దుర్భాక రాజశేఖర శతావధాని (Durbhaka Rajashekhara Kavi)

Share
పేరు (ఆంగ్లం)Durbhaka Rajashekhara Kavi
పేరు (తెలుగు)దుర్భాక రాజశేఖర శతావధాని
కలం పేరురాజశేఖర శతావధాని
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరుదుర్భాక వెంకటరామయ్య
జీవిత భాగస్వామి పేరులక్ష్మమ్మ
పుట్టినతేదీ11/18/1888
మరణం4/30/1957
పుట్టిన ఊరు 
విద్యార్హతలుమద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.
వృత్తిరాజకీయాలు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురాణాప్రతాపసింహచరిత్ర, అమరసింహచరిత్ర, వీరమతీ చరిత్రము, చండనృపాల చరిత్రము, పుష్పావతి, సీతాకల్యాణము (నాటకము), సీతాపహరణము (నాటకము)
వృద్ధిమూల సంవాదము (నాటకము), పద్మావతీ పరిణయము (నాటకము), విలయమాధుర్యము, స్వయంవరము, అనఘుడు, గోదానము, శరన్నవరాత్రులు,
అవధానసారము, రాణీసంయుక్త (హరికథ), తారాబాయి (నవల), టాడ్ చరిత్రము,
రాజసింహ, ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో), కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో).
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి,కవిబ్రహ్మర్షి మూర్ధన్య
ఇతర వివరాలువైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రి తో కలిసి “వేంకట – రాజశేఖర కవులు” అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదుర్భాక రాజశేఖర కవి
సంగ్రహ నమూనా రచనశ్రీ దుర్భాక రాజశేఖరముగారు తొలుత గవియై, తరువాత నవధానియై, పిమ్మట మహాకవియై రాయలసీమలోను యావదాంధ్ర సీమలోను మంచి యశస్సు నార్జించుకొన్నారు. వీరికి దేశము కావ్యకళానిధి, కవిసింహ, అవధాని పంచానస, కవిసార్వభౌమ, మహాకవి చూడామణి, వీరకవితా వీర, అభినవతిక్కన, వీరప్రబంధపరమేశ్వర, చారిత్రక కవిబ్రహ్మ, సుకవిరాజరాజ, కవితాసరస్వతి, వీరగాధా విధాత, చారిత్రక కవితాచార్య, వీరరస రత్నాకర, మహాకవి మార్తాండ మున్నగు నెన్నో యుపాదు లొసగి వందించుచున్నది.

దుర్భాక రాజశేఖర కవి

శ్రీ దుర్భాక రాజశేఖరముగారు తొలుత గవియై, తరువాత నవధానియై, పిమ్మట మహాకవియై రాయలసీమలోను యావదాంధ్ర సీమలోను మంచి యశస్సు నార్జించుకొన్నారు. వీరికి దేశము కావ్యకళానిధి, కవిసింహ, అవధాని పంచానస, కవిసార్వభౌమ, మహాకవి చూడామణి, వీరకవితా వీర, అభినవతిక్కన, వీరప్రబంధపరమేశ్వర, చారిత్రక కవిబ్రహ్మ, సుకవిరాజరాజ, కవితాసరస్వతి, వీరగాధా విధాత, చారిత్రక కవితాచార్య, వీరరస రత్నాకర, మహాకవి మార్తాండ మున్నగు నెన్నో యుపాదు లొసగి వందించుచున్నది. ఇది దేశమునకున్న వెఱ్ఱి గాని, రాజశేఖర కవి కివియేవియు నవసరము లేదు. కవి, దానిని దాట దలచినచో ‘మహాకవి’ యన్న బిరుదము చాలును. దీనియెదుట బై పట్టిక సర్వము వంది వాజ్మయములోనికి జేరును. దేశము తన కర్తవ్య మింతమాత్రమేయనుకొని కొంతవఱకు నాచరణలో బెట్టికొన్న దేగాని, ఎవని నుద్దేశించి లోక మిట్టి బిరుద సంతావ ప్రదానము గావించెనో, ఆయుద్దిష్ట కవి దృష్టికి మాత్రము ‘ఆత్మన్యప్రత్యయం చేత’ అనునక్షరములు తాటికాయలంత లేసి కనబడుననుట వాస్తవము. ఆ తీరున నారయని వాడు అంతర్ముఖుడు కానివాడు.

శ్రీ రాజశేఖరకవి నావిమర్శన పథములో బెక్కుచోట్ల మహాకవి, అక్కడక్కడ కవి. ఒకానొక కవి తనజీవితమునెల్ల నొకే గ్రంథములో దాచబెట్టును. ఒకడు దానినే చిన్నచిన్న పది గ్రంథములకు బంచి యిచ్చును. అసలు, ఒకడు గ్రంథములో బ్రతుకే పోయలేక పోవును. సంపూర్ణజీవదాతృత్వము గలమహాకవి జీమూతావాహనుని వంటివాడు. అతని వితరణమునకు బ్రహ్మాండ సుందరి హారతి పట్టును. జీవనదాతలగు కవులు నలువురున్న జాలును. దేశము సువర్ణము పండును. మన రాజశేఖరకవి జీవనప్రదాత. ఆయన సారస్వతజీవితము రెండుగా వింగడించి వ్రాయబడుచున్నది. ఇందు, పూర్వార్థము జీవి. ఉత్తరార్థము జీవుడు నని కోవిదులకు వేఱుగా వివరింప నక్కఱయుండదు.

వీరికి బ్రాథమికవిద్య ప్రసాదించిన యూళ్ళు జమ్ములమడుగు – ప్రొద్దుటూరును. తరువాత గడప హైస్కూలులో జదివి 1907 సం. లో ‘మెట్రిక్యులేషను’ పరీక్షయందు నెగ్గి యాంగ్లముమీది మక్కువ యింకను జదువు మని హెచ్చరింపగా, మదరాసు క్రిస్టియన్ కళాశాలలో ఎఫ్. ఏ. చదువుటకు బ్రవేశించిరి. “నాయనా ! నాకడుపున బుట్టినబిడ్డడవు. సవతాలి పలుకులకు మరగితివా ?” యని తెలుగుదల్లి యెకనాడు రాజశేఖరుని బుజ్జగించి చెప్పినది. ఆనాటినుండి యాంగ్లపు జదువునకు స్వస్తి చెప్పి వెనుకకువచ్చి వైచెను. ఈలోపున 1904 – 07 పరమ కందాళ్ళ దాసాచార్యులుగారి సన్నిధిని సంస్కృతాంధ్ర సాహితీగ్రంథములు పాఠముచేసి కవిత్వము కట్టుటలో దిట్టతనము సంపాదించిరి. కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రిశర్మగారికడ గూడ గొన్ని దినములు చదివిరి. 1908 లో ఆంగ్లము చదువు విరమించి మదరాసునుండి వచ్చి ఆ యేడే ప్రొద్దుటూరు ‘జిల్లా మునసబు కోర్టు’ లో నుద్యోగించుట కుపక్రమించిరి. అది పదుమూడేండ్లు సాగినది. అదియే స్వరాజ్య సముద్రమునకు మంచి పోటుసమయము. మోహనదాసు కరుణాచంద్రుడు పదారుకళలతో స్వరాజ్యపు వెన్నెల వెలుగుతో భారతాకాశమున వెలుంగుచున్న పార్వణసమయము. అట్టి స్వతంత్రపు బోటులో కోర్టు ఉద్యోగమునకు రాజీనామా నిచ్చిన దేశాభిమానులు రాజశేఖర కవిగారు. కోర్టు ఉద్యోగసమయమున గూడ సాహిత్యోద్యోగము నేమఱలేదు. అపుడే యవధాన ప్రదర్శన వాంఛ యంకురించి తమకు దోడుగ శ్రీ గడియారము వేంకటశేషశాస్త్రిగారు కూడిరాగా, “రాజశేఖర వేంకట శేష కవులు ” అను జంటపేరు పెట్టుకొని 1920 నుండి 1927 దాక దత్త మండల భాగముల కాహ్వానింపబడి యనేకావధానములు గావించిరి. తరువాత దరువాత నవధానయుగము మాఱి యాకవు లెవరికి వారు స్వతంత్రకావ్యవిరచనమునకు దొరకొనిరి. కలసి యుండగా వీరికి గౌరవించి యిచ్చిన బిరుదములు కవిసింహ, అవధాని పంచానన ఇత్యాదులు. పిమ్మట నీజంట చెలికారముతోనే వేఱయినది. అవధానసార మను గ్రంథము నాటి వీరి కలయికకు గుఱుతు.

రాజశేఖరుని వాజ్మయమును దేశమును సమానప్రపత్తితో సేవించెను. దేశసేవకై యుద్యోగమునకు నీళ్ళువదలిరి. ప్రొద్దుటూరు మ్యునిసిపలు సంఘ సభ్యులుగా బెక్కువత్సరములు పనిచేసి 1928 లో ఉపాధ్యక్షులు ( Vice Chairman ) గా నెన్నుకోబడిరి. అదిగాక 1927 మొదలు 1932 దాక ప్రొద్దుటూరు తాలుకాబోర్డు ఉపాధ్యక్షులుగా గూడ నుండిరి. పదపడి, మదరాసు సెనేటు సభ్యత – వేదపాఠశాలాకార్యదర్శిత మున్నగు ప్రజాహితోద్యోగములు వీరికిదక్కినవి.

నేటికి వీరి వయసు షష్టిదాటినది. దేశ – భాషాభిరతుడైన యీ మహాకవి త్రిలిజ్గలోకము గుర్తించి యెన్నోసారులు సన్మా నముతో బ్రహ్మరథము పట్టినది. ఇంతసేయుట కాయనలో వెల్లి విరిసిన కవితావేశము కారణము. ఈ కవిసింహము ‘వీరమతీచరిత్ర’ మను పద్యకావ్య మొండు రచించెను. అందలి పద్యసంఖ్య తొమ్మిది నూఱులు. ‘చండనృపాలచరిత్ర’ యేడువందల గ్రంథము. వీరచరితములపై, దేశగాథలపై వీరికి మమకారము హెచ్చు. ‘ఆర్యావర్త వీరనారీమణులు’ అను వీరి యాంగ్లభాషాకృతి బహుప్రశస్తమయినది. వీ రేఱుకొన్న యితివృత్తములు పెక్కు వీరగాథలే. ఈ కవి మొత్తపు గవిత్వరచనలో నుండునవి రెండు దృక్పథములు. ఒకటి వీరము, రెండు భక్తి. సీతాకల్యాణాదులగు పౌరాణికనాటికలు రెండవదృక్పథమునకు సూచకములు. కాగా, మిగిలిన కృతులెల్ల వీరగాథా గ్రథితములు. ఆకృతు లన్నింటిలో ‘ప్రతాపసింహచరిత్రము’ కన్నాకు. రాజశేఖరునకు జీవము పోసిన దా మహాకావ్య మొక్కటే. దాని ప్రశంస యింక నవసరము.

రాణా ప్రతాపసింహ చరిత్ర

పఠితల కేకావ్యముమీద బెద్దయభిమానముండునో, ఆ కావ్యము మీద దత్కర్తకు గూడ నంత మమకార ముండియుండునని యూహింపవలయును. యథా లాభముగా వ్రాసివైచిన గ్రంథముపై పాఠకునకు నంత యపేక్ష యుండదు. “నా కావ్యము ప్రతిరసికమాననము నావర్జింపవలయు” నను పట్టుదలతో గవి రచన సాగించుచొ నారచన మట్లు చేసితీరును. ప్రకృతము రాజశేఖరకవి ‘రాణా ప్రతాపసింహ చరిత్ర’ విషయము.

ప్రపంచ విఖ్యాతుడైన అక్బరు పాదుషాతో నిరువదైదు వత్సరములు సంగరము చేసి భారతస్వాతంత్ర్య పతాక నెగురవైచిన విశ్వవీరచూడామణి మహారాణా ప్రతాపసింహుడు. అట్టి ధర్మవీరుని చరిత్రాంశములు కొన్నేండ్లుగా నూహించి భావించి ధ్యానించి తన్మయులై రాజశేఖరకవిగారు కవితలో జొనిపి యతని నజరామరుని గావించిరి. పద్యచరిత్ర గ్రంథములకు నీ ప్రతాపసింహ చరిత్ర యొరవడి దిద్దెననుట సత్యమునకు సమీవస్థమగు మాట. తెనుగులో బురాణయుగము వెంట బ్రబంధయుగము, దానివెంట గావ్యయుగము, అనువాదయుగము తలనూపి ముంచివైచినవి. ఈ నవీనశకమున నెన్నో మార్పులు వెలసినవి. నేడు పురాణములమీద గంటె, చరిత్రకృతులపై మక్కువ యెక్కువగ నున్నది. భారతదేశ స్వాతంత్ర్యమునకు బహుధా పోరాడుచున్న కాలమున “ప్రతాపసింహచరిత్ర” వంటి కృతులు వెలసి యుపకరించినవి ఇట్టి చరిత్ర కావ్యములకు రాజశేఖరకవిగారిది మార్గదర్శకస్థానము.

ప్రతాపుడు పవిత్రనాయకుడు. ప్రాచీనధర్మత్రాణపరాయణుడు. పసి పూరి రొట్టెలు తిని యడవులలో దపము చేసి యిరువదై దేండ్లు పాదుషాతో సంగ్రామము చేసి కృతకృత్యుడైన భగీరథుడు. అక్బరు ప్రతిపక్ష నాయకుడు. “ప్రతిపక్ష గుణవర్ణనము – తజ్జయమువలన నాయకోత్కరము” అని యాలంకారికులు. ఈసమయము రాజశేఖరకవిగారు చక్కగా నీ గ్రంథమున సమన్వయపఱిచి వివరించినారు. గ్రంథము కడముట్ట జదువుదాక, ఈ కబ్బములోని నాయకుడు అక్బరో, ప్రతాపుడో పాఠకునకు దెలియదు. ఏసందర్భమునను బ్రతినాయకుని దీసికట్టుగా వర్ణింపని కవిగారి యుదారహృదయమునకు మహమ్మదీయులు కృతజ్ఞలై యుండవలయును. శ్రీ గాంధి మహాత్ముని మనస్తత్త్వమును లెస్సగా గుఱుతించుకొని దేశసేవలో నలగినవా రగుటచే గవిగా రిటులు సంతరింపగలిగినారు. ఈ చరిత్ర కావ్యమున బ్రతాపునితోఫాటు అక్బరు, మానసింహు లమృతులగు నాయకోత్తములు.

ప్రతాపుడు చరిత్రపురుషుడైనను మనకవిగారి చూపుచే బురాణ పురుషుడుగా, నవతారపురషుడుగా జిత్రింపబడి యున్నాడు. భారతజాతీయధర్మము పరాధీనము కారాదను పట్టుదలతో ధర్మసమరము గావించిన లోకజ్ఞడు ప్రతాపుడు. అక్బరుబలగముముందు ప్రతాపుని పక్షము చాల దక్కువ. అతడు పాదషాతో బ్రతిఘటించి యుద్ధము చేయుటకు గొంత జంకినాడు. కాని, ఓర్చి ధర్మసమరమే సేయవలయు ననుకొన్నాడు. క్షురకర్మ పరిత్యజించి నిద్రాహారమువిడచి యడవులలో దపించు జాతికి స్వాతంత్ర్యభిక్ష పెట్టినాడు. ప్రతాపుని కాలమునాడు మన మెవరముగానో బ్రతికియుందుము గాని, నేడు ప్రతాపుడు లేడు. అతనిచరిత్ర మెఱపు మెఱపులుగా భారత దేశాకాశమున మెఱయచున్నది. ఆమెఱుపుల నన్నిటిని కేంద్రీకరించి నిలువుచేసి తెలుగునేలకి మూటగట్టి పెట్టినవారు రాజశేఖర కవిగారు. వారిమేలు మఱవరానిది. నాయకునితో దాదాత్మ్యము నంది రచించిన కృతియిది – ఈ పదములు చదువుడు:

నే నెల్లప్పుడు భావనాబలమునన్ నీరూప నామక్రియా
ధ్యానంబుం గొని తన్మయత్వమున నన్యాకాంక్ష లేకుంటి; నీ
వే నేనైతినొ, నేనె నీవయితొ ? రూపింపంగ నాకేల నీని
త్యానందంబు ఘటించె నీకృతి ప్రతాపా ! విశ్వలోకార్చితా
దినరాజుంబలె నుగ్రకోపనుడవై తీండ్రించి శైలంబు నిం
డిన తౌరుష్కుల దాకి నీనడపు హాల్డీఘాటు యుద్ధాంగణం
బున విశ్వోన్నతమైన నీదువిభవంబుం గొంత నే బంచుకో
గనకున్న న్నినుగూర్చి యింతయనురాగం బిట్టు లుప్పొంగు
ఇలగల వీరపుంగవుల నిట్టి బలోన్నతు డిట్టి ధీరుడుం
గలుగ డటంచు బేర్గనిన గండడ వీవిక ; నిల్లువీడి వీ
ధుల జరియింపలేని కడుదుర్బల దేహుడ, నన్ను నెట్టులన్
వలచిత; నీచరిత్రమును వర్ణనసేసి జగాన జాటగన్.తాడో భవదుదార శౌర్యమును భావన మొనర్చి
రసమునను జొక్కి గ్రంథంబు వ్రాయునపుడు
త్వద్వశుండనై యానందబాష్ప వితతు
లాణిముత్యాల వలె రాల్తు సహరహంబు.

ఈ నాలుగు పద్యముల గర్భమున బ్రతాపచరిత్రము, రాజశేఖర కవియు దాగియున్నారు. తాదాత్మ్యము లేని పద్యము లీకృతిలో లెక్కకున్నవి. అట్టివి చరిత్రగతి కొఱకును, దృష్టిదోష పరిహృతికొఱకును గలవా యనిపించును. “నిజముగా తాము ప్రతాపుడే యనుకొని యాయా ఘట్టములు చదివి వినిపించుచు నానందబాష్పములు రాల్చుచుందు” రని రాజశేఖరకవిగారినిగూర్చి కొందఱు చెప్పగా విందుము. ఈ కబ్బమునందలి పద్యములు మంచి వాటముగా నడచినవి. సీసముల మీద హెచ్చుపాలు ప్రీతి ప్రదర్శింపబడినది. సర్వవృత్తములు తీపసాగినట్లు సాగుచున్నవి.

మ. ఉదయాస్తాచల మధ్యగంబగు జగం బుఱ్ఱూత లూగించె ; బె
ట్టిదుడౌపుత్త్రుడు; ఘోరసంగర కిరీటిప్రాయుడై కీర్తి సం
పద నార్జించెను దండ్రి; యెట్లితడు మేవాడ్రాజ్య మందారశా
ఖి దినం జొచ్చిన పుప్పియట్లు వొడమెన్ గీర్తిం గళంకించుచున్. [ప్రథమాశ్వాసము]

మ. అకటా! నీయెడ నెయ్యపుంబలిమి నే నల్లూడితిం గాక యే
టికి నాప్రార్థన మియ్యకొందు, నెపుడున్ డెందంబునన్, దేశమా
తకు వాటిల్లు విపత్తుకై వగచి చింతం గ్రాగు నీవగ్గి మ్రిం
గక స్వాతంత్ర్యము దక్కుదాక నొకచో గాలూని కూర్చుందువే? [ద్వితీయా శ్వాసము]

మృదువు దప్పని జాతీయములు వాడుటలో రాజశేఖరకవిది మంచి నేర్పు. అభిమన్యుపై చేయి – ఇది పెదవి దాటు పల్లవి యెపుడొవిడచి తేమిసేయుదు నాభాగ్యమిట్టులుండె – ఎద్దీనెనన్న వెసంగొట్టమునందు గట్టు డనుచందంబయ్యె – తల్లి జంపువానికి బినతల్లి చేతులు గణింప జివుళ్లను చొప్పెఱుంగవే? మొదలన్నెత్తురు పంచుకొం చనుజుడై పుట్టొందె – నీముఖము సందె ప్రొద్దు పొడుచునె? – పిల్లికిన్ జ్వరమనంగా జెల్లె – కాడుగా మాఱి పాండవబీడు దేలె – చెంతజింతామణిని వీడి చిల్లిగవ్వ కెగుబుజము చూప నెవ్వాని మొగము వాచె – వట్టి పెడసరికట్టె యన్పించుకొనుటె – ఇత్యాదులెన్నో ప్రతాపసింహచరిత్రలోని కవితకు సొగసుమెఱుగులు తెచ్చుచున్నవి. ఈక్రిందిగీతము లెంత మెలకువగా నడిపిరో కనుడు:

చూలుపండిన యా హమీడా లతాంగి
జిచ్చుటెండ కెడారిలో దెచ్చు టెల్ల
బూప పిందెల క్రొమ్మావి మొక్క నకట!
తీవ్రదావాగ్నిలో నీడ్చి తెచ్చుటయ్యె.
ఎట్టి బ్రహ్మ ప్రయత్నంబునేని జేసి
యుదయపురలక్ష్మికి గిరీట ముంతు దలను
గాక దైవోపహతు డనై కడిమి చెడిన
రక్త తతి గూర్తు రతనాల రావిరేక.
వీరి సీసపు నడక శ్రీనాథుని స్మరణకు దెచ్చుచుండును.

సీ. క్ష్మాగోశమును ముంచు గాడాంధతమనంబు
గరదివ్వెతో నార్ప గడగునట్లు
అత్యగాధము సాగరానంత జలముల
కేతమ్ము వేయ నూహించునట్లు
వసుద బొగ్గుగ గాల్చు ప్రళయాగ్నిహోత్రంబు
గన్నీటిచే నార్ప నున్న యట్లు క్షయకాలమున రేగు సప్తమారుతధాటి
దేటిరెక్కల నాప దివురునట్టు
గీ. లని జగము నన్ను బరిహాసమాడుగాక!
యెక్కటిని నిల్చి బలమెల్ల నెదురువెట్టి
విధికి మాఱొడ్డి స్వాతంత్ర విజయలక్ష్మి
యడుగులకు నిత్తు గల్యాణహారతులను.

ఇట ‘హారతి’ వైకృతము. కల్యాణ శబ్దముతో దీనిని సమసింపజేసిన కవిగారి నిరంకుశత మెచ్చదగినది. ఆమాత్రము స్వాతంత్ర్యము కవి తీసుకోవలయును. ‘పలువిధాలంకరణములు’ మున్నగు ప్రయోగములు కొన్ని ‘ప్రతాప’ లో జూపట్టును. సువర్ణ ఖండములవంటి యీ దిగువ సీసములు పఠింపదగినవి. రాజశేఖరకవిలో నకృతకమైన భావనావేశ ముండుటచే నాయనశైలి యమృత వాహినివలె నడచును. మఱి యివి యెంతబాగుగానున్నవి!

సీ. తెగినహారమున ముత్తియములువోలె భా
రతరాజ్య మది పెక్కు వ్రక్కలగుచు
జినచిన్న పాయలై చెడె; రాష్ట్రపతులలో
నొండొరులకు మైత్రి యొదవదెపుడు;
నిత్యలక్ష్మి శుభనిలయములై యుండ
వలయు రాజ్యములు శాశ్వత రణముల
ధనజన వస్తు వాహన శూన్యమై పాడు
పడి శ్మశానములట్లు ప్రభ దొలంగె

గీ. నిట్టి కుబ్జావతారంబు లెల్ల బోయి
భరతఖండ మఖండకై భాగ్య విభవ
నిలయమై యుండ జూడగా వలయుననుచు
గడుపులో గొండయంతాస గలదు నాకు సీ. ఒక్కొక్కరుండు సమస్తోర్వీతలము నిండ
నిరుపమామోదంబు నెఱపునట్టి
పూవు లసంఖ్యముల్ పూచె, రాజస్థాన
నందన దేవ మందార తరపు;
తడవొకింతయు లేని తౌరుష్క వాహినీ
జైత్ర యాత్రా ప్రభంజనము ధాటి
గూకటి వ్రేళ్ళతో గూడ గంపించె జె;
ట్టా పూవు లన్నియు నవనిరాలె

గీ. నీ వలెడి దొడ్డ పూవైన నిలుచు బొలుచు
విశ్వ విశ్వంభరామోద విజయలక్ష్మి
నలుదెసల నించునం చని తలచుచుండ
నగ్బ రనెడి ఝంఝూనిలం బలమె నేడు.

ఇట్టి ధారాచారుత్వము గల పద్యములకు బ్రతాపచరిత్రము పురుటిల్లు. ఈకావ్యమును మించు కావ్యములుపుట్టుచున్నవి. ఇంతయావేశముగల కవిత బయలు దేరుట మాత్రము కష్టము. అభినవ చరిత్ర కావ్యనిర్మాతలలో నీయన మొదటివా డనుటలో నాక్షేపణ ముండదు. నన్నయ – తిక్కన – పోతనాదుల కవితా శైలలు నలవఱుచుకొని, క్రొత్తపోకడలు పెక్కు లాకళించుకొని, చక్కని యితివృత్త మేరుకొని, యుగమున కనుగుణు డైననాయకుని సంపాదించుకొని, తియ్యని చిక్కని తెనుగులో నిట్టి యుదాత్త చరిత్ర కావ్యము సంతరించి తెలుగు మాతకు గాన్క వెట్టిన శ్రీ రాజశేఖరకవి కృతార్థ జీవి.

రాజశేఖర శతావధానులు చాల గ్రంథములు రచింపనిండు; రచించి యుండనిండు; వానియెల్ల ముందు ‘ప్రతాప చరిత్ర’ ధ్రువతామ్యై నిలబడు కబ్బము. కవిగారు తమ యీ కావ్యము కామేశ్వరీదేవి కంకిత మిచ్చుచు వ్రాసిన యీ రసఘుటికలు విలువ కట్టరానివి: సీ. కలశపాధోరాశి గర్భమందు జనించు
నలల బంగారు టుయ్యాలలందు
నల చతుర్దశ లోకములను బావన మౌచు
దనరు మణిద్వీప తటములందు
గొడుగులు వంచినట్లడరు కదంబ వృ

క్ష వితాన శీతల చ్ఛాయలందు
శ్రీల జెన్నా రెడి చింతామణీ భద్ర
సింహాసనము పార్శ్వ సీమలందు

పాల కడలి చలువ దేలు తెమ్మెరలందు
నీడు లేని పసిడి మేడలందు
గౌరి లోకజనని కామేశ్వర స్వామి
ద్రిప్పి కూర్మి నాదరించు గాక!

క. ఈ మహనీయ గ్రంథము
గై మోడ్చుచు నంకితమ్ముగా నిచ్చెద నే
బ్రేమ బెనుప నోచని నా
కామేశ్వరు నెత్తి పెంచు కామేశ్వరికిన్.

ఆంధ్ర రచయితలు నుండి-

———–

You may also like...