కల్లూరి వేంకట రామశాస్త్రి (kalluri Venkata Ramasastry)

Share
పేరు (ఆంగ్లం)kalluri Venkata Ramasastry
పేరు (తెలుగు)కల్లూరి వేంకట రామశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుకామసోమదేవి
తండ్రి పేరువేంకటశాస్త్రులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/16/1857
మరణం5/29/1928
పుట్టిన ఊరురాజమహేంద్రవరము
విద్యార్హతలు
వృత్తిసంస్కృతోపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువంశముక్తావళి (ఆధ్యాత్మిక పద్యకృతి), కోటిలింగేశ్వర శతకము, హాస్యకుముదాకరము (ప్రహసనము), బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక, మేఘసందేశము (ఆంధ్రపరివర్తనము).
ఇతర రచనలు

http://www.amazon.in/Balavyakarana-Guptartha-Prakashika-Kalluri-Venkata/dp/1174563990

http://www.ebay.com/itm/Balavyakarana-Guptartha-Prakashika-by-Rama-Kalluri-Venkata-Paperback-/351526474399

ఈ-పుస్తకాల వివరాలు

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుజ్యోతిశ్శాస్త్ర విదులైన నాటి పండితులలో మనశాస్త్రిగారిదే పై చేయి యన్నట్లు ‘ చతురస్యా ‘ ది రచనలు చాటుచున్నవి. ఈయన మేధాసంపత్తి యత్యద్భుత మని వీరి ప్రత్యర్థులగు పండితులే శ్లాఘించుచుందురు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకల్లూరి వేంకట రామశాస్త్రి
సంగ్రహ నమూనా రచనకల్లూరి వేంకటరామశాస్త్రిగారి కీర్తివల్లరికి గుప్తార్థప్రకాశిక యువఘ్నము. బాలవ్యాకరణముపై వెలువడిన వ్యాఖ్యలలో నిది తొట్టతొలిది. వేంకటరామశాస్త్రిగారి సంస్కృత వ్యాకరణాభిజ్ఞత నిర్వేలము. ఈ విషయమునకు గుప్తార్థప్రకాశిక ప్రత్యక్షరము సాక్ష్యమిచ్చును. వీరియభిప్రాయములలో గొన్ని పొరపాటు లున్న వని విమర్శకు లెత్తిచూపిరి. అట్టివారిలో మహామహోపాధ్యాయ తాతా సుబ్బారాయశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రిగారలు ప్రముఖులు.

కల్లూరి వేంకట రామశాస్త్రి

కల్లూరి వేంకటరామశాస్త్రిగారి కీర్తివల్లరికి గుప్తార్థప్రకాశిక యువఘ్నము. బాలవ్యాకరణముపై వెలువడిన వ్యాఖ్యలలో నిది తొట్టతొలిది. వేంకటరామశాస్త్రిగారి సంస్కృత వ్యాకరణాభిజ్ఞత నిర్వేలము. ఈ విషయమునకు గుప్తార్థప్రకాశిక ప్రత్యక్షరము సాక్ష్యమిచ్చును. వీరియభిప్రాయములలో గొన్ని పొరపాటు లున్న వని విమర్శకు లెత్తిచూపిరి. అట్టివారిలో మహామహోపాధ్యాయ తాతా సుబ్బారాయశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రిగారలు ప్రముఖులు. ప్రతివాదుల విమర్శనములను మన శాస్త్రిగారు మహోపాధ్యాయులుగాన జాలభాగము ప్రతిఘటించిరి. ఎవ రేమన్నను గుప్తార్థప్రకాశిక గొప్ప వ్యాఖ్య. “బ్రహ్మశ్రీ శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి పండితవర్య ప్రణీత హరికారికాంధ్రీభూత పరవస్తు చిన్నయసూరి కర్తృక బాలవ్యాకరణము” నకు వ్యాఖ్యానమని ముఖపత్త్రముపై వ్రాసికొనిగాని వేంకటరామశాస్త్రిగారు తృప్తి పడలేదు. బాలవ్యాకరణము చిన్నయోవజ్ఞము కాదనియు, శిష్టు కృష్ణమూర్తిశాస్త్రిగారి హరికారికల కనువాదప్రాయ మనియు వీరి యాశయము. దీనిని పెక్కుమంది పండితులు సోవపత్తికముగా ‘గాదు కా’ దని ప్రతిఘటించిరి. పట్టినపట్టు వదలక పాండిత్య విశేషముచే స్వమత ప్రతిష్ఠాపనమున కెన్నో యుక్తులు ప్రకటించిరి. కాని యీవిషయమున మాత్రము వేంకటరామశాస్త్రిగారి పక్షము నెగ్గినట్లు తలపజనదు.వేద మధ్యయనించి, వేదాంత మభ్యసించి, భాష్యత్రయము పఠించి, సాహిత్యరత్నాకరము చుళుకించి మహోపాధ్యాయు లనిపించుకొనిన మహాశయులు వేంకటరామశాస్త్రిగారు. ఆంధ్రసారస్వతమున వీరి ప్రయోగ పరిజ్ఞాన పాటవము మిక్కిలి గొప్పది. గుప్తార్థప్రకాశికయే యీవ్రాతను నిర్ధారించును. గుప్తార్థప్రకాశిక విషయమై విమర్శకులు వ్రాసిన విమర్శలపై “సమరాంగణ పార్థమూర్తి, ధటా సూర్యప్రదర్శి, కన్నెపల్లి వేంకట సీతారామశాస్త్రి” మున్నగు పేరులతో సమాధాన వ్యాసములు వ్రాసిరి. ఈ రచన లెల్ల శాస్త్రిగారి యసాధారణ ప్రజ్ఞా వైశద్యమును సహస్రముఖముల ఘోషించుచున్నవి. వేంకతరామశాస్త్రి గారిని మించిన పండితు లుండవచ్చును గాని చమత్కారముగా వీరి వలె ‘కాని దవు ననియు, నయినది కాదనియు ‘ శాస్త్ర ప్రామాణ్యము చూపి సమర్థించువా రరుదు. ‘ సుమనోల్లాస ‘ శబ్దసమర్థనమున నీశక్తి తెల్లమగును. ఈయన మేధాసంపత్తి యత్యద్భుత మని వీరి ప్రత్యర్థులగు పండితులే శ్లాఘించుచుందురు. వేదాంత మెరిగిన విద్వాంసులయ్యు శాస్త్రిగారు శివాద్వైతులు. ఈశ్వరాస్తిక్య విషయమున వీరి వ్యాసరచన బహుళముగ సాగినది. 1885 మొదలు రాజమహేంద్ద్రవరమున ‘ టౌన్ స్కూలు ‘ లో సంస్కృతోపాధ్యాయులై ట్రైనింగు కాలేజీలో సంస్కృత ప్రహానోపదేశకులై, సర్వకళాశాలలో గీర్వాణభాషాగురు పదారూఢులై, కొవ్వూరు సంస్కృత కళాశాలలో బ్రధానదేశికులై, విద్యార్థుల నెందరనో విద్వాంసుల నొనరించిన యాచార్యశేఖరుడీయన. జ్యోతిశ్శాస్త్ర విదులైన నాటి పండితులలో మనశాస్త్రిగారిదే పై చేయి యన్నట్లు ‘ చతురస్యా ‘ ది రచనలు చాటుచున్నవి.

వేంకటరామశాస్త్రి చరణుల తెలుగు కవితయు, గీర్వాణ కవితయు మాధురీభరితము.

పరిభాషావిధిశాస్త్రముల్ స్వపదసంబంధైకవాక్యత్వ వై

ఖరితో రంజిలి కార్యకాల మనుపక్షం బందు నున్నట్లు ని

ర్భరరాగమంబున నల్లుకొన్న రసిక ప్రాచీనజాయాపతుల్

వరసౌఖ్యంబిడిప్రోచుతన్ ! దివిని సుబ్రహ్మణ్యు జ్యేష్టాత్మజున్.

ఈ పద్యమున బాండితీప్రతిభ, కవితామాధురి యొకదాని నొకటి మించి పొరపొచ్చములు లేక పొలుపొందినది. వీ రనువదించిన మేఘసందేశములోని యొక్క పద్యము పొందుపరుతును.

 

తమ్ముడ మేఘుడా ! తిథుల దద్దయు నెన్నుచు సాధ్విమన్నెడుం

జుమ్మి నిజంబుగా వదినె జుచెదుపో గమనంబు సార్థమౌ

నెమ్మిని నిండి పువ్వుసరణిన్ విరహంబున దీగబోండ్ల జీ

వ మ్మపుడూడ జూడ సుమబంధము వైఖరి నాన నిల్పుగా.

 

ఈ మహోపాధ్యాయులు ప్రతిదినము స్నాన సంధ్యాద్యనుష్ఠానము గావించి పార్థివలింగపూజ, లలితామంత్రజపము చేయుచుండెడివారు. ఈ లలితానుతి కనుగొనుడు.

 

లలితాం కలితాం కదంబపుష్పై

ర్మిలితాం సాంబశివేన మాతరం

లలితాంబరధారిణీం లతాంగీం

ఫలితాం తాం రనవాచ మర్థయే.

 

తిక్కన సోమయాజికి గురునాథుడు లేఖకు డైనట్లు మన వేంకటరామ శాస్త్రిగారికి సుంకర రంగయ్యగారు లేఖకుడై గ్రంథరచనోత్సాహము కలిగించెనట. రంగయ్యగారు వీరికి బ్రియశిష్యులు. ‘ గుప్తార్థప్రకాశిక ‘ రంగయ్యగారి కర్తృత్వముద్రతో మొదట వెలువరింపబడినది. శాస్త్రిగారి ప్రియశిష్యుడగుటచే వారి గ్రంథము సంగ్రహించె నని వదంతి కాని రంగయ్యగారు పీఠికలో ‘ సంస్కృతవ్యాకరణవిషయ మున్నచోట గురువులు వేంకటరామశాస్త్రిగారు పూరించి పరిష్కరించి ‘ రని వ్రాసికొనిరి. ఇట్టి గ్రంథచౌర్యము తొల్లిటినుండియు జరుగుచునే యున్నది. నేడు క్రొత్తగాదు.

వైయాకరణ శిరోభూషణులు, వ్యాఖ్యాతృశిఖామణులునగు వేంకట రామశాస్త్రిపాదుల కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో బ్రకాశింపజేయునది బాలవ్యాకరణగుప్తార్థ ప్రకాశిక యొక్కటే.

———–

ఆంధ్ర రచయితలు నుండి-

———–

You may also like...