వెల్లాల ఉమామహేశ్వరరావు (Vellala Umamaheswararao )

Share
పేరు (ఆంగ్లం)Vellala Umamaheswararao
పేరు (తెలుగు)వెల్లాల ఉమామహేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరుకృపాలక్ష్మమ్మ
తండ్రి పేరుకంఠయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/30/1912
మరణం
పుట్టిన ఊరుపుంగనూరు, చిత్తూరు జిల్లా
విద్యార్హతలుబి.ఏ
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్రవీరుడా, ఆర్యపుత్రా
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవెల్లాల ఉమామహేశ్వరరావు
సంగ్రహ నమూనా రచన1934 సం. ఆ ప్రాంతపు సినీ ప్రేక్షకులలో ‘కాంచనమాల’ నెరుగని వారుండరు. ఆ మహానటిప్రక్కన కథానయకుడుగా తొలిచిత్రములో నటించు అవకాశము శ్రీ వెల్లాల ఉమామహేశ్వరరావు గారికి కలిగినది. చిన్నతనము నుండియు నాటకరంగముపై అభిమానము పెంచుకొని, చిన్న చిన్న పాత్రలను ధరించుచు, తాను కూడ చిత్తూరు నాగయ్య, బళ్ళారి రాఘవాచార్యుల భంగి ఉత్తమ నటుడుకావలెనని కుతూహలపడి, అందుకొఱకై శ్రమించినవారు, శ్రీ వెల్లాలవారు వీరు నటులే కాదు, సాహిత్య లోకమున వీరొక మంచి రచయితలు, అనువాదకులుగా రాణించిరి. 1932వ సం. ప్రాంతములో అనంతపురము నందేర్పడిన ‘కవికుమార సమితి’ లోని ముగ్గురుకవులలో వీరొక్కరని వేరుగా చెప్పపని లేదు.

వెల్లాల ఉమామహేశ్వరరావు

1934 సం. ఆ ప్రాంతపు సినీ ప్రేక్షకులలో ‘కాంచనమాల’ నెరుగని వారుండరు. ఆ మహానటిప్రక్కన కథానయకుడుగా తొలిచిత్రములో నటించు అవకాశము శ్రీ వెల్లాల ఉమామహేశ్వరరావు గారికి కలిగినది. చిన్నతనము నుండియు నాటకరంగముపై అభిమానము పెంచుకొని, చిన్న చిన్న పాత్రలను ధరించుచు, తాను కూడ చిత్తూరు నాగయ్య, బళ్ళారి రాఘవాచార్యుల భంగి ఉత్తమ నటుడుకావలెనని కుతూహలపడి, అందుకొఱకై శ్రమించినవారు, శ్రీ వెల్లాలవారు వీరు నటులే కాదు, సాహిత్య లోకమున వీరొక మంచి రచయితలు, అనువాదకులుగా రాణించిరి. 1932వ సం. ప్రాంతములో అనంతపురము నందేర్పడిన ‘కవికుమార సమితి’ లోని ముగ్గురుకవులలో వీరొక్కరని వేరుగా చెప్పపని లేదు.
శ్రీ వెల్లాలవారు 4వ ఫారము వరకు చిత్తూరులో చదివి, తదుపరి ఉన్నత విద్యాభ్యాసము కడపలో ముగించిరి, ఇంటర్ మీడియేట్ విద్యను మద్రాసులోను, తదుపరి బి.ఏ., చదువు అనంతపురం, దత్తమండల కళాశాలలోను ముగించిరి. ఇంటర్, బి.ఏల యందు వీరు తెలుగున యూనివర్సీటీకెల్ల మొదటివారుగా ఉత్తీర్ణులైరి. అప్పుడే వారికి తెలుగు సాహిత్యముపై మక్కువ ఏర్పడినది. శ్రీ మఠం ఆచార్యులతో, సన్నిహిత మేర్పడి ‘కవికుమార సమితి’ ద్వారా ‘తొలకి చినుకులు’ ‘క్రొక్కారు మెఱుగు’లను రెండు ఖండకావ్యముల వెలువరించిర. బి.ఏ., తదనంతరం న్యాయవాద పరీక్షను మద్రాసులో ముగించి అక్కడే న్యాయవాదిగా కొంతకాలముండిరి.
వీరి రచనలన్నియు ఉద్రేక పూరితములైనవే శ్రీ రాళ్ళపల్లి వారు వీరి ఖండికలపై ఇట్లు అభిప్రాయము నిచ్చిరి. ‘‘ఉద్రేకము కార్యకారియగునేమో కాని కావ్యకారి కానేరదు వీరి కవిత్వమునందు నలుచోట్ల నాయుద్రేకపు మహత్తు కావచ్చును.’’
వీరి కవితా ఖండికల నొకసారి నిశితముగా పరీక్షించినచో వీరి భావోద్వేగము గోచరము కాగలదు. ‘ఆంధ్రవీరుడా’ ‘ఆర్యపుత్రా’ యను శీర్షికలలో తమ గుండెలలో నిండుకొన్న యువతరక్తమును తోడి వీరరసముతో రంగరించి ఆంధ్రుల కందించిరి రసపుత్రుల వీరత్వమును గూర్చి వారిట్లు వ్రాసిరి.
సైనిక వికాయమెల్లను – సమసినపుడు
అన్నపానంబులను నరుడైన యపుడు
శత్రువులు వచ్చితాకిన – జంకినాడె
అమిత వీరవరేణ్యుడౌ – నాప్రతాపు
డమ్మహాత్ముని మ్రొక్కుమా ఆర్యపుత్ర (తొలకరి చినుకులు)
‘ఆంధ్రవీరుడా’ యని సంబోధించుచు, తెలుగు వీరుడు కూడా రసపుత్రుల కేమాత్రము తీసిపోడని, వారి బలపరాక్రమములు మహోన్నతములని చాటి చెప్పిరి.
చం. మఱచితివో దిగంతముల మానుష బాహుబలాతి రేకతన్
స్ఫురితము జేసినట్టి యల భూరియశోధరు బాలచంద్రునిన్
స్మరణకుదెచ్చు కొంచతని చండపరాక్రమ విక్రమంబు నీ
ఖరకరవాల ముంగొని వికాసత లెమ్మిక నాంధ్రవీరుడా
కవిహృదయ మొక వెన్నముద్ద, లోకమున ప్రజలు జీవయాత్ర సాగించుట కెంతటి కష్టపడుచున్నారో తెలుసుకొన్నప్పుడది నిజముగా ద్రవించును. ఆ కష్టజీవులకు కొంత విశ్రాంతి అవసరము అది కవులహృదయములకు, కలములకు మాత్రమే అందగలదేమో శ్రీ వెల్లాల వారట్టి వారియెడ అభిమానము, ప్రేమ, వాత్సల్య కనికరములను తమ కవితలలో చూపిరి. ‘బిడ్డనేల కొట్టితివి’ – ‘వారు’ ‘రక్షకుని ప్రాపు’ – ‘రక్షక’ మొదలగు ఖండికలలో పై గుణములు పాఠకులకు ద్యోతకము కాగలవు.
చం. ఉదయమునుండి యిందనుక నొక్కెడ నిల్వక కూలిసేయగా
నొదవివ నాల్గణాలగొని యుడ్డ కామాళ్ళను భార్య గూతు, నే
విధమున బెంచుదున్ అడుగు పెట్టిన దాదిగ నింటిలోన నా
కదియిది కావలెననుచు నార్చెడు బిడ్డల నెట్లు తన్పుదన్ (క్రొ.మె)
ఈ కవి గారానాడే, ‘అంటరానివారి’ అనాథ దశల, మనసు కఱగు నట్లు వ్రాసిరి.
అంటరానివాడ – ననిరానివాడను
చేరరానివాడ – చెపటివాడ
తొలుత పుట్టునందు – శిలలతో దేవుని
బూజచేసినట్టి – పుణ్యజనుడ
బిచ్చమైననెత్తి – బిడ్డలకైనను
నింత గంజివేసి యిత్తనున్న
నిండ్లదరికి నన్ను – నేరు రానీయరు
కాన చచ్చుటొకటె – యౌనెతెఱగు
అని వాపోవుచు, క్రైస్తవ మతముజేరి, ప్రాణ రక్షణ మొనర్చు కొనుట శ్రేయమని వాంఛించు హిందువుల, నార్ష్యమత మెంతవరకు రక్షించు చున్నదని కవిగారు వాపోవుచున్నారు.
పసిపిల్లల పలుకులు పంచదార చిలుకలు, ఆ ముద్దుపలుకులు కన్న తల్లిదంరడులకే కాదు, సర్వులకు శ్రవణానందముల. ఒకటిన్నర సంవత్సరపు వయసుగల ‘రుక్కు’ పలికెడి తొక్కుపలుకులు, సంగీత సాహిత్యములకు విలయములు’ ఆ పలుకులను పలికెంచెడి నేర్పు కవులకు లేదు. కోయిలకు లేదు. వీణాగానమున కంతకంటే లేదు. అందుకే కవిగారిట్లనుచున్నారు.
సీ. తిక్కనార్యుని తేట – తెల్గునందొలికెడు
తియ్యతియ్యని తీనె – తెరలకన్న
పోతనామాత్యుని పొంకంపు కవితలో
నమరు సుధాతరం – గములకన్న,
షేక్స్పియర్ నుడులలో – చిప్పిల్లు వివిధ గం
భీర బంధురభావ – వితతికన్న,
తిరుపతి వేంకటే – శ్వరుల వాగ్ధారలో
గల ‘నయగార’ వే – గమున కన్న
తే. అధికమగుచు జొక్కించుతి – య్యందనమ్ము
అమఈతమాధురి గాంభీర్య – మతలవేగ
మలరు గద ‘రుక్కు’ నీపల్కులందు ఏమి
శక్తియో నీది తలప నాశ్చర్యమమ్మ (క్రొ.మె.)
‘శంకర హైమవతీ వశంకరా’ అను మకుటముతో కొన్ని పద్యములు, వీరు ‘తొలకరి చినుకులు’ క్రొక్కాఱు మెఱుగు’ లందు వ్రాసినారు.
ఈ కవిగారికి, మద్రాసులో, చలనచిత్రములో నటించు అవకాశము దొరికినది కాని, డైరెక్టర్ల మనస్తత్వమునకు వీరికి సరిపోనందున తానే స్వయముగా నొక చిత్రనిర్మాణమునకు పూనుకొని, అందులో ఎక్కువగా నష్టపడి, తుదకా కార్యము విరమించుకొనిరి.
ప్రస్తుతము వీరు కడపలో ప్రశాంత చిత్తులై కాలక్షేపము జేయుచున్నారు ‘లేపాక్షి’ అను పేర ఒక డాక్యుమెంటరీ ఫిల్ము తీసియున్నారు.
శ్రీ సర్వేశ్వరుడు, వీరికి వీరి కుటుంబమునకు సదా, ఆయురారోగ్యభాగ్యము లొసంగి గాపాడు గాత.

రాయలసీమ రచయితల నుండి…..

———–

You may also like...