మల్లాది సూర్యనారాయణ శాస్త్రి (Malladi Suryanarayana Sastry)

Share
పేరు (ఆంగ్లం)Malladi Suryanarayana Sastry
పేరు (తెలుగు)మల్లాది సూర్యనారాయణ శాస్త్రి
కలం పేరు
తల్లిపేరువేంకమాంబ
తండ్రి పేరుశ్రీరామావధానులు.
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ2/20/1880
మరణం
పుట్టిన ఊరుచినకడియపులంక (దీనికి బుర్రిలంక-మల్లాదివారిలంక యని నామాంతరములు)
విద్యార్హతలుమహాపండితులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద వ్యాకరణశాస్త్రాధ్యయనము చేశారు.
వృత్తిసంస్థానకవులు , ఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు), ఆంధ్రవిశ్వకళా పరిషత్ ప్రచురణములు. 1. వైదిక భాగము, 2. లౌకిక భాగము,
ఆంధ్రభాషానుశాసనము (2 భాగములు. చరిత్రాత్మకవ్యాకరణము),
ఆంధ్రదశరూపకము (తెనుగుసేత), భాసనాటక కథలు (వచనము 2 భాగములు),
ప్రేమ తత్త్వము (స్వతంత్ర పద్యకావ్యము), ఉత్తరరామచరిత్ర (ఆంధ్రీకృతి),
భీష్మప్రతిజ్ఞ (స్వతంత్రనాటకము), ఆంధ్రభవిష్యపర్వము (పద్యప్రబంధము),
భవభూతినాటకవచనము, విదురనితి
సంస్కృతరచనములు:
బ్రహ్మసూత్రార్థదీపిక, రజోనన్తర వివాహము, సంస్కృతభాషా (ఇవి షష్టిపూర్తి సంపుటములో ముద్రితములు) అనేక పత్రికలలో వ్యాస రచనలు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లాది సూర్యనారాయణ శాస్త్రి
సంగ్రహ నమూనా రచనశ్రీ సూర్యనారాయణ శాస్త్రిగారు సంస్కృతాంధ్రములయందు గావలసినంత నికరమైన పాండిత్యము గలవారు. ఈ పాండిత్యమునకు దీటయినది వారికి గల యభినివేశము. సంస్కృతవాజ్మయ చరిత్ర, ఆంధ్రభాషానుశాసనము మున్నుగా వారు రచించిన కృతులు శాస్త్రిగారి పట్టుదలను బ్రదర్శించుటకు బట్టుగొమ్మలయినవి.

మల్లాది సూర్యనారాయణ శాస్త్రి

శ్రీ సూర్యనారాయణ శాస్త్రిగారు సంస్కృతాంధ్రములయందు గావలసినంత నికరమైన పాండిత్యము గలవారు. ఈ పాండిత్యమునకు దీటయినది వారికి గల యభినివేశము. సంస్కృతవాజ్మయ చరిత్ర, ఆంధ్రభాషానుశాసనము మున్నుగా వారు రచించిన కృతులు శాస్త్రిగారి పట్టుదలను బ్రదర్శించుటకు బట్టుగొమ్మలయినవి. ఆయనకు గవిగానున్న కీర్తికంటె, నధ్యాపకుడుగా విమర్శకుడుగానున్న పేరుపెంపులు పెద్దవి. ఏమనగా, సూర్యనారాయణశాస్త్రిగారు నలువది సంవత్సరములు ఉపాధ్యాయ పదవి నిర్వహించిరి. ఆ నిర్వహణములో వారికిగల శ్రద్ధానియమములు చక్కనివి. మహా పండితులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి సన్నిధిని వ్యాకరణశాస్త్రాధ్యయనము చేసి, తెనుగులు స్వయంకృషిని జూచి యుభయభాషా విశారదులై 1900 లో అమలాపురము హైస్కూలున నుపాధ్యాయులుగా బ్రవేశించిరి. అది నాలుగేండ్లయిన తర్వాత ఆంధ్రసాహిత్యపరిషత్తు వ్యవహర్తగా నొకయేడుద్యోగ నిర్వహణము. 1915 లో, రాజమండ్రి ట్రైనింగుకాలేజిలో నధ్యాపకత. ఆపదవి యొక వత్సరము. పదపడి, అనంతపురము కళాశాలలో మూడేండ్లు. మరల రాజమహేంద్రవరము ఆర్ట్సు కాలేజిలో 1919 – 1931 నడుమ పండ్రెండు వత్సరములు పండితస్థానము. అక్కడినుండి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో పదియేండ్లపాటు విద్వత్పదవి. మొత్తముమీద నాలుగుదశాబ్దులు పఠనపాఠనములలో శాస్త్రులుగా రాఱితేఱిరి. ఈలోపుననే వీరు కొన్ని గౌరవోద్యోగములు నిర్వహించిరి. వేంకటగిరి రాజావారి సంస్థాన కవితాపదవి 1909 – 1919 మధ్య. జటప్రోలు సంస్థానవిద్వత్ స్థానము 1910 – 1917 నడుమ. నారయ్యప్పారావు సంస్థాన విద్వత్కవిత్వ పట్టము 1919 – 1926 నడుమ. ఈవిధముగా సంస్థానకవులై యుపాధ్యాయులై యంతేవాసులకెందఱకో విద్యాభిక్ష పెట్టియుండుటచే సూర్యనారాయణ శాస్త్రిగారికి సుస్థిరమైన యశస్సు చేకుఱినది. దీనికిదోడు గ్రంథరచన . శాస్త్రిగా రనువాదములేకాక స్వతంత్రరచనలు కూడగావించిరి. వారి కృతులన్నియు బాఠ్యములుగా నిర్ణీతములు. ‘సంస్కృత వాజ్మయచరిత్ర’ వీరిది శాశ్వతముగా నుండ దగినగ్రంథము. ఒకదశాబ్దము చేసిన నిరంతరకృషి ఫలము. వైదికవాజ్మయము , లౌకికవాజ్మయమునని రెండుభాగములుగా నీ గ్రంథము విభజింపబడి వ్రాయబడినది. ఆంగ్లములో నీవఱకు సంస్కృతవాజ్మయ చరిత్రమున గలపొరపాటులు పేరుకొని, మనోహరము నిర్గుష్టము నగు ఫక్కిలో వీ రీగ్రంథము సంధానించిరి. శ్రీ వెంకటగిరి సంస్థానాధిపతుల ప్రోత్సాహముచే “సంస్కృత కవిజీవితములు” శ్రీశాస్త్రులుగారు తెనుగులో రచించి వెలువరించిరి. ఈరెండు గ్రంథములు సూర్యనారాయణ శాస్త్రులుగారి యశోలతకు బ్రాకులు.

పింగళి సూరనార్యుని ‘కళాపూర్ణోదయము’ ముద్రణదోషములతోను, విరుద్ధపాఠభేదములతోను నుండి యర్ధావగతికి గష్ట పెట్టుచున్నదని శాస్త్రులుగారు పరిశ్రమించి, పాఠభేదములు గుర్తించి సరిపఱిచి భావప్రకాశిక యను టీకతో, ఆమహాకావ్యమును లెస్సయగు తీరులోనికి గొనితెచ్చిరి. ఇది ముద్రింపించిన వారు పీఠికాపురాధీశ్వరులు. మల్లాదివారి పాఠములు కొన్ని ససియైనవి కావని తరువాత విమర్శనములు తలసూపినవి. ముఖేముఖే సరస్వతీ! శాస్త్రులుగారి వాజ్మయ వ్యవసాయము నిస్సామాన్య మైనదికాని, అందఱకు నందునది కాదు. ప్రాచ్య భాషాపండితులలో నిట్టి ప్రగాడ మైన యభినివేశము గలవారు పెక్కురు లేరు ; ఇట్టి లోకజ్ఞతాసంపత్తి గలవారును దక్కువగా నుందురు. వీరు ఆంధ్రవిశ్వకళా పరిషత్తు ‘సెనేటూకడమిక్కుకౌన్సిలు, ఓరియంటల్ ఫాకల్టీ’ మొదలగువానిలో సభ్యత నంది పండితులకు మన సంస్కృతాంధ్రములకు సంబంధించిన తీరుమానములు తెచ్చుచు నందు గొన్నింటిని సఫలము కావించి యున్నారని ప్రముఖులు చెప్పు చున్నారు. ఇది శాస్త్రులుగారి లోకజ్ఞతకును గుఱుతు. 1927 సం.లో శాస్త్రిగారి యధ్యక్షతనంది “ఉపాధ్యాయ పండిత పరిషత్తు” నేడు తెలుగునేలలో నలుమూలల బ్రాకి దొరతనము వారిచే గొన్ని యుపయోగములు చేయించుకొన్నది.

శాస్త్రులుగారి ‘సంస్కృత భాషారచనలు’ వారి షష్టిపూర్తి సన్మానసంచిక చివర బ్రచురితములయినవి. అవిచూచినచో గీర్వాణవాణిలో వారికి గల నైశిత్యము నైపుణి వెల్లడి కాగలవు. ‘ఆంధ్ర భాషానుశాసనము’ అనుపేరుగల వీరి వ్యాకరణగ్రంథమునకు గొప్పప్రతిష్ట వచ్చినది. ఈయనుశాసనమునకు శాస్త్రులుగారు పడిన పరిశ్రమ మనంతము. ఎన్నో ప్రాచీనాధునాతన గ్రంథములనుండి ప్రయోగములు సేకరించిరి. ఈకృషికి వ్యావహారిక పదశానకముగా నుండుటవలస గొందఱు గ్రాంథిక వాదవీరులు శాస్త్రులుగారిని మెచ్చరు. పోనీ, వారికి మెచ్చులక్కఱలేదు. తోచి గొప్పకృషి చేసినారు. ముందునాళ్ళు వారి శాసనము శిరసావహించగల వని నేడు సూచనలు కనబడు చున్నవి.

ఉత్తర రామచరిత్రాంధ్రీకరణము వీరిది చక్కగానున్నది. ‘అద్వైతంసుఖదుఃఖయో’ రిత్యాదిశ్లోకమునకు శాస్త్రులుగారి యనువాదపు బొందిక యెంత సుందరముగానున్నది!

సకలావస్థల నేది కష్ట సుఖముల్ సైరించునో యేకమై

వికలంబైన మనంబు నెందు గనునో విశ్రాంతి యెందొప్పు వా

ర్ధక మందుం దమి బెండ్లియాది మృతి పర్యంతంబుగా బ్రేమసా

ర్థకమౌ నెయ్యది నిత్యభద్రమయి యాదాంపత్య మేసారెడున్.

ఆంధ్ర రచయితలు నుండి-

———–

You may also like...