పేరు (ఆంగ్లం) | Burra Venkata Subrahmanyam |
పేరు (తెలుగు) | బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అపస్వరాలు, ఆఫ్రికా రంగంలో, ఎండమావులు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం |
సంగ్రహ నమూనా రచన | పోలీసు హెడ్డు కానిస్టేబుపని చేసి రిటైరయి రోణంకిలో మా భూముల వ్యవహారం చూసిపెట్తూ ఉండే మాధవరాయుడి కొడుకు అప్పలస్వామి మిలిటరీ యూనిఫార్ములో లోపలికి వచ్చి, టోపీ తీసి, నాకు నమస్కారం చేసి, ‘‘అయ్యా, నన్ను మరచిపోయారా?’’ అంటే వెంటనే పోలిక పట్టలేకపోయాను. మనిషి నల్లబడ్డాడు. మీసం తీసేసేడు. ఆ సాయంత్రం చూడలేదు కాని, మొన్నాడు అతను స్నానం చేస్తున్నప్పుడు చూస్తే కుడిచెవి వెనకాతలనుంచి వీపుమధ్యవరకూ సుమారు అంగుళంఅంగుళన్నర వెడల్పున నల్లత్రాచులా పెద్దమచ్చ. అదేమిటంటే, చచ్చిబతికేనన్నాడు |
బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం
పోలీసు హెడ్డు కానిస్టేబుపని చేసి రిటైరయి రోణంకిలో మా భూముల వ్యవహారం చూసిపెట్తూ ఉండే మాధవరాయుడి కొడుకు అప్పలస్వామి మిలిటరీ యూనిఫార్ములో లోపలికి వచ్చి, టోపీ తీసి, నాకు నమస్కారం చేసి, ‘‘అయ్యా, నన్ను మరచిపోయారా?’’ అంటే వెంటనే పోలిక పట్టలేకపోయాను. మనిషి నల్లబడ్డాడు. మీసం తీసేసేడు. ఆ సాయంత్రం చూడలేదు కాని, మొన్నాడు అతను స్నానం చేస్తున్నప్పుడు చూస్తే కుడిచెవి వెనకాతలనుంచి వీపుమధ్యవరకూ సుమారు అంగుళంఅంగుళన్నర వెడల్పున నల్లత్రాచులా పెద్దమచ్చ. అదేమిటంటే, చచ్చిబతికేనన్నాడు.
చిన్నతనంలో అప్పలస్వామి వాళ్ల నాన్నతో ఎప్పుడూ రోణంకినుంచి మాఊరు వస్తూఉండేవాడు. తొమ్మిది పదేళ్లు వచ్చేసరికి మాఊళ్లో మాతో ఉండిపోయి మాఇంటి పిల్లలతో స్కూలులో చదువుకుంటూనని పంతం పట్టి మాఇంట్లో ఉండిపోయాడు. ఏడెనిమిదేళ్లు మాతోనే ఉన్నాడు. నాలుగోఫారందాకా చదివేడు. ఆ తరువాత చదువుమీద ఆత్రుత పోయింది. ఇంతట్లో, పోలీసులో ఉద్యోగానికి చూసేవేళకి మాధవరాయుడు చచ్చిపోయాడు. అప్పలస్వామి పెద్ద అన్నగారు సర్కసు పెట్తే అందులో కొన్నేళ్లుండి ఊరూరా తిరిగేవాడు. అయిదారేళ్లు ఆ అన్నగారితోపాటు తనూ పోకిరీగా దేశసంచారం చేసేడు. యుద్ధం వచ్చింది. అప్పలస్వామి వెంటనే సిపాయిగా ప్రవేశించాడు. మొదటి సంవత్సరం అప్పుడప్పుడు కనిపించేవాడు. ఇంకా మనదేశపు పొలిమేరలలోనే ఉన్నానని చెప్పేవాడు. తర్వాత రెండుమూడేళ్ల వరకూ కనపడలేదు. శలవు పుచ్చుకుని ఇదే మళ్లీ రావడం అని చెప్పేడు.
అతను వచ్చిన మర్నాడు సాయంత్రం మా ఆవిడ ‘‘విన్నారా, అప్పలస్వామి దొరసాన్ని పెళ్లిచేసుకున్నాడట’’అంది. ‘‘వాడిముఖం ఎవరు చెప్పేరు?’’ అంటే, ‘‘నౌకరు గురువులు చెప్పే’’డంది. చిన్నతనం నుంచీ అప్పలస్వామిని వేధించుకు తినడం గురువులికి అలవాటు. అలా వేధించుకుతింటున్నా గురువులంటే అప్పలస్వామికి అత్యంతమైన అనురాగమూ, గౌరవమూను. గురువులుని పిలిచి అడిగేను. ‘‘నిజమే బాబూ, ఆదొరసానిముండదీ, చిన్నపిల్లాడిదీ కూడా పోటోగ్రాపొకటి పెట్లో దాచుకున్నాడు’’ అన్నాడు గురువులు. ‘‘అప్పలస్వామిజీతానికి దొరసానిపెళ్లాం కూడానా?’’ అంటే ‘‘అదేటిబాబూ, అలా అంటారు? అప్పలస్వామికి అన్నీ నేరుస్తే రెండోందలుదాకా ముట్తాయట’’ అన్నాడు గురువులు.
ఇంతట్లో అప్పలస్వామే హాజరయాడు.
‘‘ఏమిటోయ్, అప్పలస్వామీ, ఎవర్తెనో దొరసాన్ని పెళ్లి చేసుకున్నావట?’’ అన్నాను.
‘‘దొరసానీ లేదు, పెళ్లీ లేదు బాబూ’’
‘‘మ రాఫోటోగ్రాపేటి?’’ అన్నాడు గురువులు.
‘‘ఏదైనా పోటో ఉందేమిటోయ్, నీ దగ్గర ?’’
‘‘ఉంది, బాబూ’’
తీసుకువచ్చి చూపించాడు.
సముద్రపు ఒడ్డున ఒకావిడ చిన్న కుర్రాడిని ఏడాదైనా ఉంటుందో ఉండదో ఎత్తుకుని అతిహాయిగా నవ్వుతోంది. ఇరవై ఇరవైరెండేళ్లకిపై నుండవు ఆవిడకి. చాలా అందంగా ఉంది.
‘‘ఎవరోయ్, ఇది?’’
‘‘నాకూ తెలియదు, బాబూ. అంటే, సమంగా తెలియదు.’’
‘‘ఎవరో తెలియకపోతే, నీ చేతి కెలా వచ్చింది?’’
‘‘అదంతా ఒక పెద్ద కథ బాబూ. మీరు ఓపిక పట్టి వింటానంటే చెప్తాను.’’
మాధవరాయుడిలాగే ఇతనూను. కథ చెప్తానని కాని, సమాచారం చెప్తానని కాని మొదలుపెట్తే ఒక పట్టున ముగించడు. ఏదైనా చెప్తానంటే భయం.
‘‘ఆవిడెవరో చెప్పమంటే చెప్పక కథ చెప్తానంటావేమిటోయ్?’’
‘‘ఆవిడెవరో చెప్పడానికే కథ చెప్పాలి, బాబూ’’
‘‘అయితే చెప్పు’’
‘‘వినండి మరి…..
‘‘నేను చెప్పబోయేది ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో నిలవేసి అడిగితే సమంగా చెప్పనూలేను; చెప్పనూకూడదు. ఉత్తరాఫ్రికారంగంలో జరిగింది. నేను ఆఫ్రికా వెళ్లిన కొత్తలో జరిగింది. అప్పటికి నేను మూడు నాలుగు నెలలు మాత్రమే ఆఫ్రికాలో ఉన్నాను. ఎడారియుద్ధాలు. అపరిమితమైన ఎండలు, సుడిగాలులు. అకస్మాత్తుగా పటాలాలకి పటాలాలు ఇసుకలో కప్పబడిపోతే ఎవరికీ తెలియదన్నంత సుకధుమారాలు. తోవా తెన్పే లేని ప్రయాణాలు. ఒక్కొక్కప్పుడు వేలకు వేలమంది. ఒక్కొక్కప్పుడు నలుగురూ అయిదుగురూను. ఒక్కొక్కప్పుడు ఒక్కరే బయలుదేరడం. ఎడారిలో అన్నిరకాల ప్రయాసలున్నూ. పదిహేను ఇరవైమైళ్ల దూరంలో జర్మను ఇంజనీర్ల క్యాంపు ఉన్నదనీ, ఆ క్యాంపునుంచి బయలుదేరి వాళ్లు మా పటాలాల బాటలలో మైన్లు పాతుతున్నారనీ, వాళ్ల క్యాంపు ఎక్కడుందో చూసివస్తే చాలుననీ, ధైర్యం చాలితేనూ, వాళ్లు తక్కువమంది ఉంటేనూ వాళ్లని హతమార్చమనీ, మైన్లు కనిపిస్తే వాటిని వ్యర్థపరచమనీ మాకు హుకుము. మాలో నలుగురికి వప్పచెప్పేరు ఈపని. చీకటిపడ్డాక అందరూ ఒక్కతోవని వెళ్లినాసరే, వేరు వేరు తోవలు తొక్కినాసరే అన్నారు. వేరువేరుగా వెళ్తేనే సుళువు అనుకున్నాము.
చిన్నప్పుడు చెప్పే కథలలో రాజుగారి కొడుకులు బయలుదేరినట్టు నలుగురం నాలుగుదిక్కులకీ బయలుదేరేము, బాగా చీకటి పడ్డాక. ఒక రోజుకి సరిపోయే తిండీ, నీరూ పుచ్చుకుని బయలుదేరేము.
రెండుమూడుసార్లు నాకు వెలతురు కనపడడం, దాగిదాగి దానిదగ్గరకు చేరడం, ఒకచోట అది కాలిపోతున్న విమానం అవడం, మరోకచోట జర్మనులు విడిచిపెట్టిపోతూ మంటపెట్టిపోయిన యుద్ధసామగ్రి అవడం సంభవించింది. ఎన్నిమైళ్లు అలా నడిచానో నాకే తెలియదు. అర్థరాత్రి అయినా ఆకాశంమీద విమానాలహోరు అలాగే ఉంది. ఫిరంగిధ్వనులు ఉండి ఉండి ఎడారిని కంపింపజేస్తూనే వచ్చాయి. తెలతెలవారుతూ ఉండగా ఒక గుడారమూ, లోపల దీపపు వెలుతురూ కనిపించాయి. మనుష్యుల గుసగుసలు వినిపించాయి. గుడారంసమీపంలోనే క చిన్న ఇసుక తిన్నె వెనుక దాగి, తుపాకీనుంచి వేళ్లు తియ్యకుండా చూస్తూ ఉన్నాను. చాలాసేపు ఇలా ఉన్నాను. ఇంతట్లో ఒకడు ఎక్కడనుంచో గుడారంలోకి ప్రవేశిస్తున్నాడు. సగంసగం వెలతురులో పూర్తిగా కనపడడమైనా లేదు. చటుక్కున అతను తిరిగి నేనున్న వైపుకి వస్తున్నట్టు అనిపించింది నిజంగానే దగ్గర కొస్తున్నాడు. అతని కోటుచేతిమీద హిట్లరుముద్ర కనిపించింది. ఒక్క క్షణంలో తుపాకీ పేల్చాను. కొయ్యలా పడిపోయాడు. నా తుపాకీపేల్పు వినగానే గుడారంలోనుంచి ఇద్దరు పైకొచ్చారు. ఒకడు రివాల్వరు పట్టుకున్నాడు. ఒకడు ఏమీ లేకుండా వచ్చాడు. వాడు రివాల్వరు పట్టుకున్నవాడు మరొకవైపు చూస్తూంటే వాడికి శవాన్ని చూపిస్తున్నాడు. రివాల్వరు పట్టుకున్నవాడికేసి తుపాకీ పేల్చేను. తప్పిపోయింది. మళ్లీ తుపాకీ పేల్చేను. రెండవవాడు చచ్చిపోయి పడ్డాడు నేను లేచి నుంచున్నాను. మిగిలినవాడు రివాల్వరు నాకేసి పెట్టి పేల్చబోతున్నాడు. ఇసుకతిన్నె వెనక్కి తప్పుకున్నాను. హఠాత్తుగా ఇసుకతిన్నెమీద కెక్కి తుపాకీ పేల్చాను. పేలుస్తూనే వాడిమీదకి గెంతేను. రివాల్వరుకూడా పేలింది. నాకుడిచేతికీ, శరీరానికీ మధ్య పేలింది. వాడిమీద పడ్డాను. నా కుడిచెయ్యి అంతా రక్తమయం. అతనికి నాతుపాకీదెబ్బ కడుపులో తగిలినట్టుంది. అతని బనీనంతా రక్తం. నే నతనిమీద వాల్తూనే అతని మెడ నాచేతులతో గట్టిగా పట్టుకున్నాను. అతను కదలలేదు. స్పృహతప్పి పడిఉన్నాడు. మెడ వదిలి అతని గాయమూ, నా గాయమూ పరీక్షచేసేను.
నాకంత దెబ్బ తగలలేదు. రివాల్వరుగుండు చేతికి రాసుకుపోయింది. అతనింకా కదలడం లేదు. అతని బనీను తీసి ఎంత దెబ్బో అని చూసేను. దెబ్బ కడుపులో తగలలేదు. పక్కగా నడుముకి తగిలింది. నేను బ్యాండేజి తీసి నా చేతికి కట్టుకుంటున్నాను. ఇంతట్లో అతను లేచి రెండు చేతులతోనూ నా మెడ పట్టుకున్నాడు. రివాల్వరు అతని కాళ్లవైపుంది. నా మెడ పట్టుకుని లేవబోతున్నాడు. రివాల్వరు తీసుకుని అతని రెండు కాళ్ల పిక్కలమీదా పేల్చేను. నా మెడ మీద పట్టు తగ్గింది. విడిపించుకున్నాను. తిరిగి చూసేసరికి నా మొలలో కత్తి తీసి నన్ను పొడవడానికి ప్రయత్నిస్తున్నాడు. రివాల్వరు వాడి గుండెకి పెట్టి పేల్చబోయాను. కత్తి అవతల పారేసి రెండు చేతులూ పైకెత్తేసేడు.
మనిషిముఖంకేసి ఇప్పుడు చూసేను. ముఫ్పై ఏళ్లూంటాయేమో. మంచి కళాకాంతులున్న ముఖం.
రివాల్వరూ, కత్తీ, తుపాకీ అన్నీ తీసి దూరంగా పెట్టేను. కాళ్ల పిక్కలమీద తగిలిన గుండుదెబ్బలతో ఇక అతను కదలలేడని నాకు తెలుసును. నాచేతి బ్యాండేజి సరిగ్గా కట్టుకున్నాక, అతని నడుముమీది గాయం నీళ్లతో కడిగి, మందుపోసి, బ్యాండేజి కట్టేను. నడుముచుట్టూ తిప్పేసరికి నాదగ్గర బ్యాండేజిగుడ్డ అయిపోయింది. అతని కాళ్లకి అతని బనీనే చింపీ బ్యాండేజి కట్టేను. అంతసేపూ నాకేసి తీక్షణంగా చూస్తున్నాడు. అంతా అయాక లేచికూర్చునేందుకు ప్రయత్నం చేసేడు. నడుముకి ఉన్న బ్యాండేజితో కూర్చోలేకపోయాడు.
ఒక్క చేతిమీద ఒక్క క్షణం ఆనుకుని ఎక్కడలేని ఆగ్రహంతోనూ ముఖం చెదిరిపోతూ, చటుక్కున నాముఖంమీద ఉమ్మేడు.
నేను తుడిచేసుకున్నాను.
కోపంతో అతని ముఖం కందిపోతోంది. కోపంతోనూ, దుఃఖంతోనూ
నీళ్లబుడ్డికేసి చూపిస్తూ నీళ్లు కావాలని సంజ్ఞచేసేడు. ఎడారిలో తిండైనా లేకుండా ఉండగలంకాని నీళ్లు లేకుండా ఉండలేము. నీళ్లే ప్రాణం. ఒక్కొక్కరికి రోజుకి ఇన్ని గ్లాసుల నీళ్లని నియమం.
తాగడానికి నీళ్లిచ్చాను. నీళ్లు తాగి కళ్లు మూసుకున్నాడు. ఎత్తుకుని గుడారంలోకి తీసుకువెళ్లేను. నామెడచుట్టూ చేతులు కట్టుకున్నాడు. గుడారంలో పెద్ద పెద్ద గుండ్లూ, ఇతరసామగ్రీ కనిపించాయి. అందులో సాధారణంగా మేము రోడ్లలో తవ్వితే కనపడేమైనల్లలా కూడా కనిపించాయి కొన్ని. ఇది జర్మను ఇంజనీర్ల క్యాంపే అయియుండాలని నిశ్చయించుకున్నాను. కాని ఈ మనిషిని లోపల పడుకోపెట్తే ఏమి అల్లరి చేస్తాడో అని భయపడి మళ్లీ అతన్ని పైకి తీసుకువచ్చి, పడక పైకి తెచ్చి అతన్ని దానిమీద పడుకోపెట్టేను.
శవాలకి గొయ్యిలుతీసి పక్కగా పాతిపెట్టేను. గుడారంలోపలికి వెళ్లి ఈసారి పరీక్షగా చూసేను. అక్కడున్న సామగ్రీ, తంతూ చూస్తే మైన్లు రిపేరు చేస్తున్నట్టు అనిపించింది. ఒకమూల ఒక రేడియో సెట్టుంది. పదిపన్నెండు పెట్రోలుతో నిండిన టిన్నులున్నాయి. రెండు తవ్విపైకితీసి విప్పేసిన పాతమైన్లలా ఉన్నాయి. వీటి రెండిటినైనా కాల్చేసి నిరుపయోగకరంగా చెయ్యాలని నిశ్చయించుకున్నాను. దూరంగా ఒక గొయ్యి తీసి వీటిని అందులో పాతి పెట్రలు పోసి అంటించాలి. గునపం లాంటిది ఆసామగ్రిలో కనిపిస్తే దాన్ని పట్టుకుని వెళ్లేను. అతను నాకేసి ఒకటే ధోరణిగా చూస్తున్నాడు. కొంతదూరం నడిచేసరికి అక్కడికి కొంత దూరంలో ఎడారిలో చిన్న చెరువు తవ్వినట్టు నాలుగు గట్లు కనిపించాయి వెళ్లి చూసేను. కాన్వసుగుడ్డ కప్పిఉంది. క్రింద ఆప్రదేశంనిండా మైన్లు. ఒకదానిమీదొకటి, ఒకదానమీదొకటీను. చక్కగా పేర్పబడి ఉన్నాయి. ఏమి చెయ్యడమా అని ఆలోచించి, గుడారంలో ఉన్న రెండు పాత మైన్లనీకూడా వాటితో చేర్చి, పెట్రోలున్నులు తెరిచి వాటిమధ్యపేర్చేను. ఒక పెరటోలుటిన్ను అంటించి పరుగెత్తుకువచ్చేసేను. ఘోరమైన మంటలున్నూ, పగులుతున్న ధ్వనులూను చటుక్కున ధ్వనులు హెచ్చేయి. బాంబులు పడుతున్నట్టనిపించింది. నుంచున్నవాడిని గుడారంఓరని నేలకు జేరి పడుకున్నాను. కాసేపటికి అతన్నికూడా తెచ్చి అక్కడ పడుకోపెట్టేను. ఉండిఉండి ఫిరంగులు పేలినట్టు చప్పుడు. మంటూ ఎర్రగా కాల్తున్న ఇనుపముక్కులు మాదగ్గరలోకూడా వచ్చిపడ్డాయి. నే నింకా ఏమిటో ఆలోచిస్తున్నాను. ఇంతట్లో అతను ఎలాగో పాకి గుడారంలోకి తల పెట్టి రేడియోసెట్టుతో ఏదో చేస్తున్నాడు. తెలివితక్కువగా చూస్తూ ఉరుకున్నాను. అతను ఏదో మాట్లడడం మొదలుపెట్టేడు. అప్పటికి బోధపడింది నాకు అతను ఎవడితోనో రేడియోసెట్టుతో మాట్లాడుతున్నాడని. చటుక్కున వెళ్లి రేడియో సెట్టుమీద గునపంపోటు వేసేను. సెట్టు బద్దలయి ఊరుకుంది. నన్ను జర్మనుభాషలో తిట్టడం మొదలుపెట్టేడు. ఇంగ్లీషులో ‘యు, నిగ్గర్’ అని రెండుమూడుసార్లు అరిచాడు. నేను మాట్లాడలేదు. జోళ్లు తీసి నాకేసి విసిరేడు. నేను పక్కకి ఒరిగి తప్పించుకున్నాను. చేతితో ఇసుక తీసి నామీద కొట్టడం మొదలుపెట్టేడు.
నన్ను ‘నిగ్గర్ అని తిట్టినతర్వాత, నా బదులు ఒక ఇంగ్లీషుసోల్జరే ఇతనిని పట్టుకున్నట్టయితే ఇతను ఈవిధంగా ఇంత కుర్రతనంగానూ ప్రవర్తించియుండునా అన్న సందేహం నాకు కలిగింది. ఇంగ్లీషువాడే నాబదులు ఇక్కడుండుంటే ఇతనిలా మీద ఉమ్ముతుంటేనూ, కసురుతుంటేనూ, జోళ్లు విసురుతుంటేనూ నా అంత నెమ్మదిగానూ ఊరుకుండి ఉండునా అనికూడా ఆలోచించాను. మా పటాలంలో నాఅంత కోపిష్ఠి లేడని నాకు ప్రఖ్యాతి. ఎదురుమాటంటే సమయం చూసుకుని ఎముకులు చితక్కొట్టేనన్నమాటే. నన్ను చూస్తే తోటివాళ్లందరికీ భయం. అటువంటిది ఇతని ప్రవర్తన చూసికూడా పిల్లిలా ఊరుకోడం మనదేశంలో తెల్లతోలంటే ఉన్న భయభక్తులు ఇతని తెల్లతోలు చూడగానే కూడా రేగడంవల్లనే, ఒకవిధంగా నా మెత్తతనం చూస్తే నాకు సిగ్గేసింది. కాని, అలవాటయిన హీనత్వమూ, అలవాటయి సిగ్గూను. మొదట్లో తెల్లతోలున్న జర్మనువాడిని చంపడం అంటే ఏమిటో తప్పులా అనిపించేది, ఎంత అర్థం చేసుకున్నా ఎంత చంపాలని ఉన్నాకూడా. ఎదురుగుండా జపానువాడో, మరొకడో ఉంటే అదొక తీరు; తెల్లతోలువాడిని చంపడం ఒకతీరు. అందులో నాకు కొత్త. రానురాను ఇటలీలో యుద్ధం జరుపుతున్నప్పుడు నాకూ కొత్త తీరి, తెల్లతోలంటే భయభక్తులణిగాయి. ఇప్పటి కింకా వేరు.
అతనికికూడా అదేకష్టంతోచిందనుకుంటాను. తెల్లవాడు తెల్లవాడికి చిక్కడం బదులు ఏ అడవిజాతివాడికో చిక్కినట్టనిపించింది కాబోలు. రానురాను వాళ్లకీ అలవాటయింది మన సిపాయిలకి లోబడడం.
నేను మళ్లీ బయలుదేరి వెళ్లిపోయేవేళయింది. నాపని జరిగింది. నేనింక ఉండవలసిన కారణం లేదు. ఈ పదిపదిహేనుమైళ్లూ ఇతనిన మోసుకువెళ్లలేను. నేను వెళ్లి పైఅధికారికి బోధపరచి ఏమైనా చెయ్యవలసినదే. ఇతన్ని ఈ స్థితిలో వదిలిపెట్టి వెళ్లవలసినదేనా అని ఆలోచించాను. గుడారంలో వెతికితే నాలుగైదు బిస్కట్లు మాత్రం ఉన్నాయి. మూడు నీళ్లబుడ్లలోనూ కలిపితే ఒక గ్లాసుడు మంచినీళ్లు పూర్తిగా లేవు. ఆ బిస్కట్లూ, మంచినీళ్లూ అతని దగ్గర తెచ్చి పెట్టేను. తిన్నాడు. నాకు బిస్కటొకటి ఇద్దామన్న ఆలోచనైనా అతనికి కలగలేదు. అసలు ఇంకా ఆకలిగా ఉందికాబోలు. పోయిన రక్తంవల్ల మరీ నీరసించి ఉన్నాడు. నాదగ్గరున్న మాంసంముక్కలూ, రొట్టే తీసి ఇచ్చాను. ఒక్క రొట్టెముక్కమాత్రం నేను తీసుకుని తిని కాసిని మంచినీళ్లు తాగేను.
అతన్ని తీసుకువెళ్లి గుడారంలో పడుకోపెట్టేను. ఎండ హెచ్చిపోతోంది.
అతని నడుముకి కట్టిన బ్యాండేజి రక్తంతో తడిముద్ద అయిపోయి జారిపోతోంది. గాయానికి ఇసుక చేరిందేమోకూడా. బ్యాండేజి విప్పేను. గాయంలో ఇసుక కనపడింది. గాయాన్ని గుడ్డతో తుడుస్తన్నాను. బాధపెట్టిందిలా వుంది. నాచేతుల్ని కసిరినట్టు తోసేసేడు. మళ్లీ తుడవడం మొదలుపెట్టేను. మళ్లీ నా చేతులని తోసెయ్యబోతే పిడికిటితో అతని చేతుల్ని విరక్కొట్టేటంత పనిచేసి ఒక చేతితో అతని మెడనీ, చేతుల్నీ కూడా నొక్కిఉంచాను. రెండో చేతితో శుభ్రంగా తుడిచి మందు రాసి దూది పెట్టి మళ్లీ బ్యాండేజి కట్టేను.
అంతా అయినేను లేచేను. అతను ఎందుకో చటుక్కున చంటిపల్లాడిలా ఏడవడం మొదలుపెట్టేడు. అతనికేసి పరీక్షగానైనా చూడలేదు నేను. నా సామానంతా సద్దుకుని, నేను వెళ్తున్నానని సంజ్ఞచేసేను. లేచి కూర్చుని, తనుకూడా నాతో వస్తానన్నట్టు సంజ్ఞచేసేడు. జాలిగా నాకేసి చూస్తున్నాడు. మళ్లీ వచ్చి అతన్ని తీసుకువెళ్తానని సంజ్ఞ చేసేను. మళ్లీ లేచి కూర్చుని తను కూడా నాతో వస్తానన్నట్టు సంజ్ఞ చేసేడు. వద్దన్నాను. నుంచోబోయాడు. పడతాడేమోనని వెళ్లి నేను పట్టుకున్నాను. నుంచోలేకపోయాడు. ఇతన్ని మళ్లీ తీసుకువెళ్లేందుకు ఎవరైనా వచ్చేవరకూ ఇతనికి తాగేందుకు నీళ్లుండవని జ్ఞాపకం వచ్చింది. అతన్ని పడుకోబెట్టి, నా నీళ్లబుడ్డిలో రెండు గుక్కలకి మాత్రం సరిపోయే నీళ్లుంచుకుని మిగిలిన నీళ్లు అతని నీళ్లబుడ్డిలో పోసి అతనికిచ్చాను. ఇస్తుంటే నా రెండు చేతులూ అతని రెండు చేతులలోనూ పట్టుకున్నాడు. ముద్దుపెట్టుకుంటున్నట్టు తన తల నా చేతులమీద ఆన్చేడు. నేను చేతులు విడిపించుకుని, వెళ్తున్నానని మళ్లీ సంజ్ఞచేసేను.
ఉండమని సంజ్ఞచేసి, తన నగిషీసిగరెట్టు కేసులో సిగరెట్లన్నీ తీసేసి, కేసు నాకిచ్చాడు. సిగరెట్లు పెట్టి ఇమ్మంటున్నాడేమో అనుకుని నాదగ్గర సిగరెట్లు అట్టేలేవని సంజ్ఞచేసేను. కాదుకాదనీ, సిగరెట్టుకేసు నా కిచ్చేస్తున్నాననీ సంజ్ఞచేసి నాజేబులో పెట్టబోయాడు. నాకొద్దన్నాను. ఆసిగరెట్టుకేసులోనుంచి తీసిన ఒకఫోటో అతని చేతిలోఉంది. పోనీ, ఆఫోటో తీసుకోమన్నాడు. ఇదేఫోటో. అతని భార్యా, పిల్లాడూ అనుకుంటాను. అతని చేతిలోనుంచి ఫోటో తీసుకుని కాసేపు చూసేను. పంట్లాంజేబులోంచి అదే ఫోటో మరొక కాపీ తీసి చూపించాడు. తన భార్యా, పిల్లాడూ అని చెప్పడానికికాబోలు అందులో ఇద్దరినీ నాకేసి చూస్తూ ముద్దుపెట్టుకున్నాడు. ఆకాపీ తనకనీ, ఈ కాపీ నే నుంచుకోవాలని సంజ్ఞచేసేడు. ఈఫోటో నాకివ్వడం చాలా అసందర్భం అని నా కనిపించింది. వద్దని ఇచ్చేసేను. అయితే సిగరెట్టుకేసు తీసుకోవాలని దాన్ని నా కివ్వబోయాడు. జ్ఞాపకార్థమై ఏదో ఇవ్వాలని అతను నిశ్చయించుకున్నాడు. సిగరెట్టుకేసు చాలా నగిషీపని ఉన్న సిగరెట్టుకేసు. చాలా ఖరీదైఉండాలి. పోనీ, అతనికి నా సిగరెట్టుకేసు ఇచ్చి అతనిది నేను పుచ్చుకుందామంటే నాకు సిగరెట్టు కేసు లేదు. సిగరెట్టుకేసు అతనికి ఎప్పుడూ కావలసినది.
సిగరెట్టుకేసు వద్దన్నాను. ఫోటో జేబులో పెట్టేడు. ఇకనులాభం లేదనుకుని ఊరుకున్నాను.
నాలుగైదు గంటలు ఎడారిలో ఎండి పటాలం ఉన్న ప్రాంతాలకి చేరుకున్నాను. అతని సంగతులూ చెప్పేను. ఒక లారీలో సాయంత్రం బయలుదేరి జర్మనుఇంజనీర్ల క్యాంపు చేరుకున్నాము. గుడారం పీకేసేరు. జర్మనులు వచ్చి అతన్ని రక్షించుకుపోయినట్టుంది. అతనెక్కడా లేడు. తీసుకువెళ్లినవాళ్లకి మైన్లని పేల్చిన గుంట చూపించాను.
ఫోటోమాత్రం వాళ్లకి చూపించలేదు. ఎవరికీ చూపించలేదు. చూపించడానికి సిగ్గువల్ల ఎవరికీ చూపించలేదు. అతని పెళ్లాంఫోటో నాదగ్గరుండడం చాలా అసందర్భం. గురువులు నాకు తెలియకుండా పెట్టె తెరిచి చూసేసేడీవేళ’’.
‘‘ఆ జర్మనుఇంజనీరుపేరేమిటి?’’ అని అడిగేను.
‘‘నేను కనుక్కోలేదు బాబూ. భాష తెలియదుకా. ఫోటోక్రిందసంతకం చిన్న అక్షరాలున్నాయి చూసేరో లేదో ‘ఫ్రీఢాఓబర్మాన్, బర్లీన్, జనవరి 1949’ అని. ఆవిడపేరయిఉంటుంది’’ అన్నాడు అప్పలస్వామి.
పిల్లాడూ, ఆవిడా అయినా కులాసాగా ఉన్నారో లేదో అనుకున్నాను, బర్లీనుపై విమానదాడులను గురించి ఆలోచిస్తూ.
———–