పేరు (ఆంగ్లం) | Battula Kamakshamma |
పేరు (తెలుగు) | బత్తుల కామాక్షమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | సీతాయమ్మ |
తండ్రి పేరు | వెంకటరత్నం |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1866 |
మరణం | 1/1/1969 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణురాలయ్యారు |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వ్యాసాలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | గృహలక్ష్మి స్వర్ణకంకణం |
ఇతర వివరాలు | దేశంలో ప్రబలంగా ఉన్న నిరక్షరాస్యతను గుర్తించారు. రాజమండ్రి కేంద్రంగా ఈమె విద్యావ్యాప్తికి మరియు స్త్రీల అభివృద్ధికి కృషిచేశారు. కాకినాడలో 1920 లో ఆంధ్రదేశ వైశ్య స్త్రీలసదనము స్థాపించారు. రాజమండ్రి పౌరులు ఈమెకు షష్టిపూర్తి సందర్భంగా గొప్ప ఉత్సవాన్ని జరిపి శ్రీ కామాక్షి విజయ సంచిన అనే పేరుతో ప్రచురించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బత్తుల కామాక్షమ్మ స్మృతులు, అనుభవములు |
సంగ్రహ నమూనా రచన | ఆంధ్ర దేశముయొక్క ఈ నాటి ఈ వికాసమునకు సర్విధముల కారణభూతుడైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారి స్మారకోత్సవములను మన ఆంధ్ర ప్రభుత్వము జరుపుటకు పూనుకొనుట చాల సంతోషకారణము. ఎందువల్లననగా శ్రీ వీరేశలింగముగారు జీవించియున్న 19వ శతాబ్దపు అంత్యభాగమునందును, 20వ శతాబ్దపు ప్రధమభాగమునందును భారతీయ జాతీయ జీవనము, ముఖ్యముగ ఆంధ్రుల జాతీయజీవనమును ఈనాటి జాతీయజీవనమును సరిపోల్చుకొని, తర తమ పరీక్షచేసి చూచుకొన్నచో, ఈనాటి ఈ సర్వతోముఖాభివృద్ధికి, ముఖ్యముగా ఆంధ్రమహిళా జాతీయ వికాసమునకు శ్రీ వీరేశలింగం పంతులుగారే కారణభూతులని వేరే చెప్పనక్కరలేదు. |
బత్తుల కామాక్షమ్మ
స్మృతులు, అనుభవములు
ఆంధ్ర దేశముయొక్క ఈ నాటి ఈ వికాసమునకు సర్విధముల కారణభూతుడైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారి స్మారకోత్సవములను మన ఆంధ్ర ప్రభుత్వము జరుపుటకు పూనుకొనుట చాల సంతోషకారణము. ఎందువల్లననగా శ్రీ వీరేశలింగముగారు జీవించియున్న 19వ శతాబ్దపు అంత్యభాగమునందును, 20వ శతాబ్దపు ప్రధమభాగమునందును భారతీయ జాతీయ జీవనము, ముఖ్యముగ ఆంధ్రుల జాతీయజీవనమును ఈనాటి జాతీయజీవనమును సరిపోల్చుకొని, తర తమ పరీక్షచేసి చూచుకొన్నచో, ఈనాటి ఈ సర్వతోముఖాభివృద్ధికి, ముఖ్యముగా ఆంధ్రమహిళా జాతీయ వికాసమునకు శ్రీ వీరేశలింగం పంతులుగారే కారణభూతులని వేరే చెప్పనక్కరలేదు.
మిక్కిలి మూఢాచారములతో నిండియున్న ఆనాటి సంఘమును సంస్కరించి వారు రాచబాట వేయుటచేతనే అట్టి విశాలాశయ ప్రబోధ పరిపూర్ణమైన సంస్కారోద్దేశములు కలిగికూడా సాహసించలేని మాబోటి స్త్రీ లెందరమో తరువాత రువాత జాతీయ భాములతోకూడిన సంస్థలను స్థాపించి మహిళా సంఘోద్ధరణ చేయగల్గి మమ్ములను మేము ఉద్ధరించుకొన గల్గితిమి.
కావున అట్టి నవయుగ వికాస కారణభూతుడైన ఆ పుణ్యపురుషునకు స్మారకోత్సవము కారణకమే కదా. ఈ సందర్భమునందు ఆనాటి సాంఘిక మర్యాదల ప్రభావమునందు పెరిగిన నాకు ఆనాటి సాంఘికాచార సంబంధమైన కొన్ని స్మృతులు, నా అనుభవములు ఇక్కడ వివరించుట నా విధియని తలంచుచున్నాను.
నా కపుడు సుమారు పదునైదు సంవత్సరముల ప్రాయముంవచ్చును. నేను మా పినతండ్రిగారగు శ్రీ ఉడత్తుకమలనాభంగారి యింటియందుండెడిదానను. నా బాల్యమున అనగా 1901-1902 సంవత్సరములలో సంపన్నకుటుంబము లనదగిన మా బోటవారి యిండ్లలో స్త్రీలయెడల చాలా కఠినమైన ఆచారనింబంధన లుండెడివి. బయటకు ముఖము చూపుటకే మాకు అవకాశము ఉండెడిదికాదు. ఎంత సన్నిహిత బంధువులైనను పురుషులతో మాట్లాడుట చాల తప్పుగా భావించెడివారు. అందునను బాలవితంతవునైన నా బోటివాళ్ళ విషయమునందు ఈ నిబంధనలు ఎంత కఠినముగ ఉండెడివో మీరే ఊహింపవచ్చును.
అయినను ఏ పూర్వపుణ్యవశముననో, నాలో సేవా భావములు చిన్నప్పటినుండియు రేకెత్తియుండెడివి. వ్యర్థముగా ఒక నిముషమైనను కాలముపుచ్చుటకు నా కిష్ట ముండెడిదికాదు. ఎంత సేపును గ్రంథపఠనము చేయవలెననియు, ఇతరులలో ఆ విద్యను ప్రచారము చేయవలెననియు, అజ్ఞాతముగా నాలో ఊహలు ఉండెడివి. అయితే చదువుకొనుటకు గ్రంథము లెక్కడ లభించునో నాకు తెలిసెడిదికాదు. మా పినతండ్రిగా రెంతో ప్రేమతో నన్నాదరించినను నాకుగల విద్యాభిలాషను వారిదగ్గర వెలిబుచ్చుటకే నాకు సాహసముండెడిది కాదు.
ఇంతలో నాకు మేనమామల కుటుంబమైన నాళంవాడి కుటుంబమునందు జన్మించిన శ్రీ నాళం కృష్ణరావుగారు తమ గురువుగారిపై భక్తితో, శ్రీ వీరేశలింగ గ్రంథభాండారమను పేరున ఒక గ్రంథాలయమును స్థాపించి, ముఖ్యముగా స్త్రీలలో విద్యాభిరుచిని కలుగజేయుటకు ఉచితముగా స్త్రీలకు ఇండ్లకు పుస్తకములు పంపించి చదివించుచున్నారనియు, అట్లు చదివిన స్త్రీలలో పోటీ పరీక్షలు కూడ నిర్వహించుచున్నారని విని పేదకు పెన్నిధి దొరికినట్లు సంతసించితిని. అప్పుడు మా నాళమువారి కుటుంబములోని స్త్రీలద్వారానే నా పఠనాభిలాష శ్రీ కృష్ణరావుగారికి తెలియపరచి వారి గ్రంథాలయమునుండి పుస్తకములు వచ్చునట్లు ఏర్పాటు చేసికొనగలిగితిని. ఆనాడు నాలో గూడుగట్టిన కాంక్ష, విద్యాభివృద్ధికై నేను పడిన తహతహపాటు ఇట్లు ప్రయోజనకరముగా సిద్ధించినందుకు ఎంతో సంతోషపడినాను.
అప్పటిలో శ్రీ వీరేశలింగము పంతులుగారిని నేను ఎన్నడూ ప్రత్యక్షముగా చడకపోయినను వారి స్త్రీ జనోద్ధరణోద్యమము పట్ల నాకు చాలా అభిమాన ముండెడిది. అందుచే నేను గ్రంథాలయ జవాను రాలేకపోయినను ప్రతిదినము మా జవానును పంపించి రోజుకొక గ్రంథము చొప్పున శ్రీ వీరేశలింగముగారి గ్రంథములనే హెచ్చుగా తెప్పుంచుకొని ఆసక్తితో, దీక్షతో చదువుచుండెడిదానను. నేను చదువుకొనుటయే గాక మా యిరుగుపోరుగు స్త్రీల కందరకు చదివి వినిపించెడిదానను. స్త్రీ విద్యకు అప్పట్లో మా పెద్దలకు చాల వ్యతిరేక భావము లున్నను. నేను బాల వితంతువు నగుటచే, నాయందు వారి కతిశయప్రేమయుండుట చేతను, నేను కేవల సంఘ సంస్కార గ్రంథములేగాక భారత భాగవతాది ఆద్యాత్మిక గ్రంథములను చదివి, ఎక్కువగా వాటి సారమునే యిరుగుపొరుగువారికి బోధించుచుండుట చేతను, మా పెద్దలు యిదొక సత్కాలక్షేపముగా భావించి మిన్నకుండెడివారు.
ఇట్లు నా గ్రంథ పఠనము నిర్విరామముగా జరుగుచుండగా నేను వీరేశలింగముగారి గ్రంథములపై ఎక్కువ మక్కువ చూపించుచుండుట గమనించి, గ్రంథాలయ పరిపాలక వర్గములోని కొందరు మా బంధువులు, వితతువివాహ సంస్కారమునకు సంబంధించిన గ్రంథములను నాకు చదువుటకు పంపించి వితంతు వివాహము నా యభిప్రాయములను గ్రహింపవలెనని ప్రయత్నములు చేసిరి. కాని నాకు శ్రీ పంతులుగారి స్త్రీ జనోద్ధరణము పట్లనే సహజముగా ఎక్కువ అభిమానముండుటవలనను, వితంతు వివాహ గ్రంథములను నేను తెప్పించినట్లు, గ్రంథాలయ పట్టికలో నా పేరు క్రింద ఈ గ్రంథములు సూచింపబడినట్లయిన నన్ను గురించి ఎట్టి అనుమానములు చెలరేగునో అను భయము నాకు విపరీతముగా గలిగి ఎవరూలేని సమయము చూచి, ‘నేను వ్రాసిన గ్రంథములే తీసికొని రమ్ము, ఇట్టి గ్రంథములను నా కెప్పుడూ తెచిచ యీయవద్ద’ని గ్రంథాలయ జవానును మందలించి కట్టడి చేసినాను. ఆ కాలము నాటి మా పరిస్థితులట్టివి.
కాని వీరేశలింగముగారు తన సంస్కారోద్యమములో ఎక్కడ ఏ పన్యాస మిచ్చినను, నేను తెలుసుకొని, ఆ ఉపన్యాసములు తెప్పించుకొని ఎంతో ఆసక్తిగా చదివెడుదానను.
అంతేకాక అప్పట్లో సనాతన శిరోమణియైన శ్రీకాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు స్త్రీవిద్య చాల అనర్థదాయకమని, అది కూడదని వీరేశలింగము పంతులు గారికి వ్యతిరేకముగా ప్రచారము చేసేడి వారు అప్పటి పత్రికలన్నియు, నేను తెప్పించి అతి ఆరుతతతో చదివెడి దానను. కాని నా మనోభావము లన్నియు, పంతులుగారి సంస్కారోద్యమము వైపునకే పురుగిడుచుండెడివి.
అయినను నాకు స్వతంత్రత లేకపోవట చేతను, ఆ కాలము స్త్రీ సంఘసేవకు స్త్రీలు పూనుకొని చేయదగినంత అవకాశము కలది కాకపోవుట చేతను నేనేమియు చేయలేకపోతిని. కాని నా మనస్సునందు మాత్రము స్వతంత్రజీవనము గడిపి, సంస్థలను పెట్టి స్త్రీ సంఘసేవచేయవలెననే బీజములకు ఆనాడే ఆవాసము జరిగినది.
ఇంతలో నేను ఎక్కువగా గ్రంథాలయ గ్రంథకాలక్షేపము జేయుటయు, ఇరుగుపొరుగు స్త్రీలతో భారత భాగవతాది సద్గ్రంథ కాలక్షేపము చేయుటయు, ఆనోట, ఆనోట ప్రాకి శ్రీ పంతులుగారి అంతేవాసినియైన శ్రీమతి కొటికలపూడి సీతమ్మగారి చెవిబడుట తటస్థించినది. అట్లు నన్ను గూర్చి విని. నన్ను చూడవలెనని మిక్కిలి యత్కంఠతో ఒకనాడు మా యింటికి వచ్చిరి. అదివరకే సీతమ్మగారి గ్రంథములైన అహల్యాబాయి మున్నగు ఉత్తమ రచనలు చదివి ఉండుటవలన వారు ఫలానా అని తెలుసుకోగానే నాకు ఎంతో సంతోషము కల్గినది. ఆమె నన్ను ఎంతో ఆదరముగా దగ్గరకు తీసికొని ఆప్యాయముగా పలకరించి పద్యములు, శ్లోకములు చదివించుకొని ఎంతో ఆనందపడిరి. ఆమె నన్ను స్త్రీ విద్యాభిమానయైన శ్రీ పంతులుగారి వద్దకు తీసికొని వెళ్ళి నన్ను వారి కెరుక పరచవలెనని చాల ముచ్చటపడినారు. వారి మాటలనుబట్టి వితంతు వివాహమునకై నన్ను ఆమె ప్రోత్సహించుచున్నటుల కూడ నే నభిప్రాయపడితిని.
అయినను మహనీయుడు, సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధారకుడు అయిన శ్రీ వీరేశలింగం పంతులుగారి దర్శనము చేతను జన్మ తరించుననెడి గొప్ప అభిలాషచే నేను సీతమ్మగారితో వెళ్ళి ప్రార్థన సమాజమునందు, శ్రీ పంతులుగారిన చూచుటకు మనస్సు స్థిరపరచుకొంటిని. కాని నేను ఒక్క తెను వెళ్ళినచో మా బంధువులలో ఎట్టి విపరీతాభిప్రాయములు కలుగునో యను భయముచే నా పురాణము వినుటకు వచ్చిన స్త్రీలకు వీరేశలింగముగారు గ్రామఫోను పెట్టి పాడిస్తారనియు మనమందరము వెళ్ళి వినెదమని ప్రోత్సహించి వారందరను తీసికొని వారితో బాటుగ వెళ్ళినాను. అప్పుడు సీతమ్మగారు నన్ను పంతుగార్కి ఎరుక చెపెపదనని చాల ఒత్తిడిచేసినారు. కాని వారితో మాట్లాడినట్లు పైకి తెలిసినచో ఎట్టి ప్రమాదములు తటస్థించి, నా జీవిత మెట్టి కష్టములపాలగునోయని నేను చాలా భయపడి ‘‘అక్కరలేదండి, నాకు చాల సిగ్గు’’ అని సీతమ్మగారితో చెప్పి శ్రీ పంతులుగారిని చూచి ఆ మహనీయునకు దూరమునుండే నమస్కరించి తొందరగా మా యింటికి తిరిగి వెళ్ళిపోయితిని. ఈ విధముగా శ్రీ పంతులుగార్ని చూడవలెననే అభిలాష గ్రుడ్డిలో మెల్లగా నేను నెరవేర్చుకొన గల్గితిని. అప్పటికి నాకు పదునెనిమిదేండ్లు.
తరువాత నేను మద్రాసుకు నా మేనమామలైన శ్రీ నాళము లక్ష్మీకాంతముగారింటికి వెళ్ళిపోయి అచ్చటనే పదునాల్గు సంవత్సరములు గడిపితిని. కాని అక్కడకూడ ఏమీ ఆటంకము లేకుండా ఈ గ్రంథపఠన కార్యక్రమము సాగించెడుదానను. అంతేకాక అప్పుడు బీజప్రాయముగా నాలో నెలకొనిన సేవాభిప్రాయములు నానాటికి వృద్ధిపొంది ఏదో ఒక సంస్థను స్థాపించి ఏదోఒక సేవాకార్యముచేయవలెననెడి అభిప్రాయము తీవ్రమై నా మనస్సున గొప్ప పోరాటము సాగుచెండెడిది. తుదకు 1920వ సంవత్సరమున స్త్రీ జన సేవకు మూలస్థానమైన రాజమండ్రికి చేరినగాని నేను ఏమియు చేయజాలనను నిశ్చయమునకు వచ్చి నా భావములను పైకి వెల్లడిచేసినచో నన్ను ప్రోత్సహించువారుండరు సరికదా పైన ఆటంకములు కలుగజేయుదురని భావించి గోదావరిలో కార్తీక స్నానములవాయజముతో నేను రాజమండ్రి చేరితిని. అయితే యీలోపుగా శ్రీ నాళం రామలింగయ్యగారితో నేను తీర్థయాత్రలకు వెళ్లుటయు, పూనాలోని కారేవగారి వితంతు శరణాలయమును గూర్చి వినుటయు, అక్కడ ఉండవలెననియు నాకు సంకల్పము కలిగెను. కాని శ్రీ రామలింగయ్యగారిది గ్రహించి నన్ను పూనా తీసికొని వెళ్లకుండా ఇంటికి పంపివేసి వారు పూనా వెళ్ళి కార్వేగారి వితంతు శరణాలయమును చూచి వచ్చిర.
తరువాత 1920లో రాజమండ్రి రాగానే శ్రీ నాళం రామలింగయ్యగారు తాను ఒక స్త్రీ సేవాసదనమును స్థాపించదలచినట్లును, నేను అందులో నా జీవితమును గడుపుట కిష్టపడినచో తాను తప్పక సంస్థను స్థాపింపగలననియు నాతో చెప్పిరి. పరమేశ్వరుడీవిధముగా నా చిరకాలాభిలాషను సిద్ధింపజేయు చున్నందులకు నేను చాలా సంతోషపడి ‘అట్లే నేను నా జీవితమును మీ సంస్థయందు గడపగల’నని వారికి వాగ్దనము చేసితిని. తరువాత కొన్ని రోజులకు రాజమండ్రిలో స్త్రీసేవా సదనము స్థాపించితిమి.
ఇట్లు నేను శ్రీ వీరేశలింగం పంతులుగారి ఆదర్శములను జీర్ణించుకొని 1920లో స్త్రీసేవా సంస్థను పెట్టునప్పటికి శ్రీ పంతులుగారు 1918లోనే కాలధర్మముజెందిరి. వారి శయాలతో నేను సేవా సంస్థను పెట్టి వారిని ఆనందముతో, స్వతంత్రముగా సందర్శించగల భాగ్యమానాడు నాకు లభించలేదని చాల బాధపడి యుంటిని. కాని వారి ముఖ్య స్నేహితులైన శ్రీ కందుకూరు వెంకటరత్నం పంతులుగార్ని కలుసుకొనుట జరిగినది. శ్రీ పంతులుగారు వితంతు వివాహుల జరుపుటకై ఆనాటి సనాతన ధర్మపరులను ఎదురుకొనుటకు, మూఢాచారములను నిర్మూలించుటకు, ఎన్నెన్ని అవస్థలు, అవమానాలు అనుభవించి వితంతు స్త్రీ జనోద్ధరణ చేయగల్గిరో శ్రీ వెంకటరత్నంగారి ద్వారా వినినపుడు నా మనుస్సు సంభ్రమాశ్చర్యములతోను, శ్రీ వీరేశలింగము పంతులుగారి యెడల కృతజ్ఞతా భాముతోను నిండిపోయినది. 10, 12 సంవత్సరములనుండి హితకారిణీ సమాజమునకు కమిటీ మెంబరుగానుండు భాగ్యము కల్గినది. ఒకప్పుడు శ్రీ పంతులుగారిచే నెలకొల్పబడిన వితంతు శరణాలయములో ఆర్థికపు యిబ్బందులవలన 16 మంది స్త్రీల కంటె ఎక్కువ మందికి భోజన, విద్యాసౌకర్యములు కల్పించు అవకాశము లేదయ్యెను. ఆ సమయమున ‘‘ఉమెన్ వెల్ఫేర్ సెంటర్’’ వారు ఇండస్ట్రియల్ సెక్షన్ ప్రారంభించి సుమారు 100 స్త్రీలకు సహకారము చేసెదమనియు, శరణాలయ ఆవరణలో స్థలము నీయవలెనని రశణాలయము వారిని కోరిరి. అప్పుడు శరణాలయమువారు ఆ సంస్థ స్త్రీ పునర్వివాహములకూ పాటుపడుచున్నదనియు, వితంతు స్త్రీ జనోద్ధరణమే శ్రీ పంతులుగారి ఆశయమనియు చెప్పి స్థలము నిచ్చుటకు నిరాకరించిరి. అప్పుడు నేను కమిటీ వారితో వాదోపవాదములు జరిపి శ్రీ వీరేశలింగము పంతులుగారు కేవలము వితంతు స్త్రీ జనోద్ధరణమే లక్ష్యముగా పెట్టుకొనలేదు, అన్ని రకములుగను స్త్రీ జనోద్ధరణ జరుపుటకూడా వారి లక్ష్యమే అనియు, మరియు మనము కేవలము 16 మందికి మాత్రమే సహకారము చేయగల్గుచున్నామనియు, ఉమెన్ వెల్ఫేర్ సెంటర్ వారు 100 స్త్రీలకు సహకారముచేసెదమనిరి గనుక తప్పక వితంతు శరణాలయ ఆవరణలో వారికి స్థానమీయవలెననియు చెప్పగా కమిటీ వారు ఆమోదించి తీర్మానమును చేసిరి.
ఈ విధముగా ఆ మహనీయుని ఆదర్శములను ఆధారముగా జేసికొని ఎనినయో సంస్థలు వెలసి స్త్రీ జనోద్ధరణ జేయుచున్నవి. శ్రీ వీరేశలింగము పంతులుగారి కాలమున జనానా స్కూలుగా ప్రారంభింపబడిన పాఠశాల నేడు శ్రీ వీరేశలింగం హైస్కూలుగా దినదినాభివృద్ధి చెందుచుండుట ఎల్లరకు తెలిసిన విషయమే.
ఈనాటి వారి స్మారకోత్సవ సంచికలో వారికి నా మనఃపూర్వక కృతజ్ఞత తెలుపగల అవకాశమును లభింప జేసినందులకు కార్యకర్తలైన శ్రీ ఆవుల సాంబశివరావుగార్కి నా ధన్యవాదములు.
———–