పేరు (ఆంగ్లం) | Kuchi Narasimham |
పేరు (తెలుగు) | కూచి నరసింహం |
కలం పేరు | – |
తల్లిపేరు | పుల్లమాంబ |
తండ్రి పేరు | వెంకనార్యుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/17/1866 |
మరణం | 10/7/1940 |
పుట్టిన ఊరు | పిఠాపురం |
విద్యార్హతలు | బి.ఎ., ఎల్.టి. |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఆకాలంలో కూచి నరసింహమును, పానుగంటి లక్ష్మినరసింహరావును, చిలకమర్తి లక్ష్మినరసింహమును గలిపి ‘సింహత్రయ’ మని వ్యవహరించిరి. ఈ సింహత్రయమును పీఠికాపుర సంస్థానము భరించినది. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కూచి నరసింహం |
సంగ్రహ నమూనా రచన | రాత్రి పదిగంటలవేళ సాలువ గప్పికొని చేతికఱ్ఱ పుచ్చుకొని మెల్లమెల్లగ విద్యార్థులు చదువుకొను గదులకడకు వచ్చి యెవరు చదువు చుండిరో, ఎవరు చదువుటలేదో బారెడుదూరమున నుండి పరిశీలించి, మరునాడు పాఠశాలకు వచ్చినపుడు విద్యార్థుల నొక్కొక్కరిని పిలిచి “నాయనా! రాత్రి నీ వెన్ని పొగచుట్టలు తగులబెట్టితివి” అని చమత్కార గర్భముగ నడుగుచు, మొగమువాచునట్లు చీవాట్లు పెట్టు చుండువారట కూచి నరసింహము పంతులుగారు. |
కూచి నరసింహం
రాత్రి పదిగంటలవేళ సాలువ గప్పికొని చేతికఱ్ఱ పుచ్చుకొని మెల్లమెల్లగ విద్యార్థులు చదువుకొను గదులకడకు వచ్చి యెవరు చదువు చుండిరో, ఎవరు చదువుటలేదో బారెడుదూరమున నుండి పరిశీలించి, మరునాడు పాఠశాలకు వచ్చినపుడు విద్యార్థుల నొక్కొక్కరిని పిలిచి “నాయనా! రాత్రి నీ వెన్ని పొగచుట్టలు తగులబెట్టితివి” అని చమత్కార గర్భముగ నడుగుచు, మొగమువాచునట్లు చీవాట్లు పెట్టు చుండువారట కూచి నరసింహము పంతులుగారు. ఉపాధ్యాయులలో నింత చండశాసను డుండడని వారి శిష్యులవలన వినికి. ఆయన యనపత్యుడు. శిష్యసంతానమే వారి సంతానము. విద్యార్థుల పురోభివృద్ధికి, వారి విజ్ఞానాభివృద్ధకి బంతులుగారనేక విధముల బరిశ్రమించెడి వారు. నయముననో భయముననో విద్యార్థుల నుద్ధరించుటయే ప్రధానాశయముగ బెట్టుకొనినారు. వీరు పెద్ద తరగతివారికంటె జిన్నతరగతివారికే యెక్కువశ్రద్ధ తీసుకొని పాఠము చెప్పుచుండువారు. పునాది దిట్టముగ నుండినగాని గోడ నిలబడ దని వీ రెఱుగుదురు. పిఠాపురోన్నత పాఠశాలను బ్రశంసించుచు 1907 లో జెన్నపుర పరీక్షా శాఖాధికారులు యోగ్యతాపత్ర మొసగిరన్న సంగతి తెలుగువారింకను మఱచియుండరు. మన నరసింహము పంతులుగారి ప్రధానోపాధ్యాయత్వమే యీ పాఠశాల కీ గౌరవము దెచ్చినది. పంతులుగారు పనిచేయుచున్నపుడు మెట్రిక్యులేషన్లో నూటికి నరువదిడెబ్బదివఱకు నుత్తీర్ణులసంఖ్య పెరిగినది. పంతులుగారు విద్యార్థులను బై తరగతిలోనికి బంపుట కెంతకార్కశ్యము కనబఱిచెడివారో, దానికి బదిరెట్లుత్తీర్ణులను జేయుటలో గారుణ్యము కనబఱచెడివారు. వీరికి శిష్యులయందెట్టి యాదరమో, వీరిపై వీరి శిష్యుల కట్టి భక్తి గౌరవములు. వీరి శిష్యులు నేడు మహాపదవులలో నుండి గౌరవింపబడుచున్నారు.
1938 లో నొకమారు పంతులుగారికి గొప్ప జబ్బుచేసినది. అది తెలిసికొని కాకినాడనుండి ముగ్గురు శిష్యులు రాత్రికి రాత్రి బయలుదేఱి వచ్చి వీరి చేతిలో నూఱురూపాయలు పెట్టి ‘తమ రివి స్వీకరింపక తప్పదు. మాప్రార్థనము విని నిఘంటుకార్యాలయములో నింక బనిచేయవలదు. నిరంతర భాషావ్యాసంగమే మీయనారోగ్యమునకు హేతువు’ అనిచెప్పి వెళ్ళిపోయిరట. శిష్యప్రేమ యిట్టిదని పంతులుగారు మాటలవరుసలో నీవిషయము చెప్పిరి.
ఎలమంచిలి, నూజివీడు, నరసాపురము పాఠశాలలలో బ్రధానోపాధ్యాయులుగా నుండి పిఠాపురాంగ్లపాఠశాలకు వచ్చి యచట బెక్కువత్సరములు పనిచేసిరి. 1920 లో శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున బండితులుగా బ్రవేశించిరి. వార్థకదశచే నదియు నిర్వహింపలేక 1938 లో మానివైచిరి. నిఘంటు కార్యాలయమున వీరుచేసినకృషి యమూల్యమైనది.
పీఠికాపురాధీశ్వరులు గంగాధర రామారావుగారు పంతులుగారి చదువు చెప్పించి వీరి యభ్యుదయమునకు సర్వధా తోడ్పడిరి. 1888 లో బి.ఎ. ప్రథమశ్రేణి నుత్తీర్ణులైరి. నరసింహము పంతులుగారి వంటి శ్రీరామభక్తుని మఱియొకని మనము చూడము. ఆయన గ్రంథములన్నియు రామాంకితములే చేసెను. పంతులుగారి యభిమానవిషయము వేదాంతము. కళాశాలలో వీరి గురువులు కందుకూరి వీరేశలింగముగారు, మెట్కాఫ్ దొరగారు. విలియమ్స్పిళ్ల మున్నగువారు. కవితాగురువులు వీరేశలింగ కవిగారేయట. ఈ సంగతి పంతులుగారు తమ ‘రామకృష్ణ పరమహంస చరిత్రము’ న నిటులు చెప్పినారు.
అందఱును నన్ను నరసింహ మండ్రు; కవిత
యందు నాసక్తి బుట్టించినట్టి గురుడు
కందుకూరి వీరేశలింగ కవిమౌళి
స్థితిగతులు నీకు విన్నవించితిని రామ!
వీరేశలింగము పంతులుగా రొకనాడు బడిలో ‘ఆటవెలది” లక్షణము విద్యార్థులకు చెప్పి నల్లబల్లమీద నీరెండుచరణములును వ్రాసి యెవరైన నిది పూరింపగలిగిన బూరింపు డనిరట.
ఆటవెలది మీర లారసి చేయుడి
చేయకున్న మీకు సిగ్గుపాటు
దీనిని మన పంతులుగా రిటులు పూర్తిచేసిరి.
సిగ్గు లెన్ని యున్న జెదరిపోవునుగద
ఆటవెలది పొంత నార్యులార!
చూచితిరా, పూరణములోని చాతుర్యము! పువ్వుపుట్టినతోడనే దాని పరిమళమునుబట్టి యిది యీజాతిపు వ్వని కనిపెట్టవచ్చును.
పీఠికాపుర సంస్థానాశ్రయణము పంతులుగారికి గవులలో బెద్దపేరు తెచ్చినది. వీరువ్రాసిన గ్రంథములు చాల బాఠ్యములుగా నిర్ణయింపబడినవి. 1904 లో శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్రము పద్యకావ్య ముగ నావిష్కరించిరి. ఈకబ్బమున గవిత్వమునుగూర్చిన తమ యభిప్రాయము నిటులు వెల్లడించికొనిరి.
మాణిక్యమకుటంబు మౌళిపై దులకింప
రాజ్యంబునేలెడు రాజుకంటె
లలితలావణ్య విలాసినీ వక్షోజ
పరిరంభ సౌఖ్యానుభవునికంటె
సతతంబు నానంద సౌగాబ్ధిలో దోగు
భర్మహర్మ్యస్థ సంపన్నుకంటె
ధనవయోరూప సంతానాది భాగ్యాళి
దనియ సంతుష్టుడౌ ధన్యుకంటె
మధురమృదువాక్యసంపద మనసుగరచు
కవిత యబ్బిన కవియె యెక్కువయటంచు
నెంచెదరుగాన దత్సుఖ మెంతసుఖమొ
స్వానుభవమున గనుగొన బూనవలదె.
శిశిరకుమారఘోషు ఆంగ్లములో రచించిన దానినిబట్టి ‘గౌరాంగచరిత్రము’ పద్యకావ్యముగ బంతులుగారు సంతరించిరి. పద్యకావ్యములేగాక ‘వనవాసి’ ‘రూపలత’ మున్నగు నాటకములు వచనకృతులు బెక్కులు రచియించిరి. మొత్తము వీరికృతులలో నాంగ్లానుకరణముసా లెక్కువయనవచ్చును. ఈయన గ్రాంథికభాషా ప్రియుడు.
ఇన్ని చూచియే కూచి నరసింహమును, పానుగంటి లక్ష్మినరసింహరావును, చిలకమర్తి లక్ష్మినరసింహమును గలిపి ‘సింహత్రయ’ మని వ్యవహరించిరి. ఈ సింహత్రయమును పీఠికాపుర సంస్థానము భరించినది.
ఆంధ్ర రచయితలు నుండి-
———–