పేరు (ఆంగ్లం) | Pamidikalva Chenchu Narasimha Sharma |
పేరు (తెలుగు) | పమిడికాల్వ చెంచు నరసింహశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | మంగళాంబ |
తండ్రి పేరు | చెంచు సుబ్బయ్యశర్మ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/19/1919 |
మరణం | – |
పుట్టిన ఊరు | పెనగలూరు – రాజంపేట తా. కడప జిల్లా |
విద్యార్హతలు | ఆంధ్రభాషావిశారద, విద్వాన్ |
వృత్తి | తెలుగు పండితులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నయనాధీశ శతకము, ఆంధ్ర భగవద్గీత, ఆంధ్ర సౌందర్యలహరి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పమిడికాల్వ చెంచు నరసింహశర్మ |
సంగ్రహ నమూనా రచన | రాయలసీమలో వెలుగు మొగము చూడక పల్లెలందే అడగియుండిన కవిరత్నములెందరో కలరు. వారిలో శ్రీ చెంచు నరసింహశర్మగారొకరు. ఈ కవిగారు నిరాడంబరులు, నిష్కపటులు. పల్లెవాసుల పసిడి హృదయము వీరిది. వ్యవసాయము చేసుకొనుచు పోతనవలె కాలము వెళ్ళబుచ్చినవారు పండ్రెండవ యేటనుండియే, వీరికి కవిత అలవడినది. సంగీతము, జ్యోతిషము, మంత్రశాస్త్రము, వైద్యము మున్నగు వాటియందు వీరికి మంచి ప్రవేశము కలదు. |
పమిడికాల్వ చెంచు నరసింహశర్మ
రాయలసీమలో వెలుగు మొగము చూడక పల్లెలందే అడగియుండిన కవిరత్నములెందరో కలరు. వారిలో శ్రీ చెంచు నరసింహశర్మగారొకరు. ఈ కవిగారు నిరాడంబరులు, నిష్కపటులు. పల్లెవాసుల పసిడి హృదయము వీరిది. వ్యవసాయము చేసుకొనుచు పోతనవలె కాలము వెళ్ళబుచ్చినవారు పండ్రెండవ యేటనుండియే, వీరికి కవిత అలవడినది. సంగీతము, జ్యోతిషము, మంత్రశాస్త్రము, వైద్యము మున్నగు వాటియందు వీరికి మంచి ప్రవేశము కలదు. చిన్నతనమునుండి వీరికి పోతన భాగవతమన్న ప్రాణము. ఆ మహాకవి వీరికాదర్శమూర్తి. అతని వలెనే వీరును సహజ పాండిత్య శోభితులు.
స్వయంకృషితో ఆంధ్రభాషావిశారద, విద్వాన్ పరీక్ష, ముగించి తెలుగు పండితులుగా పనిచేసిరి. తమ గ్రామమందే వెలసియున్న నయనాధీశ్వరునిపై ‘‘నయనాధీశ శతకము’’ ను రచించిరి. ఈ శతకమునకు జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మగారు పీఠికను వ్రాసిరి. ‘‘భావకుసుమావళి’’ వీరి మరొక ఖండకావ్యము. నవ్యభావ గర్భితములగు పద్యములిందు కలవు. ఇందలి ‘‘కాఫీదేవత, శిలావిలాపము, శుభాకాంక్ష, పోతన’’ మొదలగు ఖండికలన్నియు వివిధపత్రికలలో ప్రచురింపబడినవి;
‘‘ఆంధ్ర భగవద్గీత’’ – ‘‘ఆంధ్ర సౌందర్యలహరి’’ వీరికి పేరు తెచ్చి పెట్టిన గ్రంథరాజములు. శ్రీ మదాంధ్రభగవద్గీతశ్లోకముల నన్నింటిని ఈ కవిగారు తేనెలూరు తేట తెనుగులో తేటగీతి, కందములలో కడు సరళముగా నెల్లరు చదువుకొని అర్థము చేసుకొను రీతిలో అనువదించిరి. దీనిని చిత్తూరు జిల్లా యేర్పేడులోని వ్యాసాశ్రమమువారు తమ ప్రచురణగా ప్రచురించి భక్తుల కందించిరి. భగవద్గీతను, సాధన చతుష్టయ సంపత్తిగల వారందరూ సులువుగా చదువుకొనుటకు వీలుగా నుండునని శ్లోకములతోబాటు, తెనుగు పద్యములను కూడ చేర్చి ప్రకాశకులు ముద్రించిరి. ఈ భగవద్గీత అనువాద కార్యమును తిక్కన నుండి నేటి వరకెందరో కవులు గావించినను ‘‘ముక్తి సంపద యిడుగీత నెవ్వరెటు వ్రాసిన గ్రాలదె? సజ్జనాళిలోన్’’ అని శర్మగారు సమాధానము చెప్పుకొన్నారు.
వీరి ఆంధ్ర భగవద్గీతలోని అనువాద సరళిని కొంత చూతము.
తే.గీ. జాఱుచున్నది ధనువు – హస్తంబు నుండి
చర్మము దహింపబడుచున్న చందమయ్యె
మనసు విభ్రాంతి మయమగు, మాడ్కితోచె
నిలువజాల రథంబు పై – నిమ్మళముగ.
తే.గీ. ఎవడు ఫలకాంక్ష విడనాడి, ఈవ్వరార్ప
ణముగ నియత కర్మంబు లొనర్చు నాత
డబ్జ పత్రంబు నీటిచే నంటబడని
పగిది, దాకుడు వడడు పాపంబువలన
ఇట్లు వీరి రచన నిరాఘాటముగా, అతి సరళముగా, మృధుమధురముగా సులభశైలిలో సాగినది. ‘‘ఆంధ్ర సౌందర్యలహరి’’ వీరి మరియొక కృతి. ఇందలి కొన్ని పద్యములు భారతి మాసపత్రికలో ముద్రితములు. 1973 నవంబరు భారతి సంచికలో ప్రచురింపబడిన పద్యములలో ఒకదాని నిందు మచ్చునకు పొందు పరచడమైనది.
సీ. ఘల్లు ఘల్లని మ్రోయ కనకంపు గజ్జెల
మొలనూలు కటిభాగమున వెలుంగ
మదకరి కలభకుంభప్రాయ కుచభార
మున వంగి మైదీవ మరువు సూప
బ్రక్షీణ మధ్యంబు బరిణత శరదిందు
నిభ వదనంబును నీటు గులుక,
వరధనుశ్శరజాల – పాశాంకుశంబులు
కర చతుష్టయమున గ్రాలుచుండ.
తే.గీ. ద్రిపురవైరి – యహంకార దీప్తమూర్తి
విశ్వజనసంఘ నిత్యభావిత సుకీర్తి,
అలజగన్మాత యెవ్వేళ లందు మాకు
మించు దయతోడ సాక్షాత్కరించుగాత
శ్రీ చెంచు నరశింహశర్మ గారికి ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలరు. పెద్ద కుమారుడు శ్రీ పమిడి కాల్వచెంచుసుబ్బయ్య, అష్టావధానిగా ఆంధ్రదేశములో పేరు తెచ్చుకొన్నారు. లేపాక్షి ఓరియంటల్ కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేయుచున్నారు. రెండవకుమారుడు చెంచు సుబ్బనరసయ్య పెనగలూరు గ్రామమునందే తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. ఆదిశంకరాచార్యులవారి సౌందర్యలహరిని, భగవద్గీతను అనువదించి శ్రీ నరసింహశర్మగారు ధన్యతపొందిరి.
రాయలసీమ రచయితల నుండి….
———–