పేరు (ఆంగ్లం) | Srinivasa Siromani |
పేరు (తెలుగు) | శ్రీనివాసశిరోమణి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శివోహం, పాహిమామ్, అంపకాలు, పొరపాటు, చంద్రథణైక పుత్రః |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శ్రీనివాసశిరోమణి |
సంగ్రహ నమూనా రచన | ఆ జయిలులో కోటయ్యను మించిన హోదా కలవాడు మరొకడు లేడు. అతడు కాన్విక్టు వార్డరు. జయిలుకు వచ్చి పధ్నాలుగు సంవత్సరాలు అయింది అని విన్నాను. తెల్లవారుఝామున నక్షత్రాలు అస్తమించకపూర్వమే నిరదలేచేవాడు. దిక్కులు పిక్కటిల్లిపోయేట్టుగా ‘‘ఏ తీరున నేను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా’’ అనే కీర్తనపాడడము మొదలుపెట్టేవాడు. |
శ్రీనివాసశిరోమణి
ఆ జయిలులో కోటయ్యను మించిన హోదా కలవాడు మరొకడు లేడు. అతడు కాన్విక్టు వార్డరు. జయిలుకు వచ్చి పధ్నాలుగు సంవత్సరాలు అయింది అని విన్నాను. తెల్లవారుఝామున నక్షత్రాలు అస్తమించకపూర్వమే నిరదలేచేవాడు. దిక్కులు పిక్కటిల్లిపోయేట్టుగా ‘‘ఏ తీరున నేను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా’’ అనే కీర్తనపాడడము మొదలుపెట్టేవాడు. ఆ కీర్తనపాడడము అయిపోగానే స్నానము చేసి పట్టెవర్ధనాలు తీర్చిదిద్ది పెట్టుకొనేవాడు. ఉదయభానుడికి ఎదురుగుండా నిలుచుని చేతులెత్తి నమస్కరించి ఏదో లోపలలోపల గొణిగేవాడు. ఆపాళంగా ఇక లాఠీ తీసుకొని తన వార్డుఖయిదీలమీద పెత్తనముచేయడానికీ, ఆయా పనులు పురమాయించడానికీ కోటయ్య తయారుఅయ్యేవాడు. ఖయిదీ లందరికీ యములవాడికి మల్లే తోచేవాడు. వయస్సుబాగా ముదిరింది. కాని దేహము సడలలేదు. అతను మాదిగకులమువాడని అందరికీ తెలుసును. కాని అందరూ అతనిని గౌరవించి ‘కోటయ్యగారూ’ అని సంబోధించేవారు.
నేను జయిలకు వెళ్లినరోజునే ఆతనిని చూచినాను. వారము రోజులు అయ్యేసరికి కోటయ్యతో సాహసము చేయవలెననే బుద్ధి పుట్టింది. మాకు ఇద్దరికీ బాగా సావాసము అయింది. చీకటిపడగానే లాంతరుతో తయారు అయ్యేవాడు. అతని కోర్కెమీదనే రామాయణము చదివిఅర్థము చెపుతూ ఉండేవాడిని. అతను అత్యంత శ్రద్ధతో వింటూఉండేవాడు. మధ్యమధ్య ఉత్సాహమురాగానే రామదాసు కీర్తనలు పాడుతూ ఉండేవాడు.
పదిమాసాల సావాసము అయిపోయింది. నా రోజులు అయిపోతున్నవి. ఈ కోటయ్య ఎందుకు ఏమి నేరు చేసి వచ్చినాడో తెలుసుకోవలెననే జిజ్ఞాస నాకు చాలా రోజుల కిందటనే కలిగింది. అడుగుదామని చాలాసార్లు అనుకొన్నాను. కాని అడగడానికి కోటయ్య యీ పదిమాసాలలోనూ అవకాశము ఇవ్వలేదు. ఆ రోజున రామాయణము ఇంకా అప్పటికి మొదలు పెట్టలేదు. కోటయ్య రాగానే ‘‘ఏం కోటయ్యా, రామాయణము పూర్తిచేయకుండానే జయిలునుంచి నేను వెళ్లిపోతానేమో’’ అన్నాను. ‘‘అవును, ఇంకా మీరు ఉండేది పదిహేను రోజులు – నాకు రామాయణము పూర్తిగా వినే అదృష్టము లేదు’’ – అంటూ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి గోడకు చేరగిలబడ్డాడు కోటయ్య. అతని ముఖము వివర్ణము అయింది. కండ్లవెంట జలజల కన్నీటి బిందువులు రాలుతూఉన్నవి. పెదవులు తడబడుతూ ఉన్నవి. అతనిలో అంత తత్తరపాటు కిందటి పదిమాసాలలో నాకు ఎన్నడూ గోచరించలేదు. నేనూ కంపించిపోయినాను. ‘‘ఏమి కోటయ్యా ఎందుకు అంత విచారము?’’ అని ప్రశ్నించినాను.’’
గద్గదస్వరము తో ‘‘నాకూ రోజులు సమీపిస్తున్నవి. ఒక సంవత్సరములో నన్నూ విడుదల చేస్తారు’’ అన్నాడు.
‘‘అట్లా అయితే సంతోషపడడానికి బదులు దుఃఖపడతావేమిటి?’’ అన్నాను.
‘‘దుఃఖము ఏమీ లేదు బయటికి పోవడము అంటే ఏం చేయడము అనే చిక్కు నన్ను మహా బాధపెడుతూ ఉంటుంది. అందుకే సూపరింటును సంవత్సరము అయినతరువాత ఏదయినా యీ జయిల్లోనే ఉద్యోగం చెప్పించమని అడిగాను. అనుకూలముగా జవాబు చెప్పలేదు.’’
‘‘అదేమిటి, ఎంతో కాలము ఈ జయిలులో ఉన్నావు. ఇకనయినా నీ పెండ్లాముబిడ్డలను యి చూడవలెనని నీకు లేదా’’
‘‘నేను ఒంటరివాణ్ణి. నాకు ఎవరూ లేరు.’’
‘‘అయితే మరీ హాయి.’’
ఈ మాటకు కోటయ్య పెద్దపెట్టున నవ్వినాడుకాని బ్రహ్మాండము అయిన విచారము అతని ముఖములో కనిపించింది.
‘‘అయితే నీ స్వగ్రామము పోవడము నీకు ఇష్టము లేదన్నమాట.’’
‘‘అవును’’ అన్నాడు. అతనిముఖము వికసించింది.
‘‘అయితే మావూరు రా, నా దగ్గిరఉందువు గానీ. ’’
‘‘రోజూ రామాయణము చదువుతారా?’’
‘‘ఓ’’
‘‘అయితే సంతోషముగావస్తాను. కాని’’
‘‘కోటయ్యా, నీవు పెండ్లిచేసుకోలేదా?’’
‘‘అదంతా అడగనూవద్దు, నేను చెప్పనూవద్దు.’’
‘‘ఫరవాలేదు. నేను నీకంటే చిన్నవాణ్ణి అయినా చెపుతున్నాను, విను. చాలావిషయాలు దిగమింగినకొద్దీ బాధ ఎక్కువ అవుతుంది. ఆ బాధ మానసికముగానూ, దైహికముగానూ మనిషిని కుంగదీస్తుంది. అందువల్ల ఆ బాధ ఏదో మరికొకరితో – అందులో ఆత్మీయులతో చెప్పుకొంటే తీరిపోతుంది. పయిగాకర్తవ్యము బోధపడుతుంది.’’
‘‘ఏమో నిజమేనేమో. కాని చెప్పను. చెప్పలేను.’’
‘‘ఎందుకు అంతభయము? నాతో చెప్పడానికి సంకోచము ఎందుకు?’’
‘‘ఏం చెప్పమన్నావు పంతులూ?’’
‘‘నీవు అసలు ఏం నేరము చేశావు?’’
కోటయ్య తల పంకించి ‘‘ఖూనీ చేశాను.’’
‘‘అది మహాపరాధముగా తోచి బాధపడుతున్నావా?’’
‘‘నాకు తెలియదు. నేను చేసింది తప్పు కాదేమోను అనీ అనిపిస్తూ ఉంటుంది.’’
‘‘అయితే ఏదయినా అన్యాయయము భరించలేక ఖూనీ చేశావా?’’
‘‘పంతులుగారూ, ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేయడము. తప్పో ఒప్పో – ధర్మమో, అధర్మమో – పుణ్యమో పాపమో చెప్పివేస్తాను ఇంతకాలమూ ఎవరికీ చెప్పలేదు. నా సంగతి అంతా వినండి. ఆ తరువాత అందుకు పరిహారము ఏమిటో సెలవు ఇవ్వండి’’. అంటూ కోటయ్య నాముఖమువంక తేరిపారచూచినాడు.
అతని కథ వినడానికి నేను ఆసనకుద్ధిగా కూర్చున్నాను. ‘వినండి’ అన్నట్టు చూచి కోటయ్య ఈ విధముగా మొదలుపెట్టినాడు.
ఆఊరికి వారు కరణాలు. మేము పెద్దమాదిగవాండ్లము. చెరువుకింద అయిదుయకరాల మాగిలిభూమి మరి అయిదుయకరాల జరీబు భూమి. ఇంకొక అయిదుయకరాల మెట్టభూమి క మూడు యకరాల పశువులబీడు వారికి ఉండేది. రెండుకాండ్ల వ్యవసాయము. నేను పెద్దకమతగాడిని. నాకింద నల్గురు జీతగాండ్లు కాపులూ రుడ్లూ ఉండేవాండ్లు. కరణముగారి కమతము నాకు ముందు మావంశేమువారు ఎనిన తరాలకిందట ఆరంభించినారో నాకు తెలియదు. పధ్నాలుగు పురుషాంతరాలబట్టీ వారు ఆ గ్రామానికి కరణీకము చేస్తుఉన్నట్టూ, మేమున్నూ అన్నితరాలబట్టీ వారి కమతము చేస్తూఉన్నట్టూ మాకరణముగారే చెప్పినారు. మా తాత – మా నాయనా వారి కమతము చేయడము మాత్రము నేను ఎరుగుదును. మా కరణముగారు కరణీకానికి రావడమున్నూ, నేను కమతములో చేరడమున్నూ కొంచెము ఇంచుమించు ఒకేసారి జరిగింది.
నాకు బాగావయస్సు ముదిరేవరకూ నేను పెండ్లిచేసుకోలేదు. మా కరణముగారే నన్ను పెండ్లిచేసుకోమని ప్రోత్సాహపరచి మాకులమువాండ్లు అందరితోనూ చెప్పి రెండుసంవత్సరాలు మాకులములో ఆయా సంబంధాలు స్వయముగా విచారించి, నాక ఈడూ జోడూ అయినదాన్ని చూచి స్వయముగా నడుముకట్టుకొని నిలుచుని నా పెండ్లి చేయించారు.
మా కరణముగారు నాకంటే అయిదారుసంవత్సరాలు చిన్నవారు. వయస్సుకు చిన్నవారేకాని వారు చాలా సమర్థులు, బుద్ధిమంతులు. ఈతప్పు మాకరణముగారు చేసినారు అనడానికి వీలులేదు. ఆయనఇల్లాలు ఆయనకంటే మరీ మంచామె. ఆ మహాయిల్లాలు చేతితో కానీ, నోటితో కానీ ‘లేదు’ అని రగదు.
నా పెండ్లామున్నూ మంచిదే. నన్ను ఎన్నడూ దేనికీ కష్టపెట్టిఎరగదు. అసలు దానికోవే మంచిది. మా కరణంగారికి తెగ పిల్లలు పుట్టినారు. ప్రతిరెండు సంవత్సరాలకూ పిల్లవాడో పిల్లో వారి ఇంట్లో పుట్టుకొనిరావలసిందే. నాకు పిల్లలు లేరనే విచారము కలగలేదు. కాని పదిసంవత్సరాలు అయ్యేసరికి మా ముసలిదానికి పిల్లలు లేరే అని విచారము విపరీతముగా బాధపెట్టింది. చెట్లకూ పుట్టలకూ మొక్కుతూఉండేది. నా పెండ్లానికి కడుపు వచ్చింది. నెలలునిండేసరికి దాని ఒంట్లో ఏదో రుగ్మత ఏర్పడ్డది. మాకరణముగారే బలవంతముచేసి అది నీళ్లాడడానికి బస్తీలో ఆసుపత్రికి పంపించినారు. నా పెండ్లామునీళ్లాడింది. ఆడపిల్ల పుట్టింది. కాని ఎన్ని మందులు వేసినా లాభము లేకపోయింది. అది అయిదోరోజున చచ్చిపోయింది. పసికందు మారతము మిగిలింది. పసిబడ్డను తీసుకొనివచ్చి ఎట్లా పెంచినానో భగవంతుడికి తెలియవలెను. పెంచినా, దానికి అయిదారు ఏండ్లు వచ్చేవరకూ నాకు మహాఅవస్థ అయింది. నన్ను అనేక సార్లు మళ్ళీ పెండ్లిచేసుకోమని మా కరణముగారు చెప్పినారు. కాని నాకు మరోక ఆడదానికమీద మనసు పోలేదు. నేను పెండ్లిచేసుకోలేదు. ఆ ఆడపిల్లను పెట్టుకొనే కాలము గడుపుతూ వచ్చాను.
అది చిచింద్రీలాంటి పిల్ల. దానికి మా కరణంగారే జోతి అని పేరు పెట్టారు. అందరూ దాని తెలివతేటలకూ, దాని చాకచాక్యానికీ మెచ్చుకొంటూఉండేవారు. తెలివితేటలే కాకుండా అది అందమయిన పిల్ల. ఉక్కుముక్కకు మల్లే ఉండేది. ఎంత పని అయినా ఇట్టే చేసివేసేది. దానికి ఏడోఏడు వచ్చేసరికే నాకు ఉడకవేసి పెట్టసాగించింది. నేను పొలముపనిలో టే నాతోపాటు అది నాకు ఏదోసాయలా చేస్తూ ఉండేది.
అయిదుయకరాల మాగిలిపోలములోనూ నాతో నిమిత్తము లేకుండా పదిమంది ఆడవాళ్లనూ తీసుకొని రెండోరోజు చీకటి పడేసరికి వరినాటు అంతా అదే పూర్తిచేయించేది. నేను మెట్టచేలో జడ్డిగముతోలుతూ ఉంటే అది ఒడికట్టుకొని గింజలు పిడతలో బీరుపోకుండా వదిలేదు. సాయంత్రానికి యకరమూ ఎదపెట్టడము పూర్తిచేసేవాండ్లము.
మాజోతి మంచెమీద నిలుచుని వడిపాల తీసుకొని గిరగిర తిప్పిందో – మహామొనగాడి దొంగపిట్టలు కూడా మూడుఆమడ పారిపోయేవి. దాని పడిసాలరాయి తగిలితే గింగిరాలు తిరుగుతూ పిట్టల నేలమీదపడి తన్నుకొని చావవలసిందే. మరి తిరుగు ఉండదు. దాని గురి అటువంటిది. ఊరుంపాలేల రైతులు మాచేను కాపలాకు రమ్మంటే మాచేను కాపలాకు రమ్మని బతిమలాడేవారు. వరహాయిస్తామనీ, మొహరీ ఇస్తామనీ ఆశపెట్టేవారు. నేను కానీ, నాజోతికానీ డబ్బు చూసుకోలేదు. మేము డబ్బు అవసరము ఎరగము. అన్నీ కరణముగారే సార్లాచేసేవారు. ఇది లేదు అనేది మేము ఎరగము. మా కులము వేరు కాని వారి ఇంట్లో పండగ అయితే మాకూ పండగే. వారి అంతస్తుకు తగిన గుడ్డలు వారి ఇంటికి వస్తే మా అంతస్తుకు తగిన గుడ్డలు మా ఒంటిమీదికి వచ్చేవి. వారు పెరుగుతాగితే మేమూ పెరుగు తాగినాము. గారెలు, బూరెలు, ఆరిసెలు, పరమాన్నము వారి యింట్లో ఆడవారుకష్టపడి వండేవారు. మాకు ఆకష్టము ఏమీ లేకుండా చక్కగా రుచిచూసి రుచులు చెప్పేవాండ్లము.
ఇట్లా చూస్తూ ఉండగానే జోతికి పదిహేను సంవత్సరాలు వచ్చినవి. చీరే గీరే కట్టుకొని గుమ్మటముకు మల్లే నాతోపాటు చేలో పాటు చేస్తూఉండేది. సరీగా వేళకుపోయి ఇంత ఉడకవేసి ఇట్లా చేసేసరికి దుత్త నెత్తిన ఎత్తుకొనివచ్చేది. ఇద్దరమూ ఒక గిన్నెలోనూ కలుపుకొని తినేవాండ్లము. దానికి ఇంత వయస్సు వచ్చింది అని కానీ, దానిని మరిఒక అయ్య చేతిలో పెట్టవలెనని కానీ నాకు తోచనేలేదు. అసలు ఆఊహే రాలేదు.
మాకరణంగారే ఒకనాడు ‘‘ఒరే కోటా జోతికి పెండ్లి ఎప్పుడు చేస్తావురా’’ అన్నారు. అంతటితో నిరదమెలకువ వచ్చినట్టు అయింది. జోతి నాదగ్గర ఉండకుండా మరి ఒకడికి యిల్లాలుగా పోతుందని తోచేసరికి నాకు ఆవ్చర్యమూ విచారమూ రెండూ ఒక్కసారి పెనవేసుకొన్నవి. ఇందుకు కాబోలు తలిదండ్రులు మొగ పిల్లలకోసము తాపత్రయపడేది అనుకొన్నాను. వెంటనే ‘‘దొరా, జోతిపెండ్లి? తొందరేమి వచ్చింది? చైత్రమాసములో చిన్నదొర పెండ్లిచేయించండి’’ అన్నాను. మాదొర నావంక ఎగాదిగా పరకాయించి చూచి ‘‘నిజమే’’ అన్నారు. ఆయన ఎందుకు అట్లా అన్నారో నాకు అప్పుడు సరీగా తెలియలేదు.
చిన్నదొర అంటే మాకరణముగారి జ్యేష్ఠపుత్రుడు. మద్రాసులో మా కరణముగారి పెద్ద అల్లుడుగారి ఇంట్లో ఉండి ఇంగ్లీషు చదువుకొన్నాడు. పద్దెనిమిదో ఏడు వచ్చేసరికి మా పెద్ద దొర చిన్న దొరను చదువుమానివేయమన్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివితే కరనీకము చేయడని మా పెద్దదొర అభిప్రాయము. అందుకోసము చదువు మానుకొని రావలసింది అన్నాడు. చదువు మానడము చిన్నదొరకు ఇష్టములేదు. అయితే పెద్దదొర చండశాసనుడు. భయపడి చదువు మానుకొని చిన్నదొర ఇంటికిచేరినాడు. ఇంట్లో కూర్చుంటే మా చిన్నదొరకు తోచేది కాదు కాబోలు, తెల్లవారుతూనే పొలము వచ్చేవాడు. కొద్దిరోజులు అయ్యేసరికి పొలముపాటు వయముగా చిన్న దొర అజమాయిషీచేయడము మొదలుపెట్టినాడు. అంతటితో నాబాధ్యత చాలావరకూ తప్పింది. యజమానే వయముగా చూచుకొంటూఉన్నాడు కాబట్టి నా పూచీ చాలావరకూ తగ్గిపోయినట్టే అయింది. చిన్న దొర వ్యవసాయాములోకి దిగేవరకున్పే నేను పగటి వేళ నిద్రపోయి ఎరగను. అటువంటిది మధ్యాహ్నము అప్పుడు కాస్త కూరుకుతీయడము మొదలుపెట్టినాను. అంతేకాదు, పా జవాబుదారీ అనేది లేకపోయేసరికి సందెవేళ అయ్యేసరికి నాకు నిద్రవస్తూ ఉండేది హాయిగా సొమ్మసిల్లి నిద్రపోతూఉండేవాణ్ణి.
మెట్టపంట దైవాధీనపంట. దైవము అనుకూలిస్తే పండుతుంది. లేకపోతే ఎండుతుంది. మాగాణిపంట చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే పండుతుంద. అయితే మా చెరువు ద్వాదశర్ష క్షామము వచ్చినా వట్టిపోదు. అందువల్ల ఏపంట పండినా ఎండినా మాకు తిండిగింజలు ఉండవనే బాధకానీ, మా పశువులకు పశుగ్రాసము ఉండదనే బాధకానీ లేదు. ఇక జరీబుపయిర్లు మనుష్యప్రయోజకత్వాన్ని పట్టి పండుతూ ఎండుతూ ఉంటవి. అది అంతా ఎద్దు మెడమీది వ్యవసాయము. ఒక ఎద్దులు బావిలో నీళ్లు తోడడముతోటే సరిపోదు. దానికి మొగవాడూ, ఆడుదీకూడా తంటాలుపడవలెను. నేను మోటతోలేవాణ్ణి. నేను మోటతోలినంతసేపూ నాకూతురు మళ్ళకు నీళ్ళుకట్టేది. ఈజరీబు సాగుమీద మా చిన్నదొరకు మోజుపుట్టింది. ‘‘మోటకాదు. ఇంజనూ, పంపూ పెడుతాను. ఏటికి ఏడాదీ జరీబు సాగించవలసిందే’’ నన్నాడు. బావికి ఇంజనూ పంపూ పెట్టినారు. ఇంజను ఆడించడము చిన్నదొర నాకూతురు జోతికి చూపించినాడు. నా జోతే ఇంజన్, ఆడించేది, దొనలోనుంచి వచ్చినట్టు ఏకధారగా పంపు నీళ్ళు కుమ్మరిస్తూఉండేది. పుట్టుకు పుట్లు ఉల్లిపాయలూ, బండ్లకు బండ్లు పొగాకూ, జల్లలకు జల్లలు వంకాయలూ తెల్లవారేసరికి బస్తీకి మా జరీబులోనుంచి వెళుతూఉండేవి. సాయంరతము అయ్యేసరికి మాదొరఇంట్లో టంకశాలమాదిరిగా రూపాయలు మోగుతూ ఉండేవి. అంతా మూడుపులూ ఆరుకాయలూ మాదిరిగా సాగిపోతూఉంది.
జోతికి అన్నము ఇమడడము లుద. తిన్నదంతా కక్కుకొనేది. ఎప్పుడూ తలనొప్పి అని పడుకొనేది. లేవలేక పోయేది. మాపాటిలో వైద్యుడికి చూపించినాను. వాదేడో అన్నాడు. కాని నాకు నచ్చలేదు. ఏవేవో మందులు తింటూనే ఉండేది జోతి. ‘‘నేను ఈబాధ పడలేను. చచ్చిపోతాను’’ అని జోతి నాతో అనటము మొదలుపెట్టింది. రాత్రింబవళ్లూ కండ్లు మిటకరించుకొని పడుకొని చూస్తూ ఏదో తిదేకముగా ఆలోచిస్తూ ఉండేది. మాట్లాడించినా మట్లాడేది కాదు. ఆరోగము ఏమిటో తెలియలేదు. ఏదయినా గట్టివైద్యము చేయించవలసిందని పెద్దదొరతో చెప్పినాను. బస్తీనుంచి డాక్టరు దొరసానిని పెద్దదొర పిలిపించినాడు. డాక్టరు దొరసాని వచ్చి చూచింది. నన్ను బయటికి పొమ్మని పరీక్షచేసింది. ‘‘నీ కూతురి కేమీ భయము లేదు. హాయిగా ఉంటుంది’’ అని నాతోచెప్పి దానితో ఏదో చాలాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. సంగతేమిటో అంతుపట్టలేదు.
చీకటిపడేవరకూ నిబ్బరముగా ఊరుకొన్నాను. పెద్దదొరతో మాట్లాడి తెలుసుకొందామనుకొంటూ ఉండగా ఆయనే వచ్చినాడు. మేము ఇధ్దరమే ఉన్నాము. మరి ఎవ్వరున్నూ లేరు. ‘‘ఏమిరా కోటా జోతి తప్పు చేసింది. దానికి మూడో నెల కడుపు అని దొరసాని చెప్పింది’’ అన్నాడు పెద్దదొర. నేను నమ్మలేక పోయినాను. ఉత్తరక్షణములో నాగుండెలు పగిలిపోయే దుఃఖము వచ్చింది. మనస్సును చిక్కబట్టలేకపోయినాను. ‘‘దొరా, ఏమి చేయమంటావు’’ అని ప్రశ్నించాను.
‘‘కోటా తొందరపడకు. దాని ముందుగతి ఏమిటో జాగ్రత్తగా ఆలోచింతాము. ఇప్పుడప్పుడే దాన్ని ఏమీ అనకు’’ అని దొర సలహా చెప్పినాడు. కాని నాకు కాలు నిలవలేదు. నేనిక ఆయనతో మాట్లాడలేక పోయినాను. ఆయన ఇంకా ఏమియినా చెప్పినాడేమో నాకు వినిపించలేదు. హుటాహుటీ ఇంటికి వచ్చాను. జోతి అన్నము వండుతూ ది. న్ను చూచి నివ్వెరపోతూ నిలుచుంది. నేను బీటిలోనుంచి వచ్చినాను. నా బుజాన గొడ్డలి ఉంది. ఆగొడ్డలితో జోతిని తెగవేయవలె ననిపించింది. చెయియ అప్రయత్నముగా గొడ్డలిపిడి పట్టుకొంటున్నది. జోతి వలవల ఏడ్చింది. ఆ ఏడుపుకు నా వూనిక మారిపోయింది.
‘‘నీరోగం ఏముటో తెలిసింది.’’
జోతి మాట్లాడకుండా తల వంచుకొంది.
‘‘ఇటువంటి ఛండాలపు పని చేస్తావనుకోలేదు.’’
జోతి మాట్లాడలేదు.
‘‘నీవు మోసపోయినావా – నీవే మోపపుచ్చినావా?’’
జోతి మాట్లాడలేదు.
‘‘ఇటువంటి పాడుపనికి నీవు ఎట్లా ఒప్పుకున్నావు?’’
మాటలేదు.
‘‘చెపుతావా ఈ గొడ్డలితో నీశిరస్పు పగటకొట్టమన్నావా?’’
‘‘నేను ఒప్పకోలేదు బలవంతాన అయిపోయింది.’’
‘‘ఆబలవంతము చేసినవాడెవడో చెప్పు’’
‘‘చిన్నదొర’’
‘‘ఆఁ ఆఁ’’ అన్నాను. నమ్మలేక పోయినాను. క్షణకళము ఆలోచించినాను. ‘‘ధగడీ, నిజము చెపుతున్నావా’’ అని గర్జనము చేసినాను.
’’నాయనా నిజము చెప్పినాను. ఆయన గాబట్టి వదలించుకోలేక పోయినాను. మరొకడు అయినట్టయితే ….’’ అని జోతి వలవల ఏడ్చింది. క్రిందపడి దొర్లడము మొదలు పెట్టింది. నాకు పిచ్చెత్తినట్టు అయిపోయింది. నేను చతికిలబడిపోయినాను. నా దేహమంతా తుకతుక ఉడికిపోతూఉంది. ‘‘ఛీఛీ – ఇక నీ చేతి అన్నము తినను’’ అంటూ ఆ గొడ్డలితో ఆ అన్నభాండము పగలగొట్టినాను. ‘‘నా కడుపు చెడబుట్టినావు. నీతల్లి దొడ్డది. నేను పరాయి ఆడుదాన్ని కన్నెత్తి చూడలేదు. నీవు కులనాపకపుముండవు పుట్టావు.’’ నీవు నీవు చచ్చిపోరాదూ’’ అన్నాను. నాకు ఏడుపు వచ్చింది. ఆపుకోలేకపోయినాను. పెద్దపెట్టున ఏడ్చినాను. ఆ తరువాత ఏమయిందో తెలియదు.
బారెడు పొద్దు ఎక్కింది. జీతగాడు వచ్చి కేకలు వేస్తే నిద్ర మెలుకువ వచ్చింది. లేచి చూచినాను. జోతి లేదు. యిల్లంతా బావురుమంటూ ఉంది. మనస్సు పరిపరి విధాల పోయింది. అట్లాగే లేచి పొలము పోయినాను. ఏ పనీ చేయబుద్ధి పుట్టలేదు. జీతగాండ్లకు ఆయాపనులు పురమాయించి బీటిలోకి పోయి దూడలనూ, ఆవులనూ మేపడము మొదలుపెట్టాను. జోతి ఏమయిపోయింది అనే ఆలోచన పట్టుకొంది. మధ్యాహ్నము దొర యింటినుంచి అన్నము వచ్చింది. తినను అన్నాను. సాయంత్రము దొర వచ్చి అన్నము తినమన్నాడు. ‘‘ఇక అన్నము ఈ జన్మకు తినను’’ అన్నాను. దొర ఎంతో చెప్పాడు. నా చెవుల కాయన మాటలు ఎక్కలేదు. ఆ రాత్రి గొడ్ల కొట్టములో పడుకొన్నాను. మరునాడు లేవ బుద్ధిపుట్టలేదు. అట్లాగే పడుకొన్నాను. రెండు రోజులూ ఉపవాసముతోనే ఉన్నాను. మూడోరోజు తెల్లవారుతూనే జీతగాడు వచ్చి ‘‘జోతి బావిలో తేలింది’’ అన్నాడు. మారు మాట్లాడకుండా బయలుదేరినాను.
అంతకాలమూ నేను మోటతొలిన బావిదగ్గరకు పోయినాను. జోతిని బావిలోనుంచి బయటికి తీసినారు. చూచినాను. నా కాళ్లు నన్ను అక్కడ నిలవనీయలేదు. నా కండ్లు బైర్లు కమ్మినవి. పరుగెత్తబుద్ధిపుట్టింది. పరుగెత్తుకొని వస్తున్నాను. ఎదుట కంపతొడుగులక గుచ్చిన రాగోలలు కనిపించినవి. నేను స్వయముగా చేయించిన రోగాల ఒకదాన్ని ఆ కంపతోడుగులో నుంచి బయటకు ఊడబెరికినాను. ఆ రాగోల బుజాన పెట్టుకొని నురుగులు కక్కుకొంటూ దొర ఇంటివైపుకు పరుతెత్తుతున్నాను. ఎదురుగుండా చిన్నదొర వస్తూ ఉన్నాడు. ‘‘వస్తూ ఉనానవా – నీ కోసమే వస్తూ ఉన్నాను’’ అన్నానో లేదో నా బుజముమీదినుంచి రాగోల లేచింది. రెండు చేతులతోనూ చిన్నదొర నెత్తిన బాడినాను. పుర్రె దానిమ్మపండులాగా పగిలిపోయింది.
ఆ కళేబరాన్ని బుజానవేసుకొన్నాను. వేడివేడి నెత్తురుతో స్నానముచేస్తూ గ్రామ మునసుబు ఇంటికి పోయినాను. ‘‘ఓ మునసబూ ఈ బ్రాహ్మణుడు నాకూతురిని చెరిచాడు. నా కోపానికి అదిపోయి భావిలోపడి చచ్చింది. నేను బ్రాహ్మణ్ణి చంపాను. ఇక నీవు చేసే దేదో నీవు చేయి. నన్ను ఉరితీయించు బాబూ’’ అని ఆ కళేబరాన్ని అక్కడ పారవేశాను.
జడ్జీతో ఎన్నివిధాలో చెప్పుకొన్నాను. నేనే మంచివ్యక్తతతో చంపివేసినాననీ, నన్ను ఉరితీయించమనీ వేడుకొన్నాను. ఆ జడ్జీ నా మాట వినలేదు. నా కోర్కె మన్నించలేదు. తాత్కాలిక చిత్తభ్రమణమువల్ల ఖూనీ చేసినాదు అనీ, జీవితాంతముశిక్ష అనీ చెప్పినాడు.
ఇందువల్ల ఈ జయిలుకు వచ్చాను. ఇప్పుడు విడుదలచేస్తే ఏఊరు పోయేది ఏమి చేసేది?’’
‘‘కోటయ్యా, మా ఊరు రా, నా దగ్గిరఉందువు గాని. నీవు ఏమీ చేయనక్కరలేదు’’ అని నేను అన్నాను.
కోటయ్య కొంతసేపటికి నవ్వతూ ‘‘పంతులూ, నీవు చాలా చదువుకొన్నావు, చెప్పు నేను చేసింది ధర్మము అంటావా అధర్మము అంటావా?’’
‘‘ఓయి వెర్రివాడా ఈ ప్రపంచములో సుఖదుఃఖాలూ, ధర్మాధర్మాలూ, పుణ్యపాపాలూ నులకతాడుకు మల్లే పెనవేసుకొని ఉన్నవనీ, ఇక్కడికి ది సుఖము ఇక్కడికి ఇది దుఃఖము అనీ, ఇంతవరకూ ధర్మము, ఇంతవరకూ అధర్మము అనీ విడదీయడానికి వీలు లేదని అన్నారోయ్ పెద్దలు.’’
‘‘అట్లానా – బాగుంది’’ అంటూ కోటయ్య తూర్పుదిక్కుచూచి ‘‘అరే తెల్లవారవస్తూఉంది. పొద్దు కండెలువిచ్చుకూ ఉంది’’ అంటూ ‘‘ఏ తీరున నను దయ జూచెదవో ఇనవంశోత్తమ రామా – నా తరమా భవసాగర మీదను’’ అంటూ దిక్కులు పిక్కటిల్లి పోయేట్లుగా పాడడము మొదటు పెట్టినాడు.
———–