
పేరు (ఆంగ్లం) | Sonti Bhadradri Ramasastry |
పేరు (తెలుగు) | శొంఠి భద్రాద్రి రామశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | కామాంబ |
తండ్రి పేరు | గంగరామయ్య. |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1856 |
మరణం | 1/1/1915 |
పుట్టిన ఊరు | పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. |
విద్యార్హతలు | – |
వృత్తి | కవి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కాళిందీ పరిణయము, శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు), చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము), శంబరాసుర విజయము (సంస్కృత చంపువు), శివరామశతకము (ద్వ్యర్థి.), ముక్తావళి (మదాలసకథగల సంస్కృతాంధ్ర నాటకములు), మల్లిక (నవల), అహోబల పండితీయ వ్యాఖ్య, లఘుకౌముది (ఆంధ్ర టీక), జగన్నాథక్షేత్ర మహాత్మ్యము, శ్రావణమహోత్సవ తారావళి. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శొంఠి భద్రాద్రి రామశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | తిరుపతివేంకటకవులు ‘భద్రాద్రిరామకరుణ యున్నచో మాకు లోపముండ’దని యొక నమస్కారబాణము విసిరికాని పిఠాపురములో నవధానమునారంభింపలేదు. సిద్ధాంతకౌముదికి బాఠము వ్యాఖ్యానవిశేషముల గ్రోడీకరించి చెప్పువారిలో నాడు భద్రాద్రిరామశాస్త్రిగారు ప్రోడలు. |
శొంఠి భద్రాద్రి రామశాస్త్రి
తిరుపతివేంకటకవులు ‘భద్రాద్రిరామకరుణ యున్నచో మాకు లోపముండ’దని యొక నమస్కారబాణము విసిరికాని పిఠాపురములో నవధానమునారంభింపలేదు. సిద్ధాంతకౌముదికి బాఠము వ్యాఖ్యానవిశేషముల గ్రోడీకరించి చెప్పువారిలో నాడు భద్రాద్రిరామశాస్త్రిగారు ప్రోడలు. “కౌముది యది కంఠస్థా వృథా భాష్యే పరిశ్రమ:” అనుసూక్తి వీరిపట్ల సముచితముగ సమన్వయించును. ఈయన వినయసంపద పాండిత్యమును మించినది. కర్మాచరణము కవితాపాటనమును డాటినది. బ్రాహ్మముహూర్తమున లేచి సచ్చాత్రుడై పిఠాపురములో బాద గయాక్షేత్రమునకు బోయి స్నానసంధ్యాదులు కావించి, కుక్కుటేశ్వర దర్శనము చేసి వచ్చి యింట గూర్చుండి విద్యార్థులకు బాఠములు చెప్పుకొనుచు సూర్యాలోకము లేకుండ జీవయాత్ర సాగించినధన్యుడీయన. ఆలంకారగ్రంథము లాయన పెక్కుమందికి బాఠము చెప్పెను. కాని యాయనశిష్యులుమాత్ర మలంకారవిద్యార్థులు కారు. పెండ్యాల వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు భద్రాద్రిరామశాస్త్రిగారి శిష్యులు.
శాస్త్రిగారు తమయిర్వదవయేట ‘కాళిందీపరిణయ’ ప్రబంధము రచించిరి. మచ్చున కీపద్యములు తిలకింపుడు.
కాయచ్చాయల వెల్వరించు వలిపెన్ గాటంపు నీరెండ గెం
జాయల్ పూనగదమ్మలంబు బటవాసద్రవ్యముల్ గంధ చ
ర్చాయుక్తిం బలుతావు లీన సఖిహస్తం బూని వాహ్యాళికై
సాయంవేళల వత్తురందు దరుణుల్ జానొప్ప బూదోటలన్.
వలరాజు తనదుపనులన్
మెలగింపం జెందకుండ నేర్పున దారిన్
వలవైచి పట్టె ననగా
దిలకింపం దగిరి దోమ తెరమంచములన్.
శంతనూపాఖ్యానము 32 వ సంవత్సరమున సంతరించిరి. అది చక్కని ప్రబంధము. ఈకవివరుడు కేవల ప్రాచీనకవితా ధోరణికలవాడేగాక నవీనపథమున గబ్బము లల్లుమేధావి కూడను. వీరి ‘చిత్రసీమ’ కావ్యము పరికించిన నిది స్పష్టపడును. చిత్రసీమ కళాపూర్ణోదయమును బోలు కల్పితకావ్యము. ఇందు గృత్యాద్యవస్థ లేదు. ఇదిక్రొత్తపద్ధతి. “కల దొక రాచకూతురు..” అని కావ్యము నుపక్రమించినారు. ఇందలి యాశ్వాసములకు దళము లనిపేరు. అవియు ద్వితీయదళము మొదలుకొని యారంభింప బడినవి. తత్కారణము గ్రంథములో విశదమగును. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’ యనుచొప్పున నాది మధ్యాంతములందు గృతినాయకుని స్తుతించుపద్యములు రచించె. ఆపద్యములు కేవలషష్ట్యంతములు గాక ద్వితీయాద్యంతములుగా వ్రాయుట మఱియు నూతనత. ఆపద్యములలో భూతభావికథలు సూచితములు. ఈకావ్యములో గార్యముముందును, గార ణము వెనుకను కన్పించుటచే జదువుట కింపు పుట్టించుచుండును. ఇందు నాయకుడు చిత్రసీమ ఈపేరులో నొకవిచిత్రము. సీమ నకారాంతము, ఆకారాంతము కూడ నుండుటచే స్త్రీత్వపుంస్త్వవ్యవహారముల కీపేరే యుపయోగించెను. ఇది యవశ్యపఠనీయకావ్యము. తెలుగుపలుకుబడి కొకమచ్చు.
క్రొవ్వుమెఱుంగుగ బ్బొలయు గుజ్జగుమేనులతోడ నోరగా
దువ్వి శిఖల్ లతల్ ముడిచి దొడ్డగు నిత్తడిపోగులం జెవుల్
గవ్వల పేరుల న్నుదురుగప్పగ వంకరబొట్లు దిద్ది పై
గువ్వలవన్నె చేలమిడి కొందఱు చెంచులు వచ్చి కొంకుచున్.
చిత్రసీమ. —–
తెలుగుననేకాక సంస్కృతమునను వీరి కవితాధార ధారావాహిని. వీరి ‘శంబరాసురవిజయచంపువు’ చదివితీరవలయును. అందలి కవిత్వ మిటులు ప్రహించును.
నిర్మంజీరస్వన మవచనం నన్న కాంచీనినాదం
పశ్చా దేత్య ప్రియతమదృశా వంబుజాక్షి సిధాయ
కాహం బ్రూహీ త్యభిహితవతీ కంకణానాం విరావై
ర్జాతా నద్య: పులకితలసద్గాత్రయష్టి ర్బభూవ.
వైదార్భ్యాదినురీతి శ్చైకావళ్యాద్యలంకృతిప్రఖ్యా
నుకుమారత్వాదిగుణా రసికమనో హరతు కాన్యకన్యా మే.
పరమనైష్ఠికుడై, పండితశ్రేష్ఠుడై, కవిగరిష్ఠుడై చనిన భద్రాద్రిరామశాస్త్రిగారి కృతులు చిరకాలము తెలుగుపుడమి నిలువగలవనుటకు సందేహములేదు. పోతనవలె, కూచిమంచి కవివలె దనకృతులు భగవచ్చిహ్నితము లొనర్చిన మహావుణ్యు డీయన. ఈకవి తనవిషయమును శ్రీరామస్తవమున లగింపజేసి వ్రాసిన యీపద్యము చూడుడు; బాల్యంబున గవిత్వపటిమ చూవ నొనర్చె
మృదులకాళిందీ పరిణయకృతిని
సంస్కృతకవితోరుసామర్థ్య మెఱిగింప
విరచించె శంబరానురవిజయము
శబ్దార్థముఖచిత్ర సరణికై శంతనూ
పాఖ్యాన నామకావ్యం బొనర్చె
రూపకకవితను జూప ముక్తావళి
రచియించె సంస్కృతాంధ్రములయందు
కల్పితకథాపటిష్టత దెల్ప జిత్ర
సీమ గల్పించె మఱియును జేసె బెక్కు
లెట్టి కవితను నిర్మింపనేని దగడె
రామపదనేవి భద్రాద్రిరామశాస్త్రి.
శాస్త్రిగారు ముక్తావళి యనునాటకము తెనుగుభాషలోను, సంస్కృతభాషలోను రచించుట మెచ్చదగినది. తెనుగు ముక్తావళిలోని పద్యములు ముత్యములు.
చ. పడకొదవంగ గొంచెముగ వంగిన గాత్రమునందు వన్నక
ప్పడమును గ్రమ్మి పెన్విరహభారముచేత గృశత్వమంది యి
ప్పడతున్ గ్రీష్మమేగుతఱి వారిదగర్భమునందుగోన వ
చ్చెడు తొలిమించుపోల్కి గడుచిక్కియు గన్నులపండు
వయ్యెడున్.
——-
ఆంధ్ర రచయితలు నుండి-
———–