పేరు (ఆంగ్లం) | Kolachalam Srinivasarao |
పేరు (తెలుగు) | కోలాచలం శ్రీనివాసరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | అచ్చమ్మ |
తండ్రి పేరు | సేతుపతిశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | లక్ష్మమ్మ |
పుట్టినతేదీ | 3/13/1854 |
మరణం | 6/20/1919 |
పుట్టిన ఊరు | కామలాపురం, బళ్లారి జిల్లా |
విద్యార్హతలు | 1876లో ఎఫ్.ఏ పరీక్ష రాసి నెగ్గాడు. |
వృత్తి | న్యాయవాది, రచయిత |
తెలిసిన ఇతర భాషలు | కన్నడ, సంస్కృతము మరియు ఆంగ్లము |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సునందినీపరిణయము, మదాలసాపరిణయము, శ్రీరామజననము, పాదుకాపట్టాభిషేకము, లంకాదహనము, ద్రౌపదీవస్త్రాపహరణము, కీచకవధ, బభ్రువాహన, మైసూరు రాజ్యము, చాందుబీబీ, కుశలవ, హాస్యమంజూష, బాలభారత శతకము, ఆంధ్రీకృతాగస్త్య బాలభారతము, సీమంతిని, మానావమాన, అన్యాయ ధర్మపురి మహిమ, నాచిపార్టి, ఆచారమ్మ కథె (కన్నడ), సమయమునకు భార్య, మైసూరు రాజ్యం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | — |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రచరిత్రనాటకపితామహుడు |
ఇతర వివరాలు | బళ్లారిలో సుమనోరమసభ అనే నాటకసమాజాన్ని స్ధాపించాడు. ఇతను వృత్తిరీత్యా న్యాయవాది అయినా నాటక కళ అంటే అత్యంత అభిమానం. అప్పటి నాటక రచయితలలో కోలాచలం, ధర్మవరం రామకృష్ణమాచార్యులు ప్రముఖులు. 1917లో కడపలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్ సభకు శ్రీనివాసరావు అధ్యక్షత వహించాడు. మండపాక పార్వతీశ్వరశాస్త్రి లాంటి వారు ఆయన కవిత్వాన్ని ప్రశంసించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కోలాచలం శ్రీనివాసరావు |
సంగ్రహ నమూనా రచన | కోలాచలం శ్రీనివాసరావు గారి నాటకములు, యితర రచనల గూర్చి ఇంతవరకు సమగ్ర పరిశోధనము జరుగలేదు. ప్ర ప్రధముగా శ్రీనివాసరావుగార్కి నాటక కర్త గా అధికగౌరవమొసగిన వారు శ్రీ పురాణం సూరిశాస్త్రిగారు. వారు తమ “నాట్యాం బుజము” న శ్రీనివాసరావు గారి నాటకములలో ప్రధానము, ప్రసిద్ధములైన ‘రామరాజు చరిత్రమును’ గురించి కొంత వరకు చర్చించిరి |
కోలాచలం శ్రీనివాసరావు
కోలాచలం శ్రీనివాసరావు గారి నాటకములు, యితర రచనల గూర్చి ఇంతవరకు సమగ్ర పరిశోధనము జరుగలేదు. ప్ర ప్రధముగా శ్రీనివాసరావుగార్కి నాటక కర్త గా అధికగౌరవమొసగిన వారు శ్రీ పురాణం సూరిశాస్త్రిగారు. వారు తమ “నాట్యాం బుజము” న శ్రీనివాసరావు గారి నాటకములలో ప్రధానము, ప్రసిద్ధములైన ‘రామరాజు చరిత్రమును’ గురించి కొంత వరకు చర్చించిరి. అట్లే శ్రీ టేకుమళ్ళ అచ్యుతరాగారు “ఆంధ్ర నాటకము-రంగస్థలముల”లో శ్రీనివాసరావు గారి ‘రామరాజు చరితము’ ను ప్రశంసించి వున్నారు. ‘నాటకోపన్యాసములులో’ శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణా శర్మ గారు ‘శ్రీ ధర్మవరం, కోలాచలం’ వారల గూర్చి అయినను – శ్రీనివాసరావు గారి నాటకముల గూర్చి ప్రప్రధమముగా దిజ్మాత్ర పరిచయము గావించిరి శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు తమ ‘ఆంధ్ర నాటక దర్శిని, ఆంధ్ర నాటక సమీక్ష, ఆంధ్ర నాటక కవులు ‘ అను గ్రంధములలో శ్రీనివాసరావు గారి నాటకముల గురించి సంక్షిప్తముగా వివరించిరి. ఇక డా.పి. యన్.ఆర్. అప్పారావు గారి ‘తెలుగు నాటకవికాసము’న శ్రీనివాసరావుగారికి సముచిత స్థానం కలదు. అందు సమగ్ర చర్చ కవకాశం లేదు, ‘ఆంధ్ర నాటక కర్తలు’లో శ్రీనివాసరావుగారి నాటకములనేగాక,ఇతర రచనలను సైతము గూర్చి శ్రీ కప్పగల్లు సంజీవమూర్తిగారు రచించిన వ్యాసము మిక్కిలి విలువైనది, శ్రీనివాసరావుగారి జీవితమునకు, నాటకములకు, ఇతర రచనలకు సంబంధించిన సంగతులను లోకమునకు తెలియచేసిన వారు శ్రీ కప్పగల్లు వారే,అయినను యిది పరిమితమైనది. ఇట్లు శ్రీనివాసరావుగారి జీవిత విశేషములను, రచనలను గురించి సమగ్ర పరిశీలనము జరగలేదని స్పష్టమైనది.
‘నాటకాంతంహి సాహిత్యము’ అని నార్యోక్తియున్నను,నాటకాది సాహిత్యముగా శ్రీనివాసరావుగారు ఆరంభించియు, ఉత్తమ నాటక కర్తగా నిరూపించు కొని యుండుట ఈ సిద్ధాంత గ్రంథమున వ్యక్తమైనది. నాటక రచనానంతరమే పద్య కావ్యము నాంధ్రీకరించుటయు, ఇతర వచన రచనలను ఆంధ్రాంగ్ల భాషలలో చేసి యుండుటయు స్పష్టమైనది, ఆధునిక యుగమున ఆంధ్ర వాటకరచనా ప్రయోగముల తొలి దినములలో శ్రీనివాస రావుగారు నాటకరచనకు పూనుకొనిరి. అప్పటికి వీరికి దాదాపు నలువది వత్సరముల ప్రౌఢవయస్సు.అట్టి వయఃపరిపాకమున రచనకు దొరకొని యుండుటచేతనే జన్మతః వీరిలో గలప్రతిభకు భారతీయ పాశ్చాత్య కావ్యనాటక పఠన విమర్శన జన్యవ్యుత్సత్తి వన్నె పెట్టినది. లోకజ్ఞతజతయై, సముచిత రీతి రచన కవకాశము కల్పించినది ఇట్టి సదవకాశమును పరిగ్రిహించి శ్రీనివాసరావుగారు నాటకములు రచింప నారంభించి, క్రమముగా నాటక వాజ్మయ నిర్మాత కాగలిగిరి. మరొక పక్క ఆధ్యాత్మిక చింతనతో భగవద్గీతను తొమ్మిది భాష్యముల సాహాయ్యమున పఠించి, ఉపన్యాసములు రచించి ప్రసంగించిరి. ఇంకొక ప్రక్క తమ జీవిత కాలమందలి సంఘమును సంస్కరింపదలచి వేదశాస్త్ర గ్రంథములను పఠించి, ఆర్యుల సంస్కృతి, నాగరకతాదుల నెరిగి, విమర్శించి, పరిశోధించి, ఉపన్యాసములు వ్రాసి సభలలో చదివిరి. ప్రపంచనాటకములను, తత్సంబంధిత గ్రంధములను జదువుటచేతను, సుమనోరమసభ నాటక సమాజమున నాటక ప్రయోక్తగా నుండుట చేతను, కలిగిన అసామాన్యానుభవుమును పురస్కరించుకుని ‘ప్రపంచ నాటక చరిత్రమును’ (The Dramatic Historyof The World) రచించిరి.సంస్కృతం లోని అగస్త్య బాలభారతము సైతము తెనిగించిరి. అయినను యింత కంటెను నాటక కర్తగా వీరుత్తమ గుణగరిష్టములు, రసవంతములు, అమూల్యములు నైన రచనలు గావించి ప్రసిద్ధిగాంచిరి. ఇట్లామరణము రచన వ్యాసంగము కొనసాగించిరి. ఆంధ్ర నాటక వాజ్మయమునకే కాక ఆంధ్ర వాజ్మయమునకే ఎనలేని సేవగావించిన వారు శ్రీనివాసరావుగారు.
పేరుమోసిన నాటకరచయిత లిరువురు “బళ్ళారి” ని పావనము చేసిరి. అందు మొదటివారు ధర్మవరమువారు. రెండవవారు శ్రీనివాసరావుగారు. వీరిరువురును న్యాయవాదులు. ఇరువురును నటకులు, ధనికులును. కృష్ణమాచార్యులవారి చిత్రనళీయ మెంతపేరు సంపాదించినదో, శ్రీనివాసరావుగారి రామరాజుచరిత్ర మంత ప్రతిష్ఠ నార్జించినది. “రామరాజుచరిత్రము” చారిత్రకము. తల్లికోట యుద్ధమున గీర్తిశేషుడైన యళియ రామరాజుకథ యిం దభివర్ణితము. వీరి మైసూరు రాజ్యము, ప్రతాపాక్బరీయము చారిత్రకములు.
వీరు గ్రామ్యభాష నొప్పుకొనరు. కళాశాలలలో గ్రామ్యము నుపయోగింపవచ్చు నన్నప్పుడు మదరాసు విశ్వవిద్యాలయము వారేర్పాటు చేసిన సంఘమునకు శ్రీనివాసరావుగారు సభాపతులై వ్యావహారికమును నిరసించివైచిరి. సంఘసంస్కారమును గూడ వీరు కోరినటులు లేదు. నాటకములు విషాదాంతములు చేయుట వీరి కనిష్టము. ప్రాకృతాది భాషలకు బదులు వ్యావహారిక ముపయోగించ వచ్చునన్న వేదమువారి మతము సైతము వీరికి సమ్మతము కాదు. చారిత్రకములు, సంఘసాంబంధికములు నగు నాటకములే యీనాట వెలయవలెనని వీరు చెప్పినారు. తెలుగునకు శ్రీనివాసరావుగా రిచ్చిన సందేశమునకు సంగ్రహ మిది : “భాషను జెఱుచుట తప్పు. అశ్లీలము లుంట తప్పు. దుర్నీతికరములుగ నుంట తప్పు. బండుబూతుమాటల నీతిజెప్పుట తప్పు. పేరుపెట్టి దూషించి యెత్తివేయుట తప్పు. గ్రంథమునం దిత్యాదులు తప్పు లగునుగాని మిగతవి తప్పులు గావు. విషయవైశద్యము కొంతవరకు నుండిన జాలు. లోహములన్నియును స్వర్ణమయములు కాకపోయినను బనికిమాలినవి యెవ్వియును గావు. పూర్వకాలమునుండియు బుద్ధికుశలులని పెరందిన పండితుల గ్రంథములు చదివి తమ బుద్ధి బలిమిని వానికి జేర్చి యిప్పటివారు వ్రాయు గ్రంథములు చెడెనని చెప్పుట యసమంసంబు.”
శ్రీనివాసరావుగారు మల్లినాధసూరి వంశీయులు. వీరి పూర్వజు లందరును విజయనగర సంస్థాన పండితులు. వీరు నాటకాంత సాహిత్యము నెఱిగి స్వాధ్యాయపాఠము చేసిరి. జ్యోతిషము తెలిసికొనిరి. 1876 లో ఎఫ్.ఏ. పరీక్షలో నెగ్గిరి. రెవెన్యూ డిపార్టుమెంటులో బనిచేసి 1881 లో అనంతపుర మండలము “డిప్యూటి కలక్టరు” కడ దివానుగా నుద్యోగించిరి. 1888 లో రెండవతరగతి ప్లీడరు పరీక్షలో దేలి బళ్ళారిని న్యాయవాదులైరి. అంతటినుండి వీరి సారస్వతసేవ యభ్యుదయ మార్గమున బడినది. 1917 లో కడపయందు జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్సభ శ్రీనివాసరావు గారి నధ్యక్షులుగా నాదరించినది. మండపాట పార్వతీశ్వర శాస్త్రి ప్రభృతులు వీరి కవిత్వమును గొండాడిరి.
శ్రీనివాసరావుగా రుదారభావులు. పండితులను సత్కరించిరి. కవులను సన్మానించిరి. పేదలను బోషించిరి. తెలుగునాట నాటక శబ్ద మున్నంతదాక శ్రీనివాసరావుగారి పేరు నిలబడుననుట నిశ్చయము. “ప్రతాపాక్బరీయము” లోని యొక పద్యము మచ్చు.
మూరెడు మీసలన్బెనిచి ముప్పిరిగాబలుమారుదువ్వుచున్
నేరువుమీఱ దుస్తులను నీటుగ గట్టుచు వాలుబట్టుచున్
ధీరులమంచు నోటికసిదీఱగ బ్రల్లదమాడునట్టి యీ
భీరుల బోల కీవు రణభీకరవైతివి తక్కె గీర్తియున్.
———–
ఆంధ్ర రచయితలు నుండి-
———–