అట్లూరి పిచ్చేశ్వరరావు (Atluri Pichcheswararao)

Share
పేరు (ఆంగ్లం)Atluri Pichcheswararao
పేరు (తెలుగు)అట్లూరి పిచ్చేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుచౌదరాణి
పుట్టినతేదీ4/12/1925
మరణం
పుట్టిన ఊరుకృష్ణా జిల్లా, చౌటపల్లి
విద్యార్హతలు1948లో B R W, K C G పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు.
వృత్తిభారత జలసేన లో పని చేసారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిముక్తి (1946) , వింత మరణం (1956), పనిమనిషి (1946) ,
వసుంధర (1946) , మరపే మెరుగు (1946), ఒక అనుభవం , జీవచ్ఛవాలు
నెత్తరు కథ ,గడవని నిన్న , కోరిన వరం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునేవీ నుండి వచ్చేసిన తరువాత ఈయన తొలుత కొంత కాలం విశాలాంధ్ర తెలుగు దినపత్రికలో పనిచేసారు. 1962లో అప్పటి మద్రాసు (నేటి చెన్నై) కి వచ్చి సినీ రచయితగా మంచి పేరును సంపాదించుకున్నారు. రచయితగా ఎన్నో ప్రసిద్ధ రచనలు చేసారు. హిందీ నుండి తెలుగులోకి అనువదించిన వాటిలో గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, గాడిద ఆత్మకథ ముఖ్యమైనవి. అనువాదాలే కాక ఎన్నో కథలు, రేడియో నాటకాలు, ఇతరాలు రచించారు. మనసులో మనిషి చెప్పుకోదగ్గ రచన. గౌతమ బుద్ధ మరియు వీరేశలింగం డాక్యుమెంటరీలకు చేసిన స్క్రిప్టు ఈయన రచన కౌశలతకు తార్కాణాలు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅట్లూరి పిచ్చేశ్వరరావు
సంగ్రహ నమూనా రచనఒక రచయితకు అర్హతకు మించిన గుర్తింపు లభిస్తుంది. మరొక రచయితకు అర్హతకు తగిన గుర్తింపు కూడా రాదు. మొదటి దానికంతగా విచారించనక్కర్లేదు. కానీ, రెండో దానికి అనివార్యంగా విచారం కలుగుతుంది. ఎందుకంటే, అర్హతకు మించిన గుర్తింపు రావడం వల్ల ఆ రచయితకు కొంత ప్రయోజనం కలిగినా, అందువల్ల సాహిత్యానికీ, సమాజానీకీ కలిగే నష్టం అంతగా వుండదు. అంతేగాదు, అర్హతకు మించిన గుర్తింపు అట్టే కాలం నిలిచివుండదు.

అట్లూరి పిచ్చేశ్వరరావు

ఒక రచయితకు అర్హతకు మించిన గుర్తింపు లభిస్తుంది. మరొక రచయితకు అర్హతకు తగిన గుర్తింపు కూడా రాదు. మొదటి దానికంతగా విచారించనక్కర్లేదు. కానీ, రెండో దానికి అనివార్యంగా విచారం కలుగుతుంది. ఎందుకంటే, అర్హతకు మించిన గుర్తింపు రావడం వల్ల ఆ రచయితకు కొంత ప్రయోజనం కలిగినా, అందువల్ల సాహిత్యానికీ, సమాజానీకీ కలిగే నష్టం అంతగా వుండదు. అంతేగాదు, అర్హతకు మించిన గుర్తింపు అట్టే కాలం నిలిచివుండదు. రచయిత అర్హతకు తగిన గుర్తింపు రాకపోతే మాత్రం సాహిత్యానికీ, సమాజానికీ ఎంతో కొంత నష్టం జరిగితీరుతుంది. గుర్తింపుకు రాని రచయిత తన సాహిత్యం ద్వారా ఏం చెప్పిందీ, ఏ విలువల కోసం పోరాడిందీ తెలీక పోవడం వల్ల, అటువంటి నష్టం కలుగుతుంది. అట్లూరి పిచ్చేశ్వరరావు విషయంలో అలా జరిగిందనిపిస్తుంది. పిచ్చేశ్వరరావుకు గుర్తింపే రాలేదనికాదు, అర్హతకు తగిన గుర్తింపు రాలేదనే చెబుతున్నది. అందుకు కారణాలున్నాయి. వాటిని తర్వాత చెప్పుకుందాం.

ఎవరీ పిచ్చేశ్వరరావు?

ఈ ప్రశ్నకు నేనైతే, ‘‘పిచ్చేశ్వరరావు మా పెద్దమ్మ కొడుకు, మా పులపర్రువాడు, పిచ్చేశ్వరరావు లేకుండా వుండివుంటే, ఈ అట్లూరి రాధాకృష్ణ కూడా లేకుండా వుండేవాడు, ఉండినా ఇలా వుండేవాడు కాడు, ఇంకెలాగో వుండేవాడు’’ అంటాను. అంటే, పిచ్చేశ్వరరావు ప్రభావం నావిూద అంతలా వుందనీ, ఈ నేను రూపొందిందే ఆ ప్రభావంతోననీ అనడమన్నమాట. నా ద్వారా పిచ్చేశ్వరరావును చూపించడం కన్నా, పిచ్చేశ్వరరావును పిచ్చేశ్వరరావు ద్వారానే చూపించడం సరైన పద్ధతి. అందువల్ల, నాకు పిచ్చేశ్వరరావుకూ వున్న సంబంధం గురించీ, అనుబంధం గురించి అవకాశాన్ని బట్టి మరోసారి చెబుతానని, హామీ ఇస్తున్నాను. ఇప్పుడు పిచ్చేశ్వరరావును గురించి కొడవటిగంటి కుటుంబరావు ఏం చెప్పారో చెబితే, గౌరవ ప్రదంగా వుంటుంది కదా!

‘విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌’’ వారు 1967 నవంబర్‌లో మొదట ‘పిచ్చేశ్వరరావుకథలు’ ప్రచురించారు. దానికి కుటుంబరావు ‘కథకుడుగా పిచ్చేశ్వరరావు’ అంటూ, ముందుమాట రాసారు. ముందుమాటలో మొదటి మాటగా ఇలా అన్నారాయన. ‘‘అతను చనిపోయాడంటే నేను నమ్మలేను. అతను ఇంకా నాకళ్ళకు కట్టినట్టు కనపడుతూనే వున్నాడు’’ ఈమాటలు ఒక కథలో పిచ్చేశ్వరరావు అన్నవి. ఈ మాటల్నీ పిచ్చేశ్వరరావును గురించి కుటుంబరావూ అన్నారు. అంతేనా? ఇంకా ఇలా అన్నారు. ‘‘ఒక మనిషి చావు అవాస్తవం అనిపించడానికి కారణం ఏమిటని ఆలోచించాను. ఆ మనిషిమీద ప్రేమాభిమానాలే అందుకు కారణంకాదు. మనిషితోపాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో వుంటుంది. అదే ఆ మనిషి చావును నమ్మశక్యం కాకుండా చేస్తుంది’’ గొప్ప విశ్లేషణ కదూ! పిచ్చేశ్వరరావులో మిగిలిపోయిన సజీవతను గుర్తించిన కుటుంబరావు ఆయనకథ ‘చిరంజీవి’ని మెచ్చుకోకుండా ఎలా వుంటారు?

‘‘నిజానికి పిచ్చేశ్వరరావును బాగా ఎరిగినాక, అతని సజీవ భావ చైతన్యాన్ని గుర్తించకుండా వుండడం సాధ్యంకాదు. చాలా సామర్ధ్యాలు కలవాడు. కానీ వాటిని సాధ్యమైనంత గోప్యంగా దోచుకున్నాడు’’ కుటుంబరావు పిచ్చేశ్వరరావును గురించి ‘బాగా ఎరిగిన’ వారుకనుకనే, ఈ సంగతి కనిపెట్టగలిగారు. ఆ సంకలనంలో వున్న 22 కథల్లోనూ చాలా వాటిని పేర్కొని, వ్యాఖ్యానించి మెచ్చుకున్నారు. చివరగా, ‘‘నేనెరిగినంతలో అతని కథలు నాలుగైదు ఉత్తమ తెలుగు కథా సాహిత్యంలో శాశ్వతంగా నిలువ కలిగినవిగా వున్నాయి’’ అనీ ప్రకటించారు. కుటుంబరావు అన్ని కథల్ని ప్రస్తావించడమూ, ఆ చివరి అభిప్రాయమూ ఆశ్చర్యం కలిగించేవే.

 

ఆ తర్వాత, 1994 జులైలో ‘పిచ్చేశ్వరరావు కథలు’ ద్వితీయ ముద్రణగా వచ్చాయి. దానికి ‘ధ్యేయం’ అన్న పేరిట ఆరుద్ర ముందుమాట రాసారు. అందులో ఆయన ‘‘కుటుంబరావు వంటి నిర్మొహమాట విమర్శకుడు అభిప్రాయం వెలిబుచ్చాక, ఈ సంపుటికి ఇంకొకరు ముందుమాట రాసి పిచ్చేశ్వరరావును ప్రశంసించనక్కర్లేదు’’ అన్నారు. ‘‘ఉత్తమ సాహిత్యం బ్రతుకు మీద మమతను పెంచాలి. పిచ్చేశ్వరరావు ఆ ధ్యేయంతో కథలు రాసాడు. అందుకు ఈ సంపుటిసాక్ష్యం’’ అంటూ ఆరుద్ర సాక్ష్యం ఇచ్చారు.

ఇద్దరు సాహితీ ప్రముఖులు ఈ విధంగా ప్రశంసించినప్పుడు పిచ్చేశ్వరరావుకు తగిన గుర్తింపు రాలేదనడమేమిటి… అనడగవచ్చు… గుర్తింపు రావడంమంటే, కుటుంబరావు, ఆరుద్ర స్థాయిలో గుర్తింపు రావడమని కాదు. ఉత్తమ సాహిత్యాన్ని గుర్తించగలిగిన పాఠకుల స్థాయిలో సైతం గుర్తింపు రావాలన్న కోరిక. అందుకు కారణాలున్నాయనీ, వాటిని తర్వాత చెప్పుకుందామనీ అన్నాను. అయితే, నేను చెప్పనవసరం లేకుండా ఆ ఇద్దరు ప్రముఖులే అవీ చెప్పారు. ఎలా చెప్పారో, ఏం చెప్పారో చెప్పుకుంటేచాలు.

‘‘అతను చాలా సామర్ధ్యాలు కలవాడు. కానీ వాటిని గోప్యంగా దాచుకున్నాడు. వాటిని దుకాణంలో పెట్టలేదు. ప్రదర్శించి కీర్తి తెచ్చుకోడానికి మొదలే ప్రయత్నించ లేదు. హిందీ, ఇంగ్లీషు, తెలుగూ బాగావచ్చు. బెంగాలీ కూడా వచ్చుననుకుంటాను. శాస్త్రీయ దృక్పథం వుంది. కథలు రాసాడు, విమర్శలు రాసాడు, అనువాదాలు చేసాడు, సినిమాలకు సంభాషణలు రాసాడు. ఏదిరాసినా, విశిష్టంగా తన వ్యక్తిత్వం ఉట్టిపడేట్టుగా రాసాడు’’ (కుటుంబరావు)

అదిగో… ఆ వ్యక్తిత్వమే తనని తాను ప్రదర్శించుకోనీకుండా చేసింది. ఏది రాసినా తన వ్యక్తిత్వం చూపెట్టేందుకు రాసాడు కానీ, తన ప్రతిభను చూపెట్టేందుకు రాయలేదు. గొప్పకథలు రాయాలన్న కోరికతో, తపనతో కాకుండా, క్లుప్తంగా, గుప్తంగా రాసినా, ఉత్తమ కథా సాహిత్యంలో శాశ్వతంగా నిలువ గలిగినవీ రాసాడు! ఆశ్చర్యంగా లేదూ? ఆశ్చర్యమెందుకు? అది కూడా పిచ్చేశ్వరరావు వ్యక్తిత్వంలో, ధ్యేయంలో భాగమే.

ప్రజలలో చాలామంది చావంటే వున్న భయంతో బ్రతుకుతున్నారనీ బ్రతకుమీద మమతను పెంచేకథలు రాసాడని, ఆరుద్ర అన్నారు. చావంటే వున్న భయంతో చాలా కాలం బ్రతకడం ఇష్టంలేకనేమో, బ్రతుకుమీద మమతతో స్వల్ప కాలం బ్రతికినా చాలని చాటడానికేమో, పిచ్చేశ్వరరావు 41 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. ఆయనకంటే చిన్నవాడినీ, ఆయన చేత ‘కృష్ణా’ అని ఆప్యాయంగా పిలిపించుకున్నవాడినీ, అయిన నేను ఎనభై ఏళ్ళు పై బడినా ఇంకా ‘బ్రతికివున్నాడ జీవచ్ఛవంబువోలె’ ఇదంతా చెప్పడమెందుకంటే, పిచ్చేశ్వరరావు అన్నట్టూ, నాతో సహా చాలా మంది చావు భయంతో బ్రతుకుతున్నవాళ్ళమే అనడానికి.

ఇంతకూ, పిచ్చేశ్వరరావుకు అర్హతకు తగిన గుర్తింపు రాలేదన్న బాధ కలుగుతుందేకానీ, అసలా మనిషి తన అర్హతను పూర్తిగా చూపించిందెప్పుడని, ఆ అర్హతను గుర్తించే అవకాశం ఈ ‘ప్రదర్శన యుగం’లో ఇతరులకెలా వస్తుంది?

 

‘‘మహాసముద్రంలాంటి సినిమా రంగంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు’’ (కుటుంబరావు) చూడండి, సముద్రంలో ఉన్నప్పుడు ఆ అలల మీద అలా అలా జాలీగా కొట్టుకుపోతారుకానీ, వ్యక్తిత్వాన్ని పట్టుకొని కూచుంటారా? ఒక్కమాటలో చెప్పాలంటే, పిచ్చేశ్వరరావును ‘బ్రతకడం తెలియనివాడు’ అనాలి. పాపారావును అందరూ అన్నట్టే పిచ్చేశ్వరరావును నేను అలా అంటాను. పాపారావు ఎవరో తెలీదా?

అతను పిచ్చేశ్వరరావేనండీ.

ప్రజలలో చాలామంది చావు భయంతో బ్రతకుతున్నారే కానీ, బ్రతుకుమీద మమతతో కాదని, పిచ్చేశ్వరరావు ఒక భయానక సత్యం చెప్పింది. ఆ ‘బ్రతకడం తెలియనివాడు’ కథలోనే. కుటుంబరావు, ఆరుద్రల మాదిరిగా నేనూ ఓ మేధావిగా పిచ్చేశ్వరరావు రాసిన కొన్ని కథల్ని గురించి చెబుదామనుకున్నాను. కానీ, అనవసరం తన ఆశయాలతో, జీవితంతో, వ్యక్తిత్వంతో ప్రత్యక్షంగా పిచ్చేశ్వరరావే పాపారావులో కనిపిస్తున్నప్పుడు, ఆ ఒక్క కథ గురించి చెబితే చాలదా? అది పిచ్చేశ్వరరావు అర్హతనూ, నా అర్హతనూ చెబుతుంది కనుక, ఆ కథ గురించీ పలికేది రెండు మూడు గాథలు పలుకగనేలా?

‘‘నీకు బ్రతకడం తెలియదురా’’ అన్నారు అందరూ పాపారావు ముఖం మీదనే. పాపారావు ముఖం చిరునవ్వు నవ్వింది కానీ నోరు తెరిచి మాట్లాడలేదు. పాపయ్య అన్న తాత పేరు మనవడి తరానికి పాపారావు అయింది. అయితే, తాత లక్షణాలేవీ మనవడికి లేవు. తాత లక్షణాలేకాదు, తండ్రికున్న తెలివితేటలూలేవు. పాపారావు తండ్రి సంఘ సంస్కర్త, హరిజనులతో దేవాలయ ప్రవేశం చేయించాడు, వాళ్ళతో పంక్తిభోజనాలు చేసాడు. తన ఇంట్లో మాలవాళ్ళతో మంచినీళ్ళు తెప్పించుకునే ఏర్పాటు చేసాడు. అటువంటి సంస్కర్తకూ ఒక సమస్య వచ్చిపడిరది. వెట్టివెంకడు తన కొడుకు పాపారావును ‘‘చిన్న దొరగారూ!’’ అని పిలుస్తూంటే, వాడి కొడుకు సుబ్బడు ‘‘పాపారావ్‌, గోళీలు ఆడుకుందాం రావోయ్‌’’ అని పిలవడం ఆ సంస్కర్తకు మింగుడుపడటం లేదు. కొడుకు గోళీలు ఆడుకోవచ్చు, కానీ ఆ వెట్టివెంకడి కొడుకుతోనా అదీ ‘వోయ్‌’ అని పిల్చేవాడితోనా? ఆ సుబ్బడిని తిడదామనో, తందామనో అంటే, తన సంస్కర్తతనం గాల్లో కలుస్తుంది. ఇప్పటికీ ఆ పక్కింటి బ్రహ్మయ్య చూపు ఎలావుంది?

‘‘మాలవాళ్ళతో మంచినీళ్ళు తెప్పించుకుంటున్నానంటే వాళ్ళమీద ప్రేమతోనా? అరమైలుదూరంలో వున్న చెరువు నుంచీ రోజూ పది కావిళ్ళ మంచినీళ్ళు కావాలి కదా! వాళ్ళ మీద ప్రేమవుంటే, మాలపాలేరుకు పదిసోలలవడ్లు ఎక్కువ ఇస్తున్నావా? పోనీ సెలవులైనా ఇస్తున్నావా? ఎందుకయ్యా ఈ సంస్కర్త వేషమా, మోసమూ’’ అన్నట్టుంటుంది. అనడు, అన్నట్టు కనిపిస్తుంటాడు.

ఒకసారి ఆగ్రహం పట్టలేక, ‘‘ఆ లంజాకొడుకు తో సావాసం మానకుంటే గొంతు కోస్తాను, అని అంటే కొడుకు అదిరాడా, బెదిరాడా? పైగా ఇంట్లో నుంచీ కత్తి పీట పట్టుకొచ్చి ‘‘ఇదిగో… కొయ్యి గొంతు’ అన్నాడు! అలాంటి వాణ్ణి ఎవరేం చేస్తారు? చదివిస్తే, స్నేహాలు మాని మారతాడేమోనని స్కూల్లో చేర్పిస్తే, అక్కడా అంతే! మాలవాణ్ణి లోపలికి రానివ్వలేదని హోటల్‌ వాడితోనూ జీతం కట్టనందుకు విద్యార్థిని బెంచీ ఎక్కించిన మాస్టారితోనూ పోట్లాటే. పోనీ, స్కూలూ మాన్పిద్దామంటే ఎప్పుడూ ఫస్టు మార్కులే! అలాంటి వాడిని గొడ్లకాడికి ఎలా పంపాలి?

వయస్సు పెరిగే కొద్దీ మారతాడేమో అనుకుంటే, ఇంకా ముదిరాడే. కాలేజీ చదువు పనికి రాదనీ, సమాజం గురించి చదవాలనే దశకి ఎదిగాడు. ఇంకిలా కాదని, ఇంట్లో నుంచీ వెళ్ళి పొమ్మంటే, ‘‘నీ ఇష్టం నాన్నా’’ అని వెళ్ళిపోయాడు. అప్పుడూ అదరలేదు, బెదరలేదు. ఆ తర్వాత కూడా పాపారావు రైతులతో ఆందోళనలు చేయించీ, ఉద్యోగులతో సమ్మెలు చేయించీ, కొంత ప్రయోజనాలు పొందేలా చేసాడు. ఈ లోపల సమాజం మరీ పురోగమించింది. రౌడీయిజం పెరిగింది. గూండాయిజం చేతులు చాపింది. దౌర్జన్యాలకు తలవంచే ప్రజలను చూస్తే పాపారావుకు చిరాకేసింది. జనంలో ఎక్కువమంది చావు భయంతో బ్రతుకుతున్న వాళ్ళే కానీ, బ్రతుకు మీద కోర్కెతో బ్రతుకుతున్నవాళ్ళు కాదనిపించింది. ప్రజలకు బ్రతుకుమీద కాంక్ష పెంచాలని నిర్ణయించుకున్నాడు. తుపాకులు పేల్చేవాళ్ళమీద ఎదురు నిలబడి తనూ తుపాకి పేల్చాడు. ఆ పోరాటంలో పాపారావు మరణించాడు. పాపారావు తుపాకీ పట్టడం తప్పు అన్నవాళ్ళు వున్నారుకానీ, అప్పటికే తుపాకీ పేల్చేవాళ్ళమీద తుపాకీ పేల్చేందుకు చాలామందీ తయారయ్యారు. వాళ్ళంతా, బ్రతికితే పాపారావులా బ్రతకాలని నమ్ముతున్నవాళ్ళే.

ఇది పిచ్చేశ్వరరావు రాసిన ‘బ్రతకడం తెలియనివాడు’ అనే కథ. ఇది నూటికి తొంభైపాళ్ళు పిచ్చేశ్వరరావు జీవిత కథే. తండ్రి ఇంట్లో నుంచీ వెళ్ళి పొమ్మంటే, వెళ్ళిపోయింది పిచ్చేశ్వరరావే. అతను రాసిన చాలా కథల్లాగే, నవల కావలసిన ఇతివృత్తాన్ని చిన్న కథగా కుదించాడు. కథేకాదు, తనను తాను కుదించి చూపడం కూడా పిచ్చేశ్వర తత్వమే. రౌడీలతో, గూండాలతో పోరాడటమనేది ఒకప్పుడు కమ్యూనిస్టులు అరాచక శక్తులతో పోరాడిన నేపథ్యం కావచ్చు. అలాగే సంస్కర్తలనిపించుకోవడానికి కొందరు చేసిన ప్రయత్నాలు కూడా అప్పటివే. పాపారావు తండ్రి, పక్కింటి బ్రహ్మయ్య చూపులో వున్నట్టు అనుకుంటున్నది, అతని అంతరాత్మ అన్నదీ! పోతే, పాపారావు తుపాకి పట్టడం అన్నది, అప్పటికి పిచ్చేశ్వరరావు మనసులో వున్న ఆలోచన కావచ్చు. పాపారావు తుపాకి పట్టడం తప్పు అన్నది, మనం ఇప్పుడు వింటున్నదే.

అంతవరకూ, ‘బ్రతకడం తెలియనివాడు’ గా కనిపించిన పాపారావు, తుపాకిపట్టి ప్రాణాలర్పించిన తర్వాత, బ్రతికితే పాపారావులా బ్రతకాలి అన్న ఆదర్శమయ్యాడు. అంతే కాదు. బ్రతకడం తెలిస్తే అది బ్రతుకుకాదనీ, బ్రతకడం తెలియకపోతేనే నిజమైన బ్రతుకు అనీ అన్యాపదేశంగా ఈ కథ తెలియజేస్తోంది. చావంటే తెలీనివాళ్ళకు బ్రతకడమంటే కూడా తెలీకపోవచ్చని ఇది తెలియజేసింది.

ఈ ఒక్క కథ చాలదా కథా సాహిత్యంలో పిచ్చేశ్వరరావుకు శాశ్వత స్థానం వుందనీ, వుంటుందనీ తెలియ జేసేందుకు…

———–

You may also like...