పేరు (ఆంగ్లం) | Krovvidi Lingaraju |
పేరు (తెలుగు) | క్రొవ్విడి లింగరాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/3/1904 |
మరణం | 1/3/1986 |
పుట్టిన ఊరు | ఘంటసాల, తూర్పు గోదావరి జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | భారతదేశం’ , అమ్మ కథలు : గొప్పొళ్ళ న్యాయం, గోదారి, చతురంగయోధులు, పాతపరిచయం, తీర్పు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు’ , 1984లో అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహీతీ సత్కారం లభించింది. |
ఇతర వివరాలు | రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షులుగా, శాసన సభ్యులుగా రాష్ట్రానికి, అఖిలభారత స్వాతంత్ర్య సమర యోధుల సంఘానికి ఉపాధ్యాక్షులుగా దేశానికి సేవలందించారు. మాక్సిం గోర్కీ ‘మదర్’ను అమ్మగా అనువదించారు. ‘సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు’ పొందిన తొలి తెలుగు రచయిత . జవహర్ లాల్ నెహ్రూ రచించిన ‘ డిస్కవరీ ఆఫ్ ఇండియా ‘ ను ‘భారతదేశం’ గా అనువదించారు. గొప్పోళ్ళన్యాయం కథల సంపుటిని రచించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | క్రొవ్విడి లింగరాజు గోదారి |
సంగ్రహ నమూనా రచన | గోదారి పట్టుమని పదేళ్లు కాపురం చెయ్యలేదు. కాని చేసిన నాల్గు రోజులూ వెంకన్న స్వర్గం చూపించేడు. రంగం నుంచి తెచ్చిన నాలుగురాళ్లు చేతులో గలగల లాడుతున్నాయి. పైగా పెద్దకాపుదగ్గర పాలేరుతనం. ఇక చెప్పేదేముంది. ముందు ఆలోచన లేకుండా కాపురం గడిపేస్తున్నాడు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది వ్యవహారం. బస్తీలో తిరుగుతున్నవాడవడం చేత వెంకన్న గోదారిని అపురూపంగా చూస్తున్నాడు. |
క్రొవ్విడి లింగరాజు
గోదారి
గోదారి పట్టుమని పదేళ్లు కాపురం చెయ్యలేదు. కాని చేసిన నాల్గు రోజులూ వెంకన్న స్వర్గం చూపించేడు. రంగం నుంచి తెచ్చిన నాలుగురాళ్లు చేతులో గలగల లాడుతున్నాయి. పైగా పెద్దకాపుదగ్గర పాలేరుతనం. ఇక చెప్పేదేముంది. ముందు ఆలోచన లేకుండా కాపురం గడిపేస్తున్నాడు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది వ్యవహారం. బస్తీలో తిరుగుతున్నవాడవడం చేత వెంకన్న గోదారిని అపురూపంగా చూస్తున్నాడు.
‘ఎరోయి యెంకా వారి వాడితస్సాదియ్యా నీకేవట్రా పెళ్లయింది. నీది కామాసు పెళ్లాముంట అంటూ కులపెద్ద ఎత్తిపొడిచినా వెంకన్న కేమీ నాటేది కాదు. అంతగా పట్టిస్తే ‘ఓసోసి చెప్పేవులే, మామా కబురు. సీరంగనీతులు సెప్పేవోళ్లంతా పడుత్తనంలో ఏం చేశారో? అత్త నడిగేదా?’ అంటూ తప్పుకుపోయేవాడు.
‘వెంకా మరి కూలీ ఎద్దడొచ్చినప్పుడు కూడా గోదారికి బతికిపోయేవట్రా తకీ నిన్నవాలసిన పనేమయింది. రంగం డుబ్బులు అయిపోయేదాకా అదరిపాటల్లా ఏడిపిస్తుందిలే అన్నాడు పెద్దకాపు ’లేదండి బాబాయ్యా? ఉట్టి అర్భనాకారం మడిసండి. పెల్లల్తో కూలి కెక్కడ రాగలనండి. దూడలకు గడ్డికోసుకుని కూడొండమే బెమ్మాండంగా ఉందండి’
‘అవున్రా పడుచుతనం ఎగలే మరి. పెళ్లాం బెల్లం ముక్క కాదుట్రా వాడ్తితస్సాదియ్యా, నువ్వేమగోడవు మరి.’
‘అలాగనకండి బాబయ్య, బతికున్నంతకాలమేనండి సుఖం. తర్వాతి ఎవరి కెవరండి.’
ఎవరే మనుకుంటే నేమి వెంకన్న గోదారి చిలాకా గోరింకాలా కాపురం చేస్తున్నాను. ఉన్న గుడిసెలోనే సౌఖ్యాలమర్చుకున్నారు. నులకమంచం పోయి పట్టెమంచం వచ్చింది కిరసనాయిలు బుడ్డికి బదులు గోడలాంపు వెలిగించారు. చిన్న చిన్న చెంబూ తప్పేలా అమర్చకున్నారు సంకురాత్రి పండుగకు నల్ల సిలుకుచొక్కా గొలుసు బొత్తాములు వెంకన్న కొనుక్కున్నాడు. గోదారిమెల్లోకి ఇమిటేషన్ గొలుసు, చెవులకి దుద్దులు, కట్టుకునేందుకు గల్లచీర కొన్నారు. కుర్రోళ్లకు గళ్లచొక్కాలు కొనుక్కొచ్చాడు. మొత్తంమీద మాలపల్లెలో నలుగురికళ్లూ ఈ కుటుంబంమీద పడ్డాయి.
మంచికాలం గబగబ పరుగెత్తుకుపోతుంది. సంవత్సరాదిడెళ్లిన మర్నాడు వెంకన్నకి పెళ్లుమంటూ జ్వరం వచ్చింది. మంచమెక్కేడు. ఆ ఎక్కడం ఎక్కడం నెలరోజులు మంచంమీదున్నాడు. ఇంట్లో ఉన్నలొడ్డూలొసుగూ చెంబూతప్పేలా మంచంకంచం అన్నీ అమ్మి వైద్యం చేయించింది గోదారి. గుడి ఆచార్యులు గారిమందు పట్టివ్వకపోతే రాజమండ్రింనుంచి డాక్టరుగారిని పిలిపించింది. కాని ప్రయోజనం లేకపోయింది. వెంకన్న హంస లేచిపోయింది. గోదారి దీపం ఆరిపోయింది. ఆమె సౌఖ్యం అస్తమించింది. వెంకన్న పేరిట గోదారికి ఇంట్లో మిగిలినది ఇద్దరుకొడుకులు. వాళ్లతోపాటు, వాళ్లు పెద్దవాళ్లై తనను సుఖపెడతారనే పెద్దాడికి అయిదు ఏళ్లు, చంటోడికి మూడేళ్లు.
వెంకన్న పోయి ఆరు నెలలు కాలేదు రోజూ రెండుమోపులు గడ్డికోసుకొస్తేగాని గోదారికి పిల్లలకూ రోజెళ్లడంలేదు. ఒక మోపు వాకిట్లో దూడముందరేసి బలమైన మోపొకటి సాయంత్రం కరణంగారి దొడ్లోవేస్తే, వారం వారం సంతఖర్చుకో అర్థరూపాయి, 4 కుంచాల ధాన్యం ముడుతుంది. మెత్తటి పరకలు మరో నాలుగు ఎక్కువేస్తే కరణంగారి విధవ అప్పగారు సంతోషపడి కాస్తంత ఊరుగాయముక్కో, నాలుగు కూరముక్కలో చేతులో పెడితే ఆవేళ పిల్లలకి పండుగే. బుల్లి బుల్లి తపుగోలలుచ్చుకుని వీరు పెంటడు తనతోకూడా వస్తూంటే అదే పరమానందంగా ఉండేది గోదారికి. కాని ఆమాత్రంగా నైనా కాలం పోనిచ్చాడా దేవుడు? కష్టాలు ఒక్కొక్కటిగా రావు. తగిలిన వ్రేలికే తిరిగి ఎదురుదెబ్బ తగుల్తుంది. అకస్మాత్తుగా పెద్దమ్మవారు పొట్టనెట్టుకుంది. గోదారి మళ్లీ మూలపడింది కాని కాలం ఎంత దుఃఖాన్నయినా మరిపిస్తుంది కదా పంచప్రాణాలూ పెంటడిమీద పెట్టుకుని గోదారి మళ్లీ యధాప్రకారంగా బ్రతుకుతోంది. ఇంకెంత, పదేళ్లు కళ్లు మూసుకుంటే పెంటడు పెద్దోడవుతాడు. ఏకాపు కాళ్లకాడయినా వాడి బ్రతుకు వాడు బ్రతికలేకపోతాడా? అని ఆమె ఆవ. అంతేకాని తనకాళ్ళు, తన కష్టం.
రాత్రి పది గంటలయింది గోదారి గుడిసెలో చిన్న కిరసనాయిలు బుడ్డి మినుకు మిణుకు మంటోంది. నులకమంచం కుక్కిలో పెంటడు గిజగిజ తన్నుకుంటున్నాడు. దాహం, దాహం. గోదారి పాలికావడిపెట్టి మీదకూర్చుని పైటకొంగుతో విసరుతోంది. జ్వరం ఫెళ్లుమంటూ పేలాలయ్యేటట్లుంది. నాలుగురాత్రులనుంచి నిద్ర లేకపోవడం వల్ల గోదారికి కళ్లు జ్యోతుల్లా ఉన్నాయి. కళ్లంబడి కారిన నీటిచారికలు అల్లాగే ఉన్నాయి. యిరుగుపొరుగుమ్మలు ఓదార్పు కబుర్లు చెపిప చక్కా పోయారు. ఆమె హృదయంలో రేగుతున్న తుఫానును తొలగించేదెవరు? పొయ్యిలో నిప్పేసి రెండు రోజులయింది. ఎక్కడి దాక అక్కడికక్కడే యింకి అక్కడే ఉంది. గుడిసెలో గోదారి దీనత్వం యొక్క నిజస్వరూపంగా ఉంది. ఆచార్యులుగారిచ్చిన మాత్ర పెంటడినోట్లో వేసి గ్రుక్కెడునీళ్లు పోసింది. ‘‘దేవుడా నలుసైనా దక్కడా?’’ అని దేవుడికి దండం పెట్టుకుంది. నోరు మెదపకుండానే కాస్సేపటికి పెంటడు నిశ్శబ్దంగా పడుకున్నాడు. గోదారికళ్లు అప్రయత్నంగానే మూతపడ్డాయి. అంతలోనే వెంకన్న వీపు చరిచినట్లయింది. ‘శింగారం వెంకన్న దేవుడికి మ్రొక్కుకో’ అన్నట్లు వినిపించింది. ఉలిక్కిపడి లేచి చూచేసరికి వెంకన్న లేడు పాపం గోదారికి దిక్కు తోచలేదు. కంగారుపడింది. వెంకన్న తలుపుకొచ్చి దుఃఖం పొర్లివచ్చింది. కాని పెంటడికి మెళకువ వస్తుందేమోనని దుఃఖాన్ని మ్రింగేసింది. బయటికొచ్చి బావురుమని కడుపులో భారాన్ని కక్కుదామనిపించింది. కాని పెంటడు దగ్గ రెవరెంటారు; మాతృత్వం అన్ని దుఃఖాలను మ్రింగగలిగే శక్తినిచ్చింది. పెంటడు మెడలో వెండితావీజును తీసి రాగిడబ్బు, బియ్యపుగింజలతో పాటు పాతగుడ్డలో మీదుకట్టింది. ‘వెంకన్న దేవుడా నా పెంటడి కొళ్లునయమైతే పళ్లుఫలాలు ఇచ్చకుంటాను. పావుసేరు నెయ్యి దీపం పెట్టుకుంటాను’ అని మ్రొక్కకుంది. వెంకన్న దేవుడు చల్లనిచూపు చూచాడు.
ముక్కోటి వారంరోజులుంది. ఆరోజు శృంగవరం వెంకటేశ్వర్లుకి ఉత్సవం. మ్రొక్కులు చెల్లే సమయం. ఊరు ఆబాలగోపాలం దేవాలయంలో ఉంటారు. చుట్టుప్రక్కల గ్రామాలవారంతా నాటుబళ్లమీద తీర్థానికొస్తారు. అక్కడి వైష్ణవముఖ్యులకి నాల్గురోజులూ నిత్యపంట. భక్తులకోరికల మన్నించడంలోనూ, అసలు ప్రభావంలోరూ ఏడుకొండలవెంకన్న మా వెంకన్నకు పరిచాలని వారి సిద్ధాంతం. వేంకటనాయకకి అన్నమాట ఆవూరి వెంకటేశ్వరుడిని గురించి అని వారివాదం. ఎవరైనా కాదంటే ఊరుకోరు. ఏనాడో ఏమహారాజో దేవుడ్ని ప్రతిష్ఠచేశాడు. నిత్యనైవేద్యానికి, అర్చనకు వైష్ణవకుటుంబాలకు ఈనాములిచ్చాడు. 4,5 కుటుంబాల స్వస్తివాచకులకు, నృత్యగీతాది సేవలకు 4,5 బోగం కుటుంబాలకు ధారాళంగా ఈనాములు ఏర్పాటు చేశాడు. దేవాలయం ప్రధానంగా ఆ ఊరు వృద్ధి పొందింది. ముక్కోటి దగ్గర కొచ్చి, ఉత్సవానికి సన్నాహాలు దగ్గిరవుతున్న కొద్దీ గోదారి గుండెల్లో భారం ఎక్కువవుతోంది. ఆపదలో మ్రొక్కుకుంది. కాని దేవుడి మ్రొక్కు తీరడమెల్లాగ? చేతిలో కాని లేదు. ఏ రోజు కారోజు పిట్టని కొట్టి పోయిలో పెట్టగానే ఉంది బ్రతుకు. ఎంత లేదన్నా రెండు రూపాయిలైనా కావాలే మ్రొక్కుబడి చెల్లడానికి. ఎవరిస్తారు రూపాయిలు? ఇదే బెంగ గోదారికి…. చివరికి కావడిపెట్టి అడుగున వెంకన్న చనిపోయినప్పుడు దాచిపెట్టిన ముక్కు పుడక తీసింది. అతగాడు తన వెన్నెల జీవితంలో ఆఖరు సంక్రాంతినాడు తెచ్చిన మురిపెం. దాన్ని చేత్తో పుచ్చుకొనేసరికి ఆమెదేహం పులకరించింది. ఆనాటిగాధ కల్లకుకట్టినట్లయింది. ఆ మూడుపాళ్లముక్కుపుడక రంగసాని పురమాయింపుమీద వీరాచార్యులు పనివాడితనంగా చేసిన ఆభరణం. ఏదో అవాంతరం వచ్చి ఆమె పుచ్చుకోకపోతే వీరాచార్యులు వెంకన్న పైలా పచ్చీసు వ్యవహారం చూసి అతగాడికి అమ్మచూపడం, ఇల్లాంటివి గొప్ప గోప్పొళ్లకు కాని మన కెందుకని తాను వద్దన్నా అతగాడు మోజుపడి పదిరూపాయల సొమ్ముపోసి కొనడం, వెంటనే తన ముక్కున వున్న ఇత్తడిగొట్టం తీసేసి తనచేత్తో ముక్కుకి పెట్టడం, అప్పటి తన రూపానికి మురిసిపోయి అతగాడు చేసిన చిలిపి పనులూ అన్నీ గోదారి స్మరణకొచ్చాయి. ఆలాంటి ఆప్యాయతతో నిండిన ముక్కుపుడకను చేతులారా వదలిపెట్టాలనేసరికి అబ్బ అనిపించింది. ఎప్పటికైనా పెంటడు పెద్ద వాడై పెళ్లి చేసుకున్న రోజున కోడలీ ముక్కుకు తాను సొంతంగా పెట్టాలని ఆమెకోరిక. అందుచేతనే పాపం మూడు మూటలు గట్టి దాన్ని దాచింది. కాని తాత్కాలికమైన అవసరం ఆత్మకు సమాధానం చెప్పింది. వెంకన్న ప్రేమకు సజీవచిహ్నమైన పెంటడు ప్రాణం మీది మ్రొక్కు చెల్లించడానికి కదా ఈ ముక్కు పుడక ఇందులో తప్పేమిటనిపించింది ఆమె మనస్సుకి…. తప్పన్న మాటేమిటి? నమ్మమని కూడా అనిపించింది.
ముక్కోటి వచ్చింది. ముక్కుపుడక తాకట్టు పెట్టి తెచ్చిన సొత్తు మూడు రూపాయలు. ఒక రూపాయితో దేవుడికి పండుల ఫలాలు, అమ్మవారికి పసుపుకుంకం, కర్పూరం వైగరా పూజాసామగ్రి సేకరించింది. ప్రొద్దున్నే పెంటడిని గోదావరిలో ముంచింది. తాను మునిగింది. ఆనాడు ఆమె భక్తిపరవశమైపోయింది. వెంకన్నతో ఆకరుసారి తీర్థాని కెళ్లినపుడు కొన్న గళ్లకోక కట్టుకుంది. పెంటడి ప్రాణాన్ని కాపాడిన దేవుడి కాల్ళమీదెప్పుడు పడదామా అనే ఆవేశంతో బయలుదేరింది గోదారి. పెంటడు పూజాసామగ్రిమూటను భుజాన్నేసుకొని కూడా ఆవువెంట బోయే లేగదూడలా బయలుదేరేడు.
‘గోదారీ ఏటేపు సంబరం’ అంటూ ఎకసక్కెంగా అడిగింది వెట్టివీరయ్య పెళ్లాం.
‘ఏముందత్తా పెంటడికి మొక్కుబడి చెల్లిస్తున్నా’
‘నూకాలమ్మకా?’
‘కాదత్తా, అగ్రారం వెంకన్నకి.’
‘అగ్రారం వెకన్నకా? అక్కడి కెవరు రానిస్తారే పిచ్చిదానా?’
‘ఎందుకు రానీ రత్తా. దేవుడందరికొక్కడేగా? నీ కొడుకు కళ్లో కనిపించి మొక్కుకోమంటే మొక్కుకున్నా. పెంటడికి నయమైంది.’
‘వెర్రిపిల్లవు. అక్కడి కెడితే కాళ్లిరగ్గొడతారే’
గోదారికి గోలేమీ తెలియదు దేవుడి మీది భక్తి కృతజ్ఞత ఆమెను గుడిలోకి లాగినాయి. ఆవేళ ఊళ్లోజనం పొరుగూరిజనం తండోపతండాలుగా ఇసుకేసినా రాలకుండా వున్నారు గుళ్లో. పిల్లవాడెక్కడ నలిగిపోతాడో అని భయపడుతూ తప్పుకుంటూ గోదారి ద్వజస్తంభందాకా వెళ్లింది. మండపం మెట్లెక్కబోతూంటే కరణంగారి వెధవతోడబడుచు కంటబడింది. గోదారిని చూచీ చూడడంతోనే ఆమె తారాజువ్వలా చుర్రుమంది. ‘నీకేం పొయ్యేకాలమొచ్చిందే దిక్కుమాలినముండా, వీథుల్లో తొలగడం మానేశారు సరిగదా, ఇంకా చాలక గుళ్లల్లోకి గోపురాల్లోకీ కూడా విరుచుకుపడుతున్నారూ? ఔరౌర ఏమిపిదపకాలం? ఏమి పిదపకాలం? దిక్కుమాలిన గ్రాంధిఒకటి చేసి ఒకటి చేయకుండా ఊరుకున్నాడూ? వచ్చింది వర్ణసంకరం. ఇంకా దేవుడేమిటి దెయ్యమేమిటి? అంటూ బడబడ తిట్టేసింది. గోదారి తలమీద పిడుగడినట్లయింది. తనబడుతూ తడబడుతూ ‘పెంటడిజబ్బు లో వెంకన్న దేవుడికి మీదుకట్టేనండి’ అంది.
ఆమాటకి మరీ రేగిపోయింది ఆవిశ్వస్త.
‘ఓసి నీసిగ గొయ్య నీకెంత కళ్లుమీదకొచ్చాయే మాలాళ్లు వెంకటేశ్వర్లుకు మొక్కుకోవడమేమిటేవు నీబండపడ. ఇంకేం దేవుడర్రోయి? మహాత్యాలర్రోయి? మా చారాలు చట్టుబండలైపోనూ అంటూ గొల్లున గోలెట్టి నెత్తి బాదుకోవడం మొదలెట్టింది. నలుగురూ ఏమిటంటే ఏమిటని ఆవిడను చుట్టేశారు. స్థానాచార్యులు, పెద్కాపు, దేవస్థానం ట్రస్టీలు యావన్మంది చేరుకున్నారు. స్థానాచార్యులు సమ్మేరీవిచారణ ప్రారంభించాడు.
‘….ఓసీ ఎవ్వరేనీ కీ సలహా చెప్పినది? నీబాబుల్నా డెరుగుదువా నీతాతల్నాడెరుగుదువా? విడ్డూరం. మాలాళ్లు పెరుమాళ్ల సన్నిధికి రావడం ఎప్పుడైనా విన్నావుటే? నిన్నేమిచేస్తే పాపముందే?
‘స్వాములు పాదాలకి మొక్కుతున్నానండి. ఈడు నాకొడుకండి. తోలేకాశికండి ఈడికి జ్వరం వచ్చి సచ్చేవాడయ్యాడండి. అపుడండి నా యజమానికల్లో అవుపడ్డాడండి. అవుపడి ఈ వెంకన్న దేవుడికి మొక్కకుకోమన్నాడండి. అల్లాగే మొక్కుకుని తావీజు మీదుగట్టేనండి. వెంకన్న మారాజుపుణ్యమా అని వాడికి జ్వరం తగ్గిపోయిందండి. ఆ మొక్కుబడి చెల్లించుకోడానికొచ్చానండి. ఇందులో తప్పేటండీ?’
‘ఓహోహో తల బాగానే తిరిగింది వరుస బాగానే ఉంది. ఏమిటీ తప్పేమిటని అడుగుతున్నావూ? ఏమోయికాపూ ఇంకా దేవుడేమిటి?’ మా పూజలు, పురస్కారాలు ఈ పట్టివర్ధనాలు, ఇంకా ఎందుకయాయ?’ అని గుంభవగా తలూపుతూ పెదివిలు విరిచేడు. పటపటపళ్లు కొరుకుతూ పెదకాపు ముందుకుదూకేడు.
‘ఆచార్యులుగారిని తప్పేటని అడిగేదాకా వచ్చిందేం నీవరస? వీపు చీరించేస్తాను చూసుకో’
‘అదెందుకు బాబయాయ, మీపాదాల కాడిదాన్ని దేవుడికి మొక్కిచ్చుకుంటే నేనెవరి కేంచేశానండి.’
‘దానిమదం అల్లా ఉంది చూస్తారేమిటి?’ అన్నాడెవరో గుంపులోనుంచి.
గబగబా గోదారి ఒంటిమీద దెబ్బల వర్షం కురిసింది. పట్టవర్ధనాలు ధట్టించిన ధర్మమూర్తి ఒకడు ఆమెజుట్టు పట్టుకుని బరబర బయటికి లాక్కొచ్చాడు. పెంటడు ఆమె కొంగట్టుకుని ఏడుస్తూ వెంటబడ్డాడు. ధర్మకర్తలు దేవుడికి ప్రాయశ్చిత్తం చేయించారు.
రెండుజాములకి దెబ్బతిన్న లేడిలాగ గోదారి గుడిసెలో పడింది. దేవుడికి మ్రొక్కు తీర్చకుంటుంటే తన కింత అపకారం ఎందుకు జరిగిందో ఆమెకు తెలియలేదు. రెండు జాములదాకా గంజి త్రాగకుండా ఏడుస్తున్న పెంటడు అలసి పడిపోయాడు. దెబ్బలవల్ల కలిగిన పులకరంచేత గోదారి ఏడుస్తూపడుకుంది. దయామయుడైన దేవుడి సన్నిధికి పోవడాని కొకరికి హక్కుండడం మరోకళ్లకి లేకపోవడం సంభవం కాదనుకుంది. తనకు జరిగిన ఈపరాభవానికి తన వెంకన్నే బ్రతికుంటేనా అనుకుంది. కాలంనాడు వెంకన్నతో కోరుకొండతీర్థంలో చూచిన రామాయణం సినీమాలో దేవుడికి ఎంగిలిపళ్ల నిచ్చిన శబరికథ జ్ఞాపక మొచ్చింది. నిరుటి తీర్థమప్పుడు దాసుగారు చెప్పిన నందనారు హరికథ జ్ఞాపకాని కొచ్చింది. వెంటనే తన కది పరాభవంకాదేమోననీ, వెంకన్న దేవుడిపరీక్షేమోననీ సంశయం కలిగి ఆ ఆలోచనలో పడుంది. ఇంతలో పెంటడికి ఫెళ్లుమంటూ జ్వరం వచ్చింది. గోదారి మనసు కరిగిపోయింది. ‘ఆపదలో దేవుడికి మ్రొక్కుకుని ఆపద గడచిన తర్వాత ఎవరో అడ్డుపడితే వెనక్కొచ్చేస్తావా’ అంటూ ఎవరో అంటున్నటుల మనస్సు గుంజాటన పడడం ప్రారంభించింది. తన భక్తి పరీక్ష కాగలేక పోయిందనుకొని తన్ను తానే నిందించుకుంది. ఏమయినా సరే ఈ వేళ పెంటడ్ని పెరుమాళ్ల కాళ్ల మీద పడేసి నిశ్చయంగా ఆయన పాదాలంటుకోవాలనుకుంది.
రాత్రి 12 గంటలయింది. మధ్యాహ్నం నలిగిపోగా మిగిలిన పళ్లు ఫలాలు ఒల్లో వేసుకొని పెంటడ్ని చంకనెట్టుకొని దేవాలయం ప్రాకారం దగ్గరకొచ్చింది. గుళ్ళో మండపం ముందరి పందిట్లో భోగం మేళం మేజువాణీ నడుస్తోంది. పిన్నలు పెద్దలు అంతా అక్కడస్థాయిగా కూచుని ఉన్నారు. మరొక ప్రక్క గజేంద్రమోక్షం హరికథ చెపుతున్న దాసుగారి దగ్గర కొందరు వృద్ధులు వితంతువులు తల లూపుతూ కూచున్నారు. గోదారి లోపలికి తొంగి చూచింది. జనం మేజువాణీలో తన్మయులై ఉన్నారు. పిల్లి అడుగులేసుకుంటూ ఆమె లోపల ప్రవేశించింది. మండప మెక్కింది. గర్భగుడి తలుపులు దగ్గరగా చేరేసి ఆచార్యులుగారు మేళం దగ్గర తన్మయుడై ఉన్నాడు.
‘‘అమ్మయ్యా’’ అనుకుంటూ గోదావరి నెమ్మదిగా తలుపు తోసింది. సర్వాలంకారలతోను వెలుగుతున్న వెంకన్న స్వామిదర్శనమైంది. గభాలున పెంటడిని స్వామిగుమ్మం ముందర సాగిలించింది. పళ్లు ఫలాలక్కడ పెట్టేసింది. రెండు చేతులుజోడించి తదేకధ్యానంతో కరుణామయుని నేత్రాల్లోకి తన చూపు కలిపి అలాగే నిలబడుంది. ‘ఎవరు వారు’ అంటూ బోగం మేళం విడిచిపెట్టి రాలేక రాలేక ఆచార్యులుగారు లోపలికొచ్చారు.
గోదారిని చూడడంతోనే ఆచార్యలు భగ్గున మండిపోయాడు ‘పాపిష్టి ముండా మళ్లీ తగులడ్డావుటే’ అంటూ హుంకరించి ప్రక్కనున్న పంచపాత్రతతో నెత్తిమీద ఒక్క పెట్టశాడు. ఆ దెబ్బతో గోదారి తల దిమ్మెక్కిపోయింది. ఆచార్యులుగారి హుంకారంతో బోగంమేళంలో కూర్చున్న భక్తులంతా గబగబ లోపలికొచ్చారు దొరికిపోయిన దొంగను దారిపొయ్యేవాళ్లంతా తలో దెబ్బ వేసినట్లు భక్తులంతా గోదారిని తలోదెబ్బా వేశారు. చేతిలో కర్ర ఉన్నవాళ్లు కర్రతో ఒకటేస్తే హీ లేనివాళ్లు కాలితో ఒక తన్ను తన్నేరు. పెంటడు నిశ్చేష్టుడై తల్లి మీద పడ్డాడు. ఒకటీ అరా పెంటడిమీద పడ్డాయి. ఎవ్వడో ఘాతుకుడు ఒక్కతన్ను తన్ని ఆమెజుట్టు పట్టుకుని బరబరా గుడిబయటికీచ్చేశాడు. కరుణామయుడైన వెంకటేశ్వరస్వామి పొడారిపోయినకళ్లతో చూస్తూనేఉన్నాడు. కాస్సేపటికి గుడియెదుట పెంటడిని గుండె కదుముకుని గోదారి ప్రాణాలర్పించింది. ఆమెకండ్లు చూసిన ఆఖరుచూపు వెంకటేశ్వరస్వామిని. ఆకళ్లతో మళ్లీ పాపిష్టి ప్రపంచాన్ని చూడలేదు.
———–