పేరు (ఆంగ్లం) | Lanka Krishnamurthy |
పేరు (తెలుగు) | లంకా కృష్ణమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | దుర్గా లక్ష్మమ్మ |
తండ్రి పేరు | వెంకటరామప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 9/9/1925 |
మరణం | – |
పుట్టిన ఊరు | పెనుకొండ, అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | బి.యస్.సి.; బి.యల్. |
వృత్తి | హైకోర్టునందు డిప్యూటి రిజిస్ట్రారు |
తెలిసిన ఇతర భాషలు | హిందీ, కన్నడ, ఆంగ్లము, సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | దానయజ్ఞము, తాయగ శిల్పము, శ్రీవిలాసము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | లంక కృష్ణమూర్తి |
సంగ్రహ నమూనా రచన | శ్రీ లంకా కృష్ణమూర్తిగారు రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందినవారు. వీరు ఉద్యోగరీత్యా 1950 నుండి కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరమైన బెంగళూరులో హైకోర్టునందు డిప్యూటి రిజిస్ట్రారుగా పనిచేయుచున్నారు. వీరు సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేయగల దిట్టలు. హిందీ, కన్నడ, ఆంగ్లభాషలెఱిగి అందభిమానము, అభినివేశము కూడ గలవారు. కన్నడ దేశపువారికి తెనుగుసాహిత్య సౌరభముల నందించిన ఆంధ్రులలో వీరొక్కరు. |
లంక కృష్ణమూర్తి
శ్రీ లంకా కృష్ణమూర్తిగారు రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందినవారు. వీరు ఉద్యోగరీత్యా 1950 నుండి కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరమైన బెంగళూరులో హైకోర్టునందు డిప్యూటి రిజిస్ట్రారుగా పనిచేయుచున్నారు. వీరు సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేయగల దిట్టలు. హిందీ, కన్నడ, ఆంగ్లభాషలెఱిగి అందభిమానము, అభినివేశము కూడ గలవారు. కన్నడ దేశపువారికి తెనుగుసాహిత్య సౌరభముల నందించిన ఆంధ్రులలో వీరొక్కరు. బెంగుళూరులోని ‘తెలుగు సాహితీ సమితి’కి వీరుపాధ్యక్షులు. వీరి తెలుగు ఉపన్యాసములు, కవితలు, బెంగళూరు ఆకాశవాణినుండి ప్రసారము చేయబడినవి. కన్నడ ప్రాంతమున జరుగు తెనుగు సాహిత్యసభలలో, అవధాన క్రియలలో వీరికి ప్రథమస్థానముకలదు.
శ్రీ కృష్ణమూర్తిగారు మద్రాసు యూనివర్సిటీ బి.యస్.సి. పరీక్షలో ఉత్తీర్ణులై, తదుపరి యూనివర్సిటీలో బి.యల్. పట్టమునొందిరి. 1950 నుండి – 59 వరకు వీరు న్యాయవాదులు. తరువాత కర్ణాటక హైకోర్టులో డిప్యూటి రిజిస్ట్రారు పదవిని చేబట్టిరి.
ఈ కవిగారి ‘దానయజ్ఞము’ 1956 లో ముద్రింపబడినది. ఇందులో కరుణాప్రేరితమగు దానమత్యుత్తమ మనియు. దానిని యజ్ఞముగా నాచరించినచో నేటి మానవడున్నత స్థానమునందుటకవకాశమేర్పడగలదనియు చెప్పిరి. ఇందు భారతమందలి సక్తుప్రస్థ చరిత మితివ్రిత్తముగా గ్రహింపబడినది. ధర్మరాజు గావించిన అశ్వమేధయాగమును కవిగారిట్లు వర్ణించిరి.
సీ. యజ్ఞమంత్రములకుఁ బ్రాజ్ఞభూసురశాస్త్ర
చర్చ, వ్యాఖ్యను సమకూర్చుచుండ;
భూసురాశీర్వాదములకు, రాజన్యుల
జయనినాదంబులు జయమునొసఁగ;
హోమధూమములతో నొక్కటైయరుదగు
ధూపముల్ క్రొత్తావి జూపుచుండ;
దగజెప్పు పనసల ధాటికి మంగళ
తూర్యశబ్దంబులు తోడ్పడంగ;
గీ. ధర్మజుడొనర్చు నశ్వమేధమ్మువింత
చెలువముల గల్గి యెల్లర చిత్తములను
వివిధరీతుల జెలగించె, వేడుకలకు
మేర లేదయ్యె; నెల్గెడ శ్రీరహించె
శ్రీకవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారీ కృతిని పరిశీలించి తమ యభిప్రాయముల నిట్లు వెల్లడించిరి.
‘…………….. వీరికి సంస్కృతాంధ్రములయందు చక్కని పాండిత్య కలిమియు, పద్యరచనాకౌశల్యము కలదని గ్రంథము వలన దెలియుచున్నవి. ఇంతటి రచనా శక్తితో వీరు మహాకావ్య రచనము చేయగలరు. అట్టి కావ్యరచన కిక గడంగుదురని, యాశించుచున్నాడను’.
కవిసామ్రాట్ గారు ఆశించిన విధముగనే శ్రీకృష్ణమూర్తి గారు 1958-59 సం.లలో ‘తాయగ శిల్పము’ అను మహాకావ్యమును వ్రాసిరి. అందు లేపాక్షి దేవాలయమును కట్టించిన విరుపణ్ణ కథ వ్రాయబడినది. విరుపణ్ణ కళాయోగమున జీవన్ముక్తుడగుట విపులముగా వర్ణింపబడినది. అతడు యోగసిద్ధుడగుటచే తన కన్నులను తానే త్యాగము చేయగలిగినాడు. కళాయోగమును వర్ణించుచు కవి ప్రేమ చైతన్యపు సమగ్ర స్వరూపము నీక్రింది పద్యమును వర్ణించినాడు.
సీ. విష్ణుపదోద్భూత విమల మందాకిని
దేవ లోకాలకు దీప్తినిచ్చి
శివజటాజూట రంజిత సుస్థితినిగాంచి
ఆవేశమున భూమి కట్టెదుమికి
సాగరంబులనింపి జగతి నోముచునుండి
జీవకోటికి నెల్ల జీవనమిడి
నృష్టిస్థితుల మూలపుష్టియై యొప్పిన
ముద్రబంధమునకు బొదిగియుండి
గీ. ఆస్థిరంబగు జగతి లయంబునందు
వేళ శివనాట్య చలితమై వేలమీరి
పొంగి తేజోమరుద్భావములను బొంది
విష్ణు పదమందు గంగయై ప్రేమవెలయు
ఇటిట ధ్వని మయములగు శిల్పములీ కావ్యము నందచ్చటచ్చట గలవు. దేవాలయ నిర్మాణమును వర్ణించునీ క్రింది పద్యము కవిగారి స్రౌడ రచన కొక యుదాహరణము.
చీల్చుచుఁ జీల్చుచు జనగఁ జేతికి లొంగెను గండశైలముల్
తొల్చుచుఁ దొల్పుచు జన గతుల్ గని రూపముల ధరించుచు
మల్చుచు, మల్చుచు జనగ నవ్యవిలాసము బెంచుచు శిలల్
నిల్చుచు నిల్చుచు గనియె నిశ్చల నిత్య సురాలయస్థితి.
ఈ కావ్యము త్వరలో ముద్రింపబడుగాత
వీరి రెండవ ముద్రితకృతి ‘శ్రీవిలాసము’ దీనిని రాయల కళాపరిషత్తు – మడకశిర వారు ముద్రించిరి. ‘శ్రీ’యన్న పదమునకు సర్వసాధారణముగా ఎల్లరూ ధనమును అర్థమునే గ్రహించినారు. కాని వేదమున నీపదమున కుద్దేశించిన యర్థము వేరు. యర్థమును వివరించుటకే శతకము ప్రవృత్తమైనది. ఇందెటిట కథా వస్తువును లేదు.
‘కవి తాను వివరింపదలచిన ధర్మ రహస్యమును సూటిగా, సులభముగా, అర్థవంతములైన పదములతో, జాతీయములైన నుడికారములతో హృదయంగమములైన లోకోక్తులతో వివరింపగల్గెను. ఇదియే శతకమునకు కావలసినది. గుణములన్నియూ ఈ శతకమునకు గలవు’ అని శ్రీరూపావతారం నారాయణశర్మ గారు కృతియందు తమ అభిప్రాయమును వెల్లడించినారు. ఈ శతకమునకు కవిగారెట్టి మకుటము నుంచలేదు. దీనిని ధర్మప్రబోధకముగా నెంచవచ్చును.
‘శ్రీ’ యొక్క కూపమును, సుగుణములను కవిగారిట్లు తెల్పుచున్నారు.
శాంతి, ముదము, సత్యనంధత, ధైర్యంబు
దమము, తృప్తి, సమత, దైవభక్తి
భూతదయ, విశాలబుద్ది, ధర్మశ్రద్ధ
మున్నుగాగ సుగుణములును నీవ
ప్రతిభ, కవిత, వాక్పటుత, కార్యకౌశల
మందు, కళలయందు నభిరుచియును
నైపుణ్యంబు, విద్య, రూపంబు, శక్తియు
నీదు రూపులుగ గణింతు నేను.
ధనము కొరకు బండచాకిరి చేసెడి పేదలను, నిశ్శక్తుల కష్టములను జూడమని కవిగారు ‘శ్రీలక్ష్మి’ కిట్లు నివేదించుకొనుచున్నారు.
సీ. ఎప్పుడో విధిలేక నప్పుసేసిన నద్ది
పెరుగుచుండగఁ దీర్ప వెనవులేక
ఋణదాత కోరినరీతిఁ బత్రంబుల
వ్రాసియిచ్చుచు వాని దాసులగుచు
కొనకు వాడాస్తులెల్లను దోచుకొని పోవ
నాలుబిడ్డల సాక వీలుగాక
కలవర మందు కంకాళ రూపులఁజూడు
మమ్మ లక్షలకొద్ది యగపడెదరు
గీ. మేని చెమటలూడ్చి వూనికసేవింప
గూలి యివ్వ తిట్టు కొనెడివారి
యడుగు లాశ్రయించి కడుపుకై మానంబు
వీడిబ్రతుకు వారిఁజూడుతల్లి
కన్నడ సాహిత్యమునకు వీరొనరించిన కృషి కడు ప్రశంసింపదగినది వీరి కలమునుండి వెలువడిన ‘కొడెయగోపాల’ కన్నడ నవల ప్రస్తుతము కన్నడప్రభ దినపత్రికలో ప్రతిదినము ధారావాహికగా వెలువడుచున్నది. ‘త్యాగశిల్పి’ కన్నడ నాటకము, ‘అత్తెయ ఎత్తర’ కన్నడ ప్రహసనము. వీరి అముద్రిత రచనలు.
శ్రీలంకా కృష్ణమూర్తిగారు నిరాడంబరులు. బిరుదములకు సన్మానములకు ప్రాకులాడు స్వభావము వారికిలేదు. ఇతోధికముగ సాహిత్య సేవ చేయుట వీరి ప్రధానాశయము. తమ ‘శ్రీవిలాసము’ను రాయలకళాపరిషత్తునకు సర్వహక్కులతోబాటు, ముద్రణకగు ఖర్చులనుకూడ నొసంగి తమ నిస్వార్థ సారస్వత సేవను ప్రకటించుకొనిరి. కవిగారుత్తరోత్తర తమకుగల సంస్కృతాంధ్ర, కర్ణాటక భాషాపాండిత్య ప్రతిభలతో అమూల్యగ్రంథములను రచించి కర్ణాటకాంధ్ర కవిశేఖరులుగా విఖ్యాతి నొందుదురు గాక.
రాయలసీమ రచయితల నుండి….
———–