పేరు (ఆంగ్లం) | Kotha Sachidananda Murthy |
పేరు (తెలుగు) | కొత్త సచ్చిదానందమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | రాజరత్నమ్మ |
తండ్రి పేరు | కొత్త వీరభద్రయ్య |
జీవిత భాగస్వామి పేరు | వేదవతీదేవి |
పుట్టినతేదీ | 1/1/1924 |
మరణం | 1/24/2011 |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి |
విద్యార్హతలు | తత్వశాస్త్రంలో పి.హెచ్.డి. పూర్తిచేశారు |
వృత్తి | గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి వృత్తి ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో తత్వశాస్త్రాచార్యునిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతి 1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్ సంస్థకు ఛాన్సలర్. |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, హిందీ |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రివలేషన్ అండ్ రీజన్ ఇన్ అద్వైత వేదాంత, స్టడీస్ ఇన్ ది ప్రాబ్లెమ్ ఆఫ్ పీస్, మెటా ఫిజిక్స్ మాన్ అండ్ ఫ్రీడమ్, ఇండియన్ ఫారిన్ పాలసీ, ది ఇండియన్ స్పిరిట్, రీడింగ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, పాలిటిక్స్ అండ్ ఫిలాసఫీ, నాగార్జున, ది రిలమ్ ఆఫ్ బిట్వీన్, ఫార్ ఈస్టరన్ ఫిలాసఫీస్ భగవద్గీతకు వాఖ్యానం, హనుమద్విజయము, కారుమబ్బులు, ఈశోపనిషత్తు మొదలగు గ్రంధాలను తెలుగులో రచించారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | డాక్టర్ బి.సి.రాయ్ అవార్డు , 1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ |
ఇతర వివరాలు | ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. పదిహేనేళ్ళ వయసులో భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసి సర్ సి.ఆర్.రెడ్డి ప్రశంసలు పొందడం విశేషం. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొత్త సచ్చిదానందమూర్తి |
సంగ్రహ నమూనా రచన | ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తిచేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆచార్యునిగా చేరారు. 1963లో బీజింగ్‌లోని చైనా పీపుల్స్ విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేశారు. మధ్యలో జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. |
కొత్త సచ్చిదానందమూర్తి
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తిచేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆచార్యునిగా చేరారు. 1963లో బీజింగ్‌లోని చైనా పీపుల్స్ విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేశారు. మధ్యలో జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏడేళ్లకే గుంటూరు యూనివర్శిటీ పి.జి. సెంటర్‌కు ప్రత్యేకాధికారిగా వచ్చారు. ఇక్కడ 1971 వరకు పనిచేసిన ఆయన జిల్లాలో కళాశాలల అభివృద్ధికి విశేష కృషిచేశారు. 1975 నుంచి నాలుగేళ్ల పాటు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. 1986లో విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడుగా, 1989 నుంచి సారనాధ్‌సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్‌కు కులపతిగా పనిచేశారు. అప్పుడే టిబెట్‌తో మంచి సంబంధాలేర్పడ్డాయి. తర్వాత విదేశాల్లో చాలాచోట్ల తత్వశాస్త్రంపై ప్రసంగాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్ దేశాల్లో పర్యటించారు. ఇంగ్లండులోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
టిబెట్‌తో అవినాభావ సంబంధాలు: టిబెట్‌తో సచ్చిదానందమూర్తికి మంచి సంబంధాలే ఉన్నాయి. 1989లోనే టిబెటన్ స్టడీస్ సెంటర్‌కు కులపతిగా పనిచేసిన రోజుల్లో అక్కడి వారితో అవినాభావ సంబంధమేర్పడింది. పలుమార్లు దలైలామాతో కలిసి పలు తత్వ విషయాలపై పరిశోధనాంశాలను చర్చించారు.
దేశంలోని జే ఎన్ టి యూ, వారణాసి హిందూ విశ్వవిద్యాలయము, తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో సైతం సచ్చిదానంద సేవలు అందించటం తత్వశాస్త్రంలో ఈయన ప్రతిభకు నిదర్శనం. సచ్చిదానంద ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ బిరుదుతో ఆయనను సత్కరించింది. తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డును తొలి సారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు.
2007లో భారత తత్వశాస్త్ర పరిశోధనా సంస్థానము రజతోత్సవం సందర్భంగా ఆయనకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. స్వామి ప్రణవానంద తత్వ శాస్త్ర జాతీయ బహుమతి, శృంగేరీ పీఠం అందించే విద్యాసాగర అవార్డు, కాశీ సంస్కృత విద్యాలయం ప్రదానం చేసిన వాచస్పతి తదితర అవార్డులనూ ఈయన పొందారు. 1995లో తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ‘మహామహోపాధ్యాయ’ అనే అరుదైన గౌరవాన్ని సచ్చిదానందకు ఇచ్చి గౌరవించింది.
జర్మనీ, రష్యాలోని పలు సంస్థలు కూడా సచ్చిదానందకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ బిరుదులు ఇచ్చి సత్కరించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి పేరిట “ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ” పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆయన కీర్తికి నిదర్శనం. తత్వశాస్త్రంపై సచ్చిదానందమూర్తి 1952లో రాసిన ‘ఎవల్యూషన్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా’ అనే గ్రంథానికి ఎం. ఎన్. రాయ్ పీఠిక రాయడం విశేషం.
సర్వేపల్లి వారసుడు
భారతీయ తత్వశాస్త్ర నిపుణుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రథములైతే ఆయన వారసుడు ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి. ఈ విషయంలో దేశంలోని తత్వశాస్త్ర నిపుణులందరిదీ ఏకాభిప్రాయమే. సర్వేపల్లికి, సచ్చిదానందమూర్తికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. సర్వేపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగం అధిపతిగా అయిదేళ్లపాటు పనిచేశారు. సచ్చిదానందమూర్తి ఆ విభాగంలో విద్యసభ్యసించి అక్కడే మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి అయిన తరువాతే ఆయనతో పరిచయం జరిగింది. ఆయన పలుమార్లు ఢిల్లీకి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించేవారు. తత్వశాస్త్ర అధ్యయనంలో సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు. పాఠశాల, కళాశాల విద్య అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ పూర్తి చేసి, పీహెచ్డీ అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొద్దికాలం అధ్యాపక వృత్తి స్వీకరించారు. తర్వాత ఆచార్యుడిగా మయూర్‌భంజ్‌లో పనిచేశారు. 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ యూనివర్శిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1975-78 మధ్య పలు విద్యా విధానాలకు నాంది పలికారు. 1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా, సారనాథ్‌లోని విశ్వవిద్యాలయ స్థాయిగల సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్ సంస్థకు ఛాన్సలర్ హోదాలో1989-2001 వరకూ పనిచేశారు.
పదవులు, పురస్కారములు
ఉపాధ్యక్షుడు- యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్, అధ్యక్షుడు – ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్, దాక్టర్ ఫిలసాఫియే హానోరిస్ కాసా- రష్యా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ – 1989, ఛైనా విశ్వవిద్యాలయము, బీజింగ్- తత్వశాస్త్రములో గౌరవ పట్టా- 1988, బి. సి. రాయ్ పురస్కారము, పద్మభూషణ్ – భారత ప్రభుత్వము – 1984, పద్మ విభూషణ్ – భారత ప్రభుత్వము -2001
ఆచార్య మూర్తి వ్రాసిన ”రివలేషన్ అండ్ రీజన్ ఇన్ అద్వైత వేదాంత” అనే గ్రంథం మతాలకు సంబంధించిన తత్వాలపై మహోన్నత గ్రంధంగా గుర్తింపు పొందింది. యూదు, క్రిస్టియన్ పిలాసఫీలకు సంబంధించిన వాస్తవాల పోలికతో, సంస్కృత ఆధారాలతో ఆయన పై గ్రంధాన్ని రచించారు. అదే విధంగా ”శంకరాచార్య మీమాంసకాలు, శంకర అద్వైతాల గురించి” ఆచార్య మూర్తి వ్రాసిన గ్రంధం దార్శనిక గ్రంధాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఆచార్యమూర్తి తన గ్రంధంలో భగవద్గీత, మహాత్మాగాంధీ ప్రబోధించిన అహింస, శాంతి అనే అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ సౌహార్ధ్రం, సౌభ్రాతృత్వం, సహనం సామాజిక ఆర్ధిక రంగాలలో సమానత్వం శాంతికి అవసరం అని ప్రభోదించారు. ప్రపంచ శాంతికి, యుద్ధానికి వ్యతిరేకంగా శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా మానవ హక్కులపై వ్యాఖ్యానిస్తూ ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు దుర్వినియోగపరచటం ద్వారా తమ సామర్ధ్యాన్ని విస్తరించుకోవడమే కారణమంటారు.
భారతీయ తత్వవేత్తలలో ”ఫార్ ఈస్టరన్ ఫిలాసఫీస్”పై రచించిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన తన రచనలలో అన్ని శాస్త్రాలను, అన్ని రంగాలను స్పృశించారు. త్వశాస్త్రంలో తల పండినా, విద్యా, సామాజిక, సాంస్కృతిక , రాజకీయ ఆర్ధిక, చారిత్రాకాది రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనపరచిన వ్యక్తి ఆచార్య సచ్చిదానందమూర్తి. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరోప్ ఖండాలన్నీ పర్యటించి తత్వశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలపై ప్రసంగాలు చేసి అక్కడి వారి ప్రశంసలను పొందారు. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ (1959), బీజింగ్ పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో విజిటింగ్/ఆనరరీ ప్రొఫెసర్‌గా పనిచేయటంతో పాటు, ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో (1963) ప్రత్యేక ఆహ్వానంపై ప్రసంగాలు చేశారు. 1970లో సిమ్లాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేశారు. ప్రపంచంలోని ప్రసిద్ధమైన అన్ని విశ్వవిద్యాలయాలలోను ప్రసంగాలు చేశారు. ఆచార్య మూర్తి పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలకు, సంఘాలకు పలు హోదాల్లో విశేషమైన సేవలందించారు. అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఫిలాసఫికల్ సొసైటీ ఉపాధ్యక్షుడిగాను, వరుసగా పది సంవత్సరాలు, ఇండియన్ ఫిలాసఫీ కాంగ్రెస్ ఛైర్మన్ గాను, ఇండియన్ సొసైటీ ఫర్ ఇండియన్ ఫిలాసఫీ అధ్యక్షులుగాను వ్యవహరించారు. ఇవి కొన్ని మాత్రమే.
తత్వశాస్త్రంలో అత్యున్నత కృషి చేసిన వారికి ప్రదానం చేయడానికి ఏర్పడిన అత్నున్నతమైన ‘డా|| బి.సి. రారు నేషనల్ అవార్డ్’ తొలిసారిగా ఆచార్య సచ్చిదానందమూర్తికి 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. తత్తశాస్త్రంలోను, ఉన్నత విద్యా విధానంలోనూ ఆయన సాధించిన ప్రగతికి, భారతదేశ ప్రభుత్వం 1984లో ‘పద్మభూషణ్’ మరియు 2001లో ‘పద్మవిభూషణ్’ లను ఇచ్చి సత్కరించింది. పైన పేర్కొన్నవి మాత్రమే కాకుండా, దేశ విదేశాలలోని అనేక విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ సంస్థలు ఆయనను వివిధ అవార్డులతో సన్మానించాయి. ఆయన కృషికి గుర్తింపుగా మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సస్, బల్గేరియాలోని సోఫియా యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా, జర్మనీలోని పోల్-విట్టన్బర్గ్ యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.
ఆచార్య సచ్చిదానంద మూర్తి కృషికి గుర్తింపుగా దాదాపు 9 విశ్వవిద్యాలయాలు-ఆంధ్ర, నాగార్జున, జె.ఎన్.యు, కృష్ణదేవరాయ, బి.హెచ్.యు, శ్రీ వెంకటేశ్వర తదితర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఇవే కాకుండా ‘స్వామి ప్రణవానంద తత్వశాస్త్ర జాతీయ బహుమతి’, కలకత్తాలో ‘దర్శన్ విజ్ఞాన్ ఫౌండేషన్’ అవార్డు, మద్రాసు వారు ‘రాజ్యలక్ష్మీ అవార్డు’, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్, తిరుపతి ‘మహా మహోపాధ్యాయ’ వారణాసి సంస్కృత విద్యాపీఠ్ ‘వాచస్పతి’ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘బెస్ట్ టీచర్’ అవార్డులతో ఆయనను సత్కరించారు. ఇటీవలనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చి వారు ‘లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్’ ఎవార్డు ప్రకటించారు.
విశ్వమంతా చుట్టివచ్చినా, చాలా కాలం పాటు వివిధ రంగాలలో వృత్తి రీత్యా నగరాలలో నివసించినప్పటికి, పదవీ విరమణ చేసిన తరువాత స్వగ్రామం సంగం జాగర్లమూడిలో పితృ పితామహులు నివసించిన ఇంట్లోనే నివసిస్తూ అవకాశం, అవసరం ఏర్పడినప్పుడు తన మేధా సంపత్తిని పంచుతూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తన జీవితాన్ని గడిపారు. అవసరమైనప్పుడు కటువుగా మాట్లాడటం, తన సంభాషణలో తీవ్రమైన వ్యంగ్యాన్ని విసరటం, గిలిగింతలు పెట్టే హాస్యాన్ని వెదజల్లడం ఆచార్య మూర్తి ప్రత్యేక లక్షణాలు. తాను విశ్వసించిన సత్యాల కోసం, విశ్వాసాల కోసం ఎవరికి తలవంచని వ్యక్తిత్వం ఆయనకే సొంతం. రాష్ట్రంలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్య మూర్తి పేరిట ఫిలాసఫీ అధ్యయన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆచార్య సచ్చిదానంద తత్వంపై ప్రముఖ తత్వవేత్తలు భట్టాచార్య, డాక్టర్ వోహ్రా సంపాదకత్వంలో ”ఇండియన్ ఫిలాసఫికల్ రీసెర్చి” అనే గ్రంధాన్ని 1993లో ప్రచురించారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మినహా, ఏ భారతీయ తత్వవేత్త చేపట్టని అంశాలను అధ్యయనం చేసిన వ్యక్తిగా ఆచార్య సచ్చిదానంద మూర్తిని పేర్కొంటూ 1970లో సుప్రసిద్ధ జాతీయ భాషావేత్త ఆచార్య సునీతి కుమార్ చటర్జీ, ”ఇప్పుడు ఆ భారం ఆచార్య మూర్తి భుజస్కంధాలపై పడిందని” పేర్కొనడం గమనార్హం. అదే విధంగా ఎందరో ప్రభృతుల ప్రశంసలు పొందిన మాననీయుడు ఆచార్య సచ్చిదానంద మూర్తి.
———–