పేరు (ఆంగ్లం) | Maram Vasudevamurthy |
పేరు (తెలుగు) | మరం వాసుదేవమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | సుందరమ్మ |
తండ్రి పేరు | మరం నారాయణాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | నీరజాదేవి |
పుట్టినతేదీ | 5/15/1910 |
మరణం | – |
పుట్టిన ఊరు | అనంతపురము |
విద్యార్హతలు | బి.ఏ.; పి.హెచ్.డి. |
వృత్తి | లెక్చరర్ |
తెలిసిన ఇతర భాషలు | ఆంగ్లము, సంస్కృత౦ |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తొలకరిచినుకులు, క్రొక్కాఱు మెఱుగు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మరం వాసుదేవమూర్తి |
సంగ్రహ నమూనా రచన | 1930 వ సం నందు అనంతపుర పట్టణమున ‘కవికుమార సమితి’ అను సంస్థ మువ్వురు యువకవుల కృషితో ఏర్పడినదన్న విషయమే కొద్దిమంది సాహితీపరులకు మాత్రమే తెలిసి యుండుననుటలో సందేహము లేదు. ఈ మువ్వురు నవయువకులలో శ్రీ మరం వాసుదేవమూర్తిగారొకరు. |
మరం వాసుదేవమూర్తి
1930 వ సం నందు అనంతపుర పట్టణమున ‘కవికుమార సమితి’ అను సంస్థ మువ్వురు యువకవుల కృషితో ఏర్పడినదన్న విషయమే కొద్దిమంది సాహితీపరులకు మాత్రమే తెలిసి యుండుననుటలో సందేహము లేదు. ఈ మువ్వురు నవయువకులలో శ్రీ మరం వాసుదేవమూర్తిగారొకరు. వీరి తండ్రిగారు న్యాయవాదులగుటచే పెనుకొండ నుండి తమ కుటుంబమును అనంతపురమునకు మార్చిరి. శ్రీవాసుదేవమూర్తిగారి ప్రాథమిక విద్యాభ్యాసము పెనుకొండలో కొంతవరకు జరిగి, తదుపరి ఉన్నత పాఠశాల విద్యాభ్యాసమనంతపురములో సాగినది. వీరనంతపురము సీడెడ్ డిస్ట్రిక్ట్సు కళాశాలలో తమ బి.ఏ., చదువును ముగించిరి, హైస్కూలు విద్యాభ్యాసకాలములోనే తెలుగు పండితులైన శ్రీ గద్వాల సుబ్బశాస్త్రిగారి ప్రోత్సాహముతోను, కాలేజీలో, శ్రీ ప్రయాగ వేంకట రామాశాస్త్రివారి ఆశీర్వాద బలముతోను, ప్రాచీన పోకడలలో కవితలను వ్రాయుట నేర్చిరి. బి.ఏ., ముగించులోపల తెలుగు సాహిత్యమును పూర్తిగా అవగాహన చేసుకొనిరి. సులువుగా పద్యములు వ్రాయుట నేర్చిరి. ఆంగ్లమునందు కూడా అప్పుడే వారికి కవిత లల్లుటలో నేర్పు కుదిరినది.
శ్రీ మూర్తిగారు తమ సహ పాఠకులైన శ్రీ వెల్లాల ఉమామహేశ్వరులు, శ్రీ పి. సుబ్బణాచార్యులు, తదితరులైన శ్రీ విద్వాన్ విశ్వం, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులతో కలసి అప్పుడప్పుడు కవితా గోష్ఠులను జరిపెడివారు. అప్పుడే కవికుమార సమితి ఏర్పాటున కంకురార్పణ జరిగినది. అనంతపురములో విద్యాభ్యాసానంతరము శ్రీమూర్తిగారు బొ౦బాయి రీసర్చ్ స్కూలులో ‘సామాజిక శాస్త్రమును’ అభ్యసించు విద్యార్థిగా నెలకు 200 రూప్యముల ఉపకార వేతనముపై చేరిరి. అప్పుడు వారు ‘‘హైందవ యుద్ధమీమాంస’ అను విషయముపై ఆంగ్ల గ్రంథము నొకదానిని వ్రాసి పి.హెచ్.డి. పట్టమును పొందిరి తదుపరి వీరు 1943లో బొంబాయి ‘‘తాతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ సైన్సు’ శాఖలో లెక్చరర్లా చేరిరి. ఉద్యోగము చేయుచు వారు కొన్ని ఉత్తమ వ్యాసములను సామాజిక శాస్త్రముపై వ్రాసి వివిధ పత్రికలలో ప్రచురించిరి. ఆ వ్యాసము లందలి యథార్థ విషయములను న్యూయార్క్, అంతర్జాతీయ విద్యాసంస్థ గుర్తించెను వారి ఆహ్వానముపై శ్రీ మూర్తిగారు ఉపకారవేతనముపై చికాగో విశ్వవిద్యాలయములో 1946-48 వరకు, పరిశోధనా కార్యక్రమములలో పాల్గొనిరి తదుపరి స్వదేశమునకు తిరిగివచ్చిన తరువాత మనదేశపు విశ్వవిద్యాలయములందు సహితము సామాజిక శాస్త్రపు కోర్సులు ప్రవేశపెట్టుటకు బహుళ కృషి గావించిరి. ఫ్యాక్టరీ యాజమాన్య విషయములు, కార్మిక సంఘములు సంఘటనలు వాటి పద్ధతులు మొదలగు పాఠ్యాంశములను పోస్టుగ్రాడ్యుయేట్ విద్యాస్థాయిలో ప్రవేశపెట్టిరి. క్రమముగా ఈ కోర్సులు గౌహతి – బరంపూర్ – ఆంధ్ర – కర్ణాటక మొదలగు విశ్వవిద్యాలయములలో ప్రవేశపెట్టిరి. తదుపరి అధికారులు శ్రీ మూర్తిగారిని అధ్యాపకులుగా నియమించుట జరిగినది.
1962 వ సం.లో U.N.O (అంతర్జాతీయ సంస్థ) కు చెందిన సాంకేతిక విజ్ఞాన విభాగము నుండి వీరు కార్మిక పరిపాలక వర్గము యొక్క (Personal Management team) జాతీయ నాయకుడుగా ఎన్నిక కాబడిరి, ఆ సందర్భమున జపాను, అమెరికా, (పూర్తిగా) ఇంగ్లాండు ఫ్రాన్స్, స్విజ్జర్లాండు, మున్నగు విదేశములలో పర్యటించి అక్కడ కార్మిక యాజమాన్యముపై పరిపాలనపై, ఒక గ్రంథము వ్రాసిరి, ఈ విధముగా వీరికి విదేశ పర్యటనజేయు సదవకాశమును భగవంతుడనుగ్రహించెను.
1963వ సం.లో ‘ఆంధ్ర విశ్వవిద్యాలయము’ వారు వీరి విద్యా ప్రౌఢిమను గమనించి అధ్యాపకునిగా ఆహ్వానించిరి. అక్కడే 1969లో విశ్వవిద్యాలయాధిపతిగా పనిచేసిరి. 1976లో పదవీ విరమణగావించి, మరల కాశీ విద్యాపీఠమువారు వారణాశిలో అధ్యాపకులుగా నుండనాహ్వానింపగా ఇట్లు 1970వ సం. పూర్తి విరామమెరుగక కృషిచేసి, తుదకు బెంగళూరులో తమ స్వగృహమునందు స్థిరపడిరి. ఈ విరామ సమయములందు కూడా వీరప్పుడప్పుడు బెంగళూరు యూనివర్శిటీ వారిచే తాత్కాలిక అధ్యాపకులుగా నుపన్యసించుటకాహ్వానింప బడెడివారు.
శ్రీ మూర్తి వర్యులు సంస్కృత భాషపై అభినివేశము సంపాదించిరి. అందులకు వీరి ‘హైందవ యుద్ధ మీమాంస’ అను గ్రంథమే దోహదకారియైనది. వీరు సంస్కృతమున చిన్న చిన్న కథలను వ్రాసి సంస్కృత భవితవ్యం’ అను పత్రికలో ప్రకటించిరి. సంస్కృత పండితుల ఆదరణ పొందిరి.
శ్రీ మూర్తిగారి కొన్ని ఆంగ్ల గ్రంథములు ఎం.ఏ., పరీక్షకు పరిశీలనా గ్రంథములుగా ఎన్నిక చేయబడినవి, వాటిలో కొన్ని
1) Principles of Labour Welfare
2) Beggers’ Problem
3) Philosophy Friends of Social Work.
4) Work participation in Welfare
5) Social Action.
మొదలైనవి. ఇంకనూ వీరు కొన్ని పుస్తకములను వ్రాసి, ప్రకటింపబోవుచున్నారు. అనంతపురము వదలిన తరువాత వీరి రచనా వ్యాసంగమంతయు ఆంగ్లమునందే అధికముగా జరిగినది. ఈ విషయము వీరిని ప్రశ్నించగా వారిట్లు జవాబిచ్చిరి.
‘‘అనంతపురము వదలిన తరువాత తెనుగులో వ్రాయుట మానివేసితినని చెప్పుటకు లజ్జించు చున్నాను. ఇప్పుడు కేవలము సంస్కృతాధ్యయవమే నాకు పరిపాటియైనది. ఇంగ్లీషు రచనయే అనివార్యమైనది. అనంతపురమునందు వ్రాసి ప్రచురించిన కొన్ని ఖండికలే తప్ప మఱల నేనేమియు వ్రాయలేదు. ఆ ప్రచురణలే నన్నొక తెనుగు కవిగా సాహిత్య లోక మాదరి౦చినది. తెలుగు కవినని చెప్పుకొను సాహసము నాకులేదు.
‘కవికుమార సమితి’ వెలువరించిన ఖండకావ్యములు రెండు. మొదటిది ‘తొలకరిచినుకులు’ రెండవది క్రొక్కాఱు మెఱుగు’ ఈ రెండునూ, కవి కుమారులైన శ్రీ వెల్లాల ఉమామహేశ్వరరావు శ్రీ మరం వాసుదేవమూర్తి, శ్రీ పాళ్ళూరు సుబ్బణాచార్యలు వ్రాసినారు. కళాశాల కులపతులైన డాక్టర్ చిలుకూరి నారాయణరావుగారు ఈ కవికుమారుల నిట్లు సంబోధించిరి.
కవికుమారకులార – కదలి రండయ్య
కన్నుల పండువై – కనిపించె జగతి
తొలకరి మాలక్ష్మి – తొంగి చూచింది
తొల్లింటి తాపము – తొలగి పోయింది
కాపు పాటలలోన – కలదురా తీపి
కాపు చేతులలోన – కలదురా లచ్చి
కాపు మాటలలోన – కలదురా తీపి
కాపు మానసములో – కలదురా తేట
కాపు పాటలు మెచ్చి – కాపు చేతల జొచ్చి – కాపు మాటల జొక్కి
కవికుమారకులార – కదలి రండయ్య
కాపు కైతల గూర్చి కలసి పాడుదము
శ్రీ మూర్తిగారిని గూర్చి కీ.శే. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిట్లు తమ అభిప్రాయములను వ్రాసిరి.
‘శ్రీమూర్తిగారు కవనమందు చెప్పవలసిన మాటనేదో యొక క్రొత్త తీరున జెప్పుదురు. గంభీరమైన యోచనలు, అపూర్వమగు పోకడలు, విరర్గళమగు మత్సాహము, వీరి రచనలలో కలదు’ వాడిని ఒక శుష్క పుష్పమును గూర్చి శ్రీ మూర్తిగారిట్లు వాపోయిరి.
సీ. మొగ్గయై పెఱిగిన – మొదలగు క్రొంబువ్వుగా
బ్రేమపెంచిన తల్లి – రెమ్మ యేడ
మకరందమును బొంద – మధురంబుగా బాడు
నెలతేటి బయకాండ్ల – బలగ మేడ
చల్లతెమ్మెర వల్ల – నెల్లతావుల గొల్ల
గా విలసిల్లు నీ – తావు లేడ
చేత నంటిన యంత – జెడి వాడి జెందెడి
లలిత తావక కోమ – లత్వ మేడ
గీ. పూర్వ వైభవంబుల నెల్ల బోవ నాడ
నీకు గలిగినే చెల్లబో – నీదు జాడ
యెఱుగ నయ్యెను పుష్పమా యీవునాడ
స్వల్పజీవికాదె మనోజ్ఞ – వస్తు నేడ
తానే బ్రహ్మదేవుడై యున్నచో యిట్టి స్వల్పజీవుల కెల్లరకును నిండుకాలము ఆయువు పోసియుందునని కవిగారు ధైర్యముగా ‘అజడనైతే’ అను శీర్షికలో వ్రాసుకొనిరి.
ప్రాణములు వోయగల యట్టి యజుడనైన
బసరు టాకుల తెరలలో ముసిముసి నగి
పదవడి మలిన స్థండిల పతితమై, కృ
శించు, మృదుల పుష్పము చిరంజీవిజేతు
తదుపరి కవిగారు అందమైన వస్తువు లతిశీఘ్రముగా హతమారుటకు గల కారణము లేవియో తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. కవిగారు ‘తల్లీ, బిడ్డ’ అను ఖండికలో తల్లి తన బిడ్డ నిట్లు ఓదార్చు చున్నది.
ఉ. కంటిర నిన్ను నా కడుపు కష్టమునొరిచి పెంచినానురా
చంటిని చేపి నాయెడద చల్లగ, చెల్లగ నాదు కోరికల్
మంటివిరా విరాకులపు మన్కి జగాల జయించునట్టి నా
యింటి వెలుంగి యశ్రులు వహింపకు, కాంచి సహింపలేనురా
ఇట్లు వీరి పద్యములు చక్కని భావ ప్రయుక్తములై వ్రాయువెలసినవి.
శ్రీమూర్తిగారి భార్య శ్రీమతి నీరజాదేవి. ఈమె సంగీత సాంప్రదాయ మెరిగిన కుటుంబము నుండి వచ్చిన యువతి, తండ్రిగారి వద్ద వీణవాయించుట, చక్కగా, గానము చేయుట నేర్చుకొన్నది.
ఆమెగారి ప్రోత్సాహము శ్రీమూర్తిగారికి పూర్తిగా లభించినది. వీరు అన్యోన్యానురాగ దంపతులు వీరు అతిథి అభ్యాగతుల నాదరించు సహృదయులు వీరికిద్దరు పుత్రులు, అంబరీషరాజా, నహుషరాజా అను ముద్దు పురాణ పురుషులపేర్లు పెట్టరి. ప్రస్తుతము వీరు బెంగుళూరు నగరమున నివసించు చున్నారు. వీరిని, వీరి కుటుంబమును, సర్వేశ్వరుడు సదా రక్షించుగాక.
రాయలసీమ రచయితల ను౦డి……
———–