పేరు (ఆంగ్లం) | Nanduri Venkata Subbarao |
పేరు (తెలుగు) | నండూరి వెంకట సుబ్బారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | చిన్న బాపన్న |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1884 |
మరణం | 1/1/1957 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా వసంతవాడ |
విద్యార్హతలు | ఎఫ్.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులై, బి.ఎ. మద్రాసు క్రైస్తవ కళాశాల |
వృత్తి | కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించారు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | నండూరి వెంకట సుబ్బారావు |
స్వీయ రచనలు | నాటికలు : చిత్రనళినీయం, ఎండమావులు, అద్దెయిల్లు, చౌకబేరం, వడ్లగింజలోది , ఒకే గొడుగులో ఎంకి పాటలు (గేయాలు ) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నండూరి సుబ్బారావు ఎంకి పాటలు |
సంగ్రహ నమూనా రచన | ముద్దుల నా యెంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండ నీదురా కూసింతసేపు! నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ యీడుండ మంటాది యిలుదూరిపోతాది యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ మందో మాకో యెట్టి మరిగించినాదీ వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥ |
నండూరి సుబ్బారావు
ఎంకి పాటలు
1. ముద్దుల నా యెంకి
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండ నీదురా కూసింతసేపు!
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
యీడుండ మంటాది యిలుదూరిపోతాది
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
మందో మాకో యెట్టి మరిగించినాదీ
వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
2. వొనలచ్చిమి
జాము రేతిరియేళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటె
మెల్లంగ వస్తాది నాయెంకీ సల్లంగ వస్తాది నాయెంకీ
పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటె
వొయ్యార మొలికించు నాయెంకీ వొనలచ్చి మనిపించు నాయెంకీ
యెంకివస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె
కాలు కదపాలేదు నాయెంకీ కరిగి నీరౌతాది నాయెంకీ
మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి
కూలాస గుంటాది నాయెంకీ కులుకు సూపెడతాది నాయెంకీ
యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె
సెందురుణ్నీ తిట్టు నాయెంకీ సూరియుణ్నీ తిట్టు నాయెంకీ
3. యెంకి ముచ్చట్లు
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు
దొడ్డితోవకల్లె తొంగి సూడంగానే
తోటకాడే వుండు త్వరగొస్త నంటాది యెన్నాని సెప్పేది…
యెంకి రాలేదని యెటో సూత్తావుంటె
యెనకాలగా వచ్చి ‘యెవురువో’ రంటాది యెన్నాని సెప్పేది…
‘సిట్టి సేబా’ సాని నిట్టూర మేత్తుంటె
మాటా యినబడనట్టు మరియేటో సెపుతాది యెన్నాని సెప్పేది…
‘కోడిగూసేసరికి కొంపకెల్లాలి నీ
కోసరమె సెపుతాను కోపమొ’ ద్దంటాది యెన్నాని సెప్పేది…
‘యెంతసేపున్నాను యిడిసి పెట్టాలేవు
తగువోళ్ళలో మనకు తలవొంపు’ లంటాది యెన్నాని సెప్పేది…
యెనకెనక సూత్తానె యెల్లుతా వుంటాది
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు
4. యెంకితో తిరపతి
యెంకీ నాతోటి రాయే
మన ఎంకటేశ్శరుణ్ని యెల్లి సూసొద్దాము
ఆవుల్ని దూడల్ని
అత్తోరి కాడుంచి
మూటాముల్లీ గట్టి
ముసిలోళ్ళతో సెప్పి యెంకీ నాతోటి రాయే…
ఆసామి మీదేటో
వూసు లాడూకొంట
కొండ మెట్లన్నీ నీ
కొంగట్టు కెక్కాలి యెంకీ నాతోటి రాయే…
‘రేతిరి పగటేల
రెప్పెయ్య కెంకీని
సల్లంగ సూడ’ మని
సామితో జెప్పాలి యెంకీ నాతోటి రాయే…
5. సత్తెకాలపు నా యెంకి
“నీతోటే వుంటాను నాయుడు బావా!
నీమాటే యింటాను నాయుడు బావా!”
“సరుకు లేమికావాలె సంతన పిల్లా”
“నువ్వు మరమమిడిసి మనసియ్యి నాయుడు బావా”
“సక్కదనమున కేమిత్తు సంతన పిల్లా”
“నువ్వు సల్లగుండు పద్దాక నాయుడు బావా”
“యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా”
“నీ నీడలోన మేడ కడతా నాయుడు బావా
నీతోటే వుంటాను నాయుడు బావా
నీమాటే యింటాను నాయుడు బావా”
6. దూరాన నా యెంకి
యాడుంటివే యెంకి యాడుంటివే?
పూతోరి పందిట్లో
సీతాయి యెల్తుంటె
నీ తళుకు గేపకాన
నా తల తిరిగిందోలె!
యాడుంటివే యెంకి యాడుంటివే?
మామిడితోట కెల్లి
మంచీ పండొకటి గోసి
యేటోగాని నోట్లేస్తె
యిసమై పోయిందోలె!
యాడుంటివే యెంకి యాడుంటివే?
పొత్తేళ జొన్న సేలొ
సిత్తరమై పోతాది
గుమ్మైనవోసనొస్తే
గుండెగిరి పోయెనోలె!
యాడుంటివే యెంకి యాడుంటివే?
7. యేటిదరి నా యెంకి
‘యీరేతి రొక్కతేవు యే మొచ్చినావే?’
‘ఆడు నే నిక్కడే ఆడినామమ్మా’
‘యేటి నురగలకేసి యేటి సూసేవే?’
‘మా వోడి మనసటె మరుగుతాదమ్మా’
‘సెంద్రవొంకలో యేమి సిత్రమున్నాదే?’
‘వొంక పోగానె మా వోడొస్తడమ్మా
ఆడు నే నిక్కడే ఆడినామమ్మా
మావాడి మనసటె మరుగుతాదమ్మా
ఆవొంక పోగానె ఆడొస్తడమ్మా’
25. పంటసేలకే పయనం
యీయేపు నోయావు ఆయేపు నోయావు
జోడావులకు నడుమ నాయెంకి,
యీడ జోడుగా నిలుసుండె నాయెంకి,
ఆట లాడతా కలిసుంటె నాయెంకి,
నన్నె సూడు మన్నట్టుండు నాయెంకి !
ఈయేపు నోయేరు ఆయేపు నోయేరు
యేళ్ళ రెంటికి నడుమ నాయెంకి
తలను పాలకడవెత్తుకొని నాయెంకి,
సేత పూలు పుణుకుకొంట నాయెంకి,
పూల బూరవోయిస్తానె నాయెంకి,
నన్నె పోలుండుమంటాది నాయెంకి !
ఈకాడ నోకొండ ఆకాడ నోకొండ
కొండాకోనల నడుమ నాయెంకి,
పాల కుండ దించుకోని నాయెంకి,
గుడి దండ మెడతావుంటె నాయెంకి,
సూడ రెండే కళ్ళనిపించు నాయెంకి !
ఈసాయ నోసేను ఆసాయనో సేను
సేలరెంటికి నడుమ నాయెంకి,
పాలు పూలు నా కందిచ్చి నాయెంకి,
‘సొమ్ము లేల మన’కంటాది నాయెంకి,
గుండె జాలి పుట్టిస్తాది నాయెంకి !
26. సాటేలా ?
సాటేలా ? నీకు మాటేలా ?
సిన్నతనమేలా ? సిగ్గేలా ?
ఆ సీమ యీ సీమ
అందరందాలు
తిన్నంగ నినుసూసె
దిద్దుకుంటారు !
సాటేలా ? నీకు మాటేలా ?……
ముందు మన పాపణ్ణి
కింద దిగనీరు,
యెంకి కో వంటారు
యెత్తుకుంటారు !
30.అణకువ
ఎంతెంత దూరాన
ఎందరిలొ నే నున్న-
సూటిగా నావెనుక చూసె నా యెంకి
చురికి నేతనవైపు తిరుగవలసినదే !
ఏటవల నేబోయి
యిల్లుచేరని రేయి-
ఏటదీపము పళ్ళ నిడినదా యెంకి
వెలుగులో నేనచట మొలవవలసినదే !
కథ నడుమ మాజోడు
నిదుర దోగిన నాడు-
కథ కొస తళుకుగోరి కల గనెన యెంకి
కలను నే జొరి కథలు తెలుపవలసినదే !
31.ముసుముసులు
ఎంకి జలకపు పలుకు లెచట నిడుకొందు ?
ఎంతదాచిన చెణుకు లెగురు నిందందు !
మడుగున జలకమాడ
మానీడ లలలపై
గోరంత మా నటన
కొండంత జేసెనట ! ఎంకి జలకపు….
నీలపై మా రహ
స్యాలగొని తీరతీ
రాల పరుగిడి, మమ్ము,
గాలె యెగతాళియట ! ఎంకి జలకపు….
మెరుపు మేఘుల మించు
సరసులను మముగాంచి
ఆకసమెవులికి మడు
గడుగున పడినదంట ! ఎంకి జలకపు….
రతనాల వేదికను
రవల చాందిని కింద
ముత్తెపు తలంబ్రాలు
ముసిముసుల పెళ్ళంట ! ఎంకి జలకపు…
32.దీపసుందరి
దీపసుందరి తోటి సాపత్యమా నాకు
దీప సుకుమారి దరిదాపు చనగలనా ?
రంగుకోక ధరించి
రాజురాక తపించు
నీడలను తెలివి విడ
నాడి కననుంకించు ! దీపసుందరి….
రెప్పవాల్పక మింట
లెక్కించు చుక్కలను
అలికిడికి వులికిపడు
నలుదెసల విరగబడు ! దీపసుందరి…
నిలువంత చెవిజేసి
పిలుపువిన నోరగిలు
కటి బిగించును శిరసు
కానిలెమ్మని విసురు ! దీపసుందరి…
కెవ్వుమని కిందబడు
నవ్వు నాలుక సాచు
‘రాజా’యనుచు నెగిరి
‘రారా’ యనుచు కునుకు ! దీపసుందరి…
వేదన సుఖానమను
వెలుగుచు శుభాన చను ! దీపసుందరి….
33.జాలి
రాలురేలును పూలె జాలి నొలికెడురా ?
వేలుపే నీకంటె చాల సులభుడురా !
నా యలికిడి నేనె
రేయి కొండలనడల
శిఖర శిఖరమ్ము నీ
ముఖమె చూపునురా ! రాలు రేలును…
ఒక్కననె మళ్ళగని
చుక్కల మొయిళ్ళగొని
నీ కళ్ళె నీ నిలువె
నింగి రాయునురా ! రాలు రేలును…
పూలతలె నా వెతల
పోలిచి మెలికెలారి
వొళ్ళు ఝల్లన నిన్నె
కళ్ళ గట్టునురా ! రాలు రేలును….
ఏమియడుగకె గుడిని
సామికడ నే నిలిచి
హారతీయగ వెలిగె
మూర్తి నీదేరా !! రాలు రేలును…
వుసురుల పసలు చెల్లి
ఒంటినై యుంటగని ! రాలు రేలును…
34.మరపు
ఏటికోయి మనచెలిమి-నీట చిత్తరవుల కలిమి ?
కలయె తెలుపు మనమనసుల కలయికల నిజానిజాల !
అలక నలసి నేను కునుక
తెలివిని నను నీవు చెనక-
కనకె నీ సరాగసరణి
కల రెక్కల పరతుదివిని ! ఏటికోయి….
కనులుకునుక బొమలుకులుకు
నని నను తనివారక నెదు
యెరుగవింత కలలోనా
మరుగుమరులు తిరుగుతెరలు ! ఏటికోయి….
నీ యెద వూయల లీయెడ
పోయెద కల పలుపోకల-
కలలో కలగందు నొకట
తెలివి నిదుర లచట నచట ! ఏటికోయి….
యీ నందనమును నిను నను
ఆనంద సుఖమున మరతు !
కలలో నను చూతువేమొ
కత్తికెరను జేతువేమొ ! ఏటికోయి….
35.జయభేరి
కళలీను వనమె వెల-తెలలేల నోయీ ?
వనలక్ష్మి కనగాచు-కొను దినములేమో !
వుండుండి పూలటుల-వులికె నేమోయీ ?
కడుపులో పాప చ-క్కలిగింతలేమో !
చిలుక పావురము లటు-చిందులేలోయీ ?
ఆప్తమిత్రుని రాక కాత్రమో యేమో !
వురుములు మెరుపులాయె-దరికి రావోయీ ?
జయభేరితో వెలుగె దయసేయునేమో !
36.శివ శివా
తనివితీరలేదే ఆ తరుణ మాగిపోదే !
కార్తిక దీపాల గంగకలలె కందునే పదేపదే !
తలకిందుతపసున కాశి
నిలిచె గంగనను నీ పగ !
శంకరుడె యెరుగడింత
సావాసమ్మను నీ వగ ! తనివి…
నీలను మన వేలు వేలు
కీలింపగ వెదకు సుకము !
ననుతాకిన అలయె నిన్ను
పెనగొన నీ పులక తళుకు ! తనివి…
నీ కరముల వెలుగు గంగ
నా శిరమునె అభిషేకము !
‘శివశివా’ యనన్గ ప్రజలు
సిగ్గున మునిగెడు నీ భ్రమ ! తనివి…
ఉదయమె నా దోయిలి నీ
వుదక ధారలుంచు రక్తి
బిందు బిందు కోటి
సూర్యబింబము లొలికించు శక్తి ! తనివి…
37.బరిణె
కలవారిగని అలంకారాలు గొనుట
పులి బోలదలచి వాతలనింపుకొనుటె !
ఘనులు తమ సకియలను
మణులతో కైసేయ
ఆకులలములె యెంకి
కాయె నాయిడుసరులు ! కలవారి…
ఆకుల కులపుసరులె
వేకనులలో కదిలె
మెప్పునమెరిసె కనులు
నిప్పులగురిసె మణులు ! కలవారి….
పనితనమనగ సఖులు
పసలేదనగ ఘనులు
పలువాయి సమరాల
నలిగె నాకుల సరులె ! కలవారి…
వెలవోని మా సరులు
నిలువనీడనొసన్గి
స్వంతమటు దాచెనొక
వలపు పలుకుల బరిణె ! కలవారి….
ననుగూడ నటె దాచు
మని పొగిలె నా యెంకి ! కలవారి….
38.యెంకితనము
ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే !
యీ చిత్తమునకు వెలుగు నీ యెంకితనమే !
కొమ్మనొక చేయూని
గోవునొక చేయాని
వేళ్ళు కదిపితివా, నె
మళ్ళజత దిగియాడ ! ఆ చిత్ర…
చిలుక, పావురము, నీ
చే వ్రాల చెంపగొని
అంత ననుగని, వింత,
వంత, మీ మువురెగుర ! ఆ చిత్ర…
కోడె, పసిలేడి, నడి
కోన నిను పసిగట్టి
‘నేను, నే’నని యురికి
నినుతాకి కనుమూయ ! ఆ చిత్ర…
యేట కనుచాటొసగ
తోట నీడల తెరలు
నాటి వెన్నెలనావ
నా,నీ, మరువ నీవ ! ఆ చిత్ర…
39.చిలుక పలుకు
ఎకసకె మెవరికి తెలుసు ?
ఎంకిచిలుక మనుసు గడుసు ! ఎకసకె…
‘పేరంటము పిలిచి తోట
చూరవిడుతె’ యని నేనన-
చిలుకను పురికొలిపి నన్ను
‘బలిరాజా’యనిపించిన ఎకసకె…
గాయపడిన లేగకు నే
సాయమిడకె సాగిపోవ-
చిలుకను వుసికొలిపి నన్ను
‘శిబిరాజా’ యనిపించిన ఎకసకె…
కలలో తన సెలవులేకె
కానలబడి పోతినేమొ-
మెలకువగని చిలుక బిలిచి
‘నలరాజా’ యనిపించిన ఎకసకె….
పూలను గద్దియ నమరించి
పూలకిరీటము కూరిచి
‘రాజా’ యన తానెకోరు
‘రాణీ’తన మనుకొంటిని ! ఎకసకె…
ఎగతాళియు ఎంతో సొగసు
ఎంకి చిలుక మనుసె మనుసు ! ఎకసకె…
40.చెర
కరములు సిరులు పరుల కారింపనా ?
ఎంకి
కనులెత్తెనా రాజు గతులెరుగునా ?
‘నారాజు కగుశయ్య
రేరాజు చేరె’నని
శయ్య సదురును యెంకి
చంద్రుగని కనులార్చు ! కరములు సిరులు….
పానుపున మాజోటి
పవళింపు భావించు
వెచ్చవెచ్చని పాన్పు
వే విధుల లాలించు ! కరములు సిరులు….
తనను వెన్నెల సోక
తప్పువలె కోపించు
‘రాజుపస గనురాజు
రాడ ?’ యని తలయూచు ! కరములు సిరులు…
నేరాక తనుతరలు
నా రాక గని మరలు
కళ్ళలో చందురుని
కైదుగొని నిదురించు ! కరములు సిరులు….
దూరాల దొర,పై నిగారాల రాజు కీ
కరములు సిరులు పరుల గారింపనా
ఎంకి
కనులెత్తెనా రాజె గతులెరుగునా ?
41.రేవెలుగు
ఎవరైన యెపుడైన యేవాడనైన
యింత జాలి గనెర యెంకి చిత్రాలు ?
మొయిలు జొరె చంద్రుడని
భయపు మిష నా యెంకి
పూసెజ్జ నాపజ్జ
పోగుపడ-ఆరటము ! ఎవరైన యెపుడైన…
మబ్బు వెలువడు చంద
మామ గని, తన చీర
చెరగు మాటిడి నన్ను
జీరు సిగ్గరితనము ! ఎవరైన యెపుడైన….
‘కళ్ళ ములుకులు దించె
కంఠపాశము లేసె
కిరణాలు నువులేని
తరి’ యనెడు-ఆకులము ! ఎవరైన యెపుడైన…
‘దృష్టి’తొలగగ తనను
తిలకముగ నేగొనిన
నెలవంక నా రాజు
తులయె యను-అతిశయము ! ఎవరైన యెపుడైన…
రేవెలుగు గీవెలుగు
నా వెనుకె యనుమతము ! ఎవరైన యెపుడైన…
42.ఉయ్యాల
ఎంకి వూగెను కొమ్మ వుయ్యాలా ! చంద్ర
వంక వూగెను బొమ్మవుయ్యాలా !
ఏటిపైకొమ్మ నూ
యెల యెంకి అమరించె
నీట బొమ్మవుయ్యాల
నెలవంక వెలయించె ..ఎంకి…
ఎంకి వన్నెలచీర
నెగిరె వెన్నెల పూలు
ఎండుటాకుల గొలుసు
వెండితీగలు చేరె ! …ఎంకి…
సికపూలు, ముంగురులు
చిరుమువల మొలనూలు
ఒకచే సదురుకొనుచు
ఒయ్యారమే వూగె ! …ఎంకి….
తీగల నడుమ నూగె
దీపమై, తిలకమై,
పీఠమై-ఎంకికి-కి
రీటమై,నెలవంక ! ..ఎంకి….
మున్నీటి యాజోడె
ఆనాటి కీనాడు ! …ఎంకి….
43.తపస్సు
“సాగరుని సల్లాపమా అల
చందురుని యుల్లాసమా సిక
తాతలాల విలాసమా
ఆ పగిది బంధించు నీ కనుపాప నెయ్యది తాపసీ ?”
“కలదు నా పాలకుని కంటను
కడలి, కల దీ చందమామయు
అలల తలపై నాట్యమాడుదు
రచట దంపతు లెవ్వరో ?
ఆట కలరును సాగరుండును
అలల ననుకూలముగ నడుపును,
దంపతులు నింపుదు రతని రత
నంపు కాంతుల కాన్కలన్ !
బాలభక్తులవలె, నిలింపుల
లీల, శంపాలతికయన,గో
పాలు దరహాసాంచలమువలె
నటన సలిపిరి చిటుకలో !
ఆటలాడెడు నా సురూపమె
కోటి గుణితంబయ్యె త్రుటిలో
పాలకుడు తనుమరచి పరవశులీల
కన్నులు మూయగన్ !
సాగరుని సల్లాపమేలా
చందురుని యుల్లాసమేలా
సైకతంపు విలాసమేలా
లోకమిక నేలా ?”
రచన : నండూరి వెంకట సుబ్బారావు
సేకరణ : ఎంకి పాటలు
———–