పేరు (ఆంగ్లం) | Ratnakaram Venkateswarlu |
పేరు (తెలుగు) | రత్నాకరం వెంకటేశ్వరులు |
కలం పేరు | – |
తల్లిపేరు | శేషమాంబ |
తండ్రి పేరు | హొన్నూరాజు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1910 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ వెంకటేశ్వర పుష్పమాల, శ్రీ కృష్ణవర్ణమాల, శ్రీ సత్యసాయిస్తుతి రత్నాకరం, శ్రీ వేంకటేశ్వర కల్యాణము (గేయము) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రత్నాకరం వెంకటేశ్వరులు |
సంగ్రహ నమూనా రచన | శ్రీ రత్నాకరం వెంకటేశ్వరులుగారు భట్రాజు కులమున జన్మించి, వృత్తిరిత్యా ఆయుర్వేద వైద్య విద్యను చేబట్టి, పుట్టుకతో అబ్బిన కవిత్వమును మరువక తనకు తోచిన రీతిలో తగినంతగా సాహిత్యసేవ గావించుకొన్న నిరాడంబరులు వీరు. వైద్య వృత్తి రీత్యా గ్రామాంతరములకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలలోగల మతవైషమ్యములు, అన్యోన్యకలహములు, దుర్భర దారిద్ర్యజీవితము, ధనికులు స్వార్థ పరత్వముతో చేయు దుండగములను చూచినప్పుడు కవిగారు హృదయాంతర్గత సాహితీ విపంచి తీగమీటినది. తమలోని ఆవేదనను పద్యరూపమున లలితాంబకు నివేదించుకొనిరి. దానిని ‘‘శ్రీలలితా పుష్పమాల’’గా వెలుగులోనికి దెచ్చిరి |
రత్నాకరం వెంకటేశ్వరులు
శ్రీ రత్నాకరం వెంకటేశ్వరులుగారు భట్రాజు కులమున జన్మించి, వృత్తిరిత్యా ఆయుర్వేద వైద్య విద్యను చేబట్టి, పుట్టుకతో అబ్బిన కవిత్వమును మరువక తనకు తోచిన రీతిలో తగినంతగా సాహిత్యసేవ గావించుకొన్న నిరాడంబరులు వీరు.
వైద్య వృత్తి రీత్యా గ్రామాంతరములకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలలోగల మతవైషమ్యములు, అన్యోన్యకలహములు, దుర్భర దారిద్ర్యజీవితము, ధనికులు స్వార్థ పరత్వముతో చేయు దుండగములను చూచినప్పుడు కవిగారు హృదయాంతర్గత సాహితీ విపంచి తీగమీటినది. తమలోని ఆవేదనను పద్యరూపమున లలితాంబకు నివేదించుకొనిరి. దానిని ‘‘శ్రీలలితా పుష్పమాల’’గా వెలుగులోనికి దెచ్చిరి.
‘‘మాతృబోధ’’ యను వీరి చిన్ని పుస్తకము నీతి ప్రబోధకమైనది. ఒక మాతృమూర్తి తన అనుంగు కూతురును ‘‘పుత్రికా’’ యని సంబోధించుచూ చెప్పిన నీతి పద్యములివి. ‘‘నీ ముదిప్రాయంబున నిన్ను జూడవలదే మోదంబుతో కోడలున్’’ అని ఆ తల్లి కూతురును మెల్లగా మందలిస్తుంది.
వీరు రచించిన భక్తి గ్రంథములలో శ్రీ వెంకటేశ్వర పుష్పమాల, శ్రీ కృష్ణవర్ణమాల, శ్రీ సత్యసాయిస్తుతి రత్నాకరం, శ్రీ వేంకటేశ్వర కల్యాణము (గేయము) శ్రీ భగవద్గీతా గద్య పద్య గేయామృతము, శ్రీ హనుమద్విజయము (గేయము) శ్రీ వాల్మీకి రామాయణ సుందరకాండము ననుసరించి రచించిన గేయ కావ్యములు ప్రసిద్ధములుగా చెప్పుకొనదగినవి.
గేయములలో వ్రాయబడిన పై మూడు గ్రంథములు స్త్రీలు, బాలురు, పామరులు తమకు తోచిన రాగతాళములలో పాడుకొనుటకు అనువుగా రచించిరి. పాదమునకు ముప్పదిరెండు మాత్రాగణములతోకూడి ప్రాసయతిగాని, సాధారణయతిగాని కలిగియున్న గేయములివి. శ్రీ వేంకటేశ్వరుని ఎందరో మహానుభావులు ఎన్నెన్నోరీతులుగా స్తుతించినారు. ఆతని దివ్యాద్భుత చరిత్ర ఎన్నిసార్లు వ్రాసినాను, చదివినను, ముక్తిదాయకమే కదా ఇతరులను మెప్పించవలెననెడి తలంపుతోగాక, కవిగారు తమలో పొంగి పొరలివచ్చు భావావేశము నణుచుకొనజాలక తమకు తాము తృప్తిచెందు నుద్దేశ్యముతో ఎల్లరునూ పాడుకొనుటకు అనువుగా రచించి ధన్యత పొందిరి. ఈ వేంకటేశ్వర కల్యాణమును గానము చేయువారికి శ్రీయుతి యం.యస్.రామారావుగారి సుందరకాండ రామాయణమును తలపుకు దెచ్చును.
ఇందు తొండమానుని జననము, పద్మావతి జననము, వకుళాదేవిచరిత్ర, వేంకటపతివేట, పద్మావతి పూర్వజన్మ కథ, పద్మావతి వేంకటేశ్వరుల కల్యాణము ప్రధాన ఘట్టములు. ‘‘శ్రీ వెంకటేశ్వరుని కల్యాణము చేసెద గానము శ్రీహరి కృపచే’’ అను పల్లవితో నీ గేయములను సాగించిరి. గేయరూపమున రచించిన ఈ కృతులు ఆంధ్ర సాహిత్యమునందు ఒక ఉన్నత స్థానము నందగల వనుటలో సందేహములేదు.
శ్రీ వేంకటేశ్వర కల్యాణమునందు శ్రీమన్నారాయణుడు ఎరుకలసానివేషము ధరించి, పద్మావతి కడకొచ్చి సోదె చెప్పిన విధమును కవిగారు బహు ముచ్చటగా వ్రాసిరి. అందలి ఒక వరుస గేయములో మచ్చునకు కొంత చూతుము. పద్మావతి తల్లి ఎరుకలదానిని యువకుని వివరములను గూర్చి అడుగగా ఎరుకలసాని యిట్లనుచున్నది.
నేసాలశలమున సికరము మీదను
సెరెను తల్లీ నారాయనుడే
ఆదిదేవుడై యందరి మొక్కులు
నందును నేరెను వెంకటపతియై
పదివినవాడూ సకల విద్దెలను
సక్కనివాడూ మనుమతుకన్నా
దనమూ బలమూ దండిగ యుండూ
శీనివాసుడని సెప్పుదు రతనిని.
వీరి శ్రీ భగవద్గీతా గద్యపద్య గేయామృతము ఒక పెద్ద గ్రంథము. ప్రస్తుతము ముద్రణలో వున్నది. శ్రీ భగవద్గీత మూలము ననుసరించి ఇందు 701 పద్యములు, 701 గేయములు, 701 గద్యములు గల్గి సుమారు 1200 పేజీలకు తక్కువకాని గ్రంథరాజమిది. ‘‘ఇదివరలో వచ్చిన పెక్కు అనువాద గ్రంథములన్నింటికి ఇది తలమానికము కాగలదనుటలో గొప్పేమీలేదు’’ అని శ్రీ కలచవీడు శ్రీనివాసరావుగారు ప్రశంసించిరి.
ఇంకనూ, ముద్రణ కావలసిన వీరి సుందరకాండగేయం, శ్రీ హనుమద్విజయములు కూడ త్వరలో ముద్రింపబడి ఆంధ్రలోకమును అలరించును గాక. వీరికి శ్రీ వేంకటాచలపతి ఆయురారోగ్య భాగ్యములనిచ్చి కాపాడుగాత.
రాయలసీమ రచయితల నుండి…
———–