గంటి కృష్ణవేణమ్మ (Ganti Krishnavenamma)

Share
పేరు (ఆంగ్లం)Ganti Krishnavenamma
పేరు (తెలుగు)గంటి కృష్ణవేణమ్మ
కలం పేరు
తల్లిపేరుసుబ్బలక్ష్మమ్మ
తండ్రి పేరుకర్ణా రామశర్మ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/20/1920
మరణం
పుట్టిన ఊరుతిరుపతి-చిత్తూరు జిల్లా
విద్యార్హతలుహిందీ, వార్ధా విద్యాపీఠమువారి ‘భాషా కోవిద’ పరీక్షవరకు చదివి పట్టముపొందిరి.
వృత్తి
తెలిసిన ఇతర భాషలుఆంగ్లము, కన్నడ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునిర్వేదన, ‘సైరంద్రి” పద్యకావ్యము, వృథా, గాలిపటము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుసరసకవయిత్రి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగంటి కృష్ణవేణమ్మ
సంగ్రహ నమూనా రచనరాయలసీమ మహిళామణులుకూడ, కవిత్వము చెప్పటలో వెనుదీయలేదు. మొల్ల, తరిగొండ వెంక మాంబ, తాళ్ళపాక తిమ్మక వీరందరూ ప్రాచీనులు. పుట్టపర్తి కనకమ్మ, గంటి కృష్ణ వేణమ్మ మొదలైనవారు ఆధునికులు. వీరు తమ కవిత్వమును ఛందోబద్దముగా వ్రాసినవారే. స్వాతంత్ర్యానంతరము దేశములో పద్యరచన తగ్గి, వచన రచనలధికమైనవి. స్త్రీలు నవలలు వ్రాసి పేరు దెచ్చుకొన్నారు. ఇప్పటి రచయిత త్రులకు పత్రికలధికము. పాఠకులు అధికమే. అప్పటిలో భారతి-గృహలక్ష్మి వంటి కొన్ని ప్రముఖ పత్రికలు విద్యావంతులను మాత్రమే ఆకర్షించుచుండెడివి.

గంటి కృష్ణవేణమ్మ

రాయలసీమ మహిళామణులుకూడ, కవిత్వము చెప్పటలో వెనుదీయలేదు. మొల్ల, తరిగొండ వెంక మాంబ, తాళ్ళపాక తిమ్మక వీరందరూ ప్రాచీనులు. పుట్టపర్తి కనకమ్మ, గంటి కృష్ణ వేణమ్మ మొదలైనవారు ఆధునికులు. వీరు తమ కవిత్వమును ఛందోబద్దముగా వ్రాసినవారే. స్వాతంత్ర్యానంతరము దేశములో పద్యరచన తగ్గి, వచన రచనలధికమైనవి. స్త్రీలు నవలలు వ్రాసి పేరు దెచ్చుకొన్నారు. ఇప్పటి రచయిత త్రులకు పత్రికలధికము. పాఠకులు అధికమే. అప్పటిలో భారతి-గృహలక్ష్మి వంటి కొన్ని ప్రముఖ పత్రికలు విద్యావంతులను మాత్రమే ఆకర్షించుచుండెడివి. మద్రాసు నుండి వెలువడుచున్న డా: కె. యన్. కేసరిగారి “గృహలక్ష్మీ’ మాసపత్రిక ఆనాటి స్త్రీ రచయిత్రులను ప్రోత్సహించినది. ప్రతి ఏడాది గృహలక్ష్మి “స్వర్ణకంకణము”ను ఉత్తమ శ్రేణి మహిళల కందించెడిది. ఆ పత్రిక యిచ్చిన ప్రోత్సాహముతో కొందరు స్త్రీలు తమ కాలమును రచనా వ్యాసంగమునకు వెచ్చించి. పత్రికాముఖమున మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొనిరి. అట్టి మహిళలో రాయలసీమకు చెందిన కవయిత్రి శ్రీమతి గంటి కృష్ణవేణమ్మగారొకరు.

శ్రీ కృష్ణవేణమ్మ తాతగారందరు దివాన్, పెష్కారు స్లీడర్లు, ఆస్థానపండితులుగాను పనిచేసిన వారు. వీరి తండ్రి కర్ణా రామశర్మగారు పోలీసు ఇన్స్పెక్టర్ గా పనిచేసిరి. వీరి తల్లి శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ కవయిత్రి. “చంద్రకళా విలాసము” అను ప్రబంధమును ఈమె రచించినది, ఆ గ్రంథము విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథముగా నుండెడిది. కృష్ణవేణమ్మగారి భర్త శ్రీగంటి వెంకటసుబ్బయ్యగారు బి. ఏ. వీరుకూడ మంచి పండితులు. కవిత్వము వ్రాయగలిగినవారు. వారు ‘కప్పలుట్ల చెన్నకేశవ’ శతక మును వ్రాసిరి. వారు బొంబాయిలో జనరల్ మోటార్సులో ఉన్నతోద్యోగులై యుండిరి. 1940లో వీరు కాలగర్భములో కలసిపో యిరి. అప్పటికి శ్రీమతి కృష్ణవేణమ్మగారికొక కుమారుడుండెను.
ఈ కవయిత్రి బహు విద్యావంతురాలు కాక పొయినను తాత గారైన నాగపూడి కుప్పస్వామయ్యగారి వద్ద తెనుగులో కొంత పరిచయము కలుగజేసుకొన్నది. ఒంటిమిట్టలో శ్రీ వావిలికొలను సుబ్బరావుగారు జరుపుచున్న పరీక్షలలో 8, 4 పరీక్షలను చిన్న తనములోనే ముగించిరి. హిందీ, వార్ధా విద్యాపీఠమువారి ‘భాషా కోవిద’ పరీక్షవరకు చదివి పట్టముపొందిరి. ఆంగ్లమున కొంత వరకు పరిచయము కలదు. కన్నడభాషలో పవేశమున్నది.
బాల్యదశలోనే ప్రాపించిన వైధవ్యముతో జీవితాంతము బాధచెందక, మనోల్లాసమునక, దైవభక్తి కనుకూలమార్గమైన కావ్యపఠన, కావ్యరచనలను చేబట్టి వివిధఖండికలు వ్రాసి గృహలక్ష్మి మాసపత్రికకు పంపిరి.
1947 జనవరినుండి వీరి ‘సైరంద్రి” పద్యకావ్యము వరుసగా గృహలక్ష్మీ లో ముద్రిం పబడినది. విధి వక్రించిన పాండవులు ద్రౌపదితోబాటు విరటు కొలువున అజ్ఞాతవాసము గడుపవలసి వచ్చినది. ద్రౌపది సైరంద్రిగా విరటుని అంతఃపురము జేరినది. ఒక నడిరేయి ఆమె గతమును గూర్చి తనకు తానే చర్చించుకొన్నది. ఆమె కారాజ సౌధమున నిదురపట్టలేదు. ఆమె నాశనాళము లుద్రేకముతో బొంగినవి. ఆమె అక్కడ “బోనులోపలి పులియట్ల ప్రొద్దుపుచ్చు’ చున్నది.
మనుజుఁడెకాకి యై దాను మసలుచున్న
మనసదెప్పడు ల్పడు మౌనముద్ర
తనకుడా జెప్పికొను; వినుతానె మరల
అనృత మాడదు మానస మట్టిపట్ల,

కవయిత్రి, మనస్తత్వమును చిత్రీకరించుటలో నేర్పరురాలు. నాడు కురుసభలో ద్రౌపది చెందిన మనోవేదన నిట్ల కవయిత్రి చిత్రీకరించినది.

నాడటు పాండవాత్మజులు నన్నును , తమ్మును రాజ్య మెల్ల దా
నోడి మహార్తి నున్నతరి నుద్య తులై ధృతరాష్ట్ర నందనున్
పాడి దొరంగి వల్వ లోలువన్ గని సూత సుతుండు కొల్వులో
నాడిన మాట లకటా ! తల పోయా మనంబు ప్రయ్యదే!

కురుపతి , భీష్ముడున్ , గృపుడు , కుంభజ ముఖ్యులు గల్లుకొల్వలో
నరసి వచింపరై రకట! యూడుది వేడిన ధర్మసంశయం
బెరుఁగరె? ధర్మ శాస్త్రముల నేటికగాల్పనె పెద్దవారలం
దురుగద, యేటి పెద్దలిక నేటిక వానల గౌరవింపగన్ ?

ఆ ద్రౌపది మనోపరితాపమును రచయిత్రి అతిచక్కగా వర్ణించెను. ద్రౌపది హృదయాంత రాళములో గూడు కట్టుకొన్న మనోవేదనే ధారగా ఆమె కనులలో స్రవించినది. ఆ నాడు నిండు కొలుపులో తన్నవమానించిన దుష్టు లందరూ సమరాంగణమున తన భర్తలతో చచ్చుట తాను చూడవలెనని పట్టుబట్టినది.

1951 జూలై గృహలక్ష్మీ కృష్ణవేణమ్మగారి “నిర్వేదన” యను ఒక ఖండికను ప్రచురించెను. అందలి భావములన్నియు స్వయముగా జీవితమున నెదుర్కొను వేదనా పరంపరలే,ఆమె వేదన ఇట్లు న్నది .

దుఃఖమయమైన లోకమ్ము దొలగి పోవ
మిగుల జింతించి చింతించి, మేరలేని
సంశయాబ్దిని ముస్లుచు జాపులేక
బ్రదుకు లేకిట్లు వెర్రినై పాడుచుంటి

వీరి” వృథా” – “గాలిపటము’ మున్నగు ఖండికలు కూడ ఆవేదనా భరితములే. వీరి యితర కృతులలో ‘గిరిజా కల్యాణము” శృంగార రస ప్రధానమైనది. ఈ యితివృత్తమును మనోహరముగా నవ్య రీతిలో తీర్చిన నవీన కావ్య కుసుమమిది. ‘పవనదూత్యము” వీరి మరొక సందేశ కావ్యము. ఇందలికథా వస్తువు రాధాకృష్ణల పరిణ యము. రాధ మాధవుని పైగల విరహవేదన నిక సహింపలేక పవనునితో రాయబారము పంపుటకు యత్నించును. ఈ రెండును ప్రాచీన తెనుగు మహా కవుల కావ్యముల కేమాత్రము తీసిపోవు. చక్కటి కవితాధార, భావ గంభీరత ఈ కావ్యములందు కాన్పించును శ్రీ రాజరాజేశ్వరీ శతకము-కామాక్షీ శతకము కవయిత్రి గారి ముద్రిత రచనలు.

శ్రీమతి కృష్ణ వేణమ్మగారు గృహలక్ష్మి పత్రికాధిపతులతో స్వర్ణకంకణమును, “సరసకవయిత్రి” యను బిరుదమును పొందిరి . ఇంతటి ఉన్నత స్థాయిని పొందుటకు ఆమె భర్తగారి తోడ్పాటే మూల కారణము. దానికితోడు జ్ఞాన ప్రసూనాంబిక వరప్రసాదము కూడ కవయిత్రికి లభించినది. ఆందులకే వారిట్ల వ్రాసుకొన్నారు.
అందముగ రసిక హృదయా
నందంబుగ గవిత జెప్ప నాకలవియె? బా
లేందుదరు కూర్మినతి నా
యందు నిలిచి బలుకు మన్న, యంత పలికెదస్ (నిర్వేదన)

కవయిత్రి అత్తగారిల్లు కడపజిల్లా ప్రొద్దుటూరు తాలూకా యర్రగుంటపల్లె. మామగారు గొప్ప భూస్థితి గలిగిన శ్రోత్రియం దారులు. వీరి కుమారులు శ్రీ గంటి దతాత్రేయగారు, ప్రముఖ న్యాయవాదులుగా నున్నారు. ప్రస్తుతము కవయిత్రి ప్రొద్దుటూరు నందు నివాసము చేయుచు తీరిక వేళలందు కావ్యరచన చేయుచు, తాను నేర్చిన హిందీ భాషను విద్యార్థినులకు బోధించుచు, సమాజ కార్య క్రమములందు పాల్గొనుచు కాలము బుచ్చుచున్నారు. కవయిత్రికి జ్ఞాన ప్రసూనాంబిక సతతమీండగానుండి రక్షించుగాత:

రాయలసీమ రచయితల చరిత్ర నుండి…

———–

You may also like...