పేరు (ఆంగ్లం) | Vadela Venkata Seshagirirao) |
పేరు (తెలుగు) | వాడేల వేంకట శేషగిరిరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | వాడేల వెంకట లక్ష్మమ్మ |
తండ్రి పేరు | వాడేల వెంకట్రామయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/14/1905 |
మరణం | – |
పుట్టిన ఊరు | రావిపాడు – కంభంతా | కర్నూలు జిల్లా |
విద్యార్హతలు | యింటర్మీడియేట్ |
వృత్తి | ఆయిర్వేదిక్ డాక్టరు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ కృష్ణాభ్యుదయము, నక్షత్ర మాల, స్తోత్రమాల , స్తోత్ర కదంబము, శ్రీ శైల పంచాంగము, శ్రీ శైల క్షేత్రమహిమ, శ్రీ శైలేశ చరితము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | అభినవ పోతనామాత్యుడు, కవికులాలంకార, గీత భాగవతము (2000 గీతములు), రుక్మిణీకల్యాణము,సత్యభామ, పరిణయము , కట్నపిశాచి , శ్రీకృష్ణదేవరాయలు, లీలా మల్లికార్జునీయము లేక శివలీల మొదలగునవి నాటకములు. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వాడేల వేంకట శేషగిరిరావు అభినవ పోతనామాత్య |
సంగ్రహ నమూనా రచన | భక్త్యావేశము ప్రోత్సహింప స్థిరుడై బ్రాహ్మీ మహా దేవియే సూక్ష్యంతర్గత భావగుంభిత పదస్తోమంబునం దీర్చుచో ముక్త్యావేశమునన్ లిఖించు ఘనుడా పోతన్నతో దీటుగా రక్ష్యానంద మెరుంగనట్టి జడుడా వ్రాయుస్ ప్రబంధంబునుస్, వాని పదరేణువుల బోలలేని నేను భాగవత కావ్యరచనకై పాటుపడుట దైవ నిర్ణయమే సూవె తలచి తలచి వ్రాసితిని తోచినంత శ్రీవరుని కరుణ. |
వాడేల వేంకట శేషగిరిరావు
అభినవ పోతనామాత్య
భక్త్యావేశము ప్రోత్సహింప స్థిరుడై బ్రాహ్మీ మహా దేవియే
సూక్ష్యంతర్గత భావగుంభిత పదస్తోమంబునం దీర్చుచో
ముక్త్యావేశమునన్ లిఖించు ఘనుడా పోతన్నతో దీటుగా
రక్ష్యానంద మెరుంగనట్టి జడుడా వ్రాయుస్ ప్రబంధంబునుస్,
వాని పదరేణువుల బోలలేని నేను
భాగవత కావ్యరచనకై పాటుపడుట
దైవ నిర్ణయమే సూవె తలచి తలచి
వ్రాసితిని తోచినంత శ్రీవరుని కరుణ.
శ్రీ వాడేల వేంకట శేషగిరిరావు గారొక సాహసకృత్య మును భగవంతుని కృపతో సాగించిరి. భవబంధ విమోచనకొరకై పోతన వ్రాసిన ఆంధ్రమహాభాగవత దశమస్కంద యితివృత్తము నాధారముగా జేసుకొని వీరు “శ్రీ కృష్ణాభ్యుదయము” ను రచించి వాసికెక్కిరి.
ఈ కార్యమును క్రితమునందు శ్రీ జనమంచి శేషాద్రిశర్మ గారు గావించి ధన్యులైరి. వారి కావ్యమునకు “తాండవ కృష్ణ భాగవతము”అని పేరిడిరి. వారు సహితము పోతన భాగవత దళము స్కందమునే మూలముగా గొనిరి. అటే శ్రీపాదకృష్ణమూర్తి
శాస్త్రిగారు కూడ సంస్కృత వ్యాస భాగవతమును ఆమూలాగ్రముగా ఆంద్రీకరించి కృతార్దులైరి, అట్టి విద్వత్కవులచే శ్రీ వాడేల వారి శ్రీకృష్ణాభ్యుదయము ప్రశంసలను పొందినది. శ్రీ వాడేలవారు తొలుత ‘విజయభారతి’ఆను యితివృత్తమును వ్రాయ పూనుకొని అందు శ్రీకృష్ణలీలలు వర్ణించు నుత్సాహముతో ధారగా కొన్ని పద్యములు వ్రాసిరి. తదుపరి వారికి శ్రీకృష్ణుని కథనే ప్రత్యేకముగా వ్రాయు సంకల్పమును భగవంతుడు కల్గించెను. ఆ కార్యమును భగవంతుడతనితో చేయించెను, ఆ దైవ నిర్ణయమం డుటవలననే రాయలసీమ యందు అభినవ పోతనామాత్యుడుగా వెలిగినారు శ్రీ వాడేల వేంకట శేషగిరిరావుగారు.
కావ్యము ముగించి యేడాదియైనను ముద్రణకు ధనములేక మౌనముగానున్న తరుణములో భగవంతుడే కవిగారికి త్రోవ చూపించినాడు. ఆంగ్లములోగల “క్రాసువర్డ్ పజిల్” నందు కవి గారు పాల్గొని ద్రవ్యమును సంపాదించుకొనిరి. ఆ ఆకస్మిక ధన లాభముతో కావ్య ముద్రణ చక్కగా జరిగినది. ఇందు కవిగారు తమ వంశక్రమమును. కుటుంబ చరిత్రను విపులముగా పద్య రూపమున, జేర్చిరి. ఈ కవిగారి పూర్వీకు లు నిరతాన్న దాతలు. సద్గుణ సంపన్నులు .
“శ్రీ కృష్ణాభ్యుదయము”నందు వీరి రచన సరళముగా సాగినది. పామరులకొకపరి చదివి విన్పించిన సులువుగా అర్థము కాగలదు. పాండిత్య ప్రకర్షకై సుదీర్ఘ సమాసములుపయోగించు నలవాటు వీరికి లేదు. ఎన్నో లోకోక్తులను, వ్యావహారిక భాషా పదములను తమ రచనలో ప్రవేశపెట్టిరి. ఇందక్కడక్కడ నాటకధోరణి కనిపించును. కొన్నియెడల భాగవతము ననుసరింపక స్వతంత్రించి రచన సాగించిరి. వాడేలవారు పాత్రల మనస్తత్వ ములను గొప్పగా చిత్రీకరించిరి.
ఆరు కాన్పులన్యాయముగా కంసుని కత్తికి బలి కేసి, తుద కేగవగర్భమును ధరించిన దేవకి మనకోభము నిట్లు కవిగారు వర్ణించిరి .
ఉ : ఇప్పటి కారుమార్లు సహియించితి; లోకమునందు నెవ్వరే
నెప్పడుఁ జెందియుండని, భరింపని యూతన; గన్నవారినే
యప్పన జేసినాను మనసార నరాంతకు కత్తివాతకున్
జెప్పన దేమి? భూతమను, జెడ్డపిశాచిని నేను మాధవా !
శా: దేవా! యింక భరింపలే నుబును; నీదే భారమికాన్పు నే
త్రోవన్ దీర్చెదొ ? యేదియెట్లయిన, నాదుర్మార్గుఁడే వచ్చి నా
జీవంబుల్ బలివెట్టనెంచిననరే; చేజేఁత నాపాప న
య్యో వారాశిని ‘ద్రోయద్రోయ’ నని యెంతో భిన్నయై యేడ్చుచున్ !
ఆయా సందర్భములందు కవిగారు చదువరులకంట కన్నీరొలికించిరి. కొన్నియెడల నవ్వు పుట్టించిరి. గోపికల తన్మయత్వ మెట్లన్నదో చూడుడు.
సీ. సరిగంచు చీరను నవరించు కొనులేమ
మైజారు పయ్యెద మరచిపోయె;
బిగుతు కంచుకమును బిగియించు కొనుభామ
ముడివేసి కొనుమాట విడిచిచనియె;
నంగరాగము దిద్దు మంగళాంగి చెలంగి
పరిపూర్తిసేయగా నరయదయ్యె
భూషణములదాల్చు పొన్ని కొమ్మ యొకర్తు
తలక్రిందులుగ వాని దాల్చ దొడగె ;
గనులగాటుక దిద్దెడు కనకగాత్రి
సగములోనిల్పి పయనమై సాగిపోయె;
గట్టికట్టని చీరతోఁ గదలె నొకతె
కుతుకమున రెచ్చి యన్య సంగతులు మరచి,
ఉ: తల్లులు దండులుస్ నఖులు దత్పతులాపులు. నన్నదమ్ములున్
బెల్లగ నార్చుచున్న వినిపింపనియట్లు తదేకచిత్తలై
వల్లవ కామినీమణులు ఎర్విడి రొక్కటి భావదీప్తిచే
నుల్లము లెంతయున్ మెరసి యూరక శ్రీహరి జూచుచుండగస్.
గోపికలు గోపాలకృష్ణుని రాసక్రీడకిట్ల ఆహ్వానించుచున్నారు .
సీ. బిడియమా ? కౌగిటబిగియించి, వగద్రుంచి
సాగసించి కరుణింప సుందరాంగ
తలవంపులా? ముద్దులొలికించి వలపించి
లలిముంచి పరికించ లలితగాత్ర!
సరిపోలము ? నిన్ను మరు బంతులాడించి
మురిపించి, మెరపించ మోహనాంగ !
పనికిరామా? సేవలొనరించి తనయించి
మనసుదీరి సుఖించ మదనమూర్తి !
ఇంత బలవంత మేలనో ? కాంతు కేళి
యంత భాతరలాడి మెప్పింతువనుచు
వలచిపిలుచుటచేన? గోపాలబాల!
చాలు జాలింక ఓగువలు జక్కనయ్య!
ఇందు రుక్మిణీ కళ్యాణఘట్టమును గూడ అందముగా జొప్పిం చిరి. రుక్మిణీ తన లేఖలో శ్రీకృష్ణునికిట్ల నివేదించుకొన్నది.
శా: నేనే సిసతి, నీవె నాపతివి, నింతే యెన్ని జస్మంబులం
దైనం బాయని సత్యబంధమిది నాథా! సూక్ష్మమూహించి నీ
చానన్ నన్నుఁ బరిగ్రహింపుము దురాశాను లుర్వీశ్వరుల్
గ్లానిం బొందెడునట్లు రాక్షసవిధిస్ గైకొమ్ము నిక్కమ్ముగస్.
క: రాక్షస విధి గైకొనుటలు
సుక్ష త్రియ వంశకీర్తి శోభన మౌటన్
రక్షా దక్షుడవై నీ
పక్షమునం జేర్చుకొమ్ము పావనమూర్తీ !
ఇట్లీ శ్రీ కృష్ణాభ్యుదయ పూర్వభాగమును రుక్మిణీకృష్ణు కల్యాణముతో ముగించిరి. ఇందు పోతన భాగవతమున కానరాని కంస, కాలయవనుల జన్మవృత్తాంతములు జేర్చబడినవి. కొన్ని పద్యములు చదువుచున్నప్పడు పోతన జ్ఞప్తికి వచ్చును. అంత మాత్రమున కవిపోతనను పూర్తిగా అనుసరించి యున్నాగనుటకు వీలులేదు. గ్రంథము పూర్తిగా జదివిన వారికీ విషయము స్పష్టము కాగలదు. శ్రీకృష్ణ చరిత్రను కవిగారు గానము చేసి ధన్యులైరి. అది వారి పూర్వజన్మ పుణ్య విశేషము.
శ్రీ వాడేల వేంకట శేషగిరిరావు గారు కవులేగాక సిద్దాంతులు కూడ. వీరికి భగవంతుని కృప వలననే జ్యోతిషమునం దనుభవము గలిగినది. వీరి కక్షరాభ్యాసము చేసిన గురువులు శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు. ఉన్నత విద్యాభ్యాసమంతయు హైదరా బాదు నందలి వారి అక్క, బావగాళ్లయింట జరిపిరి. వీరికి ఇంగ్లీషునందు యింటర్మీడియేట్ వరకు ప్రవేశము కలదు. వీరు “ Paradise” అను ఒక పొ త్తమును ఆంగ్లమున వ్రాసిరి.
ఈ కవి శ్రీ శైల మల్లికార్జుని పై నక్షత్ర మాల స్తోత్రమాల స్తోత్ర కదంబము, శ్రీ శైల పంచాంగము, శ్రీ శైల క్షేత్రమహిమ, శ్రీ శైలేశ చరితము మున్నగునవి రచించిరి. ఆ పుస్తకములపై వచ్చెడి సొమ్మును దేవాలయమునకే సమర్పించిరి. శ్రీ శైలేళ చరితమునందు మల్లికార్జున స్వామి చరిత్రను గద్యమున వ్రాయుచు అటనట కొన్ని సందర్భములందు ముత్యములవంటి పద్యములను చేర్చిరి. మచ్చునకీ పద్యము చూడుడు.
సీ. పండిత ప్రవరులు పాతాళమున నుండ
మిడిమిడి చదువరి మేడలెక్కు
ముక్తుడౌ విజ్ఞాని రిక్తుడై పడియుండ
మెటవేదాంతి లూమింటి కెగయు
బుజువర్తనులమాట రితయై బొత్తిల
కూలంకషునిధాటి కోటగట్టు
గీ : ప్రకృతి తలదాచు కొనచోటు బడయకున్న
వికృతి విజయధ్వజంబు స్థాపింపగలుగు
నేమిలీలలో యివి నీకె యెరుకగాని
తలప దుస్సావ్యమూహింప తరముగాదు
వీరి రచనలో సీసపద్యములే మిక్కిలి రసవత్తరముగా సాగినవి. సీసపద్య రచనలో వీరిది అంద వేసినచేయి.
వీరికి నంద్యాల, కర్నూలు, నెల్లారులందు ఘనముగా సన్మానములు జరిగినవి. పెక్కు బిరుదులు లభించినవి. 2-11-60 వ తేది కర్నూలు నగరమున సంస్కృత విద్యాదాన సమాఖ్య వారు కలెక్టరు గారి సమక్షమున “కవికులాలంకార” బిరుదముతో , సన్మానించిరి. వీరి అముద్రిత ܶ రచనలు పెక్కులున్నవి. 1) శ్రీకృష్ణా భ్యుదయము (ఉత్తరభాగము– 4200 పద్యములు ), 2) గీత భాగవతము (2000 గీతములు), 3 ) రుక్మిణీకల్యాణము, 4)సత్యభామ, పరిణయము , 5) కట్నపిశాచి ,6) శ్రీకృష్ణదేవరాయలు, 7) లీలా మల్లికార్జునీయము లేక శివలీల మొదలగునవి నాటకములు.
వీరు రావిపాడు గ్రామమున శ్రీలక్ష్మీ గణేశ జ్యోతిషాలయ మును నడుపుచు, కవిగా, ఆయిర్వేదిక్ డాక్టరుగా ప్రసిద్ధిపొందినారు.
రాయలసీమ రచయితల నుండి….
———–