పేరు (ఆంగ్లం) | Sthanam Narasimharao |
పేరు (తెలుగు) | స్థానం నరసింహారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | ఆదెమ్మ |
తండ్రి పేరు | హనుమంతరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 9/23/1902 |
మరణం | 2/21/1971 |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా బాపట్ల |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నటస్థానం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది. వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు. |
ఇతర వివరాలు | ప్రసిద్ధ రంగస్థల మరియు తెలుగు సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందారు. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు మరియు కళాకారుడు. 1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్ర నాటకం లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | స్థానం నరసింహారావు తొలి రోజుల జీవిత విశేషాలు |
సంగ్రహ నమూనా రచన | మూడున్నర దశాబ్దాలపాటు తన స్త్రీ పాత్రధారణలో వైవిధ్యభరితమైన పాత్రలను ధరించి ఆంధ్ర పేక్షకలోకాన్ని సమ్మోహితులను చేసి, “నటకావతంస”, “నటశేఖర”, “ఆంధ్ర బాలగంధర్వ”, “నాటక కళాప్రపూర్ణ” వంటి బిరుదుల్ని భారత ప్రభుత్వంవారి “పద్మశ్రీ” పురస్కారంతోపాటు మరెన్నో గౌరవాలను పొందిన మహానటుడు స్థానం నరసింహారావు. నూట పదకొండు నంవత్సరాల క్రిందట 1902లో గుంటూరు జిల్లా బావట్లలో ఒక పేద కుటుంబంలో జన్మించారాయన. |
స్థానం నరసింహారావు
తొలి రోజుల జీవిత విశేషాలు
మూడున్నర దశాబ్దాలపాటు తన స్త్రీ పాత్రధారణలో వైవిధ్యభరితమైన పాత్రలను ధరించి ఆంధ్ర పేక్షకలోకాన్ని సమ్మోహితులను చేసి, “నటకావతంస”, “నటశేఖర”, “ఆంధ్ర బాలగంధర్వ”, “నాటక కళాప్రపూర్ణ” వంటి బిరుదుల్ని భారత ప్రభుత్వంవారి “పద్మశ్రీ” పురస్కారంతోపాటు మరెన్నో గౌరవాలను పొందిన మహానటుడు స్థానం నరసింహారావు. నూట పదకొండు నంవత్సరాల క్రిందట 1902లో గుంటూరు జిల్లా బావట్లలో ఒక పేద కుటుంబంలో జన్మించారాయన. ఆపద్ధర్మంగా నాటకాలలో పాత్రధారణ చేయడం ప్రారంభించి రెండేళ్లలోనే -నాడు – ఆంధ్రదేశానికి “నాటక రాజధాని”గా ప్రసిద్ధి చెందిన తెనాలి పట్టణం చేరి, ఆంధ్రనాటకరంగ చరిత్రలో సమన్నతమైన స్థానాన్ని పొందిన శ్రీ రామ విలాస సభ ప్రధాన సభ్యలలో ఒకడై, పాతికకు పైగా నాటకాలలో ప్రధాన భూమికలను ధరించి, వేలాది ప్రదర్శనలిచ్చి తనతోపాటు తన సహనటులకు, తన మాతృసంస్థకు గౌరవమర్యాదలను ఆర్జించిన పెట్టిన ఉదాత్త నటశేఖరుడు స్థానం.
స్థానం నరసింహారావు స్త్రీ వేషాలు ధరించి రంగస్థలం మీద చూపిన శృంగారభావ విలాసాలు, చిలిపి నవ్వల హౌయలు, ఆయన ప్రతి పాత్రలోనూ సుప్రతిష్టితం చేసే శృంగార, వీర, కరుణ రసాల పరిపోషణ, జాలిలో నుంచి కార్యంలోకి, శృంగారంలో నుంచి కరుణలోకి అలవోకగా ఉరికే ఆయన అభినయ నైపుణ్యం ప్రేక్షకుల మననుల్ని ఉర్రూతలూపి, లాలించి, కవ్వించి, పులకింపచేసింది. ఆయన నటనాచాతుర్యం బహుముఖాల విస్తరించిన వటవృక్షం -వంటిది. ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న చిత్రలేఖనా విన్యాసం, వారి దగ్గరా వీరి దగ్గరా వినికిడిగా పట్టబడ్డ రాగలక్షణాలు, ప్రకృతిని, మానవ ప్రకృతిని, లోక ప్రవృత్తిని పరిశీలించాలన్న ఆయన మానసోల్లాసం -ఇవి అన్నీ రంగరించి చిత్రకారుడి కుంచెలో నుంచి వెలువడిన విలాస మూర్తిగా ప్రత్యక్షం అయ్యేది ఆయన వేషం. ఆ క్షణం నుంచి మూడు నాలుగు గంటలపాటు తానధిష్టించిన నట క్షేత్రాన్ని ఏకచ్ఛతాధిపత్యంగా ఏలేవాడాయన.
ఆ మూడు నాలుగు గంటలలోనే ఆయన నడక హంసలకు వయ్యారాలు నేర్చేది. ఆయన ఆగి ఆగితెరలు తెరలుగా నవ్వేనవ్వగువ్వపిట్టలకు కిలకిలారావాల సోయగాలుచూపేది. ఆయన పాట మధుమానపు కోయిలకు స్వరాల సరాగాలు కూర్చేది. ఇదంతా ఈనాడు కాల్పనిక భావనలా అనిపించవచ్చు. కాని ఆయనను ఆయన నటజీవితం చివరి రోజుల్లో నయినా రంగస్థలం మీద చూసే అదృష్టం కలిగిన మా తరం వారికి, మాకన్నఎక్కువగా మా ముందుతరం వారికీ వారి జీవితాల్లో లభించిన మహద్భాగ్యం – స్థానాన్ని విభిన్న ప్రాతలలో రంగస్థలం మీద చూడగలగడం.
కట్ట బొట్టు తీర్చడం దగ్గర నుంచి కురులు మడవడం దాకా తన పాత్రను తీర్చిదిద్దుకోవడంలో స్థానం వారు చూపించే జాగ్రత్త, హావభావాలని, అంగచలనాలని తూచి తూచి వాడడంలో ఆయన కనబరిచే నేర్పరితనం, సమకాలీన నటులందరిలో ఆయనను “నటకావతంసుణ్ణి చేశాయి. వేసిన పాత్రలా అన్నీ నటగరిమకు గీటురాళ్లు! వేస్తున్నది స్త్రీ పాత్రలు, వేస్తున్నవాడు పురుష పాత్రధారి. ఈ ఊగిసలాటల మధ్య ఆయన సమర్థవంతంగా నిర్వహించిన ప్రతి పాత్రా ఆయన ప్రతిభకు అద్దం పట్టింది.
ప్రేమ-ప్రతీకారాల మధ్య ఊగిసలాడే రోషనారగా, నిరాదరించిన ప్రియుడిమీద కార్పణ్యం పెంచుకున్న చిత్రాంగిగా, భర్త తాను గీచిన గీటు దాటడని సపత్నుల ముందు గర్వోన్నతిని చూపి చివరకు వారినే ప్రాధేయపడే అభిమానవతి సత్యభామగా, తన వ్యంగ్య హాస్యచతురోక్తుల్నిఎదుటివారిని నిర్వీర్యం చేసే వాడి బాణాలుగా ప్రయోగించి, నవ్వుల ప్రతిధ్వనుల్లో పరిసరాలను కూడా జ్వాజ్వల్యమానం చేసిన మధురవాణిగా, శృంగార, శోకరసైకమూర్తి శకుంతలగా – ఇలా ఎన్నో ఎన్నో పాత్రలను తనదైన ముద్రతో అజరామరం చేసి అమరుడైనాడు స్థానం.
నటుడుగా ఆయన అధిరోహించని అభినయ శిఖరం లేదు. దానికి గుర్తింపే ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలూ ఇచ్చిన బిరుదులు, చేసిన సన్మానాలు, సహనటుల ప్రేమాభిమానాలు, అన్నిటినీ మించి లక్షలాది ప్రేక్షకుల నీరాజనాలు స్థానంవారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆంధ్రదేశంలో ఒక గ్రామంలో సామాన్య కుటుంబంలో పట్టి, చిన్నతనంలో ఎటువంటి భవిష్యదభివృద్ధిసూచకాలు లేని మామూలు జీవితం గడిపిన స్థానం అనితరసాధ్యంగా కళోత్తుంగ శిఖరాలు అధిరోహించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇదీ ఆయన నటజీవితం నుంచి ఈనాటి నటలోకం నేర్చుకోవలసిన పాఠం. తాను ఎన్నుకొన్న వృత్తిమీద గౌరవాభిమానాలు, అందులో రాణించాలన్న ఆరాటం, అందుకు పడిన శ్రమ, లోకవృత్తపరిశీలన, దీక్ష, ఏకాగ్రత -ఇవీఆయనకు నటలోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్టల నార్జించి పెట్టాయి.
స్థానం పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతితో చదువు ఆపి, కుటుంబ పోషణ కోసం ట్రెయినింగ్లో చేరాడు. నంప్రదాయ పద్ధతిలో పంచకావ్యాలు, భారత-గవత పురాణాలు చదివినవాడుకాడు. ఇటువంటి సామాన్యజీవన నేపథ్యం నుంచి నటుడుగా-రంగంలో కూడా ఏవిధమైన శిక్షణ లేకుండా ఎదిగిన స్థానం యువనటులకు ఎలా మార్గదర్శి కాగలడు? పాఠశాల నుంచి పురాణాల నుంచి నేర్చుకోవడానికి బదులు జీవితం నుంచి పాఠాలు నేర్చుకున్నాడు స్థానం . ఆయన గురువుగారు త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి గారు చెప్పినట్లు -విద్యాభ్యాసము వల్ల అలవడు సంస్కృతి కన్న లోకములోని వివిధ సన్నివేశముల అనుభవమువల్ల అలవడు సంస్కృతి ఉత్పష్టమయినది. అట్టి సంస్కృతిని సంపాదించుకొని మాధవపెద్ది, స్థానం గార్లు దేశదేశములందు తమ నాటకౌశలమును ప్రదర్శించి, యశన్సును,బిరుదములను , బహు కృతులను గడించి ఆంధ్ర నాటక ప్రతిభన వేనోళ్ళ చాటినారు”,
స్థానం వారి తొలి రోజుల జీవితం , ఆ జీవితంలో అడుగడుగునా తాను అనుభవించిన నిరంతర సంఘర్షణలో మంచి ఆయన ఒక గొప్ప కళాకారుడుగా నిలదొక్కుకోవడం, వేలాదిమందిని అలరింప చేయడం, దానికి ఫలితంగా నాటకాభిమానుల ప్రేమా స్పదాలను పొందడం ఇవీ ఆయన జీవితం మనకు చెప్పే పాఠాలు. అందుకే ఈనాటి నటలోకానికి ఆయన జీవితం ఒక ప్యాగ్రంథం!
బాల్యం ,-విద్యాభ్యాసం :
స్థానం నరసింహారావు గారు శుభకృత నామ సంవత్సరం భాద్రపద మాస బహుళ ఏకాదశికి సరి అయిన 1902 వ సంవత్సరం సెప్టెంబరు 23వ తేదీన గుంటూరు జిల్లాలోని బాపట్ల అనే తాలుకా గ్రామంలో జన్మించారు. బాపట్లలో భావనారాయస్వామివారి దేవాలయానికి రాష్ట్రంలోనే పెద్దపేరు. దేవాలయ గోపురం ముందు నుంచి దక్షిణంగా నాలుగు మైళ్ళల్లో సముద్రం ఉంది . రోడ్డ మీద ఉండేది స్థానం పుట్టిన తాత తండ్రుల నాటి తాటి ఆకుల ఇల్లు . తండ్రిగారి హయాంలో ఆ యిల్లును తండ్రిగారి అన్నదమ్ములు అమ్మివేసి దేవాలయానికి ఉత్తరం వైపుగా తమకు సంక్రమించిన స్థలాన్నిసమంగా పంచుకున్నారు. అక్కడ స్థానం తండ్రి గారు ఇల్లు కట్టుకున్నారు . పెంకుటింటిని మార్చి స్థానం 1929లో డాబా వేసుకున్నారు . దాని మీద యిప్పటికీ ఆయన పేరు ఉంది . –
స్థానంవారి ఈ అదెమ్మ , తండ్రి హనమంతరావు . బాపట్ల మునసబు కోర్టులో చిన్న ఉద్యోగి . ఆయన స్థానం 16వ యేటనే మరణించారు. తల్లిగారు-తరవాత 50 ఏళ్ళకు 1968లో చనిపోయింది. స్థానాన్ని అల్లారుముద్దుగా పెంచుకున్నడా తల్లి .
వారికి అయిదుగురు సంతానం. అందరిలోను పెద్దవాడు స్థానం. తండ్రి మరణించాక స్థానం మేనమామ, ఆ తరువాత మామగారు అయిన కామరాజు వెంకట నారాయణ గారి అజమాయిషీలో పెరిగాడు. ఆయన కుమార్తె హనుమాయమ్మ స్థానం వారి
భార్య. వారికి ఒక్కతే కుమార్తె పేరు సావిత్రి. ఆమెను నేలకంటి వెంకట రమణమూర్తికిచ్చి వివాహం చేశారు.
స్థానం వారిది సామాన్యమైన కుటుంబం. అందరు మధ్యతరగతి పిల్లల మాదిరిగానే ఆయన కూడా తన తండ్రి చెప్పినట్లుగా బాపట్ల బోర్డు హైస్కూలు లో చేరాడు. కాని తొమ్మిదవ తరగతితో చదువు ఆపవలసి వచ్చింది, తండ్రి అకాల మరణంతో ఏదోఒక ఉద్యోగం చేయవలసిన అగత్యం ఏర్పడ్డది. ఆ రోజులలో మెట్రిక్ చదవకపోయినా టీచర్ ట్రెయినింగ్ అయి చిన్నక్లాసులకు పాఠాలు చెప్పే వెసులుబాటు ఉండేది స్థానం ఆ ట్రెయినింగ్ స్కూలులో చేరాడు.
చిన్నవ్పటి నుంచీ స్థానానికి తమ ఊరి భావనారాయణ స్వామి గుడిలో స్నేహితులతో కలిసి సాయంకాలాలు భజనల్లో పాల్గొనడం అలవాటయింది. నలుగురితో కలిసి పాడడం కాక, తాను పాడితే మిగిలిన వాళ్న తనతో పాడాలని ఆయనకు చాలా తపనగా ఉండేది. అందుకోసం ఊరి బయటకు పోయి ఆ పాటలు బిగ్గరగా పాడుకొనేవాడు. దీనికితోడు ఆవూల్లో ఉన్న వయోలిన్ విద్వాంసుడు నోరి వెంకటేశ్వరు గారు తన సహపాఠి నోరి నాగభూషణంగారి తండ్రిగారు కావడంతో ఆ చనువుతో వారి ఇంటికి తరుచు వెడతూ ఆయన దగ్గర నుంచి కొన్ని రాగాల అనుపానులు గ్రహించి వాటిని తన సాయం భజనలలో పాడేవాడు. ఒకనాడు వారి భజన మందిరానికి సీతారాం బావాజీ అనే సాధువొకాయన వచ్చాడు. ఆయన చేతితో ఏక్తారా మీటుతూ పాడేవాడు. భజన బృందంలోని పిల్లలు కొందరు దానిని మీటుతూ తామూ పాడే ప్రయత్నం చేశారు. ఆయన గుక్క చాలాసేపు నిలుపుతూ పాడేవాడు . అది స్థానానికి చేత కాలేడు. ఆ బావాజీ నవ్వాడు. అలా గుక్క నిలిపి పాడాలంటే ఏంచెయ్యాలని అడిగాడు స్థానం . పద్మాసనం వేసుకుని వేలుతో తన ముక్కు ఒక రంధ్రాన్ని మూసి రెండో రంధ్రం నుంచి గాలి మెల్లగా పీల్చి బిగపట్టమన్నాడు. అలా ప్రయత్నించగా ప్రయత్నించగా ఆపకుండా ఒక నిముషం వరకు ఊపిరి బిగపట్టి ఉంచగలిగాడు స్థానం . చాలాసేపు ఆ గాలిని గాత్ర శబ్దంతో పాటు నింపాదిగా వొదులుతూ “ ఆ “ అనే ఆలాపన శబ్దాన్ని సాధ్యమైనంత కాలం పొడిగించడం అలవాటు చేసుకోమన్నాడు . అలా కొన్నేళ్లు అభ్యాసం చేశాడు స్థానం . అది కూడా తరువాతి రోజుల్లో స్థానం నట జీవితానికి ఎంతగానో ఉపకరించింది .
స్థానం వారి మేనమామ కామరాజు వెంకట నారాయణ గారు బాపట్ల ప్లీడరు గుమాస్తాల నాటక సంఘంలో సభ్యుడు . ఆ సమాజం వారు నాటకాలు వేస్తూ ఉండేవారు . స్తామ వారు రిహార్సలు చేసుకొనే గదికి వెళ్లి వచ్చీరాని పద్ధతిలో హార్మోనియం వాయిస్తూ పాడుకొనేవారు . అసలు నటులు వచ్చినప్పుడు పక్కనే కూర్చొని వారు పాడే పద్యాలు పాటలు శ్రద్ధగా వినేవారు . . ఈ విధంగా అబ్బిన రాహ జ్ఞానం వల్ల భజన కాలక్షేపంలో ఒక గుర్తింపు లభించడమే కాక . అది ఉత్తరోత్రా ఆయన నట జీవితానికి దోహదకారి అయింది .
ఈ బోర్డు హైస్కూలు రోజుల్లోనే స్థానం నేర్చుకున్న మరో లలిత కళ చిత్ర లేఖనం . అప్పుడు బోర్డు హైస్కూలులో డ్రాయింగ్ మాస్టారుగా బండారు రామ స్వామి గారు పని చేస్తున్నారు . రామస్వామి గారు గుంటూరు వారు . అక్కడి సెకండ్ కంపెనీలో ప్రధాన నటుడిగా ఉండి అప్పటికే మూన్ థియేటర్ అనే నాటక సమాజాన్ని నడిపేవారు . ఆయన క్లాసులంటే స్థానానికి చాలా ఇష్టంగా ఉండేది . ఆ యిష్టమే చిత్ర లేఖన మంటే కూడా ఇష్టాన్ని కలగా జేసింది . ముందు భజన మందిర అలంకరణలలో ప్రారంభమైన ఈ కళ , రాను రాను రవివర్మ బొమ్మలను అనుకరిస్తూ స్వయంగా బొమ్మలు గీయడం వరకు ఎదిగింది . మూడవ ఫారంలో ఉండగా బోర్డు స్కూలు “కారోనేషన్ డే “ కి జరిగిన చిత్రలేఖనం పోటీల్లో ఆనంద గజపతి మహారాజు గారి చిత్రాన్ని గీసి ఒక బహుమానాన్ని కూడా పొందారు .
———–