నిడుదవోలు వేంకటరావు (Nidadavolu Venkatrao)

Share
పేరు (ఆంగ్లం)Nidadavolu Venkatrao
పేరు (తెలుగు)నిడుదవోలు వేంకటరావు
కలం పేరు
తల్లిపేరునాగమ్మ
తండ్రి పేరుసుందరం పంతులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/3/1903
మరణం10/15/1982
పుట్టిన ఊరువిజయనగరం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుత్రిపురాంతకోదాహరణము. విపుల పీఠికతో. 1944.
చిన్నయసూరి జీవితము: పరవస్తు చిన్నయసూరికృత హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము సహితముగా. 1962.[1]
దక్షిణదేశీయాంధ్ర వాఙ్మయము. The Southern School of Telugu Literature (with preface in English). 1954.
కొప్పరపు సోదరకవుల చరిత్ర. 1973.
నన్నెచోడుని కవితావైభవము: నన్నెచోడుని పద్యాలకు రుచిర వ్యాఖ్యానము. 1976.
పోతన. 1962.
తెనుగు కవుల చరిత్ర 1956.
ఉదాహరణ వాఙ్మయ చరిత్ర. 1968.
విజయనగర సంస్థానము: ఆంధ్రవాఙ్మయ పోషణ. 1965.
ఆంధ్ర వచనవాఙ్మయము. 1977.
ఆంధ్ర వచనవాఙ్మయము: ప్రాచీనకాలమునుండి 1900 ఎ.డి. వరకు. 1954.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుశ్రీ నాచన సోముని హంస దింబికోపాఖ్యానము (ఉత్తర హరివంశము, చతుర్థ ఆశ్వాసము. 1972.
పరిష్కరించినవి,
మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము. నిడుదవోలు వెంకటరావు విపుల టీకతాత్పర్యములతో. 1968
నంది మల్లయ ప్రబోధ చంద్రోదయము. సం. నిడుదవోలు వెంకటరావు. 1976.
బహుజనపల్లి సీతారామాచార్యులు. శబ్దరత్నాకరము. నిడుదవోలు వెంకటరావుచే సరిదిద్దబడినది. 1969.

ఇతర రచయితలతో సహకరించి కూర్చిన గ్రంథములు:
మడికి సింగన. సకల నీతిసారము. సం. నిడుదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు. 1970.
మానవల్లి రచనలు. సం. నిడుదవోలు వెంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు. 1972.
తెలుగు కన్నడముల సాంస్కృతిక సంబంధములు. సం. నిడుదవోలు వెంకటరావు, et. Al. 1974.
తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ బాషలలో సాటి సామెతలు. కూర్పు. నిడుదవోలు వెంకటరావు, et. al., 1961.
పొందిన బిరుదులు / అవార్డులుకళాప్రపూర్ణ
,విద్యారత్నం,పరిశోధనపరమేశ్వర
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనిడుదవోలు వెంకటరావు
ఆంధ్రశతక వాఙ్మయ పరిణామ చరిత్ర
సంగ్రహ నమూనా రచనఆంధ్రవాఙ్మయమున ప్రత్యేకవిశిష్టత గల శాఖలలో “శతకము” అనుశాఖ గణనీయమైనది. ఇది పండితులను, పామరులను, బాలురను, వృద్ధులను, సామాన్య ప్రజానీకమును సర్వేసర్వత్ర సమానముగా రంజింప జేయగల శక్తిమంత మైనది. భారతీయ దేశభాషలలో సంస్కృతమును సంపూర్ణముగా తనలో నైక్యము చేసికొనినది తెలుగు భాష యొక్కటియే. ఈ కారణము చేతనే, మన సాహిత్య ప్రక్రియల పేళ్లన్నియు సంస్కృత భాషలో నున్నను – వాస్తవముగా నాయా సాహిత్య ప్రక్రియలుగాని, శాఖలుగాని – అందు విశేషముగ గన్పట్టవు. చంపూ, ద్విపద, శతక, ఉదాహరణ, యక్షగాన, గేయ, సంకీర్తన వాఙ్మయ శాఖ లిందుల కుదాహరణములు.

నిడుదవోలు వెంకటరావు

ఆంధ్రశతక వాఙ్మయ పరిణామ చరిత్ర

ఆంధ్రవాఙ్మయమున ప్రత్యేకవిశిష్టత గల శాఖలలో “శతకము” అనుశాఖ గణనీయమైనది. ఇది పండితులను, పామరులను, బాలురను, వృద్ధులను, సామాన్య ప్రజానీకమును సర్వేసర్వత్ర సమానముగా రంజింప జేయగల శక్తిమంత మైనది. భారతీయ దేశభాషలలో సంస్కృతమును సంపూర్ణముగా తనలో నైక్యము చేసికొనినది తెలుగు భాష యొక్కటియే. ఈ కారణము చేతనే, మన సాహిత్య ప్రక్రియల పేళ్లన్నియు సంస్కృత భాషలో నున్నను – వాస్తవముగా నాయా సాహిత్య ప్రక్రియలుగాని, శాఖలుగాని – అందు విశేషముగ గన్పట్టవు. చంపూ, ద్విపద, శతక, ఉదాహరణ, యక్షగాన, గేయ, సంకీర్తన వాఙ్మయ శాఖ లిందుల కుదాహరణములు.
శతకములు పురాణములవలె కథా ప్రధానములు గావు; ప్రబంధములవలె వర్ణనాప్రధానములు గావు; గేయకృతులవలె సంగీత ప్రధానములుగావు. ద్విపదల వలె దీర్ఘపరిమితి గలవి కావు. ఇవి ముక్తకము లయ్యును, నేక సూత్రత గలవి. సుసంస్కృతములైనను సులభగ్రాహ్యములైనవి. శతకములలో కవి యాత్మానుభవము ప్రకటిత మగుచుండును. కాబట్టియే అవి హృదయమున కత్యంత సన్నిహితములై, ఆంతరంగిక స్వానుభూతిని గలిగించును.

శతకములు తెలుగున క్రీ.శ.12వ శతాబ్దినుండి వర్ధిల్లుచున్నవి. నవీన కాలమున నీ రచన యంతగా వ్యాప్తిలో లేకున్నను పూర్తిగా విస్మృతమైనదనుట కెంతమాత్రమును వీలులేదు. అద్యతనులలో పెక్కురు ప్రసిద్ధులైనవా రీశతక రచనకు గడగుటయే దీనికి నిదర్శనము. ఇతర రచయితలు చాలమంది శతకములను రచించుచునే యున్నారు. ఇట్లీ వాఙ్మయశాఖ యవిచ్ఛిన్నముగ కొనసాగు చున్నదనియే చెప్పవచ్చును.

ఉపలబ్ధములైన తెలుగు గ్రంథములలో, కేవలము సంఖ్యయే ప్రధానముగ దీసికొనినచో, తక్కిన ప్రబంధాది శాఖలన్నింటికంటె, శతక వాఙ్మయ శాఖయం దున్న సంఖ్యయే యధికమని ఘంటాపథముగ జెప్పవచ్చును. ఒక్కతెలుగుననే గాక, విశాలమగు సంస్కృత భాషా వాఙ్మయమున నిన్ని శతకములు లేవు. అందలి శతకములు, శతసంఖ్యనుగూడ మించవేమో యనుటలో నతిశయోక్తి లేదు. ఇక సజాతీయము లైన ద్రవిడ, కన్నడ, మళయాళ భాషలలో శతక రచనయే చాల విరళము. కన్నడ భాషలో శతకము మన భాష కంటె ముందుగా నవతరించినను ఆ భాషలో దానికి ప్రాధాన్యమే లేదు. ఇది యొక్కటియే తెలుగులో శతక సాహిత్యముయొక్క ప్రత్యేకతను ప్రదర్శించును.

సంస్కృతానువాదములైన శతకముల సంఖ్య శతమును మించవు. కావున వేలకు మించిన తెలుగు శతకములన్నియు స్వతంత్ర రచనలనియే నిర్ధారణ చేయ వచ్చును. ఇవి యచ్చముగా, తెనుగు ముద్ర గలిగి దేశి సాహిత్యమునకు సంబంధించినవి.

శతక లక్షణములు : సంఖ్యా నియమము ,మకుట నియమము ,వృత్త నియమము ,రస నియమము ,భాషా నియమము

1. సంఖ్యా నియమము:

సంఖ్యా నియమము సంస్కృతమున గల స్తోత్రములనుండి గ్రహింప బడినది. 1అష్టోత్తర శత (108) నామపారాయణము, పూజ; సహస్రనామ(1000) పారాయణము, పూజ మనకు విధ్యుక్తములైనవి. వ్రత కల్పములయందు నిర్దిష్టములై యున్నవి. ఈ యాచారము ననుసరించి శతకములలో నూఱు పద్యములు గాని, నూటయెనిమిది పద్యములుగాని యుండును. ఈ నియమమున కపవాదములు గలవు. కాని యవి క్వాచిత్కములు. పై సూత్రము ననుసరించి 108 పద్య సంఖ్య సర్వసామాన్యముగా పాటింపబడకున్నను, శతకము అనగా నూరు(100) సంఖ్య యగుటచేత నూటికి తక్కువగ పద్యములున్న రచన శతక మనిపించుకొనదు. నూటికి తక్కువ రచనలకు ప్రత్యేకముగ పేళ్లు గలవు.

ఒక్క పద్యము – ముక్తకము
రెండు పద్యములు – కుళకము
మూడు పద్యములు – త్రికము
అయిదు పద్యములు – పంచకము, పంచరత్నములు
ఎనిమిది పద్యములు – వారణమాల, అష్టకము
తొమ్మిది పద్యములు – నవరత్నములు
పది పద్యములు – దశకము
పండ్రెండు పద్యములు – భాస్కరమాలిక
పదునాఱు పద్యములు – శశికళ
ఇరువది పద్యములు – వింశతి
ఇరువదియైదు పద్యములు – పంచవింశతి
ఇరువదేడు పద్యములు – తారావళి
ముప్పదిరెండు పద్యములు – రాగసంఖ్య
ఏబది పద్యములు – పంచాశత్తు
నూఱు పద్యములు – శతకము
నూట ఎనిమిది పద్యములు – అష్టోత్తర శతకము
రెండువందల పద్యములు – ద్విశతి
మూడువందల పద్యములు – త్రిశతి
ఏడువందల పద్యములు – సప్తశతి
పదివందల పద్యములు – దశశత లేక సహస్రము
పైరీతిగా నూటికి పై బడిన పద్యములున్నను, వానిని “శతకములు” గానే పరిగణించుట కాధారము – మకుట నియమము.

2. మకుట నియమము:

శతకము ప్రతి పద్యమున చివరనుండు నామ సంబోధనకు ‘మకుటము’ అని పేరు. శతకము లన్నియు విధిగా సంబోధనాంతములుగా నుండవలయును. చంపువులలో లేక ప్రబంధములలో ప్రాయికముగా సంబోధనలే యుండును. క్వాచిత్కముగా విభక్తి ప్రత్యయము లుండును. కాని శతకములలో సంబోధన విభక్తికి తప్ప4తక్కినవానికి చోటు లేదు.
సంబోధనలో నామోచ్చారణ ప్రధానము. శతకములలో ఆ నామ మన్ని పద్యములలో నొకే రీతిగా నుండును. కావున మకుటము నట్లే నొకే రీతిగా నుండును. మకుటమున పర్యాయపదము లుండరాదు. ‘సర్వేశ్వరా’ అను మకుటమున్న నట్లే యుండవలయుగాని ‘విశ్వేశ్వరా’ లేక ‘లోకేశ్వరా’ అను విధమున నుండరాదు.

3. వృత్త నియమము:

పై మకుట నియమముబట్టియే, తెలుగు శతకములలో వృత్త నియమ మేర్పడినది. తెలుగున తొలి శతకము మల్లికార్జున పండితారాధ్యుని “శ్రీగిరి మల్లికార్జున శతకము.” దీని మకుటము ‘శ్రీగిరి మల్లికార్జునా’ అని యుండుటచే నిందు చంపకమాలిక, ఉత్పలమాలిక తప్ప తక్కినవి ప్రయుక్తమగుటకు వీలులేదు. వేమన సహస్రముల, ‘విశ్వదాభిరామ వినుర వేమ,’ అని మకుటము. ఇం దాటవెలది తప్ప వేరొక ఛందస్సు కుదురదు. ఇట్లే సదానందయోగి శతకమున సదానందయోగి అను మకుటమున్నది. ఇది తేటగీతిలో తప్ప నిముడదు, కావున శతకమంతయు తేటగీతి యగును. తెలుగున ప్రత్యేకముగా కాక, ఆటవెలదులు తేటగీతులు సీసపద్యములకు నియతముగా కూర్పబడుట చేత, సీసపద్యములలో రచితములైన శతకములలో గూడ మకుటనియమ మిట్లే యుండునని గ్రహింపనగును.
పై విషయములను బట్టి శతకములన్నియు నొకే వృత్తముతో, ఒకే ఛందస్సులోనే యుండవలయును.

4. రస నియమము:

శతకములలో నే రసము ప్రతిపాదిత మగునో అదియే అన్ని పద్యముల యందు ప్రపంచితము కావలెను కాని వేఱొక రసమున కందు ప్రవేశము కలుగ కూడదు. భక్తిరస ప్రధానములగు శతకములలో నితర రసముల ప్రసక్తి యుండరాదు. శృంగారరస ప్రధానములగు శతకములలో వీర హాస్యాది రసములకు చోటీయరాదు. భక్తి శృంగార రసములకు తప్ప తక్కిన రసము లెంతమాత్రమును ప్రపంచితము కావని సారాంశము. ఈ శతకములలో భావము లొకభాగమున నొకరీతిగాను, వేఱొక భాగమున మఱియొక రీతిగాను నుండరాదు.

5. భాషా నియమము:

శతకము లన్నియు, సలక్షణమైన కావ్య భాషలోనే యుండును. కావుననే లాక్షణికులు, శతకములనుండి ప్రయోగములు, ప్రామాణికములుగా గ్రహించిరి. దీని కపవాదము తెలుగున ‘చంద్రశేఖర శతకము’ అనునది కలదు. ఇది ‘చంద్రశేఖరా’ అను మకుటముతో, చంపకోత్పల మాలికలతో రచింపబడినది. ఇందలి భాషయంతయు గ్రామ్యమే.
శతక రచన స్వతంత్రమని యీవఱకు దెలిపితిని. దానికి చారిత్రక విస్తరణ యావశ్యకము.
తెలుగు భాషలో కవితారచన ప్రాయికముగా సంస్కృత ప్రాకృత ద్రవిడ కర్ణాట భాషారచనల వెనుక వెలసినది. ఆ యా భాషలలోని గుణవిశేషములను గ్రహించి, స్వతస్సిద్ధమైన లక్షణములతో సమ్మేళనము చేసికొని ప్రతిభాసంపన్నమైన నూతనత్వమున ప్రవర్ధిల్లినది. శతక విషయమున దీనికి సమన్వయము.
తెలుగు శతకమునందలి ముఖ్య లక్షణములలో సంఖ్యామకుట నియమముల రెండింటిలో, సంఖ్యానియమ మొక్కటియే సంస్కృత శతకములనుండి గ్రహించినది. సంస్కృత శతకములలో మకుట నియమము లేనేలేదు. సంఖ్యా నియమము సంస్కృతమున స్తోత్రములలో మాత్రమే కన్పట్టుచున్నది. మకుట నియమము శ్రీ శంకర భగవత్పాదుల స్తోత్రములనుండి గ్రహింపబడినది. అష్టకాది స్తోత్ర రూపము లైన మకుటములలో కొన్నియెడల సంబోధనలుండుట గమనింపదగినది.

కన్నడ భాషలో క్రీ.శ. 950 ప్రాంతముల, ‘త్రైలోక్యచూడామణి’ అను మకుటము గల శతకము వెలసినది. అందు సంఖ్యానియమము, మకుట నియమము రెండును గలవు. ఆ కాలమున తెలుగు కన్నడముల పరస్పర సంబంధమును బట్టి కన్నడ శతక రచనము తెలుగు రచనకు మార్గదర్శకము కావచ్చును. ఇది యొక యుప పాదనమే కాని సిద్ధాంతము కాదు. ఇట్లే తక్కిన శాఖలలోను, తెలుగు కన్నడములకు దగ్గఱ చుట్టఱిక మున్నది. కాని కన్నడమున యతి లేదు. ప్రాస మాత్రమే యున్నది. సంస్కృతమున యతిప్రాసలు రెండును నియతిగా లేవు. ఆంధ్రభాషా స్వభావ సిద్ధములగు నీ యతిప్రాస లక్షణములను తెలుగున పాటించి, తెలుగు శతకమున కొక ప్రత్యేక లక్షణత్వము తెలుగు కవు లాపాదించిరి.

———–

You may also like...