మాడ్గుల వేంకట రామాశాస్త్రి (Madgula Venkata Ramasastry)

Share
పేరు (ఆంగ్లం)Madgula Venkata Ramasastry
పేరు (తెలుగు)మాడ్గుల వేంకట రామాశాస్త్రి
కలం పేరు
తల్లిపేరుసీతమ్మ
తండ్రి పేరుభాస్కరప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ2/27/1915
మరణం11/26/1978
పుట్టిన ఊరుమణేసముద్రము, హిందూపురం తా. అనంతపురం జిల్లా
విద్యార్హతలు‘ఆయుర్వేద విశారద’ పట్టము పొందిరి. ‘విద్వాన్’ పరీక్ష యందుత్తీర్ణులైరి.
వృత్తితెలుగు పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు‘ప్రబోధ గీతాంజలి’, ‘శతకభారతి’, శ్రీ సుబ్బరాయ సప్తతి సువర్ణాభిషేకము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవికోకిల, విద్వన్మణి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమాడ్గుల వేంకట రామాశాస్త్రి
సంగ్రహ నమూనా రచనహిందూపుర పట్టణమునందు కవికోకిల బిరుదాంకితులగు శ్రీ మాడ్గుల వేంకటరామశాస్త్రుల వారి పేరు వినని వారు లేరు. వారు హిందూపురమునందు చిరకాలము ఉన్నత పాఠశాల ఆంధ్ర పండితులుగను, ఆయురేవద వైద్యులుగను, పురాణ ప్రవచన కర్తలుగను వాసికెక్కిరి. సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబీకులగుటచే బాల్యమునందే వేదాధ్యయనము గావించి, పంచదశకర్మల అధ్యయనానుభవమును గడించిరి.

మాడ్గుల వేంకట రామాశాస్త్రి

హిందూపుర పట్టణమునందు కవికోకిల బిరుదాంకితులగు శ్రీ మాడ్గుల వేంకటరామశాస్త్రుల వారి పేరు వినని వారు లేరు. వారు హిందూపురమునందు చిరకాలము ఉన్నత పాఠశాల ఆంధ్ర పండితులుగను, ఆయురేవద వైద్యులుగను, పురాణ ప్రవచన కర్తలుగను వాసికెక్కిరి. సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబీకులగుటచే బాల్యమునందే వేదాధ్యయనము గావించి, పంచదశకర్మల అధ్యయనానుభవమును గడించిరి. కర్నూలు సంస్కృత పాఠశాలయందు పంచకావ్యములు, నాటకములు, వ్యాకరణములను నేర్చిరి, శ్రీమాన్ విక్రాల వేంకటాచార్యులు, శ్రీ వెల్లాల శంకరశాస్త్రులు వీరి విద్యాగురువులుగా భాసిల్లిరి. తదుపరి విజయవాడ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో ఐదేండ్లు చదివి, ‘ఆయుర్వేద విశారద’ పట్టము పొందిరి. 1943లో మద్రాసు యూనివర్సిటీ వారిచే నిర్వహింపబడుచున్న ‘విద్వాన్’ పరీక్ష యందుత్తీర్ణులైరి. శ్రీ శాస్త్రిగారు కొన్నాళ్ళపాటు రాయదుర్గము, ఆదోని, కడప హైస్కూళ్లలో తెలుగు పండితులుగా పనిచేసి, కడపట హిందూపురం మహాత్మాగాంధీ పురపాలకోన్నత పాఠశాలలో ఫస్టుగ్రేడ్ తెలుగు పండితులుగా పనిచేసి ఉద్యోగ విరమణ గావించిరి.
సంస్కృతాంధ్ర సాహిత్యములందు వీరికి చిన్న తనము నుండియు మక్కువ గలదు. బాల్యము నందే కవిత్వము వ్రాయుట వీరి కలవడినది. సాహిత్యలోకమున వీరు ‘మాశాస్త్రి’గా మారినది. వీరు గురువులకు, పూజ్యులకు, దైవమునకు, తల్లదండ్రులకు వినమ్రత చూపువారేకాని పరులకు తలవంచు వారుకారు.
దాస్యజీవనమును కాలదన్ని నేను
లోకమను నాట్యరంగాన లుప్తమైన
పౌరుషోదాత్త జీవికపాదుకొల్పి
కొంత నటియించు చున్నాడ సొంత నబుడ.
అని తమ ‘నడివడి’లో వ్రాసుకొన్నారు. జీవితమొక నాటకరంగ మనుమాట వాస్తవము. అందు మనమెల్లరము పాత్రధారులే కదా. కవిగారు సర్వతంత్ర స్వతంత్రులు. అట్లనివారి విచ్చలవిడిగా సంచరించ లేదు.
పరవనితలన్న, నొరుసొమ్ము దొఱయు టన్న
నలము కొనెడు నశక్తి నాకట్టి తఱిని
పాపభీతియు నేహ్య భావంబు గల్గి
పరితపించును నా యాత్మ వలవ దంచు
ఇట్టి సద్గుణములే వారి జీవిత సౌధమునకు పునాదులైనవి. వీరు నిత్య సంతోషులు. ఉన్నదానితో సంతుష్టి చెందు నిండు హృదయులు. లేని దానికి బ్రాకులాడ స్వభావము వారికి లేదు. తమలోని సద్గుణములే యితరుల కలవడ వలెనని ఆశించెడి ఉదారులు వీరు.
ఎంతయున్నను సంతుష్టి నెఱుగ రకట
వారి తల వ్రాత కెవ్వారు బాధ్యులవని
నిత్య సంతోషమే జన్మకత్యవసర
మంచు, జీవిఁతు నే శివమంచు కృతము.
ఇట్లే కవిగారు మానవాళికి ప్రబోధ గావించిరి. వీరి ప్రబోధనలన్నియూ మానవకోటిలోని తమస్సును పటాపంచలుచేసి, వారిని జాగృతము చేయుననియే ఈ ప్రబోధలు బోధనలవరకే కాదు, ఆచరణ యోగ్యములు కూడ. కవిగారు సహితము తమ నిత్య జీవితమందు వాటిని శోధించి, సాధించి, ఆచరించి మన ధరణలకు వదిలిరి యువకులను కవిగారెట్లు ప్రబోధించిరొ చూతము.
శివాజి యెడిరో ఉడికిన రక్తం
మహాత్ముమతిలో మరగిన రక్తం
సుభాసు చేతుల జెరగిన రక్తం
మన రక్తంలో పొంగాలోయ్ (ఓ యువకులారా)
ఆదునిక గేయ పోకడలలో రచనలు చేయుట యందు కూడ వీరు సిద్ధహస్తులే. పాఠశాలలో గ్రాంధికము, పత్రికలలో వ్యవహారికము, సాహిత్యంలో భావి విప్లవ కవిత్వము, చోటు చేసుకొను ఈ సంధియుగము ఛాందసులై చంధోబద్ధ కవిత్వము చేబట్టిన కవివరేణ్యుల రాణింపున కొక అవరోధదశయైనది శ్రీ శాస్త్రిగారి విషయమున అది దూరమైనది.
ఈ ప్రబోధ గీతములన్నియు ‘ప్రబోధ గీతాంజలి’ యనుపేర శ్రీ శాస్త్రిగారు 1962వ సం.న ప్రకటించిరి. ఇందలి భావగీతములు దేశికవిత, వృత్తము, ఆధునిక గేయము మున్నగు రకములుగానున్నవి. ఇందుధ్వని, వ్యంగ్యములకే ప్రాముఖ్యతఇవ్వబడినది ఇందు కవి ఆలోచనలు స్రవంతిగా సాగినవి ‘ప్రజాప్రభుత్వమ’ను శీర్షికలో ‘ప్రభుత్వమేదోచేస్తుందనకోయ్ – ప్రభుత్వమంటే మనమేకాదోయ్’ అంటూ ప్రజలను ప్రబోధించారు. అంతియేగాక,
‘కుంటీ గ్రుడ్డీ సోమరిపోతుల
కింటా బయట పని – పెట్టాలోయ్
భిక్షం అంటే – అవమానంగా
భిక్షం అంటే – అతినీచంగా
భిక్షకు లిప్పుడు – ఓటరురాజులు
భిక్షాలక నిక – గురియౌతారా
అంటూ ‘గరీబీహటావో’ నినాదమును ప్రజలకు వినిపించారు. ఇందులో కొంత వ్యంగ్య ధోరణికూడ ద్యోతకము కాగలదు.
వరకట్న నిషేధముపై ఒక కవితవ్రాసి, యువకులకిట్లు రోషమునూరి పోసిరి.
రోసిన కాసుల – కాపింపకుమా
మీనముగల యా – మగవాడై తే’
ఇట్లెన్నో విషయములిందు ప్రబోధించిరి.
తదుపరి వీరి ‘శతకభారతి’ ఒక శతకము. ఇందు కూడ అనేక భావములు కలగా పులగముగా చొప్పించబడినవి. అవి కవిగారి లోగల ఆవేశపు మచ్చుతునకలు. కొందరికీతని మతము పట్టక పోవచ్చును,కాని తన మతము తనదిగా లెక్కించుకొన్న వారు వీరు. అందుకే వారిట్లు వ్రాసుకొన్నారు.
ఉ. గ్రాంధిక మందుప్రేమ, సమకాలికమౌ వ్యవహారకంపు, ని
ర్బంధము నామనఃస్థితిని బల్విడిఁ గ్రుంగగ జేయు చున్నదీ
సంధి యుగమ్ములో నెటుల సాగునొ నా కవితాకుమారి, సం
బంధము ఛాందసంబొకొ? యవైదికమో? యిది భారతావనీ
ఉ. పుత్రులు బెక్కురం గనిన – పుణ్యము నాయది, దాని కెందు నే
మాత్రము సిగ్గిలన్, సఖులు మాత్రము నాకధ విన్న, బుణ్యుడీ
వే త్రిజగమ్ములందు ననరే, యదె చాలును, బుత్రులెల్లరున్
బాత్రులు విద్యల వినయ భాసితులైమన, భారతావనీ
ఇందు వీరి సత్సంతాన విషయమును కూడ ప్రస్తావించిరి. వీరికెనిమిది మంది పుత్రులు. పుత్రికలు లేరు. వీరందరూ ప్రస్తుతము మంచి దశలోనున్నారు. వారందరూ విద్యావేత్తలే. నిజముగా వీరి కంటెను పుణ్యాత్ములెక్కడున్నారు. వీరికి మనుమండ్లు కూడ వున్నారు.
శ్రీ మాడ్గుల వేంకటరామాశాస్త్రుల వారికి కీ.శే. పద్మశ్రీ కల్లూరు సుబ్బరావుగారిపై పితృవాత్సల్యమున్నది. సుబ్బారావుగారు వారిని చిన్నానాటి నుండి ఆదరించినవారే. వారి విద్వాన్ పరీక్షలకు ఫీజులు కట్టి చదివించి, తదుపరి యుద్యోగవిషయమున కూడ సహాయ పడినవారే అట్టి పితృసమానుల ఋణ మెట్లు తీర్చుకొనవలెననెడి తలంపు శాస్త్రిగారికి కలిగినది భగవంతుడు మార్గము చూపించినాడు. కల్లూరు సుబ్బరావుగారు రాయలసీమలో పేరెన్నికగన్న ఆంధ్రభోజులు. వారి సప్తతి శాంతి మహోత్సవ సందర్భమున ‘శ్రీ సుబ్బరాయ సప్తతి సువర్ణాభిషేకము’ను గ్రంథమును వ్రాసి కృతిసమర్పణ గావించి ధన్యులైరి. ఈ కృతియందే శ్రీశంకరాచార్య విరచిత మగు సంస్కృత కనకధారాస్తోత్రమును ‘కనకధారాస్రవంతి’గా అనువదించి ముద్రించిరి శ్రీ సుబ్బరావుగారి గుణవిశేషములనిట్లు కవిగారు కీర్తించిరి.
సీ. కవ్వించు నొకమారు గదన రంగములకు
యువకుల నుఱ్ఱూత లూపి రేపి
నవ్వించు గడుపుబ్బ నానారసోల్లాప
హాస్యకృచ్ర్ఛావ్య కావ్యప్రసక్తి
గుప్పించు నొకమారు గురుబోధ బులకించి
ఆత్మతతత్వార్థ మహత్త్వ మెఱిగి
వెల్గించు నొకమారు విజ్ఞాన దీపమ్ము
వేదవేదాంగ సంవేది నాగ
తీ.గీ. భారతము రామచరితమ్ము – భాగవతము
భక్తితో భగవద్గీత వల్లెవేయు
ననుదినమ్మును ముసలి విద్యార్థియగుచు
జోక సత్కావ్య గోష్ఠి శ్రీ సుబ్బరావు.
తదుపరి వీరు కొంతకాలము పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబాగారి సన్నధిలో గడిపి, మానసిక శాంతిని పొందిరి. వారికి సత్యసాయిబాబాగారిపై నమ్మకము పుట్టి కొనిన పుస్తకములు కూడ వ్రాసి ముద్రించిరి. వాటిలో 1) శ్రీ సత్యాదిత్య హృదయము, 2) శ్రీ సత్యసాయి మహిమ కలవు. వీరి అముద్రిత కృతులుగా శివగీతికందము తుకారాం చరిత్ర (మూడు ఆశ్వాసములు) శ్రీకామేశ్వరీ విలాసము, శ్రీ దుర్గాసప్తశతి, శ్రీమద్రమణాయనమ్ (650 శ్లోకములుగల, సంస్కృత కావ్యము) మిగిలిపోయినవి. వీరి సంస్కృత భాషా పాండిత్యమునకు ‘శ్రీమదాంజనేయ సుప్రభాతమ్’ ఒక మచ్చుతునక. శ్రీ మాడ్గులవారు ఉభయ భాషా కవిమిత్రులు గదా.
1959 సం. నందు హిందూపుర పట్టణమునకు శ్రీ కూడ్లీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులైన శ్రీ సచ్చిదానంద శ్రీ శంకర భారతీస్వామి వారు విచ్చేసిన సందర్భమున వారేర్పాటు గావించిన కవిపండిత గోష్ఠిలో కవిగారికి ‘కవికోకిల’ యనుబిరుదము నిచ్చి సన్మానించిరి. వారి కవిత్వమునకు తోడు వారి కంఠమాధుర్యము తోడైనందున ‘కవికోకిల’ బిరుదము వారికి పూర్తిగా ఒప్పినది.
శ్రీ శాస్త్రిగారిది నిండైన విగ్రహము. సదా దరహాస నూతని ముఖకమలము నందు ప్రస్ఫుటించెడిది విద్యార్థులను వారు సదా నవ్వించెడివారు. ఒకసారి ఒక విద్యార్థి బృందము వారి ఆకారమును చూచి, లంబోదరుని చూచిన చవితి చంద్రుని పగది నవ్వెను. వారు కోపగించుకొనక ‘‘ఓరే ఆ నాయకుడు, నవ్వినచంద్రుడికి శాపమిచ్చాడు. ఈ వినాయకుడు మిమ్ములనాశీర్వదిస్తాడు. ఈ బొజ్జలో సంస్కృతాంధ్ర పాండిత్య పూర్ణముతో చేసిన కరకరలాడే సాహిత్య కుడములున్నాయి’’ అని ఛలోక్తివిసిరి, అందరిని నవ్వించి, తాను నవ్వెడివారట. అట్టి కవికోకిల నిండుగా నూరు వసంతశోభలను చూడకనే గగనమున కెగిరి పోయినది. అది అరువది రెండు వసంతములవరకే పాడినది.
ఇంత వరకిట్టి మార్గాన సంతరించె
జీవితరధమ్ము, విశ్రాంతి జెందగోరి
యెదటికేగునొ, యేమౌనొ? యెఱుగనేర
మంచిమార్గాన నడచెడు మమత కలదు (ప్రబోధగీతాంజలి)
శ్రీ శాస్త్రిగారు తాము వ్రాసుకొన్నట్లే మంచిమార్గములందు నడచిన వీరి జీవిత రథము, పరమ శివుని కైలాసమునకే దారితీసినది వారు ప్రాతఃస్మరణీయులు. వారి శయములు సదా ఆచరణీయములు వారు తమ అనుశాసనము నందిట్లు వ్రాసుకొనిరి.
నాదు వస్తువులవి నాణ్యమ్ములై యుండు;
వాని దీపికొన్న వారు మరల
నెచట నున్నవాని నచటనే యుంచంగ
వలయు లేద తాక వలదు వాని.
కవిగారి శయములను వారి సంతతి వారు కాపాడుదురుగాక
‘కవికోకిల, విద్వన్మణి, విద్వాన్ శ్రీ మాడ్గుల వేంకటరామాశాస్త్రి గారు‘ అని సంపూర్ణ బిరుదాది నామధేయములతో స్వాగతము పలికినప్పుడు ‘‘అవన్నీ అక్కరలేదయ్యా నన్ను ‘మాశాస్త్రి’ అనండిచాలు’’ అని పలికిన నిగర్వి మనకికలేడు వారి ఆత్మకు శాంతి కలుగుగాత.

రాయలసీమ రచయితల నుండి…..

———–

You may also like...