పేరు (ఆంగ్లం) | Chavali Bangaramma |
పేరు (తెలుగు) | చావలి బంగారమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1897 |
మరణం | 1/1/1970 |
పుట్టిన ఊరు | తూర్పుగోదావరి జిల్లా, మోడేకుర్రు గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆ కొండ (1932), కప్పతల్లి పెళ్లి (1933), తపస్సు (1933), కార్తిక పూర్ణిమ (1934), కాంచన విపంచి (1958) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఈమె ప్రముఖ కవి కొంపెల్ల జనార్ధనరావు సహోదరి. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చావలి బంగారమ్మ కాంచన విపంచి |
సంగ్రహ నమూనా రచన | కవిత్వం అనేది సహజంగా పుట్టుకతో రావాలి. అప్పుడే దానిలో ఒకవిధమైన శక్తీ, ఒకవిధమైన రక్తీ ఉంటుంది. కవిత్వానికీ పాండిత్యానికీ సంబంధంలేదు. పండితుడు కవి కాకపోవచ్చును. కాని కవి పండితుడు కావచ్చును. శారదా కటాక్షవీక్షణం ప్రసరిస్తే పాండిత్యం లేకపోయినా కవిత్వం చెప్పవచ్చును. పద్యములల్లడం వేరు; కవిత్వం చెప్పడం వేరు. |
చావలి బంగారమ్మ
కాంచన విపంచి
కవిత్వం అనేది సహజంగా పుట్టుకతో రావాలి. అప్పుడే దానిలో ఒకవిధమైన శక్తీ, ఒకవిధమైన రక్తీ ఉంటుంది. కవిత్వానికీ పాండిత్యానికీ సంబంధంలేదు. పండితుడు కవి కాకపోవచ్చును. కాని కవి పండితుడు కావచ్చును. శారదా కటాక్షవీక్షణం ప్రసరిస్తే పాండిత్యం లేకపోయినా కవిత్వం చెప్పవచ్చును. పద్యములల్లడం వేరు; కవిత్వం చెప్పడం వేరు. పద్యాలల్లినంతమాత్రంచేత తత్కర్త కవిపదవాచ్యుడని అందరూ అన్నా కవికాడు. రచనలో చమత్కారము, భావములో ఔన్నత్యము, చెప్పదలచినది వ్యక్తీకరించుటలో ఒకవిధమైన సొగసు, ఇన్నిటినీ మించి ధ్వనీ ఉండాలి సరసకవితకు. కవిత్వమెప్పుడూ నిత్యనూతనశోభతో వెలుగొందాలి. పద్యమే కానక్కరలేదు, వచనములోనూ కవిత్వముంది; గేయములోనూ కవిత్వముంది. హృదయాన్ని రంజింపజేయగల శక్తి గేయానికీ ఉంది. ఇటువంటి గేయాలే ఈచిన్ని పుస్తకంలోనివన్నీ. ఇది నిజంగా సువర్ణగేయ విపంచియే.
ఈ గేయాలు రచించింది కొంపెల్ల జనార్దనరావు సోదరి శ్రీమతి చావలి బంగారమ్మ. మా బంగారమ్మకు కవిత్వం ఉగ్గుపాలతో వచ్చింది; సాధనవల్ల వచ్చింది కాదు. అది మేలిమిబంగారమే. కొంపెల్లవారి కుటుంబమే పండితకుటుంబమూ, కవికుటుంబమూను. సోదరుడు జనార్దనరావు చిన్నవయసులోనే అకాలమృత్యువు వాతబడినా అప్పటికే అంత చిన్నతనంలోనే గొప్ప సాహిత్యవేత్త అనీ, గొప్ప కవీ రచయితా అనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నాడు. ఆయుర్దాయమే ఉంటే నవ్యాంధ్ర కవితారీతులకు వన్నెలు దిద్ది దారులు చక్కజేసేవాడు. ఆతని సోదరే శ్రీమతి బంగారమ్మ – ఆ కుదిటిలో మొలచిన మొలక, ఆ నికుంజములో పెరిగిన లత. ఆమెకు కవితా వాసన లేకుండా ఎట్లా పోతుంది? సోదర ప్రోత్సాహాసారమున పండిన బంగారుపంట ఆమె. ఈ గేయ కుసుమాలు – సుమనోమనోహరాలు. పారిజాతపు పూవులు వాయుకిశోర కేళికను జలజల రాలినట్లు సోదర ప్రోత్సాహ సమీర కుమార స్పర్శమున అప్రయత్నంగా ఆ లతాంగి హృదయ నికుంజంనుంచి ఈ కవితా లతాంతాలు గేయరూపాన అవతరించాయి. ఒక్కొక్క గేయం నెత్తావులు విరజిమ్మే ఒక చక్కని చిన్నారి జాజిపూవు; దివ్యపరిమళం వెదచల్లే మల్లిపూవు. ఈ చిన్ని పొత్తం సురభిళం గుబాళించే జాజిపూవుల పొట్లం; కుందమాల; మల్లికా లత.
ఈ పాటలన్నీ ప్రకృతి శ్రీమతి బంగారమ్మచేత పాడించుకొంది. వీటిని ఆమె పాడుతూవుంటే ఎంత తీయగా తరితీపులు వెలారిస్తూ శ్రవణానందకరంగా ఉంటాయో వాటిలోని భావాలూ అంత ఉన్నతంగా, రమ్యంగా, హృదయానంద కందళితంగా వుంటాయి.
1. ఆకొండ
మంచులో ములిగింది
మాయమై పోయింది
ఆకాశమున గలసెనో
ఆకొండ
అక్కడే నిలుచుండెనో
రైలులోపల నేను
రాబోవు చున్నాను
ననుజూచి వెనుదిరిగెనో
ఆకొండ
నైజమే అటులుండెనో
వడివడిగ లేచింది
తడబడుచు నడచింది
మరుగుపడి ననుజూడ
పరుగిడుచు వచ్చింది
హడలుచూ నిలుచుండెనో
ఆకొండ
అక్కడే పడియుండెనో
జరజరా నడిచింది
గిరగిరా తిరిగింది
ఒలుతిరిగి తాను బడెనో
ఆకొండ
తలతిరిగి బారుమనెనో
పరుగు పరుగున నాతో
పయనమై యాకొండ
సరగున్న రాబోతె
దారికడ్డము నిల్చు
సరివితోటలు దాటెనే
ఆకొండ
తలయెత్తి ననుజూచెనే
ఏల జూచెదవంటి
ఏమి కావలెనంటి
ఎంతపిలిచిన పల్కదే
ఆకొండ
పంతమేమో తెల్పదే
డబ్బుతే డబ్బుతే
డబ్బుతే యనుపల్కు
విడువకను బల్కేటి
వడినడక రైలుతో
తనుకూడ చనుదెంచెనే
ఆకొండ
తడయకను పయనించెనే
ఇంతలో ఆకొండ
సొంతరూపము దాచి
వింతరూపము దాల్చెనే
ఆకొండ
పంతమున బడిపోయెనే
చలియన్న జడవదే
పులియన్న వెరవదే
మలయానిలుని దాచునే
ఆకొండ
మంచుకొండనిపించునే
మంచుకొండయితేను
మనకొరకు తానేల
మరచిపోయీ చూచునే
ఇదినాకు
మదితోచకను పోయెనే
గిరికన్య శ్రీగౌరి
వరతనయలము మేము
గురితప్పి పోయినాదా
ఆకొండ
గుణము తా మారినాదా?
కొనియాడ లేదన్న
కోపమున తాబోయి
కొండపొడుగున గూలెనే
ఆకొండ
గుండె రాయిగ మారెనే
ఒరులు పోశక్యమా?
పరులు తేశక్యమా?
నను విడిచి యాకొండ
నల్లరాయై పోయె
యెంత చూచిన చూడదే
ఆకొండ
ఎంత పిలిచిన పల్కదే.
2. దండ
చుక్కలన్నీచూసి చక్కనివితీసి
ఒక్క దారముతెచ్చి వరుసగాగుచ్చి
దాయి దాయినితీసి దండలోగుచ్చి
దండ చూసుకు నేను దండమెడతాను
నక్షత్రముల దండ నామెడనువుంటె
నలుగురూ నను జూచి నవ్విపోతారు
నక్షత్రముల దండ నాథుమెడనుంటె
నలుగు రాతని జూచి నవ్వుకుంటారు
ప్రక్కప్రక్కల బోయి పరికించుతారు
చక్కన్నివాడంచు చాటిచెపుతారు
నక్షత్రముల దండ ఎవరిదంటేను
నాదోయి నాదియని నలుగురంటారు
అడిగినంతనె యిచ్చునా అందరికిని
అడుగకుండనె యిచ్చు అతివ నాకతడు.
3. మనకేల?
కో అంటె తెలిసింది కోవెల్లకూత
కా అంటె తెలిసింది కాకమ్మకూత
కాకి కోవెల లొక్క కాంతినున్నాయి
కంఠములు మాత్రమే కలియలేదమ్మ
కోవెల్లకూసితే కొసరి వింటారు
కాకమ్మకూసితే కసరి కొడతారు
కోవెల్ల మీకేమి కోరితెచ్చింది
కాకమ్మ మీకేమి కాన్కలీలేదు
కోవెల్ల పాటకే కొండెక్కుతారు
కాకమ్మ గంతునూ గమనించరేమి
కోవెల్ల కూతలకు కునుకులేపోవు
కాకమ్మ గంతులను కన్నులేచూచు
కోవెల్ల కూసితే కోయిచ్చుతారు
కాకమ్మ గంతిడితె గజ్జెలిస్తారు
కాకి కోవెలల కే కయ్యములు లేవు
మనకేలనమ్మ యీ మాయకయ్యములు?
రచన : శ్రీమతి చావలి బంగారమ్మ
సేకరణ : కాంచన విపంచి
———–