పేరు (ఆంగ్లం) | Kalachaveedu Srinivasacharyulu |
పేరు (తెలుగు) | కలచవీడు శ్రీనివాసాచార్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | నరసమ్మ |
తండ్రి పేరు | వెంకటాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 3/30/1911 |
మరణం | – |
పుట్టిన ఊరు | ప్రొద్దుటూరు జిల్లా, కడప |
విద్యార్హతలు | విద్వాన్ మరియు పి.ఒ.యల్. |
వృత్తి | ఆంధ్రోపన్యాసకులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పరివర్తన, ఆసియాజ్యోతి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కలచవీడు శ్రీనివాసాచార్యులు |
సంగ్రహ నమూనా రచన | ‘కలచవీడు’ అనంతపురం జిల్లాలో పేరెన్నిక గన్న పండిత కుటుంబము, ఈ కుటుంబీకులు స్వాతంత్ర్య సమరయోధులుగా, కవులుగా, పేరెన్నిక గన్నవారు. శ్రీ కలచవీడు వేంకట రమణాచార్యులు స్వాంతత్ర్య సమరయోధులుగా సుప్రసిద్ధులు, వీరి తమ్ములైన శ్రీ కలచవీడు శ్రీనివాసాచార్యులవారు కవులు, పండితులు, శ్రీనివాసాచార్యులవారు చాలాకాలము మదరాసు రాష్ట్రమునందు హిందూ ధర్మోపన్యాసములు గావించుచు కాలము గడిపినారు. 1935 నుండి ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సంస్కృతోపాధ్యాయులుగాను, బుక్కరాయసముద్రములో ఆంధ్రోపన్యాసకులుగాను పనిచేసిరి. |
కలచవీడు శ్రీనివాసాచార్యులు
‘కలచవీడు’ అనంతపురం జిల్లాలో పేరెన్నిక గన్న పండిత కుటుంబము, ఈ కుటుంబీకులు స్వాతంత్ర్య సమరయోధులుగా, కవులుగా, పేరెన్నిక గన్నవారు. శ్రీ కలచవీడు వేంకట రమణాచార్యులు స్వాంతత్ర్య సమరయోధులుగా సుప్రసిద్ధులు, వీరి తమ్ములైన శ్రీ కలచవీడు శ్రీనివాసాచార్యులవారు కవులు, పండితులు, శ్రీనివాసాచార్యులవారు చాలాకాలము మదరాసు రాష్ట్రమునందు హిందూ ధర్మోపన్యాసములు గావించుచు కాలము గడిపినారు. 1935 నుండి ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సంస్కృతోపాధ్యాయులుగాను, బుక్కరాయసముద్రములో ఆంధ్రోపన్యాసకులుగాను పనిచేసిరి.
వీరు తిరుపతి సంస్కృత కళాశాలలో చదివి వ్యాకరణ శిరోమణి పరీక్షలయందుత్తీర్ణులగుటయే కాక స్వయంకృషితో విద్వాన్ మరియు పి.ఒ.యల్. పరీక్షల యందుత్తీర్ణులైరి. వీరికి సంస్కృతాంధ్ర ఆంగ్లములందు చక్కని పాండిత్యముకలదు. అనర్గళముగా నుపన్యసించగలరు. వీరి రచనలలో ‘పరివర్తన’ ఒకస్వతంత్ర ఖండకావ్యము, ‘విరహి’ సంస్కృతానువాద కావ్యము. ‘ఆసియాజ్యోతి’ ఒక స్వతంత్రకావ్యము.
ఒక కలుషబుద్ధి తానుగావించిన యపరాధమునకు పశ్చాత్తప్తుడై ఒక యోగీశ్వరుని బోధామృతాస్వాదనమును పరమార్థముగా గ్రహించిన, కథానికయే ‘పరివర్తన’ కావ్యముగా అవతరించినది. దీని మూలకథ ఆంగ్లములో కలదు. దానిని గొనివెంచి, సరళమైన, సులభమైన తేటగీతములలో వ్రాసిరి. పరివర్తన మందలి భావములమోఘములు. ఇందు కథకంటెను భావములకే ప్రాధాన్యత నివ్వవలెను. ఇందలికొన్ని భావములను చూతుము.
చేరుకొన్నది, మామూలు – చిత్తవృత్తి
కలిసికొన్నది, పావనంతలన – రక్తి
కారుకొన్నది చోరసంఘ ప్రశక్తి
ప్రకృతి విడనాడ లేడయ్యెఁబామరుండు
వెలిగిపోయిన నతని హృద్వీధియందు
తీవ్రతర ముఖవర్చఃప్రదీప్తరుచులు
తేరిపోయిన దజ్ఞాన తిమిరసంఘ
మొక్కత్రుటికాల మాతని యుల్లమందు
తదుపరి వీరు కాళిదాస ప్రణీతంబైన సంస్కృత ‘మేఘసందేశ’ కావ్యమును ‘విరహి’ యనుపేర ఆంధ్రానువాదము గావించిరి. ఈ మేఘ సందేశమును పెక్కుమంది తెనుగులోనికి పెక్కుక్రియలలో అనువాదము గావించినారు. శ్రీనివాసాచార్యుల యనువాదములోని గొప్పఏది? అనునదియే ఆలోచింపదగిన విషయము. ఆలోచించినచో ఇంతవరకును సీసపద్యములలో లలితశైలితో సులభగ్రాహ్యమగు రీతిని తెనిగించినవారు అరుదు. కాళిదాసు భావము లెక్కడను చెడలేదు, వీరి ఆంధ్రానువాదము వింత గమనింతము.
సీ. పడతిరో, బవదీయ భర్తృసందేశమే
మది గొని వచ్చితి ముదముగూర్ప
నాప్తుడ, నీపతి కంబువాహుడ నేను
జగముల నెల్లడ సంచరింతు
గంభీరమోహన గర్జారవంబుల
బ్రోషిత భర్తృకాలోల జటల
విడిపింప దలపోయు విభుల, బురంబుల
కేగ నెప్పుడు ప్రోత్సహించు చుండు
గీ. ప్రణయ జనుల జేర్ప బాటుపడెడి వాడ,
నైజ మిద్ది ముదిత, నాకు కనుక
నీ ప్రియుండు నన్నె నీకడకంపెను,
కార్య సాధనమును గాంక్షజేసి,
ఆచార్యులవారి ‘ఆసియాజ్యోతి’ సర్ ఎడ్వి ఆర్నాల్డు, ఇంగ్లీషులో రచించిన రచన కనువాదము, ఇది బుద్ధుని చరిత్ర. వృషభగతి వృత్తములలో వ్రాసినారు. మాయాదేవి గర్భముదాల్చినది. నవమాసములు నిండినవి. ఆమె ఒకనాటిరాత్రి సుందరమైన స్వప్నముగన్నది. స్వప్నవేత్త లాస్వప్నఫలము నిట్లుతెల్పిరి.
‘‘కల మంచిదో – రాజ్ఞి కలశుభ ప్రదమమ్మ
కర్కాటకమ్ములో – గలవె భాస్కరుడిప్డు
సుతుజన్మ తథ్యంబు – సుగుణాంచితుడతండు
లోకకారక మహాప్రజ్ఞతో సర్వాతి
శాయి, మహిమాన్వితుండౌచు – ప్రభవిల్లెడివని
రాజ్యమే ఏలుచో – రాజాధి రాజాను
లేదింత నందియం బిదియ మా నిర్ణయము’’
సంస్కృత భాషలో ‘చక్రతీర్థ కోదండరామ సుప్రభాతము, లక్ష్మీ సుప్రభాతమును రచించిరి. ఇవి అముద్రితములు.
ఈ కవిగారికి నలుగురు కుమారులు, ముగ్గురు పుత్రికలు గలరు. వీరందరును పరిపూర్ణ విద్యావంతులు. వీరిని, వీరి కుటుంబమును, సర్వదా సర్వేశ్వరుడు రక్షించుగాత.
రాయలసీమ రచయితల నుండి…..
———–