పేరు (ఆంగ్లం) | Avula Gopalakrishna Murthy |
పేరు (తెలుగు) | ఆవుల గోపాల కృష్ణమూర్తి |
కలం పేరు | ఎ జి కె |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 4/29/1917 |
మరణం | 9/6/1966 |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మూల్పూరు గ్రామం |
విద్యార్హతలు | ఎం.ఎ.ఎల్.ఎల్.బి. |
వృత్తి | న్యాయవాది |
తెలిసిన ఇతర భాషలు | తెలుగు, ఇంగ్లీషు |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ‘కృష్ణశతకం, నా అమెరికా పర్యటన సాహిత్యంలో జేచిత్యం (సాహితీ వ్యాసాలు) హ్యూమనిజం. నవ్యమానవవాదం (రాయ్ రచనకు తెలుగు), పుంఖాను పుంఖంగా ఇంగ్లీషులు, తెలుగు వ్యాసాలు, పీఠికలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | రాడికల్ హ్యూమనిస్టు , సమీక్ష పత్రికలు నడిపారు |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆవుల గోపాలకృష్ణమూర్తి |
సంగ్రహ నమూనా రచన | వ్యాసాలు-ఉపన్యాసాలు, పౌరోహిత్యం, ప్రెస్ క్లబ్, బాలకళామందిర్, లయన్స్ క్లబ్, పంతుళ్ళ సమావేశాలు; సన్మానాలు కవులకు, కళాకారులకు; స్టడీకాంపులు, రాడికల్ హ్యూమనిస్ట్ లకు; అన్నిటా ‘గాత్రం’ పాడి, ‘వైశేషికత్వాన్ని’ నిలబెట్టుకున్నాడు. అనేక యుద్దముల ఆరితేరిన జ్ఞానవృద్ధుడయ్యాడు. అఖిల భారత సమావేశాల్లో, అమెరికా, ఐరోపాలలో విశిష్టుడుగానే చలామణి అయ్యాడు. |
ఆవుల గోపాలకృష్ణమూర్తి
వ్యాసాలు-ఉపన్యాసాలు, పౌరోహిత్యం, ప్రెస్ క్లబ్, బాలకళామందిర్, లయన్స్ క్లబ్, పంతుళ్ళ సమావేశాలు; సన్మానాలు కవులకు, కళాకారులకు; స్టడీకాంపులు, రాడికల్ హ్యూమనిస్ట్ లకు; అన్నిటా ‘గాత్రం’ పాడి, ‘వైశేషికత్వాన్ని’ నిలబెట్టుకున్నాడు. అనేక యుద్దముల ఆరితేరిన జ్ఞానవృద్ధుడయ్యాడు. అఖిల భారత సమావేశాల్లో, అమెరికా, ఐరోపాలలో విశిష్టుడుగానే చలామణి అయ్యాడు. ఇంట్లో పిల్లలమధ్య హాయిగా కాలక్షేపం చేసాడు. వాళ్లు పూజలు, పునస్కారాలు చేస్తుంటే – మతస్వేచ్ఛ అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వ్యక్తిగనుక – నిరోధించనూలేదు, ప్రోత్సహించనూ లేదు. తన భావాలు చెప్పేవాడు.
సాహిత్యంలో ఔచిత్యం వుండాలనేది ఆవుల గోపాలకృష్ణమూర్తి గట్టి అభిప్రాయం. ఆ దృష్టితోనే విశ్వనాధ సత్యనారాయణ మొదలు ప్రాచీన కవుల వరకూ తన విమర్శకు గురిచేశాడు. కవులు, రచయితలలో ఆవుల అంటే విపరీతాభిమానం గలవారు, తీవ్రంగా భయపడేవారు. రెండు వర్గాలుగా వుండేవారు. భయపడిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రథముడు. ఆవుల వుంటే ఆ సభకు విశ్వనాథ వచ్చేవాడు కాదు. వేయి పడగలు మొదలు రామాయణ కల్పవృక్షం వరకూ వుతికేసిన ఆవుల అంటే భయపడడం సహజం.
1941 ప్రాంతాలలో ఎజికె గాంధీజీ పై తీవ్ర విమర్శలతో కూడిన వ్యాసం ప్రచురిస్తే, ఎం.ఎన్. రాయ్ పక్షాన ఆంధ్రలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడుగా వున్న అబ్బూరి రామకృష్ణరావు అదిరిపడ్డాడు. ఎం.ఎన్. రాయ్ కు ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ వ్యాసంలో విషయం తెలిసి ఎజికెని సమర్ధించాడు.
ఎ.జి.కె. ఎం.ఎ.ఎల్.ఎల్.బి. చదివి అడ్వొకేట్ గా తెనాలిలో ప్రాక్టీసు చేశారు. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యం రంగరించి వడపోసారు. కవులను, సాహితీ పరులను ఎజికె ఎంతగా ఆకర్షించారో చెప్పజాలం. ఏ మాత్రం పలుకు వున్న దన్నా ఎంతో ప్రోత్సహించేవారు. సాహిత్య వ్యాసాలు కొద్దిగానే రాసినా, ఉపన్యాసాలు చాలా చేశారు. కవులను ప్రోత్సహించారు. రాయించారు.
ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా ఎ.జి.కె. ఆంధ్రలో ప్రధాన పాత్ర వహించారు. సొంత ఖర్చులతో పత్రికలు, రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, నడిపారు. ఇంగ్లీషు పత్రికలకు రాశారు. మానవవాద, హేతువాద ఉద్యమాలు తీవ్రస్థాయిలో నడిపించారు.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి నోట్లో అతి సామాన్యమైన పలుకు కూడా మాధుర్యం సంతరించుకుంటుందని మూల్పూరుకు చెందిన (ఎ.జి.కె. గ్రామం) వెనిగళ్ళ వెంకట సుబ్బయ్య అనేవారు.
1955 నుండీ ఎజికెతో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. గుంటూరు ఎ.సి. కాలేజీలో చదువుతూ ఆయన ఉపన్యాసాలు ఏర్పరచాము. సాహిత్యంలో ఔచిత్యం అనే ఉపన్యాసం యివ్వగా, స్ఫూర్తి శ్రీ (బాస్కరరావు లెక్చరర్) రాసి, ఆంధ్ర పత్రికలో ప్రచురించారు. అది వాదోపవాదాలకు దారి తీసింది. అందులో నన్నయ్య ఆది పర్వం నుంచి అనేక మంది కవుల అనౌచిత్యాలను ఎజికె. విమర్శించారు.
పెళ్ళి ఉపన్యాసాలు కూడా ఎ.జి.కె. అద్భుతంగా చేసేవారు. సంస్కృత మంత్రాలు లేకుండా తెలుగులో అందరికీ అర్ధమయ్యేటట్లు ప్రమాణాలు చేయించి, వివరణోపన్యాసం చేసేవారు. అలాంటివి నేను ఎన్నో విన్నాను.
నా వివాహం 1964లో ఆయనే తెనాలిలో చేయించారు. ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు.
ఎ.జి.కె. పెళ్ళి ఉపన్యాసాలంటే అదొక సాహిత్య వ్యాసం అనవచ్చు. ప్రతి చోట ప్రత్యేక పాయింట్లు చెప్పేవారు.
ఎజికె చేత ఎందరో రచయితలు కవులు పీఠికలు రాయించుకున్నారు.
కొల్లా శ్రీకృష్ణా రావు
రారాజు
కావ్యానికి సుదీర్ఘ పీఠికలో ఎజికె నిశిత భారత పరిశీలన చేశారు.
వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య తెలుగు పుస్తకానికి ఇంగ్లీషులో సుదీర్ఘ పీఠిక రాశారు. ఎందుకంటే, ఎజికె వాడుక భాష నచ్చదని, ఆయన అలా రాయించు కున్నారు. తెనాలి దగ్గర వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రౌఢ కవి ఆయన సంస్కృత రచనకు తెలుగు అనుసరణ ‘భామినీ విలాసం’.
కొండవీటి వెంకట కవి, రావిపూడి వెంకటాద్రి, గౌరి బోయిన పోలయ్య యిలా ఎందరో రాయించుకున్నారు. వెంకటకవి నెహ్రూ ఆత్మకథ రాయడానికి తోడ్పడ్డారు. వందలాది టీచర్లు ఆయన వలన ప్రేరేపితులయ్యారు.
ఇంగ్లీషులో శామ్యుల్ జాన్సన్, మాథ్యూ ఆర్నాల్డ్, ఆర్ జి ఇంగర్ సాల్, ఎరిక్ ఫ్రాం, ఎం.ఎన్. రాయ్, రచనలు ఎజికె యిష్టప్రీతికాగా, రవీంద్రనాథ్ కవితల్ని పులుముడు రచనలుగా విమర్శించాడు. బెంగాలీ మానవ వాదులకు యిది ఒక పట్టాన మింగుడు పడేదికాదు.
ఎలవర్తి రోశయ్య చాదస్తంతో గ్రాంథిక వాదిగా నన్నయ తిక్కన వంటి వారిని అంటి పెట్టుకోగా, ఎజికె ఆయన్ను మార్చగలిగారు. కవిత అంటే చెవిగోసుకునే రోసయ్యకు త్రిపురనేని రామస్వామి సూతపురాణం పద్యాలు చదివి, పేరు చెప్పుకుండా ఆకర్షించారు. అది చదివిరోసయ్య చాలా మారారు. పిలక పెంచుకున్న రోసయ్యను మార్చడానికి, ఒక అర్థరాత్రి హాస్టల్ లో నిద్రిస్తున్న రోసయ్యకు పిలకకత్తిరించారు.
ఏటుకూరి వెంకట నరసయ్య కృషేవలడు రచన ఎజికెకు యిష్టం. అత్తోట రత్నం మొదలు జాషువా వరకూ ఎజికె సందర్శకులే. దళిత ఉద్దరణలో భాగంగా కవుల్ని ప్రోత్సహించాడు.
ఎం.ఎన్. రాయ్ మానవ వాద రచనను సరళంగా తెనిగించారు.
నాచుట్టూ ప్రపంచం అనే శీర్షికతో వాహిని వారపత్రిక (విజయవాడ)లో రాశారు 1956 ప్రాంతాల్లో. గుంటూరు నుండి వెలువడిన ప్రజావాణిలో రాశారు. చిన్న పత్రికలవారడిగితే ఎజికె అరమరికలు లేకుండా రాసేవారు.
వివేకానంద భావాల్ని ఆలోచనల్ని షూటుగా విమర్శించిన ఎజికెపై ఆనాడు ఆంధ్రప్రభ, నీలం రాజశేషయ్య సంపాదకత్వాన ధ్వజమెత్తింది, 1964లో. కానిఎజికె వెనుకంజ వేయలేదు.
బుద్దునిపై విశ్వనాథ సత్యనారాయణ చేసిన అనౌచిత్య విమర్శలపై ఎజికె పెద్ద ఉద్యమం చేశారు. 1956-57లో పాఠ్యగ్రంథాలనుండి, బుద్ధుణ్ణి రాక్షసుడుగా చిత్రించిన భాగాలు తొలగించే వరకూ నాటి విద్యామంత్రి ఎస్.బి.పి పట్టాభి రామారావుపై విమర్శలు చేశారు.
వి.ఎస్. అవధాని, ఎం.వి. శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, పెమ్మరాజు వెంకటరావు, ఎ.ఎల్. నరసింహారావు మొదలైన వారెందరో ఎజికె సలహాలు పొందుతుండేవారు. కవులకు ఆయన యిల్లు యాత్రాస్థలమైంది.
ఎజికె ప్రతిభను గుర్తించిన అమెరికా ప్రభుత్వం 1964లో ఆయన్ను ప్రభుత్వ అతిధిగా పర్యటించమని ఆహ్వానించింది.
అమెరికాలో ప్రధాని జవహార్ లాల్ నెహ్రూను ఎజికె విమర్శిస్తే, నాటి రాయబారి బి.కె. నెహ్రూ బెదిరించి ఎజికెను వెనక్కు పెంపిస్తానన్నారు. కాని ఎజికె తన విమర్శనా వాద పటిమ తెలిసినవాడుగనుక జంకలేదు.
సాహిత్యంలోనే గాక, కళలు, సంగీతంలో కూడా చక్కని విమర్శలు, పరిశీలనలు ఎజికె చేశాడు. శాస్త్రీయ దృష్టితో పరిశీలన చేశాడు. బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాడు.
ఎజికె తన ఆరోగ్యం పట్ల హేతు బద్ధంగా వ్యవహరించలేదు. గుండెపోటు వస్తే అశ్రద్ధ చేసి, కోర్టు కేసులు పడకలోనే పరిశీలించాడు. ఆ సందర్భంగా బొంబాయి నుంచి ఎ.బి.షా. (అమృత్ లాల్ భిక్కు బాయ్ షా-సెక్యులర్ ఉద్యమ నాయకుడు), నేనూ తెనాలి వెళ్ళి హెచ్చరించి, చికిత్స కైమద్రాసు వెళ్ళమన్నాం. అలా చేయలేదు.
ఆటల్లో, పాటల్లో, నాటకాల్లో ఆసక్తి, ప్రవేశం గల ఎజికె కోర్టులలో వాదిస్తుంటే, అదొక ఆకర్షణీయ దృశ్యంగా వుండేది. ఇంటగెలవని ఎజికె రచ్చగెలిచాడు.
ఎం.ఎన్. రాయ్ తో సుప్రసిద్ధ రచయిత చలంను, త్రిపురనేని రామస్వామిని కలిపినా, నిరాశేమిగిలింది. రాయ్ స్థాయిని వారందుకోలేకపోయారు.
———–