తెలుగు రచయితకు స్వాగతం!
దేశంలో సంఖ్యాపరంగా మొదటిదైనా, అధికార గణాంకాల ప్రకారం రెండవ అతి ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. వెయ్యి సంవత్సరాలకు పైబడి సాహిత్య చరిత్ర, ఏ ప్రపంచస్థాయి సాహిత్య ప్రమాణాలకూ తీసిపోని పరిపుష్ఠమైన సాహిత్య సృష్టీ, దానికే స్వంతమైన ఆశుకవితా ప్రక్రియలూ, కాలంతో పాటే రూపురేఖలు మార్చుకున్న ఛందో రూపాలూ, ఒక్క శతాబ్దకాలంలోనే ఎన్నో సాహిత్యోద్యమాలూ చూసినది తెలుగు. భాషాపరిణామం, తత్త్వచింతన, ఇతిహాసం, పురాణం, జానపదసాహిత్యం, సంగీతం, నాటకం, నవల, కథ, కవిత, వ్యాసం, చరిత్ర, జీవిత చరిత్రలు, యాత్రా కథనాలు, రేడియో, టీ.వీ మాధ్యమాలకు అనుగుణంగా మలుచుకున్న సాహిత్యప్రక్రియలూ… ఇలా ఎన్నిటిలోనో ప్రావీణ్యం సంపాదించిన గొప్ప గొప్ప రచయితలు మనకు ఉన్నారు. దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్, పద్మపురస్కారాలు, పౌర పురస్కారాలు మొ.న జాతీయ స్థాయి పురస్కారాలు, ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందిన ఘనత తెలుగు వారికుంది. కానీ చరిత్రపట్ల, విలువైన చారిత్రక ఆధారాలను పదిలపరచుకోవడం పట్ల, గొప్ప సాహిత్యకారులని సమ్మానించుకుని వారి జీవిత, రచనా విశేషాలనూ, వారు నివసించిన గృహాలనూ, వినియోగించిన వస్తువులనూ జాతి సంపదగా భావించి పదిలపరచుకోవడంలో భారతీయులకి, ముఖ్యంగా తెలుగువారికి ఆసక్తి తక్కువ.
మనుషుల్ని భాష కలపగలిగినంత బలంగా ఏ విశ్వాసమూ కలపలేదన్నది లౌకిక సత్యం. మన కళ్ళముందే జీవించి, కొన్ని తరాల సాహిత్యాన్నీ, జీవన విధానాన్నీ ప్రభావితం చేసిన వ్యక్తులు మన మధ్యనుండి కనుమరుగవగానే, వారి సాహిత్యం అదృశ్యం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది. రెండు వేల సంవత్సరాల ఉనికిగల జాతిగా తమ జీవితాన్ని భావితరాల అభివృద్ధికీ, అభ్యున్నతికీ ధారపోసిన వ్యక్తుల గురించిన సమాచారం చెదలు పట్టకుండా జాగ్రత్త పరచుకోవడం మన కనీస ధర్మం.
ఇలా జాగ్రత్త పరిచే బృహత్ ప్రయత్నమే ఈ “తెలుగు రచయిత”. ఇక్కడ పోగుచేస్తున్న రచనా సంపద తెలుగు వారైన మనందరిది. తెలుగు జాతిది. భావితరాల వారిది.
“తెలుగు రచయిత” వెబ్ సైటు ప్రపంచ తెలుగురచయితలందరికీ ఒక వేదిక. ఇక్కడ “రచయిత” అన్న మాట చాలా విస్తృత అర్థంలో, లింగ భేదం గాని, ప్రక్రియా భేదం గాని లేకుండా ఉపయోగించబడింది. రచయితల జీవిత విశేషాలను, స్వరాన్ని, వారి నమూనా రచనలను భద్రపరచాలని ఆశయం. ముందుగా కందుకూరి వీరేశలింగం పంతులు గారితో మొదలుకుని ఇప్పటివరకు ఉన్న ప్రతీ తెలుగు రచయిత వివరాలు ఈ వెబ్ సైటులో పొందుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాము. తెలుగు రచనా లోకంలో భావి తరాలకు ఇదొక సమగ్ర సమాచార భాండాగారం కావాలన్నదే ఈ వెబ్ సైటు ఉద్దేశ్యం. ప్రక్రియతో సంబంధం లేకుండా, సాహిత్య సృష్టి పరిమాణం గురించిన చర్చలేకుండా ఇక్కడ వివరాలు పొందుపరచబడతాయి.
ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావలసిందిగా అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సాహిత్యకారులందరూ తమ వ్యక్తిగత సమాచారం అందించడంతో పాటు, తమకు తెలిసిన సాహిత్యకారుల విషయాలు ఇక్కడ పొందుపరచిన నమూనా పత్రంతో అందించగలిగితే ఎంతో కృతజ్ఞులం. ఇదిగాక మీరు ఎటువంటి నైతిక, ఆర్థిక, సాంకేతిక సహాయ సహకారాలందించగలిగినా, ఈ జాలస్థలి శాశ్వతంగా కొనసాగడానికి ఉపకరిస్తుందని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాం. రండి! దీనిని కొనసాగించడానికి సహకరించండి.
——-*——-
*Telugu Rachayita is supported in part by a grant from TANA (Telugu Association of North America).
Our special thanks to Sri Jampala V. Chowdary, Ex TANA President.