పేరు (ఆంగ్లం) | Paravastu Chinnaya Suri |
పేరు (తెలుగు) | పరవస్తు చిన్నయ సూరి |
కలం పేరు | – |
తల్లిపేరు | శ్రీనివాసాంబ |
తండ్రి పేరు | వెంకటరంగ రామానుజాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | |
పుట్టినతేదీ | క్రీ.శ.1809 |
మరణం | క్రీ.శ.1862 |
పుట్టిన ఊరు | తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని పెరంబుదూరు |
విద్యార్హతలు | – |
వృత్తి | మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ఆంగ్లము, తమిళం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, ఆంధ్రకౌముది, ఆంధ్రధాతుమాల, ఆంధ్రశబ్ద శాసనము, అకారాది నిఘంటువు, ఆదిపర్వవచనము – 1847, ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము, చాటు పద్యములు, చింతామణివృత్తి – 1840, పచ్చయప్ప నృపయశోమండనము – 1845 పద్యాంధ్ర వ్యాకరణము – 1840, బాల వ్యాకరణము – 1855, బాలవ్యాకరణ శేషము, నీతిచంద్రిక – 1853, నీతిసంగ్రహము – 1855 |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | పరవస్తు చిన్నయ సూరి ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డారు. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీక్ష చేయించి, సమర్థుడని గుర్తించి, “చిన్నయసూరి” అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు. సూరి అనగా పండితుడు అని అర్థం. శ్రీ చిన్నయ సూరిగారు 1862 సం. మున నిర్యాణము జెందగా వారి శిష్యులైన శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారు, తమ గురువుగారు ప్రారంభించిన గొప్పనిఘంటు నిర్మాణపద్ధతి అసాధ్యమని తలంచి ఒకపాటి విధమున శబ్దరత్నాకరమను నిఘంటువును 1885 లో ప్రకటించిరి. |
స్ఫూర్తి | మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. |
నమూనా రచన శీర్షిక | మిత్రలాభము |
సంగ్రహ నమూనా రచన | మిత్రలాభము “ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించు కొందురు.” అనిన రాజపుత్రులు విని “యే కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగా వినిపింపుఁ” డనిన విష్ణుశర్మ యిట్లని గోదావరీతీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతునిఁ జూచి “వఱువాత లేచి వీని మొగము చూచితిని. నేడేమి కీడు రాఁగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువఁదగదు. జాగు చేయక యీచోటు విడిచిపోవలె”నని యత్నము యుచుండగా వాఁడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె: “ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి? మన మీ నూకల కాశ పడరాదు. తొల్లి యొక తెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మృతి బొందెను. మీకా కథ చెప్పెద వినుండు! |
మిత్రలాభము
“ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించు కొందురు.” అనిన రాజపుత్రులు విని “యే కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగా వినిపింపుఁ” డనిన విష్ణుశర్మ యిట్లని చెప్పఁదొడంగె.
గోదావరీతీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతునిఁ జూచి “వఱువాత లేచి వీని మొగము చూచితిని. నేడేమి కీడు రాఁగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువఁదగదు. జాగు చేయక యీచోటు విడిచిపోవలె”నని యత్నము సేయుచుండగా వాఁడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె: “ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి? మన మీ నూకల కాశ పడరాదు. తొల్లి యొక తెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మృతి బొందెను. మీకా కథ చెప్పెద వినుండు!
పులి-కంకణము-బాటసారి
ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి ‘యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ’మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని ‘యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె’నని చింతించి, ‘యేదీ కంకణము చూపు’మని యడిగెను. పులి చేయిచాఁచి ‘యిదిగో హేమ కంకణము చూడు’మని చూపెను. ‘నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు’నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. ‘ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము’ అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి ‘యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు’ మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని – ‘క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.’ అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.
కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు.” అని చెప్పఁగా విని, యొక కపోతవృద్ధము నవ్వి యిట్లనియె – “ఆ! యివి యేటి మాటలు? ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది, వినుండు. స్థానాస్థానములు వివేకింపక సర్వత్ర యిట్టి విచారమును పెట్టుకొనరాదు. కొఱమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని యేలాగున బ్రతుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుఁడు, నిస్సంతోషి, క్రోధనుఁడు, నిత్యశంకితుఁడు, పర భాగ్యోపజీవియు నను వా రాఱుగురు దుఃఖభాగులని నీతికోవిదులు చెప్పుదురు.” అనఁగా విని కపోతములన్నియు నేల వ్రాలెను.
గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికిడి గలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభమువల్ల వివేకము పోగొట్టుకొని క్లేశ పడియెదరు. ఆహా! లోభమెంత చెడుగుణము! అన్ని యిడుములకు లోభము కారణము.
అనంతరము పావురములన్ని వలలో దగులుకొని కపోతవృద్ధమును జూచి – “నీవు వృద్ధుఁడవు, తెలిసిన వాఁడవని భ్రాంతిపడి నీ మాటలను విని యీ విపత్తు తెచ్చుకొంటిమి. ఎవ్వఁడు బుద్ధిమంతుఁడో వాఁడు వృద్ధుఁడు గాని, ఏండ్లు మీఱినవాఁడా వృద్ధుఁడు?” అని కపోతములు నిందింపఁగా విని చిత్రగ్రీవుఁ డిట్లనియె: “ఇది యీతని దోషముగాదు. ఆపదలు రాఁగలప్పుడు మంచి సహితము చెడుగగుచున్నది. మన కాలము మంచిదికాదు. ఊరకే యేల యీతని నిందించెదరు? ఈతఁడు తనకుఁ దోచినది చెప్పినాఁడు. అప్పుడు మనబుద్ధి యేమయ్యె? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొను సాధనము విచారింపవలెఁగాని, యీ మాటలవల్ల ఫలమేమి? విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము. కాఁబట్టి యిప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుఁడు. ఇప్పటికి నాకొకటి తోఁచుచున్నది. మీరందరు పరాకు లేక వినుఁడు. ఒక్కసారిగా మనమందఱము వలయెత్తుకొని యెగిరిపోవుదము. మన మల్పులము, మనకీ కార్యము సాధ్యమగునా యని విచారింపఁ బనిలేదు. సంఘీభవించి యెంతటి కార్యమయిన సాధింపవచ్చును. గడ్డిపరకలు సహితము వెంటిగా నేర్పడి మదపుటేనుఁగును బంధించు చున్నవి. మీరు విచారింపుఁడు. దీనికంటె మంచిసాధనము మీ బుద్ధికిఁ దగిలెనా యది చేయుదము!” అనిన విని, “మీరు చెప్పినదే సరి, యింతకంటె మంచి సాధనము లే”దని చెప్పి పావురములన్ని విచిత్రముగా గగనమార్గమున కెగిరెను. అప్పుడా వ్యాధుఁడు వెఱగుపడి “ఈ పక్షులు గుంపు గూడి వలయెత్తుకొని పోవుచున్నవి. నేల వ్రాలఁగానే పోయి పట్టుకొనియెదఁగాక” యని చింతించి మొగము మీదికెత్తుకొని ఱెప్పవ్రేయక చూచుచు నవి పోవుదిక్కునకై క్రిందనే పోవుచుండెను. ఈ వింత చూడవలెనని లఘుపతనకము పావురములను వెంబడించి పోవుచుండెను. అనంతర మా పక్షులు చూపుమేర దూరము మీఱి పోగానే వ్యాధుఁడు నిరాశ చేసికొని మరలి పోయెను. అది చూచి యిప్పుడు మనము చేయవలసినది ఏమియని పక్షులడిగెను. చిత్రగ్రీవుఁడిట్లనియె – “లోకమందు మాతాపితలు మిత్రుఁడను వీరు మువ్వురే హితులు. తక్కిన వారందఱు ప్రయోజనముఁ బట్టి హితులగుచున్నారు. కాఁబట్టి యిప్పుడు నాకు మిత్రుఁడొకఁడున్నాఁడు. అతఁడు హిరణ్యకుఁడను మూషికరాజు. గండకీతీరమందు విచిత్రవన మాతని వాసస్థానము. అతఁడు పండ్ల బలిమిచేత వలత్రాళ్లు తెగఁగొఱికి మన యాపదఁ బాపఁగలఁడు. అక్కడికి మనము పోవుదము.” అని చెప్పగానే పావురములన్ని చిత్రగ్రీవుఁడు చెప్పిన గురుతు పట్టుకొని పోయి హిరణ్యకుని కలుఁగు దాపున వ్రాలెను. అప్పుడు హిరణ్యకుఁడు కపోతములు వ్రాలిన సద్దువిని భయపడి కలుఁగులో మెదలకుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడు కలుఁగుదాపు చేరి యెలుగెత్తి యిట్లనియె – “ఓ చెలికాఁడా! యేల మాతో మాటలాడవు?” అనగానే హిరణ్యకుఁడా మాట సవ్వడి పట్టి శీఘ్రముగా లాఁగ వెలుపలికి వచ్చి యిట్లనియె: “ఆహా! యేమి నా భాగ్యము! నా ప్రియమిత్రుఁడు చిత్రగ్రీవుఁడు నాకు నేత్రోత్సవము చేయుచున్నాడు.” అని పలుకుచు వలలోఁ దగులుకొన్న పావురములను చూచి వెఱఁగుపడి క్షణమూర కుండి “చెలికాడా ! యిది యేమని” యడిగెను. చిత్రగ్రీవుఁడిట్లనియె “చెలికాడా! యిది మా పూర్వ జన్మ కర్మమునకు ఫలము. చేసిన కర్మ మనుభవించక తీరునా?” అనగానే హిరణ్యకుఁడు చిత్రగ్రీవుని బంధము ఛేదించుటకయి సమీపింపఁగా చిత్రగ్రీవుఁడిట్లనియె. “చెలికాడా! చేయవలసిన దీలాగున కాదు. ముందుగా నా యాశ్రితుల బంధము వదలింపుము. తరువాత నాకుఁ గానిమ్ము.” అనిన హిరణ్యకుఁడు విని యిట్లనియె: “నా దంతములు మిక్కిలి కోమలములు. అన్నిటి బంధములు కఱచి త్రెంపజాలను. పండ్ల బలిమి కలిగి నంతదాఁక నీ బంధము ఛేదించెదను. తరువాత శక్తిగలిగిన పక్షమున మిగిలిన వారి కార్యము చూచుకొందము.” అనిన విని చిత్రగ్రీవుఁ డిట్లనియె. “ఆలాగుననే కానిమ్ము. శక్తికి మీఱి యేమి చేయవచ్చును? ముందు యథాశక్తి వీరి నిర్బంధము మానుపుము. ఆవల నాపని యప్పటికయిన యట్లు విచారించుకొందము.” అనిన హిరణ్యకుఁడిట్లనియె.
“తన్ను మాలి పరుల రక్షింపవలెననుట నీతికాదు. ‘తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము గలదా?’ యను లోకోక్తి విన్నాఁడవుగావా? తాను బ్రతికికదా సమస్త పురుషార్థములు సాధించుకోవలె? తాను బోయిన తర్వాత దేనితో నయినఁ బనియేమి?” అన విని చిత్రగ్రీవుఁడిట్లనియె. “చెలికాఁడా! నీవు చెప్పినది నీతి, కాదనను. అయినను నా వారి దుఃఖము చూచి సహింపఁజాలను. కాఁబట్టి యింత నొక్కి చెప్పితిని. ప్రాజ్ఞుండు దన జీవితమునయిన మానుకొని మంచివారికి వచ్చిన కీడు తొలఁగింపవలెనని నీతి కోవిదులు చెప్పుదురు. అది యటుండనిమ్ము. నావంటి వారు వీరు, వీరి వంటి వాఁడను నేను. ఇప్పటి కొదవని నా ప్రభుత్వము వలన వీరికి రాఁగల ఫలమేమి? చెలికాఁడా! హేయమై వినశ్వరమైన యీ కళేబరమం దాస్థ మాని నాకు యశము సంపాదింపుము. నా వలనా జీతమా బత్తెమా యేదియు లేదు. అయినను వీరు సర్వకాలము నన్ను విడువక కొలుచుచున్నారు. నేను వీరి ఋణమెప్పుడు తీర్చుకోఁగలనో యెఱుఁగను. నా బ్రతుకు ముఖ్యముగాఁ జూడకు. వీరి ప్రాణములు రక్షించితేఁజాలును. అనిత్యమై మలినమైన కాయముచేత నిత్యమై నిర్మలమైన యశము లభించెనా దానికంటె లాభము కలదా? శరీరమునకు గుణములకు మిక్కిలి యంతరము. శరీరము క్షణ భంగురము, గుణము లాకల్పాంతస్థాయిలు. ఇట్టి శరీరము నపేక్షించి కీర్తి పోఁగొట్టుకొనవచ్చునా?” అన విని హిరణ్యకుఁడు సంతోషపడి పులకితుఁడై యిట్లనియె. “చెలికాడా! మేలు మేలు. నీ యాశ్రిత వాత్సల్యము కొనియాడ నేనేపాటి వాఁడను. ఈ గుణముచేఁ ద్రిలోకాధిపత్యమునకుఁ దగియున్నాఁడవు.” అని పలికి యన్నింటి బంధములు తెగఁగొఱికి వాని నన్నింటిని సాదరముగా సంపూజించి, “చిత్రగ్రీవా, చెలికాఁడా! యెంతవారికిఁగాని పూర్వకర్మ మనుభవింపక తీఱదు. వలఁ దగులుకోలునకు నొచ్చుకోకు. సమస్తము తెలిసినవాడవు. నీకు నాబోఁటులు చెప్పెడుపాటివారుగారు.” అని యూఱడించి బలఁగంబుతోఁ చిత్రగ్రీవున కాతిథ్యముసేసి కౌఁగిలించుకొని వీడుకొలిపెను. అనంతరము చిత్రగ్రీవుఁడు తన పరిజనములతో హిరణ్యకుని గుణములు కొనియాడుచు నిజేచ్ఛం జనియె.
మిత్రలాభముకంటె మించిన లాభము లోకమందేదియుఁ గానము. కాఁబట్టి బుద్ధిమంతుఁడు పెక్కండ్రు మిత్రులను సంపాదించుకోవలెను. ఒక్క మూషికము తోడి మైత్రి కపోతముల కెంత కార్యముచేసినది చూడుఁడు. అని చెప్పి విష్ణుశర్మ యిట్లనియె.
అనంతరము హిరణ్యకుఁడు తన లాఁగ చొచ్చెను. పిమ్మట లఘుపతనకము జరిగిన సర్వకార్యమునకు వింతపడి హిరణ్యకుని లాఁగ దాపున వ్రాలి యిట్లనియె. “ఓహో హిరణ్యకా! కొనియాడఁదగిన వాఁడవు గదా! నేను నీతో సఖ్యము గోరి వచ్చితిని. అనుగ్రహింపుము. నా కోరిక సఫలము చేయుము.” అనిన విని హిరణ్యకుఁడు లాఁగ లోపలినుండి యిట్లనియె. “ఎవ్వడవు నీవు?” అన విని కాకి యిట్లనియె. “నేను వాయసమును. నా పేరు లఘు పతనకము.” అనఁగానే హిరణ్యకుడు నవ్వి “సరి సరి నీతోనా మైత్రి చేయవలె? ఏది యెవ్వరితోఁ దగునో వారితో బుద్ధిమంతుఁడది చేయవలె. తగని కార్యము చేయరాదు. నేను భోజ్యమను, నీవు భోక్తవు. మనకు మైత్రి యేలాగున సరిపడును? నీతో మైత్రి నాకు విపత్తునకే కారణము. పూర్వ మొక మృగము జంబుకమును నమ్మి దాని కపట వచనములకు లోఁబడి పాశములలోఁ దగులుకొని వాయసముచేత రక్షింపఁబడియె.” అనిన విని సవిస్తరముగా నాకది చెప్పుమని లఘుపతనక మడిగెను. హిరణ్యకుఁడిట్లనియె.
మిగతా కథను ఇక్కడ చదవండి.
http://www.andhrabharati.com/strI_bAla/mitralAbhamu.html
(ఆంధ్ర భారతి సౌజన్యంతో -)
———–