పేరు (ఆంగ్లం) | Vasala Narasaiah |
పేరు (తెలుగు) | వాసాల నరసయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1942 |
మరణం | – |
పుట్టిన ఊరు | కరీంనగర్ జిల్లా లోని మెట్పల్లి మండలం చవులమద్ది గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | పోస్టల్ సూపరింటెండెంట్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | స్వార్ధం వెళ్ళిపోయింది!, ముక్కుపుడక |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర బాల సాహిత్య పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వాసాల నరసయ్య స్వార్థం వెళ్లిపోయింది |
సంగ్రహ నమూనా రచన | గుండెల్లో ఒకటే దడ. మనసులో శంక, భయం. ఒంట్లో ఒనుకు, నరాల్లో రక్తప్రసరణ ఆగినట్లుగా వుంది. అయినా అదేదో శక్తి ముందుకు తోస్తుంటే నరేంద్ర క్వార్టర్లోకి నడిచాడు. చేతిలోని ఇన్సూర్డు పార్శిలు డైనింగ్ టేబుల్మీదుంచి, ఆశక్తతగా కుర్చీలో కూలబడ్డాడు. పార్శిలు చూడగానే పద్మకి ప్రాణాలు లేచి వచ్చాయి. ‘‘అబ్బ స్టీలు బిందె ఇప్పటికి సాధించారన్నమాట స్టీలు బిందెలో నీళ్లు తాగడమంటే అమృతం తాగినట్టేవుంటుంది’’ తింటున్న అన్నం వదిలేసి పార్శిలు ఒక చేత్తోనే అటూ యిటూ తిప్పింది. |
వాసాల నరసయ్య
స్వార్థం వెళ్లిపోయింది
గుండెల్లో ఒకటే దడ. మనసులో శంక, భయం. ఒంట్లో ఒనుకు, నరాల్లో రక్తప్రసరణ ఆగినట్లుగా వుంది. అయినా అదేదో శక్తి ముందుకు తోస్తుంటే నరేంద్ర క్వార్టర్లోకి నడిచాడు. చేతిలోని ఇన్సూర్డు పార్శిలు డైనింగ్ టేబుల్మీదుంచి, ఆశక్తతగా కుర్చీలో కూలబడ్డాడు.
పార్శిలు చూడగానే పద్మకి ప్రాణాలు లేచి వచ్చాయి. ‘‘అబ్బ స్టీలు బిందె ఇప్పటికి సాధించారన్నమాట స్టీలు బిందెలో నీళ్లు తాగడమంటే అమృతం తాగినట్టేవుంటుంది’’ తింటున్న అన్నం వదిలేసి పార్శిలు ఒక చేత్తోనే అటూ యిటూ తిప్పింది.
‘‘సిల్వర్ సర్కులేషన్‌తో చేరారేమో. బాగానే వుంది గాని, అడ్రసేమిటీ, ఊరు సరిగ్గానే వుందిగానీ మీదికాదే’’ పద్మే అంది.
నరేంద్ర మాట్లాడలేదు.
‘‘అవునూ, స్టీలు బిందె మోజులోపడి మీ మౌనాన్ని గమనించడమే లేదు నేను. ఇప్పుడేకదా? భోంచేసి ఆఫీసులోకి అడుగెట్టింది. అటు వెళ్ళిన ఐదు నిమిషాలకే యిటు పార్శిలుతో దర్శనమిచ్చారు. అంత నీరసమెందుకు?’’ ప్రశ్నలు కురిపించింది పద్మ.
‘‘ఓ కాఫీ ముందివ్వ. అంతా చెప్పుతా’’ అన్నాడు నరేంద్ర కణతలు నొక్కుకుంటూ.
కాఫీకేం కర్మ. హార్లిక్సే పట్టుకొచ్చింది పద్మ. అది తాగి ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు నరేంద్ర. అతనిలో మార్పేదో వచ్చేసింది.
‘‘చూడు పద్మా. ఈ పార్శిలు విప్పితే తళతళ మెరిసే స్టీలు బిందె కనబడుతుంది. ఈ కళ్ళున్నాయి చూచావు? ఇలాంటివాటికి లొంగిపోయి…’’
‘‘అబ్బా ఆ డొంక తిరుగుళ్ళు ఎందుకూ? డైరెక్టుగా చెప్పండి సార్’’ తొందరపెట్టింది.
‘‘చెబుతాను గాని, ముందు ఈ బిందెను మనం ఏం చేద్దామో చుప్పు’’ సూటిగా ప్రశ్నించాడు.
‘‘ఏం చేయడ మేమి? శుభ్రంగా వాడుకుందాం.’’ మురిసిపోతూ అంది.
‘‘కాని దాన్ని చూస్తూ రోజూ మనం బాధ పడలేమో’’ సాలోచనగా అన్నాడతను.
‘‘అదేంటీ, పాపం’’ బిత్తర పోయిందావిడ.
‘‘పాపం సంగతి తరువాత చూద్దాం. ముందు దీన్ని సుధ కిద్దామని వుంది నాకు.’’
‘‘అవును ఒక్కగానొక్క చెల్లెలు గదా? పాపం’’ పద్మ మాటల్లో వ్యంగ్యం స్ఫురించింది.
‘‘అదికాదు పద్మా అసలు యిది నా కష్టార్జితం కాదు గనుక, మనదగ్గర ఈ బిందె ఉండడానికి వీలులేదు.’’
‘‘అలా అయితే అది మనకు కూడా, సుధకు కూడా వుంచుకునే హక్కు లేదు. ఇంతకు ముసుగు ఎంతకూ తియ్యరన్న మాట ఏం మనుషులండి మీరు?’’ ఆమె మాటల్లో తిరస్కార భావం కనిపించింది.
నరేంద్ర కొంచెం చలించాడు. ‘‘ముసుగు తీస్తున్న… కాని ముడి విప్పాల్సింది నువ్వే సుమా’’ అన్నాడు లాలింపుగా,
‘‘సరే, కానీయండి.’’
‘‘మరేం లేదు పద్మా ఈ రోజు ఖాజీపేట నుండి వచ్చిన యేల్ బ్యాగులో లేటుగా వచ్చింది. యేల్ క్యారియర్ సలీం భోజనానికి వెళ్ళిపోయాడు. ఆఫీసులో ఎవరూ లేరు. బ్యాగు నేనే విప్పాను. అందులో ఈ పార్శిలు వెళ్ళింది. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కాని పార్శిలు లిస్టులో మాత్రం ఈ పార్శిలు తాలూకు ఎంట్రీ లేదు. అంటే ఎంట్రీ లేకుండా ఈ పార్శిలు ఎక్కువ వచ్చిందన్న మాట. అంటే ఓ వైపు అంతరాత్మ అరుస్తున్నా పట్టించుకోకుండా ఏమౌతుందిలే అని, నీకిద్దామని పట్టుకొచ్చాను’’ బరువు దించుకున్నట్లు ఫీలయ్యాడు నరేంద్ర.
‘‘లిస్టులో ఎంట్రీ లేకుండా ఎట్లా వస్తుంది మరి?’’ అనుమానం వ్యక్తం చేసిందావిడ.
రైల్వే యేల్ సర్వీస్‌కు చెందిన ఆఫీసులో ఆల్ఫాబెట్సు ఆర్డర్లో పోస్టాఫీసు లుంటాయి. మన ఈ పోస్టాఫీసు పేరుతో ఉన్న మరో పోస్టాఫీసు కూడా పక్కనే ఉండితీరాలి. అందుకే పార్శిలు లిస్టు మాత్రం అటు వేసేసి, అటు వెళ్ళే పార్శిలు మాత్రం రాత్రి నిద్రమత్తులో పొరపాటున, తొందర్లో ఇటు వేశారేమో పాపం’’ విడమరిచి చెప్పాడతను.
‘‘అయితే అవతల ఆ పోస్టాఫీసువాళ్ళు ఈ పార్శిలు రాలేదని నానా హైరానా పడి టెలిగ్రాములు ఇచ్చి ఉంటారు.’’
‘‘నువ్వు రిటైర్డు పోస్టుమాస్టర్ బిడ్డవి గదా? నీకు తెలియంది ఏముందిలే.’’
‘‘అయితే ఈ పార్శిలు మనమే ఉంచేసుకుంటే ఏ పాపం తెలియని వాళ్ళ జీతాల్లో కోతలు పడతాయి.’’
ఆ మాటతో వాళ్ళ సంభాషణ ఆగి పోయింది. ఇద్దరూ ఆలోచనల్లో పడిపోయారు. చదువు, వివేకం రెండూ ఉన్న ఆ యువ దంపతులు ఆ సమస్యతో ఎంతోసేపు సతమతమవ్వలేదు.
‘‘పద్మా ఈ లోకంలో కొందరు మగాళ్ళు తల్లిలాంటి, భార్యలాంటి స్త్రీ మూర్తులవల్లే చరిత్ర కెక్కారు. అందుకే ఈ సమస్య నిన్ను తేల్చమంది’’ అంటూ దగ్గరగా వచ్చాడు నరేంద్ర.
‘‘కౌగిలంతలూ, కవ్వింతలూ. ముద్దులూ ముచ్చట్లూ తరువాత. ముందు పార్శిలు తీసికెళ్ళండి. టెలిగ్రామ్ యివ్వండి. ‘‘నువ్వు ఎలాగయినా సంపాదించు కాని, నన్ను మాత్రం పోషించు, నువ్వెలా సంపాదించినా ఆ సంపాదన తాలూకు పాప పుణ్యాలు నీవే’. అన్న వాల్మీకి భార్యలాంటిది కాకూడదు. నేటి స్త్రీ నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా, సాహసించి బ్రతకాలి భర్తతో బాటు. చిన్న చిన్న ప్రలోభాలకు మనం పతనం కాకూడదండి. మీ అంతరాత్మ ఎప్పటికీ జీవించే ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ త్వరగా టెలిగ్రాం యివ్వండి. ఈ పార్శిలు మరెవ్వరూ కాజెయ్యకుండా లెక్కలోనికి తీసుకొని తిరుగు టపాలోనే పార్శిలు లిస్టులో ఎంట్రీవేసి పంపండి’’ త్వరపెట్టింది పద్మ.
‘‘పద్మా మైడియర్ థాంక్యూ సో మచ్’’ అంటూ ఉత్సాహంగా ఆపీసులోనికి దూసుకుపోయాడు సబ్ పోస్టుమాస్టర్ నరేంద్ర.
ఆ యింటిని ఆవరించిన స్వార్థం తన పాచిక పారనందుకు నిరాశతో మరో యింటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అది మీ యిల్లు కాకూడదు సుమండీ.
———–