పేరు (ఆంగ్లం) | Bhandaru Accamamba |
పేరు (తెలుగు) | భండారు అచ్చమాంబ |
కలం పేరు | – |
తల్లిపేరు | కొమర్రాజు గంగమ్మ |
తండ్రి పేరు | కొమర్రాజు వెంకటప్పయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1874 |
మరణం | 1/18/1905 |
పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలు |
విద్యార్హతలు | ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, హిందీ |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | గుణవతియగు స్త్రీ , లలితా శారదులు, జానకమ్మ, దంపతుల ప్రథమ కలహము, సత్పాత్ర దానము, స్త్రీవిద్య , భార్యా భర్తల సంవాదము, అద్దమును సత్యవతియును, అబలా సచ్చరిత్ర రత్నమాల, క్రోషో అల్లిక మీద పుస్తకం, ఊలు అల్లిక మీద పుస్తకం |
ఇతర రచనలు | http://kinige.com/book/Bhandaru+Achchamamba+Sachcharitra https://tethulika.files.wordpress.com/2011/01/achamamba-final9.pdf |
ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/stream/10988abalaasachc034506mbp#page/n7/mode/2up |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె “ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం” కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క. అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ ప్రథమ స్త్రీవాద చరిత్ర కారిణి. మహిళాభ్యుదయానికి తొలి విదూషీమణి. 1902 లో ఓరుగంటి సుందరీ రత్నమాంబ తో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది.1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది. తన తమ్ముడు సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ “అబలా సచ్చరిత్ర రత్నమాల” అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అబలాసచ్చరిత్ర రత్నమాల-ఉపోద్ఘాతము – భండారు అచ్చమాంబ |
సంగ్రహ నమూనా రచన | అబలాసచ్చరిత్ర రత్నమాల-ఉపోద్ఘాతము – భండారు అచ్చమాంబ అబలాసచ్చరిత్ర రత్నమాల యనుపేరిట ఉదాత్తము లైన స్త్రీల చరిత్రములు వ్రాయదలచినాను. ఈ చరిత్రములు వ్రాయుటయందు నాముఖ్యోద్దేశము లేవనగా :— ౧) స్త్రీలు అబల లనియు, బుద్ధి హీనులనియు, వివేక శూన్య లనియు, సకల దుర్గుణములకు నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన దోషారోపణము లన్నియు నబద్ధము లనియు స్త్రీలలో శౌర్య ధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితలును, జ్ఞానవతులును, రాజ్యకార్యధురంధరత్వము గలవారును, స్వదేశాభిమనులును, సకలసద్గుణ విభూషితలును, బూర్వముండిరనియు నిప్పు డున్నవారనియు స్థాపించుట నామొదటి యుద్ధేశము ఇంతియ కాదు. స్త్రీల యొక్క స్వాభావిక ప్రవృత్తి సద్గుణముల వైపునకే కాని దుర్గుణముల వైపునకు గాదనియు సిద్ధంతీకరించుట నా ప్రధమోద్దేశములలోని యుద్దేశమే. ౨) స్త్రీలకు విద్య నేర్పినయెడలను, వారికి స్వాతంత్ర్య మొసగినయెడలను, వారు చెడిపోవుదరనియు, బతుల నవమానించెదరనియు గుటుంబ సౌఖ్యమును నాశము చేసెదరనియు గొందరు మహానుభావులు వక్కానించెదరు. ఈయారోపణము లన్నియు నిరర్ధము లనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూల మగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు, స్త్రీవిద్యా స్వాతంత్ర్యము వలన మన దేశమునకు లాభమే గాని నష్టము గలుగనేరదనియు, స్త్రీవిద్య యత్యంతావశ్యకంబనియు సోదాహరణ పూర్వకముగా నిరూపించుట నా ద్వితీయోద్ధేశము. |
అబలాసచ్చరిత్ర రత్నమాల – ఉపోద్ఘాతము
అబలాసచ్చరిత్ర రత్నమాల యనుపేరిట ఉదాత్తము లైన స్త్రీల చరిత్రములు వ్రాయదలచినాను. ఈ చరిత్రములు వ్రాయుటయందు నాముఖ్యోద్దేశము లేవనగా :—
౧) స్త్రీలు అబల లనియు, బుద్ధి హీనులనియు, వివేక శూన్య లనియు, సకల దుర్గుణములకు నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన యీదోషారోపణము లన్నియు నబద్ధము లనియు స్త్రీలలో శౌర్య ధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితలును, జ్ఞానవతులును, రాజ్యకార్యధురంధరత్వము గలవారును, స్వదేశాభిమనులును, సకలసద్గుణ విభూషితలును, బూర్వముండిరనియు నిప్పు డున్నవారనియు స్థాపించుట నామొదటి యుద్ధేశము ఇంతియ కాదు. స్త్రీల యొక్క స్వాభావిక ప్రవృత్తి సద్గుణముల వైపునకే కాని దుర్గుణముల వైపునకు గాదనియు సిద్ధంతీకరించుట నా ప్రధమోద్దేశములలోని యుద్దేశమే.
౨) స్త్రీలకు విద్య నేర్పినయెడలను, వారికి స్వాతంత్ర్య మొసగినయెడలను, వారు చెడిపోవుదరనియు, బతుల నవమానించెదరనియు గుటుంబ సౌఖ్యమును నాశము చేసెదరనియు గొందరు మహానుభావులు వక్కానించెదరు. ఈయారోపణము లన్నియు నిరర్ధము లనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూల మగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు, స్త్రీవిద్యా స్వాతంత్ర్యము వలన మన దేశమునకు లాభమే గాని నష్టము గలుగనేరదనియు, స్త్రీవిద్య యత్యంతావశ్యకంబనియు సోదాహరణ పూర్వకముగా నిరూపించుట నా ద్వితీయోద్ధేశము.
౩) ఆంధ్రదేశములోని భగినీగణములకు మనోరంజకముగను, ఉపదేశకరముగను ఉండు పుస్తకమును నొకదానిని రచించుట నా తృతీయోద్ధేశము. వట్టియుపదేశ గ్రంధములవలనను, కేవల కల్పనా కథలవలనను జేసిన యుపదేశమునకంటే నిజమైన చరిత్రంబుల వలన జేసిన యుపదేశము అధిక ఫలప్రదం బగునని యందరికి దెలిసిన విషయమే. కాన నిజములైన యీ స్త్రీల చరిత్రముల వలన నాంధ్ర సొదరీమణులకు బాతివ్రత్యము, స్వదేశాభిమానము, స్త్రీవిద్య మొదలయిన వాని గురించి కొంత విన్నవించుకొనవలయునని నామూలోద్దేశము.
నేను వ్రాసెడి ఈ చరిత్రములలో ననేకములు మహారాష్ట్ర భాషనుండియు, హిందీభాషనుండియు, నాంధ్రీకరింపబడును. కనుక నీ చరిత్రము యందలి యుత్తమభాగములకై యాయా భాషలలోని గ్రంధకర్తలను మెచ్చవలయునే గాని నన్ను శ్లాఘింప వలసిన పని యెంత మాత్రమును లేదు.
ఇట్టి రత్నమాలలు గ్రుచ్చి జనులకి సమర్పింపవలయునని నే దలచితిని. అవి యేవి అనిన :–
౧) అబలాసచ్చరిత్ర రత్నమాల యొక్క మొదటి భాగము —
ఇందు హిందుదేశమునందు బుట్టిన యైతిహాసిక స్త్రీల చరిత్రము లుండును. ఐతిహాసిక కాల మనగా వేయిసంవత్సరములనుండి నేటి వరకు జరిగిన కాలము. ఈ భాగము నందు పద్మావతి, సంయుక్త మొదలయిన ప్రాచీన స్త్రీలు మొదలుకొని ఆనందీబాయి మొదలుకొని యర్వాచీన స్త్రీల వరకు నయిన యుత్తమస్త్రీల చరిత్రములు రాగలవు.
౨) రెండవ భాగము – ఇందు వైదిక పౌరాణిక బౌద్ధ స్త్రీల యొక్క చరిత్రములు రాగలవు. వైదిక స్త్రీలనగా వేదమందు వర్ణింపబడిన గార్గి, మైత్రేయ మొదలైన స్త్రీలు. పౌరాణిక స్త్రీలనగా పురాణాదులలో వర్ణింపబడిన పార్వతి, సీత, తార, ద్రౌపది, దమయంతి మొదలైన స్త్రీలు.
౩) మూడవ భాగము – ఇందు ఇంగ్లండు మొదలయిన పరదేశములలోని స్త్రీల చరిత్రము లుండగలవు.
కాలమానమును బట్టి చూడగా రెండవ భాగములోని వైదిక, పౌరాణిక స్త్రీలు మొదటిభాగము నందును, మొదటిభాగము నందలి యైతిహాసిక స్త్రీలు రెండవ భాగము నందును రావలిసియుండును. కాని ప్రస్తుతము రెండవ భాగము వ్రాయుటకై కావలయు సాధనములు నా యొద్ద లేనందునను, ఆ సాధనములు సమకూరువరకు నైతిహాసిక స్త్రీల చరిత్రములను, ఆపుట యోగ్యమని తోపనందునను వైదిక పౌరాణిక స్త్రీలను రెండవ భాగమునందు జేర్చెదను. ఇది యొక గొప్ప దోషముగాదు గనుక చదువరులు మన్నింతురుగాక.
మొదటి భాగము నందలి చరిత్రము లన్నియు నా యొద్ద నొకసారి గూడనందున జరిత్రములు కాలక్రమముగా వ్రాయుటకు వీలు గలుగదు. ఏయే చరిత్రము నా కెప్పుడెప్పుడు దొరకునో యాయాచరిత్ర మప్పుడప్పుడు వ్రాయబడును. చరిత్రాధ్యయనము మన ముఖ్యోద్దేశముగాని, పరీక్షలకు జదువువలె కాలక్రమానుగతమైన చరిత్రములను జదువుట మన యుద్దేశము కానందున నీ చిన్న దోషమును గూడా చదువరులు మన్నింతురుగాక.
మొదటిభాగమునందు రాగల రాణీభవానిగారియొక్కయు, రాణీసువర్ణమయిగారి యొక్కయు చరిత్రములలోని కొన్ని భాగములు జనానా పత్రిక యందు బ్రచురింపబడినవి. ఈభాగములు గూడ నిందు జేర్పబడినవని యెరుగునది.
———–