పేరు (ఆంగ్లం) | Edida Kameswararao |
పేరు (తెలుగు) | ఏడిద కామేశ్వరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకట రాజ్యలక్ష్మి |
తండ్రి పేరు | పెదకొండలరాయుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 9/12/1913 |
మరణం | 12/27/1995 |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలం, ఏడిద గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | విజయవాడ ఆకాశవాణిలో పనిచేసి 1974లో పదవీ విరమణ చేశారు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఇండోనీషియా, చిరుగజ్జెలు (గేయనాటికల సంకలనం), అరుణ ఆసఫాలి, పిలిచితే పలుకుతావట, ఆచార్య కృపలాని జీవిత చరిత్ర, ఆనంద మందిరం, రంగ బాల, బాలభారతి, పాలవెల్లి, బాలమందారాలు, పాలధార, పంచదార, బొమ్మల కొలువు, ఒప్పులకుప్ప, వినురవేమ, చిన్నారి పాపలకు చిట్టిపొట్టి కథలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | బాలబంధు |
ఇతర వివరాలు | బాల సాహిత్య రచయితగా ప్రసిద్ధుడు. చిన్నతనంలో ఒకసారి బొమ్మలకొలువులో ఎప్పుడూ పాడే పాటలేనా అని కొందరు పెదవి విరవడంతో అప్పటికప్పుడు ‘తాంబూలం’ పాట వ్రాసి పాడారు. తొమ్మిదవ తరగతి చదివేటప్పుడే ‘మానిటర్‌ను ఎన్నుకోవడం’ అనే పిల్లల నాటికను వ్రాసి ప్రదర్శించారు. చదువు ముగించిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు నడిపిన స్వరాజ్య పత్రికలో సంపాదకశాఖలో చేరారు. 1937లో ఆంధ్రపత్రిక సంపాదకశాఖకు మారారు. పిమ్మట గృహలక్ష్మి, ప్రజామిత్ర పత్రికలలో కూడా కొంతకాలం పనిచేశారు. తరువాత విజయవాడలో ‘బాలభారతి’ పేరుతో ఒక బాలల సంఘాన్ని స్థాపించి పిల్లలకు ఆటలు, పాటలు నేర్పుతూ బాలసాహిత్యాన్ని సృష్టించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బొమ్మరిల్లు, పాలవెల్లి వంటి పిల్లల కార్యక్రమాలను నిర్వహించడమే కాక బాలల నాటికలు, గేయాలు, గేయకథలు, గేయనాటికలు, హరికథలు, బుర్రకథలు వందల సంఖ్యలో రాసి, ప్రసారం చేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందారు. ఇరవై యేళ్లపాటు విజయవాడ ఆకాశవాణిలో పనిచేసి 1974లో పదవీ విరమణ చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ప్రచురించిన బాలచంద్రిక పత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఏడిద కామేశ్వరరావు ‘‘ఏది గోప్పది…?’’ |
సంగ్రహ నమూనా రచన | ఆ దెబ్బ సరిగ్గా అతని నడినెత్తి కడ్డంగా తగిలింది. అసలు దెబ్బకు అతని తల పదహారు చెక్కలు కావలసిందే. కాని కర్రపాక పెణకకు తగలడంతోటి, సగం తీవ్రత తగ్గడంచేత చావకుండా చేసింది అతనిని. దెబ్బతో చేతుల్లో నలిపేస్తున్న సూరిని గెంటేసి గోడను జారవేసియున్న కర్రకోసం వెళ్లబోతూంటే, కళ్లుతిరిగి, తలదిమ్మెక్కి వళ్లు బరువెక్కడంచేత పటుత్వం తప్పి అమాంతంగా పడిపోయాడు రోజుకుంటూ దొర్లుతూ కటికి నేలమీద. గొడ్డుఒగర్చినట్టు ఒగర్చుటచేత అతని అంతదేహం అల్లల్లాడి బోతోంది. ఆయాసంతో కూడినబాధను అనుగమిస్తు. |
ఏడిద కామేశ్వరరావు
‘‘ఏది గోప్పది…?’’
ఆ దెబ్బ సరిగ్గా అతని నడినెత్తి కడ్డంగా తగిలింది. అసలు దెబ్బకు అతని తల పదహారు చెక్కలు కావలసిందే. కాని కర్రపాక పెణకకు తగలడంతోటి, సగం తీవ్రత తగ్గడంచేత చావకుండా చేసింది అతనిని. దెబ్బతో చేతుల్లో నలిపేస్తున్న సూరిని గెంటేసి గోడను జారవేసియున్న కర్రకోసం వెళ్లబోతూంటే, కళ్లుతిరిగి, తలదిమ్మెక్కి వళ్లు బరువెక్కడంచేత పటుత్వం తప్పి అమాంతంగా పడిపోయాడు రోజుకుంటూ దొర్లుతూ కటికి నేలమీద. గొడ్డుఒగర్చినట్టు ఒగర్చుటచేత అతని అంతదేహం అల్లల్లాడి బోతోంది. ఆయాసంతో కూడినబాధను అనుగమిస్తు.
చంపేశావురా నరిసిగా.
అన్నాడు వీరన్న పల్లుకొంచెం గిట్టగరిచి బాధచేత అతని రెండు చేతులూ అతని తలను గట్టిగా అదిమిపట్టాయి. చొక్కా, పంచ రక్తమయం అయిపోయాయి ఎర్రగా సిందూరంలాగ కండకండల్తోటి.
అప్పుడేచస్తావానువ్వు. ఇంకా ఎందరు చనువు గలవాళ్లని చంపాలో ఎందరు కావలసినవాళ్ల కొంపలు కూలగొట్టాలో నాకంటే పేదవాళ్లని ఎంత మందిని పారదోలాలో.
అన్నాడు నరిసిగాడు పొడిచేసేవాడిలా చూస్తూ, కోపంతో దహించబడి పోతూన్న అతని కళ్లు ఎర్రగా నిప్పుకణాల్లాగ వున్నాయి. కండలు తిరిగిన ఆ దేహం కదిలిపోతోంది. కంపమెత్తిపోతూ ఒళ్లుతెలియని అతనికోసం మొదటిదెబ్బ కొట్టించింది. అదివీరన్న కాపుతల చెక్కలు చెయ్యలేక పోయినా అతణ్ణి అస్వాధీనుణ్ణిచేసింది. తిరిగి రెండవ దెబ్బ కొట్టడానికి పురికొల్పింది కాని వీరన్న కాపు క్రిందబడి దొర్లుతూంటే, నరసిగాడి చేతుల్లేచాయి గాదు. ఈ దెబ్బ చాలదావీడికి. బుద్దిచెప్పడాని కనుకున్నాడు.
సూరి కంగారుపడిపోతూ నరిసిగాడిదగ్గరకు వచ్చింది. కుడిచెయ్యికి, మోచేతిక్రిందుగా రక్తం బొటబొట కారుతూంటే యింతమన్ను కుక్కింది. ఏమో హడలిపోతు అలాగే చూచింది వీరన్న కాపుకేసి నరిసిగాడి చాటున్నుంచొని.
రాయేపోదాం. అన్నాడు నరిసిగాడు రెండడుగులు పక్కకువేసి. తలో అటునుంచి యిటుదొర్లి ఎక్కడికిపోతార్రా మీకాలం మూడింది లెండి. అన్నాడు వీరన్నకాపు ఎంతో బలహీనంతో అలా బాధపడుతూనే.
నీవంటి దుర్మార్గుడిదగ్గర పనిచేసేకన్న పోతేనేమేలు, అయినా నీకింత కావరం పనికిరాదు. ఊళ్లోకి పెద్దకాపునని నీకు వళ్లు తెలియటం లేదు. నీతోసమానమైనవాళ్లు వూళ్లోవున్నా, నీనోరుకు ఝడిసి వూరుకుంటున్నారు. వాళ్లెం చేయగలరు? చేసినా నావంటికూటికి లేనివాడే, నీకుబుద్ధిచెప్పినా నిన్నేంచేసినా గొప్పోడివైనందుకు నలుగురికంటె లెక్కగాయుండాలి. నీతి నియమాల్ని నిలబెట్టాలి. దానధర్మాలకి దారిచూపించాలి. మంచి చెడ్డలకి మార్గం యియ్యాలి. నలుగురు ఓహో యని మెచ్చాలి, నీవల్ల నలుగురుబతకాలి, అంతేకాని యిలా కంటికి కనబడ్డదానితో కలియబడితే ఎల్లకాలం చెల్లుతుందా ఎంతమంది కొంపలు తీశావో ఎంతమందికూట్లో మన్నుకొట్టావో ఎంతమంది యిల్లాళ్లను చెరిచావో ఇన్నేళ్లున్నాయి. నీకింకా యిదేంపాడుబుద్ది ఇంతనీచుడివి నీలెక్కెవరికి.
అంటూనే నరిసిగాడు సూరి పాకయివతలకి వచ్చారు. ఇంతలో కనుచీకటిలాగా కమ్ముకుపోయింది. వీళ్లతో అంతవరకు పనిచేసినవాళ్లు కనుచూపు దూరంలో యున్నారు యిక్కడికిపోతూను, పాక ప్రక్కని దక్షిణమూలముగా యున్న పెద్ద చేనుగట్టువెంబడే ఆగడ్డిమధ్య గబగబా నడుస్తున్నారు ముందు నరిసిగాడు వెనకాల సూరీని.
అంతపని చేశావుగదా మన్నిబతకనిస్తారా అందిమెల్లిగా సూరి నరిసిగాడి వెనకాలే హడావిడిగనడుస్తూ.
న్యాయానికి కల్లుంటే మన్నిచూస్తుంది. పోతే మనముపోతాము నాకాబెంగలేదు. భగవంతుడు లేడూ అన్నాడు. కాసేపువూరుకుని మరికాస్తజోరుగా నడుస్తూ.
మనకొంప ఎలాగూ కూలుతుంది. అని ఆగింది సూరి, ఆపైని మరిమాట్లాడ లేక –
కూలినకొంప కూలనే కూలింది, ఇంకేముంది కూలటానికి, కూట్లోమన్ను పడనే పడింది, యింకేముంది పడటానికి, మనమిద్దరం వున్నాము, బోలెడు ప్రపంచము వుంది. పైన నారాయణ మూర్తి వున్నాడు. న్యాయంగా – ధర్మంగా – కష్టపడి పనిచేసే వాడికి ఏ మారాజైనా యింత తిండి పెట్టకపోతారా –
అన్నాడు నరిసిగాడు నిర్భయంగా పుంతలోంచి అడ్డదారి తీస్తు.
ఏమో నాకుభయం వేస్తోంది. అందిసూరి అలాగే నిలబడిపోయి.
భయ మెందుకు? ఈవూరు కాకపోతే యింకోవూరు.
ఆధారం యేముంది
ఇక్కడుంటే గంజివుంది కనకనా, ఇంకో వూళ్లోవుండక పోవటానికి, ఇక్కడా సొంత కొంప లేదు. అక్కడా వుండతూ, ఇక్కడున్నా మనకి రెక్కల కష్టం తప్పదు. అక్కడున్నా తప్పదు. మనకేంభయమే, ఆస్తులా, పాస్తులా, మనకి ప్రపంచంమే భూమి, మనరెక్కలే నాగళ్లు, రెక్కల కష్టమే మనకిపంట మన నమ్మకమే మనకి విత్తనం భగవంతుడే కాపు. అని యింకా ఏమో చెప్పబోతూ సూరి చెయ్య పట్టుకున్నాడు నరిసిగాడు.
సరి ఏలాగా, ఎక్కడికి అందిసూరి డగ్గుత్తికతో.
ఏలాగేంటీ నీమెళ్లో పట్టిడలేదూ, చాలు రంగానికైరా, కేపుకి సరిపోతుంది.
అయ్యబాబో పట్టిడ తెగిపాకలో పడిపోయంది, అంది నిలబడిపోయి, మెడ, రవిక, చీర తడుముకుంటూ సూరి, పోనీ పాక్కాడకెళ్లి పట్టుకురాగలవా, అని కూలబడి పోయింది.
వొద్దు అక్కడికెళ్లటం మళ్లా మంటలోకెళ్లటం అన్నమాట, పట్టిడిపోతే, మెళ్లో పుత్తెల్లేవేంటి. అయ్యేచాలు, అన్నాడు నరిసిగాడు. సూరి మాట్లాడలేదు.
భయంలేదు అంటూ నరిసిగాడు సూరి వీపుమీద తట్టిలేవదియ్యబోయాడు. దేహమంతా వణికిపోతోంది సూరిది. కొంచెం వేడెక్కింది కూడాను. జ్వరమొచ్చినట్టు, తడిముద్దల్లా గున్నాయి కట్టుకున్న గుడ్డలు చెమటచేత తడిసి, వేడి విరులు కంఠాన్ని ఆర్పెయ్యడు చేత, మాట్లాడలేక ఆనీళ్లు తిరిగినకళ్లు అప్పచెప్పింది మొగుడికి, అలాగే నరిసిగాణ్ణి, ఆధారం చేసుకుని లేచింది, ఆలాగే వాడి చెయ్యి పట్టుకుని నడిచింది అడుగుల్లో అడుగువేసుకుంటూ, అలాగే వాడుచెప్పిన దానికి, ఊ, కొట్టింది బలహీనంగా నరిసిగాడు నిర్భయంగా ఆలోచిస్తు చరచరా నడుస్తున్నాడు. దారి తెన్ను అనక సూరిని పట్టుకుని, అప్పుడేవచ్చి అప్పుడే గాఢంగా పట్టిన మబ్బుల్లోకి మాయ మయ్యాడు. పౌర్ణమి వెళ్లిన చవితి చంద్రుడు, అంతట్లో అలుముకుపోయింది కటికి చీకటి, ఆమేఘాన్ని చూచి హడిలి పోయిందిసూరి తన బ్రతుకిక ఆచంద్రుడిలా అవుతుందేమోనని అంత మేఘం చంద్రుణ్ణి యిట్టే మింగేసి నందుకు, బాహ్యంలో భర్తమినహా అంతా సూన్యం, లోపల మొదలే సూన్యంగా యుంది సూరికి.
నిశరాత్రి రెండు గంటలు దాటినా వీరన్న కాపు గుమ్మం ముందర జనసంచారం తగ్గలేదు, వచ్చేవాళ్లు పొయ్యేవాళ్లు ఎక్కడా యెడతెరవిలేదు, వీరన్న కాపు కంతవస్తొచ్చి నందుకు చాల విచారంచే యున్నారు సమూహమంతా, లోలోపల కొంచెం సంతోశిస్తున్నా, దుర్మార్గుడికి కష్టం వస్తే జాలిదలచే వాళ్లెవరు? కట్టుకునీ పెళ్లాం ఏడవాలి. పిల్లలు విచారించాలి. బంధువులకు బెంగ వుండాలి కొద్దో గొప్పొ.
లోపలి గుడిలో ముక్తసరిగా పదిమంది పెద్దలు మాత్రం వున్నారు మంచం చుట్టూను. పై వాళ్లని లోపలికి రానియ్యటం లేదు, అలజడి యెక్కువౌతుందని, గది ప్రక్క గుమ్మాన్నంటిపెట్టుకుని ఆడవాళ్ళు నోటికి గుడ్డలడ్డం పెట్టుకుని చూస్తున్నారు తెల తెల బోతూ ర
కాసిన్ని మంచి నీళ్ళు త్రాగిన తర్వాత మీర్రాకపోతే, నేనీపాటికి వెళ్లిపోయేవాణ్ణేనర్రా అన్నాడు వీరన్న. కాపుమాటలో చెయ్యికూడ తిప్పబోయాడుగాని బలహీనం చేత చేయి ఎత్తలేకపోయాడు.
మరేం భయంలేదు, పదిహేను రోజులు తిరగకుండా మిమ్ములను తిప్పుతాను, మీరు ధైర్యంగా యుండాలంతే, మిగతా భారంనాది. అన్నాడు. డాక్టరు కట్లుకట్టి ప్రక్కనున్న కుర్చీలో కూర్చుని.
అలా అయితే, మిమ్మల్ని సంతోష పెట్టే భారంనాది. అన్నాడు వీరన్న కాపు కొడుకు డాక్టరుగారి ప్రక్కను నుంచుని తండ్రికి విసనకర్ర పెట్లి విసురుతూ.
మళ్లీ ఉదయం వస్తానని చెప్పి – చక్కాపోయాడు డాక్టరుగారు గుర్రబండి యెక్కి ప్రక్కనున్నపట్నం, మందుల పెరుచెప్పి, ఆయనది ఆయనేమో వడుక్కుని, ఫీజుకన్నా గుర్రబండి చా, యెక్కువౌతుంది. బండికూడ ఆయనదే కనుక అన్నాడు అక్కడున్న జనసమూహంలో ఒకడు కాని బండిచప్పుడులో మాట ఆయనకు వినపడిందోలేదో –
డాక్టరుగారె వెళ్లడంతోటే గూడుపుఠాణా సాగించేరు గదిలో గూడిన పెద్దలు. అందులో తేల్చారు. పాక పెణక మీదనున్న పారకోసం ఎక్కి అక్కణ్ణుంచి పడినందున పెద్దకాపు కంతగాయం తగిలినట్టున్ను, సూరీ నరిసిగాళ్ల మీదకేసు పెడితే యేభైదొకన్న, ఎక్కువ శిక్షపడదు. కనుక, త కంటె పలుకు బడిగల పెద్దవీరన్న కాపు గనుక వాళ్లని నానా బాధలు పెట్టి చిగురికి చంపాలని.
ఈతీర్మానానికి వీరన్నకాపు వొప్పుకున్నా, ఓసవరణమాత్రం ప్రతిపాదించాడు. సూరినితప్పించి నరిసిగాణ్ణి పైవిధంగా చెయ్యాలని సూరిమీద మక్కువ మిక్కుటించడంచేత. పైగా నరిసిగాడు చస్తే సూరి తనసిరిలో చేరుతుందనే ధీమా కూడ అతనిని బలపెట్టింది సవరణ నెగ్గించుకునేందుకు.
పెద్దకాపు గనుక, అతనౌనన్నది కాదనేవారెవరు. కుందేటికి మూడేకాళ్లనిఅతనంటే, మిగతావారు దానికి నాలుగున్నా మూడే అనాలి గాని, నాలుగూ అనకూడదు, రెండూ అనకూడదు. అతను చెప్పింది వేదం – ఆడింది ఆట – పాడింది పాట. అల్లాగే జరుపుతారు. అక్షరాలా అలా అనుసరిస్తారు కూడను వెనకాలనున్న కందా కాపులందరు.
ఏంచేసినా చెయ్యాలి. ఇంతకంటె ఆలోచనలేదు. అని తేల్చాడోపెద్ద శకునిలా తలపంకిస్తు.
వాళ్లని పట్టించి నాపగ తీర్చుకోవాలి అన్నాడు వీరన్నకాపుకొడుకు కర్ణుడిలా మాంచి పట్టుదలతో.
అంతపని జరిగితీరాలి అన్నాడు యింకో లావుగాయున్న పెద్దమనిషి దుశ్శాసనుడిలా పక్కనున్న బల్లగ్రుద్దుతూను.
ఉ కసి తీరాలి. అన్నాడు వీరన్నకాపు అటునుంచి యిటు మెల్లిగా దొర్లుతూను దుర్యోధనుడిక ధీమాగా.
అనుకున్న విధంగా అన్ని సరంజాములు చెయ్యాలని నడుంకట్టారు. మర్నాడు మాలపల్లంతా వెతికించారు వాళ్ళిద్దరికోసం. సూరి పుట్టింటికి మనిషెళ్ళేడు వాళ్లక్కడకు పారిపోయేరేమోనని. నరిసిగాడి నా అన్నబంధువులన్నందరిని వాళ్లు ఏమీ ఎరగమని గోలపెడుతున్నా దండించారు; పొలంలో పనికిరావడం లేదేమని కాని వాడుకొట్టినట్టు చెప్పకుండా వాళ్లెంతదాచినా మాలపల్లెలో యీవార్త ప్రతియింటా ప్రాకింది. వీరన్న కాపుకిదెబ్బ తగిలినట్టు, ఊర్లోనేకాదు చుట్టుప్రక్కల్నివున్న పల్లెల్లో కూడ పూకారెక్కింది. డీచార్జీలేదు చట్టుబండలూ లేవు కనుక అంతవిపరీతంగా వ్యాఖ్యానాలు మాత్రం వ్యాపించలేదు.
సూరీ నరిసిగాళ్లకోసం వెతికించిన చిల్లరమల్లర కర్చులక్రింద డాక్టరు మందుల క్రింద ఓ వెయ్యిరూపాయలు మాత్రం చేతులారా ఖర్చుపెట్టి సగం అయిపోయాడు వీరన్న కాపు కొడుకు. వెతికించిన ఫలం దక్కలేదు. వీరన్నకాపు మాత్రం మళ్లీయధావిధిగా మనిషీ తయారయ్యాడా అంటే, దెబ్బమానినా, మళ్ళీ ఎప్పటిబలం చేరక అటూయిటూ గాకుండా యున్నాడు అనుచరులు దగ్గిరున్నంతసేపూ అతనౌనన్నది ఔనంటూ, తర్వాత తోకముడుస్తు మామూలుగానే కాలక్షేపం చేస్తున్నారు.
రంగూన్ మహాపట్నంలో పనిచేస్తున్న లక్షలకొలది కూలివాళ్లలో సూరి నరిసిగాళ్లుకూడ లీనమైపోయారు. ఇద్దరూకష్టపడి పనిచేసేవాళ్లేగనుక రోజుకు చులాగ్గా నాలుగురూపాయలు కలిసి తెచ్చుకుంటున్నారు. గాంధీగారి హితబోధ వచ్చినప్పుడు ఓసారి కల్లుపాకదగ్గర ఓవాలంటీరుకి, నరిసిగాడికి చాలచర్చ నడిచింది. అప్పుడు వాలంటీరు మాటవినకుండా తప్పత్రాగేసినా, కల్లుకాతాక్రింద సూరిమెళ్లో పుస్తెపట్టుకెళ్లి దుకాణా దారుడిచేతుల్ణో పెడుతూన్నపుపడు, దానియొక్క చెడ్డతనం బాగా బోధపడింది నరిసిగాడికి దానితో ఒట్టెట్టుకున్నాడు యికెప్పుడూ కల్లుతాగనని వెనకోసారి స్వదేశంలో దురలవాట్లు లేకపోవడం మూలాన్ని సంపాదనలో సగం కూడా ఖర్చవడంలేదు. వాళ్లిద్దరకూ కూడు గుడ్డక్రింద, మొదట్లో రంగంవెళ్లినప్పుడు వీరన్న కాపుయొక్క దురుసుతనం – దుర్మార్గత్వం – రంగూను, కూట వెన్నంటి వస్తుంది; తప్పదనుకొని చాలా భయపడుతూండేది సూరి. కొంత కాలానికాభయం దానంతటదే యింకిపోయింది సూరి మనస్సులో విషయాన్ని గురించి నరిసిగాడు కాస్త గుప్తంగా భగవంతుణ్ణినమ్మిన వాళ్లకే భయంలేదు. ఎక్కడున్నావకటే. న్యాయానికి ధర్మానికి గుణంతోటేగాని కులంతోపనిలేదు. అని కట్టుకథలక్రింద, ఆ విషయాలూ, యీ విషయాలు చెబుతూండేవాడు సూరికి. దీనితోటి సూరిమనస్సులోవున్న మలినం పూర్తిగా మాసిపోయింది. అయినా స్వదేశ జ్ఞాపిక మొచ్చినప్పుడప్పుడు సూరి దృక్పధాన్నిపడి యీభయ పిశాచానికి, నరిసిగాడు భోధించిన ధైర్య బాణాలకి అప్పుడప్పుడు ఓచిన్న సంగ్రామం సూరి హృదయంలో కలగడం చిగురికి పిశాచాలు పారదోలబడుతూ వుండేది. కాని సూరి, నరిసిగాడు చెప్పే కబుర్లు అన్నింటిని విన్నట్లేవిని, అంది ఓనాడు రాత్రి.
చిన్నప్పటినుంచే పెంచి పెద్దవాణ్ణిచేసి, పెళ్లిచేసి పెద్దపాలేరుగా చేసిన కాపునంత చేసినందుకు మనకు గతులుంటాయా అని.
దానికి నరిసిగాడు, పెద్దనిట్టూర్పు బుచ్చి ఆవొళ్లెరగని ఆవేశంలో తానుచేసిన పనికి, అన్నమాటలకి తాను చాల పశ్చాత్తాపడుచున్నట్టుచెప్పి, బతికివుంటే ఆయనఋణం యేలాగైనా తీర్చుకుంటాను. అనిన మనస్సు సమాధాన పర్చుకొని, కూర్చున్నవాడు అలావెల్లగితలా పడుకున్నాడు. ఆ నీలాకాశంలోకి ఆలోచనగా చూస్తూ.
నిలువునా చెయ్యెత్తు మనిషి నరిసిగాడు. ఆ చిన్నజుట్టు, ఆ కోరమీసం ఆతిరిగిన కండలు, ఆ వెడల్పైనవక్షం – ఆ అజానుబాహవులు ఆపిక్కబట్టినకాళ్లు అతని దేహదారుఢ్యానికి సహజ చిహ్నాలుగా యున్నాయి. అతని ఆ అమాయకపు నేత్రాల్లోంచి చిందులాడే ఆ దృక్కులు భక్తి. సత్యం, ధర్మం మొదలుగాగల వాటికోసం వెతుకుతున్నాయా అనిపిస్తుంది. అతని దేహబలం అతని ధనార్జనకు దారిచూపింది. అతడు సంపాదించేధనం అతని వుత్సాహాన్ని పురికొల్పింది. అతనికి యీ ప్రపంచంలో సూరి తనధర్మమైన ధనార్జనతప్ప వేరొండు లేనట్టు, పదేళ్ళుగడిపి మెల్లిమెల్లిగా కూలిపని మొదలైనవి మానివేశి ఒక బట్టల కంపెనీలో వాటా దారుడయ్యేడు. దానివల్ల ప్రతియేటా లేదంటే, వెయ్యిరూపాయల లాభం తనవాటాకి వస్తుండేది. దానాదీనా నరిసిగాడు యీపదిహేను ఏండ్లలోపల పదివేల రూపాయలు వెనకెయ్య గలిగాడు. సూరికి యీపదుహేనేల్లు బాగా జరిగిపోతున్నా పుట్టింటివాళ్లని చూడాలని కోరికమీద నరిసిగాడితో ప్రస్తావించేటప్పటికి వాడికికూడ స్వదేశంమీద మనస్సు పోయేదిగాని, వ్యాపాసారంలోవుండబట్టిమళ్లీరంగం రానిపద్ధతిమీద స్వదేశం వెల్లుదామంటే, ఓపట్టాన్ని వీలుచిక్క కుండాయుండడం చేత కొంతకాలయాపన జరిగింది అది సహజంగా కష్టంగా యుండేది సూరికి.
స్వగ్రామం చేరినతర్వాత నరిసిగాడు నరసన్నపేరుతో, మాలాళ్లకి కులపెద్దయాడు. మాలాళ్లందరూ వాడు మరల దేశంలోకి ధనికుడై రావడం చేత బ్రహ్మానందంపొంది అడుగులుకి మడుగులొత్తుతూ బ్రహ్మరధం పడుతున్నారు నరసన్నకి. మొదట్లో వీరన్న కాపు వాడిని సాంధిచడానికి చాల ప్రయత్నాలు చేసినా, యిప్పటి నరసన్న వెనుకటి నరిసిగాడుగాదు కనుక ప్రయత్నాలు ఫలించినాయిగాదు. పైగా నరసన్న ధనికుటచేత లేబరుకమిటీలో మెంబరిప్పుడు. మాలాళ్లందరికి అతనిమాట సుగ్రీవాజ్ఞే.
మాలవాళ్లకి ఓ స్కూలు నిర్మించాలని స్థలంకోసం నరసన్న ప్రయత్నిస్తూంటే, పంచాయితీ బోర్డు ప్రసిడెంటయిన వీరన్న కాపు అడ్డుదగిలినా, లేబరుపార్టీ సహాయం చేత స్థలమూ సంపాదించేడు, స్కూలూ కట్టించేడు. అందుచేత వీరన్న కాపుకి నరసన్నమీదున్న ద్వేషం ద్విగుణీకరించి ఎత్తుపైయెత్తువేస్తూ, గేలంవేసి నిరీక్షిస్తున్నాడు సమయం కోసం.
పార్టీలమధ్య పంచాయితీబోర్డు యెలక్షను పట్టవర్గాలేకుండా యుంది. ఊళ్లో పార్టీబలాల మాట. ఎలావున్నా మాలపల్లె యేవైపుపెడితే త్రాసు వైపుకు మొగ్గుతుంది. అంచేత పార్టీ బలాలకోసం ‘‘ఎద్దూ ఎద్దూ కలియబడిలేగ దూడ కాళ్లు విరగగొట్టాయి’’ అన్నట్టు యుభయపార్టీల వారు మాలపల్లెలమీద పడ్డారు వోట్లకోసం. ఇద్దరు ఖామందులే. పలుకుబడి కలవారే. ధనబలం కలవారే. వారి పొలాలవల్ల జీవించేదే మాలపల్లి యావత్తూను. అయినా అన్నారు మాలలందరు ఐక్యకంఠాన్ని. ‘‘మాకుల పెద్ద పెత్తనమని’’ క్రితం సాలులో ఎలక్షనాఖర్ని పంచాయితీ బోర్డు గుమాస్తా కిచ్చేది నెలకు మూడు రూపాయలయినా యిచ్చే గుమాస్తా గిరీ క పేదవానికి కాకుండా తనపార్టీకి కుడిభుజంలాంటి చదువులేని ధనవంతుని కిచ్చినందుకు, క చదువుకున్న పేదవాని తరపున వాదించిన నరసన్నమాట పాటిచెయ్యలేదు వీరన్న కాపు. పైగా మాలల స్కూలుకు స్థలం విషయములో అడ్డుతగిలాడు. ఈ కారణాలవల్ల నరసన్నకు తనమీదున్న పాతపగ యెక్కువయి తనకు ఓట్లు నియ్యనివ్వడని, వీరన్నకాపు వోట్ల విషయమై అడగకుండా యింటికి వెళ్లిపోయాడు మాలవాళ్ల సమాధానం విని.
వీరన్నకాపు జ్ఞాతియే ఎదిరిపార్టీ నాయకుడువడంచేత, యెలక్షను ద్వేషాలకి జ్ఞాతిసామంత విరోధాలుకూడ కలిగాయి. దానితో వోట్లువున్నదంపతులమధ్య, కొన్ని సంసాలలో విరోధాలు కూడ ప్రజ్వరిల్లి గుడిసెలలో పొర్లొచ్చాయి. ఇంకా ఎలక్షన్ పదిరోజు యుందనగానే పట్టుదలలు పరిమితి మీరాయి. చదువురాని వీరన్న కన్న, చదువుకున్న విరోధిపార్టీ నాయకుడంటే, ప్రజలకి మంచి అభిమానంగాయుంది వూళ్లో. కాని కొంచెం బెదురుతున్నాడు. వీరన్న కాపుయొక్క నోటిని దుర్మార్గత్వాన్ని చూచి.
ఊరుబయట ఉత్తరానున్న పుంతగట్టిని హఠాత్తుగా రెండు దెబ్బలుకొట్టి పారిపోయేరు. ఎవరో వీరన్నకాపుని, కనీకనపడని కను చీకట్లో కునికే నక్కమీద తాటికాయపడ్డట్టు, జవసత్యాలుడిగిన వీరన్న కాపు మాటామంతీ లేకుండా పడిపోయాడు. ప్రక్కదారిని షికారు పోయివస్తున్న నరసన్న సమయాని కడ్డుతగిలాడు. కాకుల్లో కోయలలా రెండు దెబ్బలు తిన్నాడుగాని పారిపోయిన వాళ్లని గుర్తుపట్టలేక పోయినా అదంతా విరోధి పార్టీవారి పన్నాగమని నిశ్చయించుకున్నాడు.
త్వరగా యిన్ని మంచి వీళ్లు ప్రక్క చేలోయున్న బావి దగ్గరనుంచి తెచ్చి, అతని ముఖం మీదజల్లి వుపచారంచేయగా కొంతసేపటికి తెప్పరిల్లాడు వీరన్నకాపు. నరసన్ననుచూచి మరీ భయపడిపోయాడు మొదట్లో, కాని మాట్లాడలేక రెప్పవాల్చకుండా చూశాడు నరసన్నకేసి నివ్వెరపోతూ.
నరసన్న వీరన్న కాపుకి భయం లేదని ధైర్యం చెప్పి, చేతులమీద తనమాలవాళ్ల సహాయంచేత వీరన్నకాపునీ, అతనింటికి తీసుకువెళ్లి పడుకోబెట్టాడు మంచంమీద. ఈవార్తతెలిసి సూరమ్మ పరుగుపరుగున చక్కావచ్చింది వీరన్న కాపింటికి. దాని నగలూ, దాని నాజూకుతనం చూచి, వీరన్నకాపు తేల తేలబోయాడు. తన కలిగిన అవమానానికి తనలో తానే సిగ్గుపడుతూ –
‘‘కామందులికి దణ్నాలండి…’’ అంది.
‘‘సూరీ… సూరమ్మా… కులాసాగా యున్నావా?…’’ అన్నాడు కాపు.
‘‘చిత్తం… తమ దయవల్ల’’ అంది.
‘‘నివల్ల బ్రతికేనురా నరసనాన…. నీ మేలు మరవలేనురా… కష్టకాలంలో నువ్వే కొడుకు వయ్యావు….’’
‘‘అదేమండి అలాగంటారు….’అన్నాడు నరసన్న.
‘‘ఇవి తమ వుప్పువల్ల పెరిగిన దేహాలు కాదాబాబూ…’’ అంది సూరమ్మ.
‘‘ఔనర్రా… ఔనర్రా… నాకే లేకపోయిందా జ్ఞానం…’’ అన్నాడు వీరన్నకాపు. కొడుక్కేసిచూచి బోషాణం పెట్టెలోయున్న సూటుకేసు పట్టుకురమ్మన్నాడు. కొడుకు పట్టుకొచ్చిన సూటుకేసు నరసన్నకి తాళంయిచ్చి తెరిపించేడు. అందులో వోమూలని గుడ్డనుకట్టియున్న పట్టెడు సూరమ్మది తీసి దానికిచ్చెయ్యమన్నాడు వీరన్న కాపు నరసన్నతో. నరసన్న తెల్లబోతూ మూట విప్పి, పట్టెడతీసి, భార్యచేతికిచ్చాడు సంతోషంతో కూడిన చూపులు ప్రసరిస్తూ.
‘‘బాబయ్యగారూ ఇదంతా మీ అనుగ్రహమేనండీ’’ అంది సూరమ్మ. సమాధానం చెప్పలేక ప్రక్కకు తిరిగి పడుకున్నాడు వీరన్నకాపు.
ప్రక్కన నిలబడ్డ పెద్దలందరూ ‘‘అసలే మాట్లాడలేక నిలబడిపోయారు. వకళ్ళమొహాలు ఒకళ్ళు చూచుకుంటూ’’ పేదవాడి కెప్పుడైనా పట్టెడన్నం పెడితే, బ్రతికున్నంతకాలం మరచిపోలేడుసుమా అన్నభావం కళ్ళల్లో ప్రతిఫలిస్తూ.
నరసన్నలేచి నుంచున్నాడు; దీర్ఘంగా శ్వాసవిడుస్తూ, వీరన్నకాపు తనకు చేసిన అన్యాయాల్ని పాటించకుండా, తనకు మొదట్లో చేసిన మేలుకు, అతనికి ఆపత్కాలంలో అడ్డుబడి, అతని ఋణం తీర్చుకున్నందుకు సంతుష్టిపడుతూ
‘‘నరసన్న కృతజ్ఞతా? – వీరన్నకాపు పశ్చాత్తాపమా? – యేది గొప్పది? –’’ అన్నట్టు ప్రక్కనున్న మామిడిగున్నమీద పక్షలు ‘కిలకిల’ మిన్నాయి.
———–