గురజాడ అప్పారావు (Gurajada Apparao)

Share
పేరు (ఆంగ్లం)Gurajada Apparao
పేరు (తెలుగు)గురజాడ అప్పారావు
కలం పేరు
తల్లిపేరుకౌసల్యమ్మ
తండ్రి పేరువెంకట రామ దాసు
జీవిత భాగస్వామి పేరుఅప్పల నరసమ్మ (1885)
పుట్టినతేదీ9/21/1862
మరణం11/30/1915
పుట్టిన ఊరువిశాఖపట్నం జిల్లా యలమంచిలి దగ్గర రాయవరం గ్రామం
విద్యార్హతలుబి. ఏ. (తత్త్వశాస్రం) 1886
వృత్తికళాశాల అధ్యాపకుడు, సంస్థాన శాసన పరిశోధకుడు
తెలిసిన ఇతర భాషలుతెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకన్యాశుల్కం
నీలగిరి పాటలు
కొండుభట్టీయం (అసంపూర్ణ హాస్య నాటకం)
పూర్ణమ్మ, ముత్యాలసరాలు, దేశమును ప్రేమించుమన్నా, మొ. అనేక కవితలు
ఇతర రచనలుhttp://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=33
http://kinige.com/ksearch.php?searchfor=gurajada
ఈ-పుస్తకాల వివరాలుhttps://archive.org/details/kanyasulkam
పొందిన బిరుదులు / అవార్డులుఅభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర
ఇతర వివరాలుగురజాడ అప్పారావు గారు మహా కవి, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులు. హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగా భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి “కన్యాశుల్కం” నేటికీ గొప్ప నాటకం.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదిద్దుబాటు
సంగ్రహ నమూనా రచన

దిద్దుబాటు

తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక ‘దిద్దుబాటు.’ ఇది ‘ఆంధ్ర భారతి’ పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. గురజాడ కంటే ముందే కథలు రాసినవారు మనకు లేకపోలేదు. ఆచంట సాంఖ్యాయన శర్మ రాసిన ‘లలిత’ (1902), ‘విశాఖ’ (1904), బండారు అచ్చమాంబ రాసిన ‘స్త్రీ విద్య’, ‘ధన త్రయోదశి’ (1902) కథలను తొలి తెలుగు కథలని వాదించిన వారు లేకపోలేరు. అయితే ఆ కథలలో గ్రాంధిక భాష ఎక్కువగా కనపడుతుంది. ఈ కథల కథా శిల్పం, రచనాతీరు ఆధునికతకు బహుదూరం అన్న విమర్శకులున్నారు. సలక్షణమైన ఆధునిక వ్యవహారిక భాషను కథానికలో ప్రవేశపెట్టినవాడు గురజాడ అప్పారావే. ఏదిఏమైనప్పటికీ 100 సంవత్సరాల తర్వాత కూడా నేటి సమాజతీరుతెన్నులకు దగ్గరగా ఉన్న దిద్దుబాటు నేటికి కనువిప్పు కలిగించే కథే. ఇక చదవండి!
———–

దిద్దుబాటు

తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక ‘దిద్దుబాటు.’ ఇది ‘ఆంధ్ర భారతి’ పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. గురజాడ కంటే ముందే కథలు రాసినవారు మనకు లేకపోలేదు. ఆచంట సాంఖ్యాయన శర్మ రాసిన ‘లలిత’ (1902), ‘విశాఖ’ (1904), బండారు అచ్చమాంబ రాసిన ‘స్త్రీ విద్య’, ‘ధన త్రయోదశి’ (1902) కథలను తొలి తెలుగు కథలని వాదించిన వారు లేకపోలేరు. అయితే ఆ కథలలో గ్రాంధిక భాష ఎక్కువగా కనపడుతుంది. ఈ కథల కథా శిల్పం, రచనాతీరు ఆధునికతకు బహుదూరం అన్న విమర్శకులున్నారు. సలక్షణమైన ఆధునిక వ్యవహారిక భాషను కథానికలో ప్రవేశపెట్టినవాడు గురజాడ అప్పారావే. ఏదిఏమైనప్పటికీ 100 సంవత్సరాల తర్వాత కూడా నేటి సమాజతీరుతెన్నులకు దగ్గరగా ఉన్న దిద్దుబాటు నేటికి కనువిప్పు కలిగించే కథే. ఇక చదవండి!

———–

‘‘తలుపు!తలుపు!’’తలుపు తెరవబడలేదు.

ఒక నిమిషమతడూరుకొనెను.గదిలోని గడియారము టింగుమని ఒంటిగంట కొట్టినది.

‘‘ఎంత ఆలస్యము చేస్తిని! బుద్ధి గడ్డితిన్నది. రేపటినుంచి జాగ్రత్తగా ఉంటాను. యాంటి నాచ్‌లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమైపోయినది. ఒక్క పాట సరదాతో కుదరలేదు, మనిషి మీద కూడా సరదా పరిగెత్తుతూంది. లేకుంటే, పోకిరి మనిషివలె పాట ముగిసిన దాకా కూర్చోవడమేమిటి? ఏదో ఒక అవకాశము కలుగజేసికొని దానితో నాలుగుమాటలు ఆడడవు ఆసక్తి ఏమి? ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను. రేపటి నుంచి మరి పాటకు వెళ్లను. నిశ్చయం. నిశ్చయం… గట్టిగా పిలిచితే కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముడిని లేపగల్గితినా చడి లేకుండా పక్క చేరి పెద్దమనిషి వేషము వెయ్యవచ్చును.’’

గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్క విడబారెను.

‘అరె యిదేమి!’ అనుకొని, రెక్క మెల్లన తెరవ, నడవలో దీపము లేదు. అంగణము దాటి తన పడక గది తలుపు తీయ, నందును దీపము లేకుండెను. చడిలేక అడుగు వేయుచు మంచము దరికి పోయి కమలిని నిద్రించుచుండెనా, మేల్కొనియుండెనాయని కనుగొన యత్నించెను గాని, యేర్పరింపలేడయ్యె. అంత జేబు నుంచి అగ్గిపెట్టి తీసి పుల్ల వెలిగించెను. మంచముపైని కమలిని కానరాలేదు. నిశ్చేష్టుడై చేతి నుండి అగ్గిపుల్ల నేలరాల్చెను. గదినీ, అతని మనస్సును కూడ చీకటి క్రమ్మెను. వెఱ్ఱి శంకలును అంతకు వెఱ్ఱి సమాధానములును మనసున పుట్టుచు గిట్టుచు వ్యాకులత కలుగచేసెను. బుద్ధి తక్కువకు తనయందో, కానరామికి కమలిని యందో యేర్పరింపరాని కోపావేశమును, చీకాకును గలిగెను. నట్టి వాకిటికి వచ్చి నిలువ చుక్కలకాంతిని దాసి గాని దాసుడు గాని కనపడలేదు. వారికి తగిన శిక్ష వురియేనని గోపాలరావు నిశ్చయించెను.తిరిగి గదిలోనికి పోయి దీపము వెలిగించి గది నలుదెసల పరికించెను. కమలిని కానరాలేదు.

వీధి గుమ్మము చేరి తలుపు తెరచి చూడ చుట్ట కాల్చుచు తల యెత్తి చుక్కల పరీక్షించుచున్న రాముడు వీధి నడుమ కానవచ్చెను. పట్టరాని కోపముతో వానిని జూచి గోపాలరావు ‘‘రామా!రా!’’యని పిలిచెను.

రాముడు గతుక్కుమని చుట్ట పారవైచి ‘బాబు’ అని డగ్గరెను.

‘‘మీ అమ్మేదిరా?’’

‘‘మా యమ్మా? యింటున్నది బాబూ.‘మీ అమ్మ కాదురా! బుద్ధిహీనుడా! నా భార్య.’’

‘‘అమ్మగారా? ఎక్కడుంటారు బాబూ? పడుకున్నారు?’’

‘‘యింట్లోనే లేదు.’’

రాముడి గుండెలో దిగులు ప్రవేశించెను. గుమ్మములో అడుగు పెట్టగానే రాముని వీపుపై వీశ గుద్దులు రెండు పడెను. ‘చంపేస్తిరి బాబూ’ అని రాముడు నేల కూలబడెను.

గోపాలుడు సదయ హృదయుడు. అక్రమమాచరించితినను జ్ఞానము వెంటనే పొడమి ఆగ్రహావేశము దిగజారి పశ్చాత్తాపము కలిగెను. రాముని చేత లేవనెత్తి, వీపు నిమిరి పశువు వలె నాచరించితినని యనుకొనుచు గదిలోనికి తీసుకొనిపోయెను.కుర్చీపయి కూర్చుని ‘‘రామా, ఏమాయెరా?’’ యని దైన్యముతో ననెను.

‘‘యేటో మాయలా ఉంది బాబూ.’’

‘‘పుట్టింటికి వెళ్లియుండునా?’’

‘‘అంతవారు కారనా? బాబూ, కోపగించితే చెప్పలేను గాని ఆడారు చదువు నేరిస్తే ఏటౌతది?’

‘‘విద్య విలువ నీకేం తెలుసురా, రామా!’’ అని గోపాలరావు మోచేతులు బల్లపయినాని వాని నడుమ తలయుంచి యోచించుచుండ కమలిని చేవ్రాత నొక యుత్తరము కానవచ్చెను. దానిని చదువసాగెను.

‘‘అయ్యా!’’

‘‘ ‘ప్రియ’ పోయి ‘అయ్యా’ కాడికి వచ్చెనా?’’

‘‘పెయ్య పోయిందా బాబూ!’’

‘‘మూర్ఖుడా! వూరుకో!’’

‘‘అయ్యా! పది దినములాయె. రాత్రులు నింటికి మీ రాకయే నేనెరెగను. మీటింగులకు బోవుచుంటిమంటిరి.

లోకోపకారములగు నుద్యమముల నిదుర మాని చేయుచుంటిమంటిరి. మా చెలుల వలన నిజము నేర్చితిని. నేనింటనుండుటను గదా మీరు కల్లలు పలుకవలసివచ్చె. నేను పుట్టింటనున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును, అసత్యమునకు అవకాశము కలుగకుండును. మీచే దినదినమును అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుండుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నేనీ రేయి కన్నవారింటికి జనియెద సంతసింపుడు. వెచ్చముగాక ఏ పాటి మిగిలియున్నను దయ నుంచుడు.’’ఉత్తరము ముగించి ‘‘నేను పశువును’’ అని గోపాలరావు అనెను.

‘‘అదేమిటి బాబూ అలా శలవిస్తారు?’’

‘‘శుద్ధ పశువును!’’

రాముడు అతి ప్రయత్నముచే నవ్వు ఆపుకొనెను..

‘‘గుణవతి, విద్యానిధి, వినయ సంపన్నురాలు నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసినది.’’

‘‘ఏటి చేసినారు బాబూ?’’

‘‘పుట్టింటికి వెళ్లిపోయినది – గాని నీకు తెలియకుండా ఎలా వెళ్లిందిరా?’’

రాముడు రెండడుగులు వెనుకకు నడిచి ‘‘నాను తొంగున్నాను కావాల బాబూ. అలక చేస్తే చెప్పచాల్నుగాని బాబూ ఆడదయి చెప్పకుండా పుట్టినారింటికి ఎల్తానంటే చెంపలాయించి కూకోబెట్టాలి గాని మొగోరిలాగ రాతలూ కోతలూ మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ?’

‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుడి సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్ర్తీ రత్నమే. శివుడు పార్వతికి సగము దేహము పంచి యిచ్చాడు. ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. అనగా పెళ్లాము మొగుని కన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?’’

‘‘నాకేం బోద కాదు బాబూ!’’ రామునికి నవ్వు ఆచుకొనుట అసాధ్యమగుచుండెను.

‘‘నీ కూతురు బడికి వెళ్లుతున్నది గదా! విద్య విలవ నీకే బోధపడుతుంది. ఆ మాట అలా వుండనియ్యి. కాని, నువ్వో నేనో వెంటనే బయలుదేరి చంద్రవరం వెళ్లాలి. నేను నాలుగు రోజుల దాకా వూరి నుంచి కదలడముకు వీలుపడదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. వెళ్లి కమలినిని తీసుకురా. కమలినితో ఏమి జెప్పవలెనో తెలిసిందా?’’

‘‘యేటా? బాబూ! బాబు, నా యీపు పగలేసినారు, రండమ్మా అంతాను?’’

‘‘దెబ్బల మాట మరిచిపో. కొట్టినందుకు రెండు రూపాయలిస్తాను. తీసుకో మరియెన్నడూ ఆ వూసెత్తకు. కమలినితో గాని తప్పి జారి అనబోయేవు సుమా.’’

‘‘అనను బాబూ!’’

‘‘నువ్వు చెప్పవలసిన మాటలు చెబుతాను. బాగా విను. ‘పంతులికి బుద్ధి వచ్చింది. ఇక ఎన్నడూ సానుల పాట వినరు. రాత్రులు యిల్లు కదలరు, ఇది ఖరారు. తెలిసిందా? మిమ్ములను గెడ్డము పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు, దయదలచి ఆయన లోపములు బయలుపెట్టక రెండు మూడు రోజులలో వెళ్లిపోయి రమ్మన్నారు. మీరు లేనిరోజో యుగముగా గడుపుతున్నారు’ అని నిపుణతగా చెప్పు తెలిసిందా?’’

‘‘తెలిసింది బాబూ!’’

‘‘ఏమని చెబుతావో నాతో వొక మాటు చెప్పు.’’

రాముడు తల గోకుకొనుచు ‘‘యేటా – యేటా – అదంతా నాకేం తెలదు బాబూ – నానంతాను అమ్మా! నా మాటినుకొండి – కాలం గడిపినోణ్ని – ఆడోరు యెజిమాని చెప్పినట్టల్లా యిని వల్లకుండాలి. లేకుంటే మా పెద్ద పంతులార్లాగ అయ్యగారు కూడా సానమ్మ నుంచుగుంతారు. మీ శెవులో మాట. పట్టంలోకి బంగార బొమ్మలాంటి సానమ్మ వొచ్చింది. మరి పంతులు మనసు మనసులో లేదు. ఆ పైన మీ సిత్తం! అంతాను.’’

‘‘ఓరి వెధవా!’’ అని గోపాలరావు కోపముతో కుర్చీ నుండి లేచి నిలిచెను.

ఊసవలె రాముడు వెలికెగెసెను.

అంతట మంచము క్రింద నుండి అమృత నిష్యందిని యగు కలకల నగవును కరకంకణముల హృద్యారావమును విననయ్యెను.

‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుడి సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్ర్తీ రత్నమే. శివుడు పార్వతికి సగము దేహము పంచి యిచ్చాడు. ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. అనగా పెళ్లాము మొగుని కన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?’’

———–

You may also like...