పేరు (ఆంగ్లం) | Kogira Jayaseetaram |
పేరు (తెలుగు) | కోగిర జయసీతారం |
కలం పేరు | – |
తల్లిపేరు | చెన్నమ్మ |
తండ్రి పేరు | ఓబులరెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/14/1924 |
మరణం | – |
పుట్టిన ఊరు | కోగిర – పెనుకొండ తా. అనంతపురం జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ‘‘నిట్టూర్పులు’’ పద్యకావ్యం; విజయప్రభ – బుఱ్ఱకథ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కోగిర జయసీతారం |
సంగ్రహ నమూనా రచన | నిఱుపేద కుటుంబములో పుట్టిన శ్రీ కోగిర జయసీతారం గారు చిన్నతనమునుండి గడ్డుజీవితమును గడిపినవారే. చదివిన ఎనిమిదో తరగతికి ఉపాధ్యాయవృత్తి లభించే మంచికాలమది. పల్లెల్లోన, ఆ పేదప్రజలనడుమ నిత్యము కలిసిమెలసి తిరుగుతూ ఆ ప్రపజాజీవితాన్ని, భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను, మనోగతాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణింపజేసుకొని, వారికోసం, వారిభాష, పలుకుబడులతో, వారి కష్టాలను పాలుపంచుకొనే ఒక మనిషి తానంటూ, తన మనోవిపంచిని విప్పి కవితలల్లి ప్రజల ముందుంచిన ప్రజాకవి శ్రీకోగిరి జయసీతారం |
కోగిర జయసీతారం
నిఱుపేద కుటుంబములో పుట్టిన శ్రీ కోగిర జయసీతారం గారు చిన్నతనమునుండి గడ్డుజీవితమును గడిపినవారే. చదివిన ఎనిమిదో తరగతికి ఉపాధ్యాయవృత్తి లభించే మంచికాలమది. పల్లెల్లోన, ఆ పేదప్రజలనడుమ నిత్యము కలిసిమెలసి తిరుగుతూ ఆ ప్రపజాజీవితాన్ని, భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను, మనోగతాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణింపజేసుకొని, వారికోసం, వారిభాష, పలుకుబడులతో, వారి కష్టాలను పాలుపంచుకొనే ఒక మనిషి తానంటూ, తన మనోవిపంచిని విప్పి కవితలల్లి ప్రజల ముందుంచిన ప్రజాకవి శ్రీకోగిరి జయసీతారం.
వీరివి అనంతపురం జిల్లా ప్రజాభాషకు అద్దంపట్టే రచనలు. ఈలాంటి మాండలిక భాషారచనలు చేయగలిగిన కవులు చాలఅరుదు. ఆ పద్ధతి ఒంటబట్టడం కూడా కష్టమే. అందుకే ఈ కవి సామాన్య ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాలను చూచి సహించలేక కవితలల్లితే, ప్రభుత్వము దాన్ని ధిక్కారనేరంగా లెక్కించింది, బెదరించింది.
‘‘సలిమంట’’ అనే కవితలో సామాన్య పల్లెకూలీల దినదినగండపు జీవితాన్ని పుడిసిట బట్టినాడీకవి. ఆ కవిత సాధారణమాటల్లో సాగిపోయినా అది చందోబద్ధంగా వుంది. చక్కటి భావరమ్యతను కలిగి ఉంటుంది. జీవితంలో పండిపోయిన ఓ అవ్వ శరీరాన్ని కోరుక్కుతింటున్న చలికి ఓర్చుకోలేక, వాళ్ళను వీళ్ళను పలకరించి, చలి మంటేసుకొంటూ, తన వాళ్ళను పనులకు పురమాయించుతూ, చుట్టుప్రకక్కల వాళ్ళను విచారించడం ఇందులో వస్తువు. జనం, జీవం అవ్వ మాటలకు ప్రాణం. సంభాషణావిధానంలో రచన సాగుతుంది.
ఆడ బొయ్యెదెవ్ రు? ఆదిగా ‘‘యాలవా’’
‘‘అగ్గిపెట్టి వుంద అనుముగా; నితావ?’’
‘‘వూను వుందితాలు నేనంటిత్త’’
‘‘కప్కొనేకి యేడ్డి కప్పడమూలేదు
దుష్టి గొందమంటె దుడ్లులేవు
తొలుపుల్యాక వాకిలికి తడకడ్డం బెట్కోని
యేటి బతుకొ యేమొ యల్లకాల్ము’’
‘‘యంగటమ్మా లేత్వ, యాం లేదా’’
‘‘ఏం, లేశ్నవత్తా యెసురెంత బెట్టల్ల’’
‘‘రొండు జెమ్లుబెట్టు పిండి వుందొ’’
‘‘యాడదిప్ డు రాగులిసురల్ల; యెసర్లోకి
‘‘సందకాడ వురికె సత్తా రంద్రు…’’
ఇలా అత్తకోడళ్ళ సంభాషణ జరుగుతుంది. తుదకది ‘‘కుటుంబ సంక్షేమా’’నికి దారి తీస్తుంది. ఈ విధంగా ఈ కవికి పల్లీయుల జీవితంలోని నొక్కుల్ని, లోతుల్ని పసిగట్టే శక్తివుంది. అందుకే ఈ కవి ‘‘ఆత్మగతం’’ అనే శీర్షికలో వ్రాసిన కవితలో ఇలా వ్రాసుకొన్నారు.
పిన్న పదమునందు పెద్దభామవు పొందు
నేర్పు గలుగువాడె నిజము సువకి
కొద్ది పొలమునందు కొండంతపంట, పం
డించు నట్టివాడె మంచిరైతు.
‘‘నిట్టూర్పులు’’ పద్యకావ్యం; విజయప్రభ – బుఱ్ఱకథ; ఈ రెండునూ వీరి ముద్రిత కృతులు. తక్కినవన్నియూ వ్రాత ప్రతులుగానే మిగిలివున్నాయి. వీరు ‘‘సుగుణా’’ అను మకుటముతో వ్రాసిన 400 పద్యముల శతకములో నేటి భారతదేశపు రాజకీయ వ్యవహారములను, స్థతిగతులను తూర్పారబట్టిరి. అలాంటిదే వీరి ‘‘మదాంధబరాతము’’కూడ. ఇది తేటగీతికలలో కూర్చబడినది. ఇందు ధూర్తరాష్ట్రుడు (ధృతరాష్ట్రుడు కాదు) సంశయునితో (సం.యుడుకాదు) ఏ మడుగుచునానడో చూడుడు.
గీ. భరతభూమి స్వతంత్రమై ప్రజల పాల
నమ్ము ప్రారంభమైనట్టి నాటినుండి
ధాత్రియెల్ల మమాకురుక్షేత్రతమయ్యె
సంశయా చెప్పుమా దాని సరళి కొంత
కం. దేవుని ఎదుట ప్రమాణము
గావించిన సాక్షి యిచ్చు కైఫీయతులో
దేవిని దొరకని సత్యము
దేవు డపహరించెనేమొ తెలియదు సుగునా
(సుగుణా శతకమునుండి)
మన తెలుగు సాహిత్యంలో కవికోకిలలు, కవివృషభులు కవిసింహులు, కవికిశోర బిరుదాంకితులే ఎకుకవ. ‘‘కవికాకి’’ బిరుదాంకితులెవరూ ఉన్నట్లులేదు. ‘‘కవికాకి బిరుదును మీకిస్తున్నాం. తీసుకోగలరా?’’ అని ఒకసారి శ్రీ బి.టి.ఎల్.యన్. చౌదరి (అనంతపురం జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షులు) గారొక సారి జరిగిన గ్రంథాలయ వారోత్సవాల నిండుసభలో శ్రీ జయసీతారాంగారిని ప్రశ్నించగా, నిస్సంకోచంగా ముందుకొచ్చి ‘‘నెమలి జాతీయపక్షి. కాకి ప్రజలపక్షి. నిత్యం వాల్ళను మేలుపుకొలుపుతుంది. నేను ఆలాంటికవినే. నాకాబిరుదతగిందే’’ అని సగౌరవంగా సభలోపలికి, గౌరవా గౌరములన్నింటినీ ఒకే స్థాయిలో మన్నించిన సుకవి ఈయన. ఈ కవిగారిని శ్రీ చౌదరిగారు అత్యభిమానిస్తారు. ‘‘కవికాకిగారు బాగున్నారా?’2 అని ఎక్కడ కనిపించినా నవ్వుతూ కుశలప్రశ్నలు వేస్తుంటారు, ‘‘అంతా నీ చలువేకదా నాయనా’’ అంటూ చౌదరి గారికి నవ్వుతూ జవాబిస్తాడీ కవి.
వ్రాసిపెట్టిన రచనలన్నీ వెలుగు చూడకపోయినా, రి రచనలన్నీ అనంతపురం జిల్లా సాహిత్యాభిలాషుల మనోఫలకాలపైచిరస్థాయిగా ముద్రింపబడినాయి. ఏ కవి సమ్మేళనం జరిగినా ఏ సాహిత్యగోష్ఠి జరిగినా, అభిమానులు కోరినా అక్కడికక్కడే తన సంచిలోని వ్రాతప్రతిని తీసి కవితలను వినిపిస్తుంటారు. 1. అరణ్యరోదనము (సీస పద్యములు) 2. కావ్ – కావ్ శతకము, 3. కాకిగోల (గేయాలు) 4. పండువెనెనల (పిల్లలపాటలు) 5. కృష్ణార్జునయుద్ధము 6. రామాంజనేయ యుద్ధము, 7. సీతారామకల్యాణము (నాటకములు), 8. జయభారతి (బుడబడక్కలకథ) ఇవి వీరి అముద్రితకృతులు.
సాధారణమైన ఉపాధ్యాయ జీవితాన్ని కొనసాగించినా, ఒక ‘‘అసాధారణమైన వ్యక్తి’’గా లెక్కింపబడి తన పదునైన కలంతో చురకలంటిన ధైర్యశాలి. ప్రస్తుతము స్వగ్రామమైన కోగిరలోనే కాలం నెట్టుకొస్తున్నారు. భగవంతుడు వీరికి ఆయురారోగ్య భాగ్యములనిచ్చి సర్వదా కాపాడుగాత.
రాయలసీమ రచయితల నుండి…
———–