పేరు (ఆంగ్లం) | Chinta Deekshitulu |
పేరు (తెలుగు) | చింతా దీక్షితులు |
కలం పేరు | బాలానందం |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1891 |
మరణం | 8/25/1960 |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా లోని దంగేడు గ్రామం |
విద్యార్హతలు | బి.ఏ. ఎల్.టి |
వృత్తి | ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేశారు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | కవి, కథకుడు- చింతా దీక్షితులు |
స్వీయ రచనలు | చిత్రరేఖ, కవి కన్య, లక్క పిడతలు, అనుమానం మనిషి, “ఏకాదశి” అనే పేరుతో 11 కథల సంకలనాన్ని కూడా ప్రచురించారు. భారతదేశాన్ని గురించి పిల్లలకు అర్థమయ్యేలా మినూ మిసాని రాసిన గ్రంథాన్ని మన ఇండియా పేరిట తెనిగించారు. |
ఇతర రచనలు | ఆడవాళ్ల పాటలు |
ఈ-పుస్తకాల వివరాలు | బాల గేయాలు |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రముఖ కథా రచయిత మరియు బాల గేయ వాజ్మయ ప్రముఖులు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చింతా దీక్షితులు ఆ పైన ఆ రామభక్తుడి దయ |
సంగ్రహ నమూనా రచన | వీధివాళ్ళందరూ ‘‘ఒట్టి మొద్దు, తెలివితక్కువ వాడు’’ అనేవారు, నిజానికి నా దగ్గర అట్లాంటి గుణాలు ఏమీ లేకపోయినా, నన్ను తెలివి తక్కువవాడు అని ఎవరైనా అనేసరికి పుట్టెడు దుఃఖం వచ్చేది. పరీక్షలు పోయినవాళ్లు వేలకొద్ది. ఈ రత్నగిర్భ అయిన భారతదేశంలో వుండగా ‘‘మొద్దు అంటే వీడు ఒక్కడే’’ అని లెఖ్ఖగా చూపడం, ఖాళీ ప్రదేశం తక్కువగావున్న హృదయాల తొందరపాటుగుణాన్ని వ్యక్తంచేస్తుంది. మెఱక అయిన హృదయంగల కొందరు యిట్లా అన్నారని నేను యెంతమాత్రం భిన్నుణ్ణవదల్చుకోలేదు |
చింతా దీక్షితులు
ఆ పైన ఆ రామభక్తుడి దయ
వీధివాళ్ళందరూ ‘‘ఒట్టి మొద్దు, తెలివితక్కువ వాడు’’ అనేవారు, నిజానికి నా దగ్గర అట్లాంటి గుణాలు ఏమీ లేకపోయినా, నన్ను తెలివి తక్కువవాడు అని ఎవరైనా అనేసరికి పుట్టెడు దుఃఖం వచ్చేది. పరీక్షలు పోయినవాళ్లు వేలకొద్ది. ఈ రత్నగిర్భ అయిన భారతదేశంలో వుండగా ‘‘మొద్దు అంటే వీడు ఒక్కడే’’ అని లెఖ్ఖగా చూపడం, ఖాళీ ప్రదేశం తక్కువగావున్న హృదయాల తొందరపాటుగుణాన్ని వ్యక్తంచేస్తుంది. మెఱక అయిన హృదయంగల కొందరు యిట్లా అన్నారని నేను యెంతమాత్రం భిన్నుణ్ణవదల్చుకోలేదు.
నామీద ప్యాస్ చేసే, పైని వుదహరించిన తెలివితక్కువ రిమార్కులు అన్నీ రెండవ సంవత్సరం కూడా నా స్కూల్ ఫైనల్ పరీక్ష పోవడంవల్లనే దాపరించాయి. అబద్ధం ఆడి ఫలితంలేదనిన్నీ, యెక్కడికైనా వుడాయించేస్తే మానాన్న నూతిలో చేదని గెలికిలాగినట్టు తిరిగి లాగిపారెయ్యడం ఎట్లాగూ తధ్యమని నేను నాలుగు ప్రక్కలా ఆలోచించుకొని, క్రిందటి సంవత్సరం మాదిరీగానే యీ సంవత్సరంకూడా పరీక్ష పోయిందన్న యదార్థం యింట్లో చెప్పేశి, అక్షింతలకి తల ఒగ్గేశేను.
ఫలితాలు వచ్చిన కొత్త పది దినాలూ యిలా కొంచెం బెదురుగా వుంటుందని నాకు క్రిందటి సంవత్సరం గడించుకొన్న అనుభవంవల్ల తెలుసు, కాని మొదటి సంవత్సరం యీ విచారానికి తట్టుకోవడం నేర్చేసుకోవడంవల్ల యిప్పుడంతి కష్టం గాను విచారంగాను లేదు.
అయితే విచారాన్ని
యీ సమయంలో వ్యక్తపరచి, ఆ మహాదధిలో కొట్టుకుపోతున్నట్టు ముఖభావ ప్రదర్శన చెయ్యకపోతే తల్లిదండ్రులు యింకో అపోహపడిపోతారు, ‘‘రెండుపూట్లా యేమాత్రం తగ్గించుకుండా శేరు బియ్యం పోగూ చెల్లగొట్టేడంతో పరిపుచ్చకుండా వీడు బోలెడు డబ్బు ఖర్చుచేయించేడు, పరీక్ష పోతే యీ జడుడికి చీమకుట్టినటైనాలేదేం’’ అని ఆవిధంగా యెక్కడ అనుకోనిపోతారో అని నేను బ్రహ్మాస్త్రంతో తుల్యమయిని ఒక తిరుగులేని పంథా త్రొక్కేశాను. యే పదార్ధాన్నైనా యిష్టంలేనట్టు తినడం; తిండి, త్రాగుడు సమయాల్ని, కాలకృత్యసమయాల్ని మినహాయించి తక్కిన సమయాల్లో తలమీద చెయ్యివేసుకొని యేదో ఆలోచిస్తున్నట్టు, విచారంగా వున్నట్టు ప్లేటువేసెయ్యడు; ఎవ్వరైనా పలకరిస్తే చాలా విచారంగా నెమ్మదిగా సమాధానం చెప్పడం – ఒక్కవారం రోజులు యీ విధంగా సంచరించాను.
మా నాన్నా అమ్మా, ‘పాపం, వెర్రినాయిన పొయ్యిలో వంకాయిలా బాధపడిపోతున్నాడు’ అని తిట్టడం మానేశేరు.
ఎవరైనా మరణిస్తేవుంటుంది చూశారు. దుఃఖం, సరిగ్గా అట్లాంటిదే యీ ‘పరీక్ష ఫెయిల్’ విచారం. యిది యెన్నోదినాలు వుండదు. మాత్రం ప్రతి ఫెయిల్ అయిన పౌరుడికీ తెలుసు. మొదటి సంవత్సరం ఫెయిలైనప్పుడు మాత్రానికి ప్రకృతిసహజంగా బద్ధుణ్ణయాను. పోనీ, పునాది దిట్టం అనికూడా అనుకొన్నాను.
నేను, దేవుడు లేడు, వుంటే కనపడ్డా అని చాలా రోజులుదాకా మూఢాభిప్రాయాంలో వుండేవాణ్ణి. మొదటి సంవత్సరం ఫెయిల్ అవడంతోనే నాకు అనుమానం తట్టేశింది, ‘‘దేవుడు ఆయన్ని నేను నమ్మనందుకు యీ విధంగా అయినా నా శరీరాన్ని నాకు జ్ఞాపకంచేసి తన వునికిని నాకు నచ్చ చెబుదామని నాకు యీ తాత్కాలిక దుఃఖాన్ని కలుగజేశాడని’’.
ఈ అనుమానంవల్లనే నా రెండవ సంవత్సరం ఆఖరు టెరమ్ లో ‘‘విద్యార్ధులికి కష్టసమయంలో తన ప్రాణాల్నయినా ఇస్తాడని చెప్పుకోబడే’’ శ్రీ ఆంజనేయస్వామి సేవ ప్రారంభంచేశాను. రోజూ ఒక కొబ్బరికాయముక్క కొరుకుతూవుండేది, ముదిరిన ముక్క వచ్చిననాడు సంతోషిస్తూ, లేత ముక్క వచ్చిననాడు విచారిస్తూ పరీక్షలదాకా గడిపేశేను భగవద్భక్తితో.
అప్పుడప్పుడు అనుమానం తగలకుండావుండేది కాదు, అర్చకుడు ఈ కొబ్బరిముక్కలు వుడాయించేస్తున్నాడేమో అని; ‘నా వెఱ్ఱిగాని దేవుడు యీ ముక్కల్ని మోసుకుపోతాడా యేమిటి’ అనికూడా అనుకొనేవాణ్ణి తెలివిగా. కాని యీట్లాంటి అనుకోరాని అనుమానాలు నాలో వున్నట్టు ఆ భక్తజనిమందారుడైన ఆంజనేయస్వామికి తెలుస్తే, పరీక్ష ఫేల్ చేసేసి నామీద కక్ష తీర్చుకొంటాడని, ఆ అనుమానం వచ్చినప్పుడల్లా తమాయించుకొనేవాణ్ణి.
ఈ విధంగా ఆంజనేయస్వామిని నేను దూషించకుండా వుండడమేకాకుండా, యెందుకైనా మంచిదని అప్పుడప్పుడు ‘‘ఆ మహానుభావుడు గనుక రోజుకొక కొబ్బెరకాయముక్క పెట్టిస్తున్నాడు’’ అనుకొనేవాణ్ణి.
నేను యింత చాకిరీచేశినా యెందుకు ఫేల్ చేశాడో తెలియదు. బహుశా ఆరాధనలో యేవో లోపాలు వుండివుంటాయి. ఆఖరిటర్ములో యింత హఠాత్తుగా వీడికి భక్తి రావడమేమిటి, వీడి భక్తి చూస్తే ‘‘అందేదాకా కాళ్ళు, అందిన తర్వాత జుట్టూలా వుంది’’ ఆనయినా అనుకొని వుండాలి, లేదా, అడపాతడపా తెలియనితనంలో అర్చకునితో అతను బ్రద్దలుగొట్టిన కొబ్బరికాయముక్కల్లో పెద్దముక్కకోసం దెబ్బలాడినందుకైనా ఆగ్రహించివుండాలి.
ఈ సంవత్సరం మా నాన్న నన్ను తిరిగి స్కూల్లో ప్రవేశపెట్టేపక్షంలో, సంవత్సర ప్రారంభంనుండీ నన్ను నమ్మించిన ఆంజనేయస్వామి ఆరాధన మొదలుచేసి, సంవత్సరాంతందాకా కొనసాగించదల్చుకొన్నాను. మరి, అర్చకుడితో దెబ్బలాటలు, చిల్లరసందేహాలు పెట్టుకోదల్చలేదు. ఆపైన రామభక్తుడి దయ-
———–