పేరు (ఆంగ్లం) | Narla Venkateswara rao |
పేరు (తెలుగు) | నార్ల వెంకటేశ్వరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | మహాలక్ష్మి |
తండ్రి పేరు | లక్ష్మణ రావు |
జీవిత భాగస్వామి పేరు | సులోచనా దేవి |
పుట్టినతేదీ | 12/1/1908 |
మరణం | 2/16/1985 |
పుట్టిన ఊరు | జబల్పూర్, మధ్య ప్రదేశ్ |
విద్యార్హతలు | – |
వృత్తి | పాత్రికేయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సీతజోశ్యం, జాబాలి, నరకంలో హరిశ్చంద్రుడు, ద్రౌపది, హిరణ్యకశ్యపవధ, నవయుగాలబాట నార్ల మాట, నార్ల రచనలు 1 – దేశ చరిత్రలు, నార్ల రచనలు 2 – సాంఘిక నాటికలు, వ్యాసాలు నార్ల రచనలు 3 – పౌరాణిక నాటికలు, నార్ల రచనలు 4 – సాహిత్య రచనలు, నార్ల రచనలు 5 – సంస్కృతి, సాహిత్యం, మతం, నార్ల రచనలు 6 – వర్తమాన సంఘటనలు, నార్ల రచనలు 7 – జీవిత చిత్రణలు ఆంగ్ల రచనలు: The truth about the Geetha 1988, An essay on the upanishads 1989, Gods and goblins, East and west, Intellectual poverty in India |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | నార్ల వారి మాటలు: యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు.ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు. సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.బడు వాడేవాడు బడుద్ధాయి. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నార్ల వెంకటేశ్వర రావు నార్ల వారి వ్యాసాలు |
సంగ్రహ నమూనా రచన | చూచిన ఒక దృశ్యాన్ని వర్ణిచడం సులభమేమో కాని , జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా ? ఇరుకు కొంప నుంచి కదిలి , ఇరుకు బజార్ల వెంట నడిచి , అపారమైన సముద్రపు అంచున నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా ? |
నార్ల వెంకటేశ్వర రావు
నార్ల వారి వ్యాసాలు
చూచిన ఒక దృశ్యాన్ని వర్ణిచడం సులభమేమో కాని , జీవించిన ఒక అనుభూతిని వర్ణించడం సులభమా ?
ఇరుకు కొంప నుంచి కదిలి , ఇరుకు బజార్ల వెంట నడిచి , అపారమైన సముద్రపు అంచున నిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా ?
మన పరిమిత జీవితాలలోని పరిమిత సమస్యలతో కంటికి నిద్ర దూరమైనప్పుడు తలయెత్తి అనంతా కాశంలోని అనంత కోటి నక్షత్రాలను పరికించినంతనే మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా ?
భుక్తి కోసం పగలంతా పడరాని పాట్లు పడి , విసిగివేసారి ఇంటికి చేరుతుండగా , నవ్వుతూ కేరుతూ గడపలో కాళ్లకు అడ్డం పడే ముద్దు బిడ్డ నెత్తుకున్నప్పుడు మనం పొందే అనుభూతిని వర్ణించడం సులభమా ?
పచ్చని చెట్టుగాని పచ్చిక బయలు గాని చెదురుగా కానవచ్చే బస్తీలో బ్రతుకుతూ , గాలికి తలలు కెరటాల వలె వేచి పడుతుండగా , దిశ్చక్రాన్ని వర్ణించడం సులభమా ?
హృదయాన్ని ఊపే ఏ అనుభూతినీ – జీవితాన్ని కదిలించే ఏ అనుభూతినీ – సులభంగా వర్ణించలేము .
ఇటీవలనే అజంతా , ఎల్లోరాలను చూచి వచ్చిన నన్ను ఏమి చూచి వచ్చినావని మిత్రులడిగినప్పుడు నేను వారికి సులభంగా గాని , సవిస్తరంగా గాని సమాధానం చెప్పలేక పోవడానికి నేను ఆ దృశ్యాన్ని చూచి రావడం కాక , ఆ అనుభూతిని జీవించి రావడమే కారణమై వుండాలి .
జల్గామ్ కు దక్షిణంగా 35 మైళ్ల దూరాన , ఔరంగాబాద్ కు ఉత్తరంగా 55 మైళ్ల దూరాన అజంతా గుహలున్నాయి . వాటి పరిసర ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ అంతకు ముందు గాని , అటు తర్వాత గాని అందుకొననంతటి మహోన్నత శిఖరాలను అందుకొనగలగడానికి ఒక ముఖ్య కారణం స్పష్టం కాకపోదు .
గుహలను సమీపిస్తుంటే , ఇటు పచ్చని కొండ – అటు పచ్చని కొండ – ఈ రెండు కొదలకు మధ్య వాఘోరా నది . గుహలను చేరడానికి ఆ నది అంచువెంట అది రాళ్ల గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ పాడుకునే పాటలను వింటూ , మీ కాలి నడక , మీ పైన నీలాకాశం . మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు , మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వులు కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు రెండు , మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు . ఏ మెలికలో అడుగు పెడితే , దానికి అదే ఒక ప్రపంచం .
ఇటు కొండ – అటు కొండ –ముందు కొండ –వెనక కొండ – పైన కొండ – పక్కనే నది – నీలాకాశం – నీలాల నీళ్లు – పచ్చని చెట్లు – కమ్మని తావులు అది వేరే ప్రపంచం – అదొక స్వాప్నిక జగత్తు – భూలోక స్వర్గం – ఈ వాక్యానికి తుది మొదలు లేనట్టున్నది . అయితే , అజంతా గుహలను సమీపించగానే తుది మొదలు లేని జగత్తు లోకే నేను ప్రవేశించాను . ఈ దృశ్యాన్ని తలచుకున్నా అంతే జరుగుతున్నది .
మీకు ఇటు వుండే కొండ – అటు వుండే కొండ – మిమ్ము మెలికలు తిప్పించే కొండ – అన్నీ ఒక్కటే . కొండ చివరి మెలికే వాఘోరా నది జన్మ స్థానం నేను కొండ పైకెక్కి చూడలేదు గాని , పైన ఏడు కొలనులున్నాయట. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ , 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా , వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది . దూకిన తర్వాత , కొండ తిరిగిన మలుపులన్నీ తనూ తిరుగుతూ , సమతల ప్రదేశానికి చేరి , కొన్ని వందల మైళ్లు ప్రవహించి , తపతిలో కలుస్తుంది .
వాఘోరా పుట్టిన చోటనే వున్నాయి . అజంతా గుహలు . వెతుక్కుంటూ వెడితేనే కాని , సాహసించి వెడితే కాని – కనబడదు ఆ చోటు . వాఘోరా జన్మస్థానం తెలుసుకోవాలనే కుతుహాలంతో ఏ సాహసికుడు ఆదిలో అక్కడికి వెళ్లాడో! ఇప్పుడు కొండను త్రవ్వి , నది గట్టున రోడ్డు వేశారు . ఆదిలో ఇటు కొండ – అటు కొండ – మధ్యలో నది – నడవడానికి దారైనా వుండేది కాదట ; నది మధ్య నుంచే – మరీ విపరీతంగా వర్షాలు కురిస్తే తప్ప నదిలో నీళ్లు మోకాటి లోతైనా వుండవు – నడవ వలసి వచ్చేదట .
వాఘోరా పుట్టిన చోట కొండ అర్ధ చంద్రాకారంగా వుంటుంది . దాని ఒక వంపులో అజంతా గుహలుండగా , రెండవ వంపుపైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది . దాన్ని “వ్యూపాయింట్ “ అంటారు . మధ్య కాలంలో కొన్ని శతాబ్దాల పాటు అజంతా గుహ లన్న మాటే ప్రపంచానికి తెలియకుండా పోయింది . మేజర్ గిల్ అనే బ్రిటీష్ మిలిటరీ ఆఫీసర్ 1819 లో వేటకు వెళ్లి , ఒక జంతువును తరుముకుంటూ కొండ పైకి పోగా , ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి – ఏదో చెక్కడపు పని అతడి దృష్టిని ఆకర్షించిందట. సాహసించి అతడు కొండ దిగి , వాఘోరా నదిని దాటి , తిరిగి కొండపైకి ఎగ బ్రాకి చూడగా , తనకు అల్లంత దూరంలో చెట్ల సందుగా కానవచ్చింది అజంతా గుహలలో పదహారవదాని శిరో భాగమని తేలిందట . లోకం మరచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి తొలిసారిగా చూచినాడో అదే వ్యూ పాయింట్ “. వ్యవధి లేక నేను వెళ్లలేదు గాని , చాల మంది “వ్యూ పాయింట్ “ వెళ్లి , అక్కడి నుంచి అజంతా గుహలను చూస్తూవుంటారు .
బౌద్ధానికి క్షీణ దశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సయితం సభ్య లోకం విస్మరించింది . అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని కీస్తు శకం తొమ్మిదవ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు . చుట్టూ ప్రక్కల ఊళ్లను , బస్తీలను దోచుకుని , ఆ గుహలలో వారు నివసిస్తూ వుండేవారు . వంటలు చేసుకొనడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగలతో పెక్కు గుహలలోని కుడ్య చిత్రాలు మసిపూసుకుని పూర్తిగా చెడిపోయాయి . పోర్వపు రోజులలో వాఘోరా నది అంచులవెంట – ప్రవాహం మధ్య నుంచి – అజంతా గుహలకు చేరే బాట ప్తస్తుతం పొగబారివున్న గుహలకు దారి తీసేది కాబోలు . అందువల్ల వీటిలోనే బందిపోటు దొంగలు కాపురం పెట్టి వుండాలి ; వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండవ గుహలలోని కుడ్య చిత్రాలు నేటికీ అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమై వుండాలి . ప్రలోభ పూరిత మైనది . ఈ ప్రపంచం . దీనిలో స్వార్ధం , నైచ్వం , క్రౌర్యం , కృతఘ్నత మొదలైన అవగుణాలే అధికంగా కానవస్తాయి . దీనిలో మానవుని జీవితం దుఃఖభాజనం – మన ప్రపంచాన్ని గురించి బౌద్ధ భిక్షువుల అభిప్రాయ మిదే . మానవ ప్రపంచం పట్ల – మానవుని పట్ల – వారి అభిప్రాయం ఎంత నిరసన పూర్వ కమైనదో తెలపడానికి అజంతా గుహలలో వారు చిత్రించిన కొన్ని కథలే నిదర్శనాలు . అట్టి కథలలో ఒకటిది .
అడవి గుండా వెడుతున్న ఒక బాటసారి ఒక గుంటలో పడిపోతాడు . అతడి ఏడుపు విని , అతడి పియా జాలిగొని , ఒక కోతి అతడిని తన వీపుపై ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చుతుంది . తనకు ఆ కోతి చేసిన మేలును అంతలోనే మరిచిపోయి , అతడు దాన్ని పట్టుకుబోతాడు . అంతట కోతులన్నీ చేరి అతడిని ముత్తడిస్తాయి . భయపడిపోయి , మన్నించమంటూ అతడు ప్రాదేయపడతాడు . ఇకనైనా బుద్ది కలిగి వుండమని చెప్పి , ఆ కోతులు అతడిని ప్రాణాలతో పోనిస్తాయి .
మానవ ప్రపంచాన్ని గురించి , మానవుని గురించి ఇంత నిరసన పూర్వకమైన అభిప్రాయం తమకున్నందు వల్ల బౌద్ధ శిల్పు లేమి , చిత్ర కారు లేమి , అతడి ప్రపంచం నుంచి , అతడి నుంచి పారిపోవడానికే ఒక ప్రత్యేక ప్రపంచంగా వున్నా వాఘోరా అంది జన్మస్థానాన్ని తమ కళా వైదగ్ధ్య ప్రదర్శనానికి స్థావరంగా చేసుకొని ఉండాలి ! అయితే , మానవుడు ఎంతటి దుర్గను ప్రదేశానికి వెళ్ళినా , ఎంతటి నిర్జన ప్రదేశంలో దాగోన్నా ప్రపంచం నుంచి ఎంత దూరం పారిపొయినా , ప్రపంచం అతడిని వెన్నాడక మానదు . అతడిలోని అణువణువులో ప్రపంచం వున్నప్పుడు , ప్రపంచం నుంచి తాను పారిపోయినానని అతడును కొనడం కేవలం భ్రమే ! ఈ నిత్య సత్యాన్నే ఈ నగ్న సత్యాన్నే అజన్తాలోని చిత్రాలలో ప్రతి ఒక్కటీ చాటుతున్నది . ఏ ప్రపంచం నుంచి ప్రాచీన కాలపు ఈ బౌద్ధ స్థపతులుశిల్పులు , చిత్రకారులు పారిపోయినారో , ఆ ప్రపంచాన్నే వారు తమ నిర్జన ప్రదేశంలో , తమ ఏకాంత వాసంలో సృష్టించుకున్నారు . అయితే , వారు సృష్టించుకున్న ప్రపంచం వారు పారిపోయిన ప్రపంచం కంటె సుందరమైనది . మధురమైనది , ఉత్కృష్టమైనది , ఉదాత్తమైనది , గంభీరమైనది . దానిలో వారు మానవుని కంటే మర్కటాన్ని ఉత్తమ జీవిగా చూపించి వుండ వచ్చు . అయినా , అది మానవ ప్రపంచమే .
ఈ విషయాన్ని ఈ క్రింది పలుకులతో జనహర్ లాల్ నెహ్రు వివరించాడు . “ అజంతా మనసు ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది . అయినా , అది అతి వాస్తవికమైన లోకమే . ఈ కుడ్య చిత్రాలను చిత్రించినవారు బౌద్ధ భిక్షువులు . స్త్రీలకు దూరంగా తొలగండి ; వారిని కన్నెత్తి చూడనైనా వద్దు ; వారు మిమ్ము ప్రలోభ పెడతారు . వారు మిమ్ము పతితుల్ని చేస్తారు – ఇదే వారి గురు దేవుడు వారికి చేసిన బోధ . అయినా , ఇక్కడ అందాలోలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు . రాకుమార్తెలు , గాయనీమణులు , నృత్యాన్గానాలు ఎక్కడ చూసినా స్త్రీలే . కూర్చున్న వారు కొందరు , నిలబడి వున్న వారు కొందరు , ముస్తాబు చేసే వారు కొందరు , ఊరేగింపుగా వెళుతున్నవారు కొందరు . ఎంతో పేరొందిన వారు ఈ అజంతా స్త్రీలు . సన్యసించిన వారైనా చిత్రకారులకు ఈ జగన్నాటకం ఎంత చక్కగా తెలుసు ! బోధి సత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని , ఆయన విగ్రహాన్ని అంత గంభీర మూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తును చిత్రించుటలో వీరు చూపించారు . అజంతా గుహలు మొత్తం 29 , వాటిలో అయిదు బౌద్ధ చైత్యాలైతే మిగిలినవి బౌద్ధ విహారాలు , మొత్తం 29 లో , రెండింటిలో , మూడింటినో తప్ప మిగిలిన అన్నింటిలోను ప్రతి స్తంభాన్ని , ప్రతి కుద్యాన్ని , చివరికి కప్పులనైనా విడిచి పెట్టకుండా , చిత్రాలతో నింపివేశారు . కాని , ఈనాడు పదమూడు గుహలలో మాత్రమే చిత్రాలు –కాదు వాటి శిథిలాలు మాత్రం కానవస్తున్నాయి . చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది ఒకటవ , రెండవ , తొమ్మిదవ , పదవ , పదహారవ , పదిహేడవ గుహలలోనే .
గుహల గోడలకు మట్టి గిలాబా చేసి , దాని పై పలచగా సున్నం పూసి , ఆ పూత పై దాని తడి ఆరాక ముందే చిత్రాలను వేశారు . వాన తేమకు మట్టి గిలాబాపోక్కి , ఆది పొరలు పొరలుగా ఊది పోయినందున కొన్ని చిత్రాలు కాలక్రమాన నశింపు అయిపోయి వుండవచ్చును . కాలగతి వల్ల ఈ విధంగా కొన్ని చిత్రాలు పోగా , గుహలలో అప్పుడు తలదాచుకొన్న బండి పోటు దొంగలు పెట్టిన పొగకు మరికొన్ని మసిపూసుకు పోయాయి . పోతే ఇటివలి కాలంలో శాశ్వత కీర్తి సంపాదన కోసం గోళ్లతో బొమ్మలపై తమ పేర్లను కొందరు వ్రాయడం వల్ల మరికొన్ని చిత్రాలు శిథిలమైపోయాయి. కాగా , నేటికీ నిలిచినవి మొత్తంలో నూటికి ఒక వంతో , రెండు వంతులో ! కొన్నేళ్ల నాడు జాగ్రత్తపడినా , ఇంతకు రెట్టింపు చిత్రాలైనా మిగిలివుండేవేమో ! ముప్ఫయి సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి మేజర్ గిల్ ఎన్నో చిత్రాలను కాఫీ చేసుకోనగా , వాటిలో చాలాభాగం 1866 లో లండన్ లోని “క్రిస్టల్ ప్యాలెస్ “ లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దగ్ధ మైపోయాయి .
సేకరణ : నార్ల వారి రచనా సంపుటి నుంచి ………….
———–