ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ (Achanta Venkataraya Sankhyayana Sharma)

Share
పేరు (ఆంగ్లం)Achanta Venkataraya Sankhyayana Sharma
పేరు (తెలుగు)ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ
కలం పేరు
తల్లిపేరునరసాంబ
తండ్రి పేరుబాపిరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1864
మరణం1/1/1933
పుట్టిన ఊరువీరి పూర్వులు గోదావరీ మండలములోని ఆచంట గ్రామమున గాపురముండెడివారు.
విద్యార్హతలుమిడిల్ స్కూలు’ పరీక్షకు బోయి రాజధానిలో బ్రథములుగా నెగ్గిరి.
వృత్తిన్యాయవాది పరీక్షకు జదివి యుత్తీర్ణులై పార్వతీపురము మునసబుకోర్టున బనిచేసిరి.
తెలిసిన ఇతర భాషలుఆంగ్లము, సంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగ్రంథములు: సుధానిధి (కావ్యము), మనోరమ (కావ్యము), పార్థపరాజయము, అవదాతకలభకము (స్వతంత్రనాటకములు) విక్రమోర్వశీయము, ఉత్తరరామచరిత్ర (ఆంధ్రీకరణములు), రహస్య దర్పణము, ఆంధ్ర పద్యావళి మున్నగునవి. ప్రచురించిన పత్రికలు: సుజనప్రమోదిని, కల్పలత.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర భీష్ముడు, మహోపన్యాసకుడయిన మహోపాధ్యాయుడు
ఇతర వివరాలుసాంఖ్యాయనశర్మగారు కవిత్వము వ్రాసెను. చిత్రలేఖనము నేర్చెను. సంగీతము నెఱిగెను. నాట్యశాస్త్రము తెలిసికొనెను. పదార్థవిజ్ఞాన రసాయన శాస్త్రములు, భూవృక్ష క్రిమికీటక ఖనిజతత్త్వము, ప్రాచీనాధునాతన హైందవరాజ్యాంగ విశేషములు చక్కగా బరిశీలించెను. వీరి ప్రజ్ఞాదర్పణమున బ్రతిఫలింపనికళ లేదు. కుశాగ్రబుద్ధియగుటచే సంస్కృతాంధ్రములలో జిన్ననాటనే గొప్పసాహిత్య మలవఱచుకొనెను.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ
సంగ్రహ నమూనా రచనవేంకటరాయ సాంఖ్యాయన శర్మగారు మహోపాధ్యాయులని ఆంధ్రభీష్ములని కొనియాడబడిన ప్రసిద్ధపండితులు. వీరు పండితులుగాను, కవులుగాను, ప్రతికాసంపాదకులుగాను, విమర్శకులుగాను, మహోపన్యాసకులుగాను తెలుగునాట బేరు సంపాదించిరి. సాంఖ్యాయన శర్మగారు స్పుద్రూపి. ఆకారమున కనుగుణమగుప్రజ్ఞ. ప్రజ్ఞకు దగిన వాక్చాతుర్యము. ఈయన యుపన్యాసవేదిక కెక్కినచో నెట్టివాడైన కిక్కురుమనుటకు వీలులేదు.

ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ

వేంకటరాయ సాంఖ్యాయన శర్మగారు మహోపాధ్యాయులని ఆంధ్రభీష్ములని కొనియాడబడిన ప్రసిద్ధపండితులు. వీరు పండితులుగాను, కవులుగాను, ప్రతికాసంపాదకులుగాను, విమర్శకులుగాను, మహోపన్యాసకులుగాను తెలుగునాట బేరు సంపాదించిరి. సాంఖ్యాయన శర్మగారు స్పుద్రూపి. ఆకారమున కనుగుణమగుప్రజ్ఞ. ప్రజ్ఞకు దగిన వాక్చాతుర్యము. ఈయన యుపన్యాసవేదిక కెక్కినచో నెట్టివాడైన కిక్కురుమనుటకు వీలులేదు. సమయస్ఫురణము, పరేంగితజ్ఞతయు గల యుపన్యాసకులలో నీయనయగ్రేసరుడు. సమయోచితము సరసమునగు హాస్యము వీరిమాటలలో నుండి యెదుటి వారిని ముగ్ధులనొనరించెను. సాంఖ్యాయశర్మగారి వాక్ స్థానమున నే యున్న తగ్రహము లున్నవో గాని యీయన యతయందముగా బొందికగా మాటాడువారు. సరస సంభాషణమునకు గూడ గొప్ప ప్రతిభ యుండవలయును. మహామహోపాధ్యాయులు పరవస్తు వేంకటరంగాచార్యులు, కొక్కొండ వేంకటరత్నంపంతులు మనోహరముగా భాషించువారని విందుము. మంగళంపల్లి సర్వేశ్వరశాస్త్రి, బులుసుపాపయ్యశాస్త్రి మాటలలో ధ్వను లుపయోగించెడివారట. “అర్క శుష్క ఫలకోమల స్తనీ, పెద్ది భొట్టుగృహిణీ విరాజతే” ఇత్యాది మహావాక్యములకు గర్తలగు పెద్దిభొట్టుగారు చాటూక్తి చతురుడని ప్రసిద్ధి. ఇటీవలి చిలకమర్తికవి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, వేదము వేంకట్రాయశాస్త్రి చతురభాషణులలో బేరుమోసినవారు. వీరివాకులు కొన్ని లోకులు చెప్పుకొని యానందించు చుందురు. సాంఖ్యాయనశర్మగారిసంభాషణముకూడ దేశప్రసిద్ధమైనది. వీరిది పండితైక రంజకమైన వక్తృత్వమేగాదు. ప్రజాసామాన్యమునకు సుబోధమగు మాటనేర్పు. పైని మన మనుకొనిన వారందఱును బండితపామరమనోరంజకముగా మాటాడువారే.

సాంఖ్యాయనశర్మగారు కవిత్వము వ్రాసెను. చిత్రలేఖనము నేర్చెను. సంగీతము నెఱిగెను. నాట్యశాస్త్రము తెలిసికొనెను. పదార్థవిజ్ఞాన రసాయన శాస్త్రములు, భూవృక్ష క్రిమికీటక ఖనిజతత్త్వము, ప్రాచీనాధునాతన హైందవరాజ్యాంగ విశేషములు చక్కగా బరిశీలించెను. వీరి ప్రజ్ఞాదర్పణమున బ్రతిఫలింపనికళ లేదు. కుశాగ్రబుద్ధియగుటచే సంస్కృతాంధ్రములలో జిన్ననాటనే గొప్పసాహిత్య మలవఱచుకొనెను.

క్రీ.శ. 1880 ప్రాంతమున దెలుగు దేశమున వ్యాప్తములోనున్న ఆంధ్రభాషాసంజీవిని (కొక్కొండ వెంకటరత్నముగారిచే బ్రకటితము), మందారమంజిరి, ప్రబంధకల్పవల్లి మున్నగుపత్రికలు చదువుచుండుటచే సాంఖ్యాయనశర్మగారికి బత్రికా ప్రచురణోత్సాహము చిన్న తనముననే కలిగినది. నాటికాయన వయస్సు పదునెనిమిదియేండ్లకు లోబడి యుండును. అప్పుడు ‘సుజనప్రమోదిని’ యను పేరితో నొకమాసపత్రిక నడుపనారంభించిరి. దాని తొలిసంచిక 10-6-1881 సం. నాడు వెలువడినది. ‘సుజనప్రమోదిని’ తో శర్మగారి నాంధ్ర దేశము కొంచెము గుర్తించినది. 1885 లో శతఘంటకవిత్వము చెప్పిరట. ఆపద్యము లలభ్యములు. ఆంగ్లభాషాకృషి సేయనెంచి ‘మిడిల్ స్కూలు’ పరీక్షకు బోయి రాజధానిలో బ్రథములుగా నెగ్గిరి. తరువాత న్యాయవాది పరీక్షకు జదివి యుత్తీర్ణులై పార్వతీపురము మునసబుకోర్టున బనిచేసిరి. లౌకికోద్యోగము చేయు చున్నను సాహిత్యవ్యవసాయము వీడక గ్రంథరచనము చేయుచు 1892 లో ‘ఆంధ్రపద్యావళి’ యనుపేర దమఖండ రచనల నొక సంపుటముగా వెలువరించిరి. తరువాత ‘రహస్యదర్పణము’ ముద్రించిరి. అం దదృశ్య ప్రపంచరహస్యములు, క్రిమికీటక పక్షి జంతు యాత్రాదిరహస్యములు మొదలగువానిపై నపూర్వపరిశోధనము కలదు. విక్రమోర్వశీయము, ఉత్తరరామచరిత్రము బాసలోనికి బరివర్తించిరి. వీని కంతప్రశస్తి రాలేదు. 1903 లో ‘కల్పలత’ యను విజ్ఞానవిషయక మాసపత్రిక నెలకొల్పిరి. ఆ కల్పలత రెండేండ్లలో యశోలతయై యాగిపోయినది. మరల 1919 లో దాని లేవదీసి కొంతకాలము నడపిరి.

శర్మగారు తెలుగున జరిగిన యెన్నో మహాసభలకు ఆధిపత్యము వహించిరి. 1923 లో గుంటూరుమండలమునందలి ‘నండూరు’ న జరిగిన యాఱవ యాంధ్రసారస్వతసభకు వీరధిపతులు. ఆపరిషత్తుననే వీరిని మహోపాధ్యాయ బిరుదమున సత్కరించిరి. 1924 లో ఆంధ్రసాహిత్యపరిషత్త్రయోదశ వార్షికోత్సవమునకు వీరు సభాపతులు. 1929 లో దెనాలియందు జరిగిన ప్రథమాంధ్రనాటక కళాపరిషత్తునకు శర్మగారాధ్యక్ష్యము సభ్యప్రార్థనపై నంగీకరించి యద్భుతముగా సభ్నునిర్వహించిరి.

ఈవిధముగా మహాసభల కధ్యక్షుడై, మహోపన్యాసకుడై మహోపాధ్యాయు డనిపించుకొనిన సాంఖ్యాయన శర్మగారి కవితా విశేషము లిక జవిచూతము. ఈయన కవిత రసస్ఫోరకము. సరళపద భరితము. పట్టిన దెల్ల బై డియగుభంగిని పల్కినపల్కు పద్యమై యుట్టిపడంగ జెప్పినదె యొప్పిన వేదము కాగ సత్కధల్ కొట్టినపిండిగా గవితగూర్చిన ధన్యుల లోకమాన్యులన్ బుట్టను దిప్పనుం బొడమి పూజ్యతగాంచినవారి నెన్నెదన్. “సుధానిధి”

ఆట వెలదు లున్న తేటగీతములున్న మనసు కరగిపోవు మంచుపగిది ఆట లేక తేటపాటయు లేకున్న వెలదు లున్న జాలు నేవరాలు “ఆటవెలదులు తేటగీతములు”

సీ. నెలతలు చంటి బిడ్డలకు బాల్గుడుపుటే ప్రకృతిధర్మంబని పలుక రాదు ప్రకృతశాస్త్రజ్ఞలౌ పండితుల్ డార్విను మున్నగువారలు కొన్ని చోట్ల పురుషులు రొమ్మినం బొడమినపాలతో శిశుపోషణం బని చెప్పినారు ప్రకృతి ధర్మంబులు ప్రభవించు నశియించు నభ్యాస పద్ధతి ననుసరించు

మగువల కెగాని చన్బాలు మగల కెందు పొడమ వనుమాటలన్నియు బూటకములు పురుషు లిక మీద స్తన్యంబు వొడమునట్లు రొమ్ము సవరించుకొనుట కార్యమ్ముకాదె ? “సంఘసంస్కరణము” బిందె బిందెడు కాఫీకి పిడుగు తునక కట్టచుట్టల కాల్చెడి పుట్టుభోగి బుట్టెడాకులు నమలెడి పుణ్య భోగి నాగరికు లన్న వేఱె యున్నారె, వీరె.

“బహిస్సర్వాకార ప్రవణరమణీయం వ్యవహరన్” అను భవభూతి శ్లోకమున కీకవియాంధ్రీకరణపుమచ్చు నిచ్చినచో వీరిశక్తి తెలియగలదు.

మన సెటులుండనీ పయికి మాటల జేతలచేత లోక రం జన మొనరింపుచున్ దనరు స్వల్పపుదోషములైన దాచుచున్ జనులను మోసపుచ్చి యొరుచాడ్పున నేర్పరి తా దటస్థుడై తనపనిచక్క బెట్టుకొను దాల్చును బిమ్మట మౌనముద్రయున్.

ఆంధ్ర రచయితలు నుండి-

———–

You may also like...