పేరు (ఆంగ్లం) | Kotagiri Venkata Krishnarao |
పేరు (తెలుగు) | కోటగిరి వేంకట కృష్ణారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | కన్న తల్లి : సుబ్బాయమ్మ, దత్తత తల్లి : సుబ్బాయమ్మ |
తండ్రి పేరు | కన్న తండ్రి : చిన్నయ్య, దత్తత తండ్రి : జగన్నాథరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1890 |
మరణం | – |
పుట్టిన ఊరు | నూజివీడు |
విద్యార్హతలు | – |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు సంఘ సంస్కర్త. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శృంగార తిలకము (ఆంధ్రీకృతి 1915 ముద్రి) , యౌవనగర్హణము, చాటుపద్యములు , శ్రీకృష్ణరాయ నాటకావళి (అభినవ పాండవీయము-పాదుషా పరాభవము – బెబ్బులి-ప్రణయాదార్శము అను నాలుగు నాటకముల సంపుటము), మాతృదేశము, విధి (పద్యకావ్యము) , దేవదాసి (నాటకము) , ఘోషావ్యాస ఖండనము (ఆముద్రితము). |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కళాప్రపూర్ణ |
ఇతర వివరాలు | ఈయన ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమాలలో పాల్గొని, అనేక మార్లు జైలుకెళ్ళాడు. వెంకటకృష్ణారావు 1920లలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తొట్టతొలి ఆంధ్ర ప్రాంతానికి చెందిన జమీందారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కోటగిరి వేంకట కృష్ణారావు |
సంగ్రహ నమూనా రచన | జననం బందితి గీర్తికెక్కిన సువంశంబందు ; రవ్వంత స జ్జన సాంగత్యము చేతనే తెలుగు బాసన్ జ్ఞాన మొక్కింత గ ల్గెను ; నన్నింకకు స్తైరిణీరమణి పాల్సేయంగ బోకమ్మ, యౌ వనమీ ! సాహస మింత కూడదు సుమా, బాగోగు లూహింపుమా |
కోటగిరి వేంకట కృష్ణారావు
జననం బందితి గీర్తికెక్కిన సువంశంబందు ; రవ్వంత స
జ్జన సాంగత్యము చేతనే తెలుగు బాసన్ జ్ఞాన మొక్కింత గ
ల్గెను ; నన్నింకకు స్తైరిణీరమణి పాల్సేయంగ బోకమ్మ, యౌ
వనమీ ! సాహస మింత కూడదు సుమా, బాగోగు లూహింపుమా.
ఈపద్యము ‘ యౌవననిగర్హణ ‘ మను చిన్నపుస్తకము లోనిది.
సీ. కైత యందున బ్రొద్దు గడపెద నందునా
భావనాశక్తి నీపైకి మరలు
వ్యాయామ మొనరింపవలె నను కొందునా,
యడుగులు నీ యున్కియందె చేరు
గ్రంథావలోకన కార్యంబు దలతునా
చిత్తమ్ము నీయందు హత్తియుండు
హితదర్శనా యత్తహృదయుండ నైతినా
నీ రూపమె యెదుట నిలచియుండు
నవయవములే పరాధీన మయ్యెనాకు
నింక నాస్థితి నీవ యూహించు కొనుము
యీవు మాత్రము వేరె యూహింపనేల
పడతి ! నాయట్లె స్వానుభవంబు గాదె !
ఈపద్యము ‘ చాటుపద్యములు ‘ అనుచిన్న పొత్తమునందలిది. పై యౌవననిగర్హణము, ఈ చాటుపద్యములు అను రెండుకృతులే కాక ‘ శృంగారతిలకము ‘ అను కృతితో మొత్తము మూడు శృంగారగ్రంథములు కోటగిరి వేంకట కృష్ణారావుగారు రచించిరి. ఈమూడును వీరి తొలికృతులు. ఇవి చదివినవారికి కృష్ణారావుగారు శ్రీనాథుని వంటి వాడని యనిపించును. చాటుపద్యములను బట్టి స్వభావమును లెక్కించుట కొందరి యభిప్రాయము. క్రీడాభిరామమును బట్టి శ్రీనాథుడు పచ్చిశృంగారి యని మనము నిశ్చయించివైచుటకు వీలుపడదు.
శృంగార – వీరములే కవి కుపాస్యములైన రసములు. మన కోటగిరి శృంగారరస మెంతసొగసుగా గవితలో జాలువారించెనో, వీరరస మంతకు మిగులగా బ్రదర్శించెను. పాదుషాపరాభవము, బెబ్బులి యను వీరి నాటకములు చూచినవారి కీ రహస్యము తేలిపోవును. ఈ కవి సామాన్యుడు కాడు. గంపలగూడెము జమీందారయి బహుమహాకవులను గౌరవించుచున్న కవి. నాటకాంతకవిత్వము వ్రాసిన మహాకవి. ఈయన కవిత కింత బిగువులగువులు వచ్చుటకు బురాజన్మ సుకృతమే హేతువు. ఏ మహావిద్వాంసుడు వాడలేని యటులు మంచి పొంకముగా బింకముగా బదసంధానము గావించును. సమాస భూయస్త్వము వీరికవితకు దరచుగా నుండు గుణము. ఆ గుణము వీరరస భరితమైన వీరి నాటకములు కొన్నింటికి గొప్ప రమణీయత నిచ్చినది. ‘ శ్రీకృష్ణరాయనాటకావళి ‘ యనుపేర వీరు రచించి ప్రకటించిన నాలుగు నాటకములు చాలగొప్పవి. వీనికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు మహోదాత్తమైన పీఠిక వ్రాసినారు. దానియందు సర్వవిషయములు విమృష్టములు. ‘ బెబ్బులి ‘ లోనున్న పద్యములు కొన్ని యేప్రబంధకవులు వ్రాయ నేరని తీరులలో వీరువ్రాసిరి.
సీ. ఆత్మగౌరవ రక్షణార్థమై యుసురు తృ
ణప్రాయ మంచు బెనంగవలయు
వెల్మ కులద్వేషి విజయరాముని సంహ
రింప గంకణము ధరింపవలయు
బాశ్చాత్యసేనకు భరతపుత్రుల బలో
ద్రేక మీతూరి బోధింపవలయు
జచ్చియో వగతుర వ్రచ్చియో దశదిగ్వి
శద యశశ్చట వెదచల్లవలయు
గీ. మరణ మున్న దొకప్పుడు మానవులకు
సద్యశం బొక్కటే చిరస్థాయి గాన
యుద్ధరంగాని కురుక సన్నద్ధ పడుడు
దళిత పరిసంధులార ! ఓ వెలమలార !
శా. వాలున్ డాలును గేల గీల్కొలిపి దుర్వారాహవ ప్రాభవో
ద్వేలాభీల కరాళ విక్రమ కళావిస్తారులై భారతీ
యాలోక ప్రతిభావిశేషమున రాజ్యస్థాపనోత్సాహులై
లేలెండీ ! యిక వెల్మవీరులు యశోలేశంబు నాసింపుడీ !
సీ. హైదరు జంగు పాదాశ్రయ మొనరించి
దురము గల్పించిన ద్రోహబుద్ధి
ఉన్నంతలో దృప్తి నొందక వెలమరా
జ్యం బేల గోరు దురాశయంబు
ఖండాంతరుల మైత్రి గావించి భారతీ
యుల కెగ్గు రోసిన తులువతనము
పద్మనాయకకుల ప్రాభవ ధ్వంసనో
పాయ పంకిలమయౌ పాపవృత్తి
గీ. యొక్కటై విధిబలము చేయూతనొసగ
తాండ్రకులుడు నిమిత్తమాత్రంబుగాగ
నీదు వధ విధానంబును నిర్వహించు,
నాత్మ సంరక్షణోపాయ మరసికొనుము.
మ. తరమౌనేనియు రామరాజ వరరక్తస్నిగ్ధ కాషాయ వి
స్ఫుర దాభీల తను ప్రకాశితుడనై చూపట్టునన్ దాకు డో
పరిపంధుల్ ! చవిగొండ్రు తాండ్రకుల పాపారాయ బాహాభయం
కర శాస్త్రీయ రణ ప్రభాకలిత తీక్ష్ణక్రోధ విక్రాంతినిన్.
ఆంధ్ర రచయితలు నుండి-
———–