పేరు (ఆంగ్లం) | Vaavilala Vasudeva Sastry |
పేరు (తెలుగు) | వావిలాల వాసుదేవశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | మహాలక్ష్మమ్మ |
తండ్రి పేరు | అప్పయ్యశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1851 |
మరణం | 1/1/1897 |
పుట్టిన ఊరు | తెనాలి తాలూకాలోని కారుమూరు గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | వీరు రాజమండ్రి కళాశాలలో ఇంగ్లీషు ఉపన్యాసకునిగా పనిచేశారు. |
తెలిసిన ఇతర భాషలు | ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆరోగ్యసర్వస్వము, గరుడాచలము, నందక రాజ్యము, మృచ్ఛకటికము, ఉత్తారరామచరిత్రము, మాతృస్వరూపస్మృతి, ఆంధ్ర రఘువంశము, జూలియసు సీజరు, ముకుక్షు తారకము. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | తెలుగులో పద్య నాటకాన్ని, విషాదాంత నాటకాన్ని రచించినవారిలో వాసుదేవశాస్త్రి గారు ప్రధములు. వీరి నందక రాజ్యం నాటకాన్ని తేటగీతి పద్యాల్లో వ్రాసారు. ఇది పూర్తిగా స్వతంత్ర నాటకం. దీనిని 1880లో ముద్రించారు. సంఘంలోని స్వార్థచింతన, రాజోద్యోగులలో అవినీతి, నియోగుల వైదికుల మధ్య అంతఃకలహాలు, అధికారుల దౌర్జన్యాలు ఈ నాటకంలో చిత్రీకరించారు. వీరు షేక్స్ పియర్ రచించిన జూలియస్ సీజర్ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇది ఇంగ్లీషు భాష నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం. వీరు తనవద్ద నున్న రెండు వందల గ్రంథాలను రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయం కోసం దానమిచ్చారు. రాజముండ్రి పరిసరాలలో ప్రకృత కవిత్రయము అనబడే వారిలో వావిలాల వాసుదేవశాస్త్రి ఒకరు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వావిలాల వాసుదేవశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | రాజమహేంద్రవరమున బ్రకృత కవిత్రయ మనబడిన వారులో వాసుదేవిశాస్త్రిగారొకరు. తక్కుగల యిర్వురలో వడ్డాది సుబ్బారాయుడుగారొకరు. వేఱొకరు వీరేశలింగము పంతులుగారు. కవితా విషయమున గాంచినచో నీమూవురుకును జాలభేధమున్నది. కొక్కొండ వేంకటరత్న శర్మ, ఆకొండి వ్యాసమూర్తి, వాసుదేవశాస్త్రిగారలు కవులలో నొక శ్రేణికి సంబంధించినవారు. |
వావిలాల వాసుదేవశాస్త్రి
రాజమహేంద్రవరమున బ్రకృత కవిత్రయ మనబడిన వారులో వాసుదేవిశాస్త్రిగారొకరు. తక్కుగల యిర్వురలో వడ్డాది సుబ్బారాయుడుగారొకరు. వేఱొకరు వీరేశలింగము పంతులుగారు. కవితా విషయమున గాంచినచో నీమూవురుకును జాలభేధమున్నది. కొక్కొండ వేంకటరత్న శర్మ, ఆకొండి వ్యాసమూర్తి, వాసుదేవశాస్త్రిగారలు కవులలో నొక శ్రేణికి సంబంధించినవారు. ఈ మువ్వుర రచనలలోను నొక ప్రత్యేక విలక్షణత యుండును. వీరిలో నొకరు బహుగ్రంధ కర్తలగుమహా మహో పాధ్యాయులు. ఒకరు భారతాంధ్రీకర్తలగు నాంధ్రవ్యాసులు. ఒకరు దృశ్య శ్రవ్య కావ్య రచయితలు గా విఖ్యాతులు. ఈమువ్వర రచనలలో గూడ నించించుక భేద మున్నను, మొత్తము మీద నొకరకపు కవిశ్రేణికి జెందినవారుగా దోచెదరు.
వాసుదేవశాస్త్రిగారు విద్వద్వంశీయులు.ఈయన ప్రసితామహుడు వెంకటశివావధాని వాసిరెడ్డివారి సంస్థానమున బండితుడు. మనశాస్త్రిగారు బందరునోబిలు కళాశాల పండితులైన కోరాడ రామచంద్రశాస్త్రిగారికడ సంస్కృత విధ్యాభ్యాసము గావించెను. అదిగాక, రాజ మహేంద్రవర కళాశాలలో జదివి 1872 లో బి.ఏ పట్టభద్రులయిరి. ఆయేడు “మాక్డోనాల్డు” బంగారుపతకము వీరికి లభించినది. 1874 మొదలు 1896 వఱకు రాజమహేంద్రవరమున ప్రభుత్వకళాశాలాంగ్ల సహాయోపాధ్యాయపదవి నలకరించిరి. తరువాత బాఠశాలా సహాయపరీక్షకులుగా గూడ నుండిరి.
వాసుదేవశాస్త్రిగారు పేరుగొన్నరచయిత. ఆంగ్లనాటకము లాంధ్రీకరించుటలోను, క్రొత్తయితివృత్తముతో స్వతంత్ర నాటకములు సంఘటించుటలోను శాస్త్రిగారికి బ్రాధమ్య మీయవలెను. జూలియన్ సీజరు. “సీజరు చరిత్ర” మనుపేర వీరాంధ్రీకరించిరి. వీరి “నందకరాజ్య” నాటకమంతయు దేటగీతముతోనే సాగినది. యీపద్యమరయుడు.
తేట గీత మందె దీనిని వ్రాయంగ
మంచి దంచు దోచె మదిని నాకు
సాయ మిండి నాకు సదయత బుధులార!
వావిలాల వాసు దేవ శాస్త్రి.
కథా సరణియందు, పాత్రపేరులయందు మాఱుపు చేయలేదు. ఈ యాదర్శమే వీరేశలింగము పంతులుగారి వెనీసువర్తక చరిత్రాదులను వెలయింప జేసినది. “నందక రాజ్యము” స్వతంత్రాంధ్రనాటకములలో మొదటిదిగా బరిగణింపవలయును. దీని ప్రచురణము 1880 లో దాని పీఠికలో నిట్లున్నది:
“…ఇది నేనువ్రాయుటకు గల్గిన ముఖ్యోద్దేశము మనవారిలో, అందులో బ్రాహ్మణులలో బహుతరముగా గాన్పించునట్టి యైకమత్యమును సర్వవిధంబుల స్వీకరించి దానివల్ల మనమెల్ల మేలువడయ గోరవలయునని యెఱింగించుటె గాని మఱియొకటి కాదని స్పష్టముగా జెప్పు చున్నాడను. ఈ సంగతినే పొడిమాటలతో దెలియ జేయక కధ యొకటి కల్పించి యందులో బరస్పర వైరములు పెంచినవారు శిక్షింప బడినట్లు కూర్చుట మంచిదని యెంచి యిట్టి నాయభిప్రాయంబునె మన వారెల్లరు గైకొందు రని తలంచి నాటక ధోరణిని వ్రాసితిని….”
గీతనాటకముల కీ నందకరాజ్యము ముంగలిది. పూర్వపుగ్రామ్య వ్యవహారము లిందు సుందరతరముగా నభివర్ణితములు. పదప్రయోగమున నంత ప్రౌఢిమ పొడసూపదు గాని, స్వాభావిగత పెద్దగానున్నది. వైదికులపక్షమున రామదీక్షితులమాటలు:-
భూపుపు సంపత్తికిని వారె మూలబలము
కావుననె నైదికులకు భూకాంతులు మును
పెక్కులుగ జీవనములు కల్పించినారు
బహుదినంబులు పో గుటుంబములు పెరిగి
పఱకో పాతికో చిక్క మావారు సగము
తగ్గి జీవించు చుండిరి దాన దాన
కాని యేలో, యిటీవల హానివచ్చె.
రాజకీయోద్యోగుల పక్షమున శరభోజ పలుకులు:-
“ఇప్పుడీ దీక్షితులు విప్పిచెప్పినట్లు
వైదికుల పైని మాకేమి వైరమేమి?
మేము వారును నొక్కపై మెలగ గన్న
నైకమత్య ఫలంబుల ననుభవింప
గాను మాసరివా రెందు గానకారు.
అయిన నావేడ్క మాకిందు నబ్బదయ్యె;
స్వామి కార్య నిర్వహణము జగడమునకు
మూల మయ్యెను, నిజముగా భూపవర్య!”
శాస్త్రిగారు 1874 లో ముముక్షుతారక మనుపేర భజగోవిందశ్లోకము లనువదించిరి. 1875 లో “బ్రాహ్మణీయము” ప్రబంధము రచించిరి. ఇది యముద్రితము. వీ రనువదించిన “మృచ్ఛ కటికము” మనోహర మైనది. అటుపిమ్మట తిరుపతివేంకట కవులు కూడ దాని ననువదించిరి. వాసుదేవశాస్త్రిగారు ఉత్తర రామచరిత్రాంధ్రీకృతి 1883 లో వెలువడినది. వీరి తెలుగుసేత దాని ననేకు లనువదించిరి.
వీరి “మృచ్ఛ కటికము” తెనిగింపు మచ్చు:
తొడి బండకుండగా జనము త్రోవల నిల్చిన మింటిదీపమై
పొడమె శశాంకు డల్లడుగో బోటుల చెక్కులవోలె వెల్లనై
యుడుగణ మాశ్రయింప నిరు లుచ్చిపడన్ వెదచల్లె వెన్నెలన్
పడిలిన పంకమందు బయిపై బడు చుండెడు పాలధారగా.”
” అద్వైతం సుఖదు:ఖయో రనుగత” మిత్యాదిమగు ఉత్తరరామ చరితగతశ్లోకమునకు వాసుదేవశాస్త్రి గారి తెనుగు పరివర్తనపుదీరు:
ఎవ్వనికైన జన్మమున హృచ్ఛమ లేక సుఖాసుఖంబుల
న్నవ్వుచు నొవ్వకే చెలువున స్సతతంబును రాగలబ్ధితో
జవ్వనమూడి వార్ధకము సాగగ స్నేహము మెండుకొన్న దా
మవ్వపు గోర్కి నట్టి యతిమానుష శాలికి మంగళంబగున్!
వీరి “రఘువంశము” గ్రిగ్గుదొరగారికి గురుతు గానర్పింపబడినది. చిత్రమయిన యీపద్యము చదువుడు. “ఖృష్టమత బోద్దృసూతి విశిష్టభూతి, సకలవిద్యాధికారి ప్రశస్తసూరి, ఆశ్రితావనశక్తి రాజాదృతోక్తి, లగ్గు పుడుకంగలారు శ్రీగిగ్గుగారు.” వీరివ్యుత్పత్తిభారములో రచనా సౌలభ్యము కొంత మఱుగున నుండును. ఎన్నో పద్యము లిందుల కుదాహరణములు చూడవలయను. రఘువంశమును దొరగారి కంకితము నిచ్చుట యీగీతమాలలో నిటులు సమర్ధింపబడినది.
కృతుల కొప్పిరి శ్రీశిష్టు కృష్ణమూర్తి
లక్ష్మ్ణణకవులు గౌరవ సూక్ష్మబుద్ధి
కందుకూరి వడ్డాది నిగమ నునర్ల పాలెపు త్రిపురాన పన్నాల పూండ్ల
వారణాసి చిలంబు దుర్భ నిడమర్తి
సంద్రి సత్యవోల్ కల్లూరి బయపునేడి
జగతి శైల నాదెళ్ళ గుండు గురుజాడ
మాడభూషి కొక్కొండ సంశప్రగేయు
లోగిరాల జగన్నాథ నాగయాది
బుధులు నరదేవతాంకితములుగ జేసి
ఈమాలికలో సమకాలికుల ప్రసక్తి లెస్సగా బొందికగా ముచ్చటింప బడినది. రాజమహేంధ్రవర రాజకీయ సర్వకళాశాలధ్యాపకాస్య తముడు, సంస్కృత ప్రాకృత హూణాభాషాసామ్య వైషమ్యబోద్దయు, శాస్త్ర బ్రహ్మచార్యుసధా శుద్ధతాప్త సువర్ణ శాసనుండు, కతిపయ రూపకప్రణేతయు నగు వాసుదేవశాస్త్రిగారు ధన్యులు. ఎవరో చమత్కరించి నటులు వీరిపేరు ఆటవెలదిలో నిముడును. “నందకరాజ్య” మందలి యీక్రింది సీసము శాస్త్రులుగారి జీవితసర్వస్వ సంగ్రహమునకు నిలువుటద్దము.
తొల్లి విరోధికృత్తున జ్యేష్ట శుక్ల ద్వితీయాదివాకరతిధికి సరిగ నాన, వేయి యెనిమిదగు నూటయేబది యొకటవ యేటి జూనొకటి నాడు పుట్టి కార్మూరిలో మట్టెమువారింట మేనమామల కోర్కిమీద నట్లు చేవేండ్ర కృష్ణమ్మ శేషాచలముగార్ల యొద్దను బడిచదు వొనర జదివి మేనత్త పెదకొడుకై నట్టి యా రామలింగ శాస్త్రులవారి చెంగటను బసందుగా గాళిదానత్రయ మేమొ పఠించి యప్పకవీయ మెంచి నేర్చి కార్మూర, గుంటూర పేర్మితో నింగ్లీషు చదివి, బందర గొద్దిశాలజదివి నోబిలుస్కూలులోను బ్రవేశపుబరీక్ష ప్రథమశాస్త్ర పరీక్ష వఱకు దేలి యచట వేదుల వేంకటాచార్య వర్యుల సన్నిధిలో నాంధ్రసంస్కృతముల జాడలు మఱుగులు చక్కగా వినగల్గి మేరలేని కృతజ్ణ భారమొండి రాజమహేంద్రవరము వచ్చి స్కూలులో మేష్టరీ హోదాను మేలుపొంది సర్వేశుకరణ శాస్త్రబ్రహ్మచారినై కాలేజి మేష్టరీ గ్రాలుచున్న నేను, నా కువకర్తలైన మహానుభావుల పేళ్ళు సతముగా భువిని వెలుగ,
వారి కీయపూర్య ఫక్కిక పుస్తంబు
నన్ను బెంచి విద్యనాకు జెప్పి
నట్టి దయకు గృతిగ బట్టి యిచ్చెద నిదె
వావిలాల వాసు దేవ శాస్త్రి.
తిధి 1-4-1880 సం
————-
ఆంధ్ర రచయితలు నుండి-
———–