నాగసముద్రం వాసుదేవరావు (Nagasamudram Vasudevarao)

Share
పేరు (ఆంగ్లం)Nagasamudram Vasudevarao
పేరు (తెలుగు)నాగసముద్రం వాసుదేవరావు
కలం పేరు
తల్లిపేరుపిళ్లమ్మ
తండ్రి పేరుకరణం నారాయణరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1895
మరణం9/22/1979
పుట్టిన ఊరునాగసముద్రము ధర్మవరం తా. అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తిఉపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకుసుమాంగి, మనోహరవిజయము, విచిత్ర వివాహము, అనంతపుర మండల చరిత్రకథలు, అనంతపురం జిల్లా భూగోళము, The Blind Boy
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనాగసముద్రం వాసుదేవరావు
సంగ్రహ నమూనా రచనశ్రీ నాగసముద్రం వాసుదేవరావుగారు అనంతపురము జిల్లాలో పేరుగాంచిన ఉపాధ్యాయులు, రచయితలు వీరికి చిన్ననాటి నుండియు సాహిత్యాభిలాష మెండు, ఆంధ్రాంగ్లసాహిత్యములను చక్కగా అధ్యయనము చేసినవారు. రాజమహేంద్రవరములో ఉపాధ్యాయ శిక్షణ పొందుకాలము (1915 వ సం) లోనే వీరు ‘కుసుమాంగి’ యను నవలను ప్రకటించిరి.

నాగసముద్రం వాసుదేవరావు

శ్రీ నాగసముద్రం వాసుదేవరావుగారు అనంతపురము జిల్లాలో పేరుగాంచిన ఉపాధ్యాయులు, రచయితలు వీరికి చిన్ననాటి నుండియు సాహిత్యాభిలాష మెండు, ఆంధ్రాంగ్లసాహిత్యములను చక్కగా అధ్యయనము చేసినవారు. రాజమహేంద్రవరములో ఉపాధ్యాయ శిక్షణ పొందుకాలము (1915 వ సం) లోనే వీరు ‘కుసుమాంగి’ యను నవలను ప్రకటించిరి. ఈ తొలి నవలారచన ద్వారా శ్రీవాసుదేవరావుగారు సాహితీ లోకమునకు పరిచయమైరి, తదుపరి వీరు ‘మనోహరవిజయ’ మను పేరు మరియొక నవల వ్రాసిరి. ఇది ఆంగ్లములోని ‘Adventures of Ulysses’ అను గ్రంథమునకు చక్కని ఆంధ్రానుసరణము. ప్రసిద్ధ సాహితీవేత్తలు విద్వాన్ శ్రీ శీరిపి ఆంజనేయులుగారు, తమ విజ్ఞాన వల్లికా గ్రంథమాలలో వాసుదేవరావుగారి నవల ‘విచిత్ర వివాహము’ను ప్రచురించిరి. నేడీ గ్రంథములేవియు లభ్యము కాకపోవుట మన దురదృష్టము.
శ్రీవాసుదేవరావుగారు ఉపాధ్యాయ వృత్తిని చేబట్టిన వారగుటచే విద్యార్థుల కనువగు జిల్లా చరిత్రను – భూగోళమును – చారిత్రాత్మక కథలను వ్రావావలెననెడి తలంపుకల్గి ‘అనంతపుర మండల చరిత్రకథలు’ ‘అనంతపురం జిల్లా భూగోళము’ అను గ్రంథములు వ్రాసిరి. డా. చిలుకూరి నారాయణరావుగారి ‘ముసలమ్మ’ కావ్యావతరణకు ఈచరిత్రయందలి ‘ముసలమ్మ మరణము’ అను కథ ధారమైనది.
ఈకవిగారు వచన రచనలేకాక కొంతకవిత్వమును కూడా వ్రాసిరి. వీరు ‘The Blind Boy’ అను ఆంగ్ల పద్యమును తెనుగులోని కనుసరణగావించిరి. వారి పద్యరచన యిట్లున్నది.
తే.గీ. ఎపుడు విదురించు చుండిన నపుడె రాత్రి
పాటు పడియెడు సమయమే పగలునాకు
నిదుర పోకయె నేనుండ నేర్తునేని
అంతమే లేని పగలు నా కమరియుండు
వింత లేవియు లేన్నట్టి స్వాంతమందు
కొత్త కోర్కుల సమకూర్చు కొనగ నేల?
పొందజాలని దానికై పొక్కుటేల ?
గ్రుడ్డి బాలుడ ననుచునే కుందనేల ?
గాన మీరీతి చేయుచు కడుముదమున
ప్రొద్దు పుచ్చుచు మనుటయే పొసగెనేని
సార్వభౌమునితో నేను సాటినగుదు.
(1916 ఆంధ్రపత్రిక వార్షిక సంచిక నుండి)
శ్రీవాసుదేవరావుగారు అప్పుడప్పుడు వ్రాసిపెట్టిన చాటుపద్యములనేకములు. అవి వారి నిత్యజీవిత సత్యములు; అనుభవైకవేద్యములు. రాయలసీమలో అనంతపురము జిల్లా కఱవు కాటకములకు నిలయము. త్రాగునీటికి కూడ కటకటలే. కల్యాణదుర్గమున ప్రజలు నీటికొరకై పడిన యవస్థను చూచి వారొక చాటుపద్యమును వ్రాసిరి.
అట్లే రాజమండ్రిలో శిక్షణ పొందుచున్నప్పుడు పడిన అగచాట్లను వారిట్లు ఏకరువు పెట్టిరి.
సీ. కడుపు నందాకలి కాదంచు కొన్నాళ్లు
కొత్తనీరనుచును కొన్నినాళ్లు
చర్మవ్యాధుల చేత చచ్చుట కొన్నాళ్లు
చన్నీళ్ళ స్నానంబు కొన్నినాళ్లు
విడువని భేదిచే విసుగుట కొన్నాళ్లు
కొనిన మందులు త్రాగి కొన్నినాళ్ళు
మితిలేని వానచే మిడుకుట కొన్నాళ్ళు
కొంపలో చెదలచే కొన్నినాళ్ళు
గీ. ఇటుల బాధలు పొదితి మింతెకాని
సుఖము చెందితి మనుమాట సున్న యకట
ప్రాణముండగ మావూరు బడితిమేని
రాణ్మహేంద్రమ యికమేము రాము రాము
వీరిట్లు వచనరచనతో బాటు పద్యములను గూడ వ్రాసి గృహలక్ష్మి భారతి, మున్నగు పత్రికలకు పంపిరి. పత్రికలు వాటిని ఆదరించినవి.
శ్రీవాసుదేవరావుగారి పుణ్యమున అనంతపురం జిల్లా చారిత్రాత్మక సంఘటనలు దేశవ్యాప్తమై బాల్యదశలోనే బాలుర మనోఫలకములపై ప్రతిష్ఠింపబడి ప్పటికివి మరువని విధముగా శాశ్వత యశస్సు నందుకొన్నవి. శ్రీవాసుదేవరావుగారి రచనలలో ఈ వాచకములే మన కటనట కనిపించుచున్నవి. వీరి అమూల్య నవలలు సేకరించి మనసాహిత్య చందనపేటికలో భద్రపరచుకొనుట తేని అవసరము. వీరి కుమారులలో జ్యేష్ఠులైన శ్రీ ఎన్. సేతూరామారావుగారు ఈ కార్యమును చేసి ధన్యులగుదురు గాత.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...