పేరు (ఆంగ్లం) | Antati Narasimham |
పేరు (తెలుగు) | అంతటి నరసింహం |
కలం పేరు | – |
తల్లిపేరు | సుబ్బమ్మ |
తండ్రి పేరు | చెంచలయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1925 |
మరణం | 2010 |
పుట్టిన ఊరు | కడప జిల్లా, చిట్వేలు మండలం, వెంకట్రాజులపల్లె |
విద్యార్హతలు | బి.ఏ. ఆనర్సు |
వృత్తి | ఆంధ్రోపన్యాసకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కావ్యాలు : కంకాళ రాత్రి (పద్యకావ్యం), ఇప్పుడే (వచన కవితా సంపుటం)
|
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఈయన కేవలము తను నమ్మిన ఆదర్శాలను రచనలకే పరిమితం చేయక వాటిని స్వయంగా చిత్తశుద్ధితో ఆచరించారు. కులవ్యవస్థను రూపుమాపుతూ, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ, వరకట్నం నిషేధిస్తూ ఇతడు కులాంతర వివాహంగా ఒక చదువుకున్న అమ్మాయిని కట్నం లేకుండా వివాహమాడారు. జీవితాంతం కాఫీ, టీ, సిగరెట్ ముట్టక ఆదర్శవంతంగా జీవించారు. ” నా నవలలు చదివి పాఠకులు మెచ్చుకుంటే నాకంత ఉత్సాహం ఉండదు. దానిలో చెప్పినట్లు ఆచరిస్తే నాకానందం కలుగుతుంది. దీనివల్ల వారికి, దేశానికి, అసలు మానవజాతికి అభ్యుదయం కలుగుతుంది” అని తన మనసులోని మాటను ఒక సందర్భంలో వెల్లడించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అంతటి నరసింహం |
సంగ్రహ నమూనా రచన | ఆదర్శాలు వల్లించడం అందరికీ తెలుసు. కాని ఆచరణలో వుంచడం మాత్రం అందరికీ చేతకాని పని. తమ రచనలద్వారా రచయితల ఆదర్శభావాలను, సంఘ సంస్కరణలను, వర్ణాంతర వివాహాలను, అస్పృశ్యతా నివారణ విధానాలను పాఠకులకు కథలుగా, నవలలుగా వ్రాసి అందివ్వవచ్చు. సన్మానసభల్లో శ్రోతల కరతాళధ్వనుల మధ్య వక్తుల ఆదర్శాలను ఉపన్యసించవచ్చు. కాని తొలుత తానాదర్శంతుడై వుండాలనుకొనే రచయితలు, వక్తలు చాలా అరుదు. |
అంతటి నరసింహం
ఆదర్శాలు వల్లించడం అందరికీ తెలుసు. కాని ఆచరణలో వుంచడం మాత్రం అందరికీ చేతకాని పని. తమ రచనలద్వారా రచయితల ఆదర్శభావాలను, సంఘ సంస్కరణలను, వర్ణాంతర వివాహాలను, అస్పృశ్యతా నివారణ విధానాలను పాఠకులకు కథలుగా, నవలలుగా వ్రాసి అందివ్వవచ్చు. సన్మానసభల్లో శ్రోతల కరతాళధ్వనుల మధ్య వక్తుల ఆదర్శాలను ఉపన్యసించవచ్చు. కాని తొలుత తానాదర్శంతుడై వుండాలనుకొనే రచయితలు, వక్తలు చాలా అరుదు. వారాదర్శవంతులు కానప్పుడు వారి నీతిబోధకాలెవరికి అవసరమవుతాయి? తెలుగులో ఎందరో రయితలు తమ రచలనలలో సంఘ సంస్కరణ విషయాలను చొప్పించారు. ఆ రచనలు సాహిత్య చరిత్రలో ఖ్యాతి పొందాయి కూడ. ఆ రచనలు చదివి కొందరిలో మార్పురావడం కూడ జరిగింది. కానీ ఆ రచయితమాత్రం ఆ భావాలను కాసింత కూడ ఆచరణలో వుంచడు. అప్పుడవి శుష్కరచనలుగానే వ్యవహరించవలసి వుంటుంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 39 ఏండ్లు గడిచింది. విద్యాధికుల సంఖ్య పెరిగింది. నాగరికత బాగా ముదిరింది. అంతేకాని మానవత్వం ఇంకా పెంపొందలేదు. అందుకే మన జాతిలో నేటికి అస్పృశ్యత అలాగే వుంది. సాంఘిక అసమానత్వం అట్లాగే వుంది. అందుకే ఒక రచయిత తాను వ్రాసిన ఆదర్శాలను తొలుత తాను ఆచరణలో వుంచుతూ యిలా అన్నాడు. ‘‘నా నవలలను చదివి పాఠకులు మెచ్చుకుంటే నాకంత ఉత్సాహం వుండదు. దానిలో చెప్పినట్లు ఆచరిస్తే అధికానందం కలుగుతుంది. దీనివల్ల వారికి, దేశానికి, అసలు మానవజాతికీ అభ్యుదయం కలుగుతుంది’’ అని. అలాంటి అభ్యుదయవాది. ఆ ఆదర్శరచయిత శ్రీ అంతటి నరసింహం గారొక్కరేనని ఘంటాపథంగా చెప్పవచ్చు.
శ్రీ అంతటి నరసింహంగారు కులవ్యవస్థను రూపుమాపుతూ, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ, వరకట్నం నిషేధిస్తూ, కులాంతర వివాహంగా ఓ చదువుకొన్న అమ్మాయిని, కట్నం లేకుండా పరిణయమాడారు. కాలేజిలో చదువుతున్నంత కాలము కాఫీ, టీ, సిగరేట్ ముట్టక ఆదర్శవంతంగా జీవించారు. ఆదర్శ రచయితగా వాసికెక్కారు.
శ్రీ అంతటి వారు 1939 – 40 లో మిడిలుస్కూలు విద్య ముగించి 1943లో యస్.యస్.యల్.సి ముగించారు. అనంతపురం కాలేజీలో 1945లో ఇంటర్ మీడియట్ ముగించి, 1949లో వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయములో బి.ఏ. ఆనర్సు ముగించి పిదప 1974లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటి నుండి ‘‘ప్రబంధాలలో ప్రకృతివర్ణన’’ అనే పరిశోధనా గ్రంథము వ్రాసి డాక్టరేట్ పొందారు. 1946 నుండి 1976 మధ్య అనేక ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. తరువాత 1976 ఫిబ్రవరి నుండి కొంతకాలము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖకు ప్రత్యేకాధికారిగా నియమింపబడ్డారు.
శ్రీ అంతటి నరసింహంగారి మనోగత భావాలను మనం వారి రచనల వల్లనే తెలుసుకోవచ్చు. వారు సమాజంలో సమానత్వం కోరారు. అస్పృశ్యత అణగారి పోవాలంటే కులవ్యత్యాసాలను కూల్చి, కులాంతర వివాహాలు జరపాలంటారు. ‘‘సమాజంలోని ఉచ్చనీచతలకు, కలిమిలేములకు, అజ్ఞాన అస్పృశ్యతలకు, వర్ణధర్మమే మూలకారణం. అట్లే మన సాహిత్యాన్ని సంస్కరించాలి’’ అని అంతటివారు తమ అభిప్రాయాలను వెల్లడిచేశారు.
వీరు గేయకావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రాత్మిక నవలలు, నాటకాలు మరెన్నో రచించారు. వీరి రచన లన్నింటిలోను వీరి అభిమాన విషయాలను గూర్చే చర్చించారు. ఆదర్శం – భావం – స్వగతం – ప్రేమభిక్ష – శోభాదేవి – శంపాలత వీరి సాంఘిక నవలలు. వీరి నవలలు సంఘంలో కొంత సంచలనాన్ని సృష్టించాయి. వీరి ‘‘భావం’’ నవలలో ‘‘సెక్సు’’ అధికంగా వుందని పాఠకులు అభిప్రాయపడినా, అది వట్టి భ్రమేనని, అదివారి భావంమీద ఆధారపడి వుంటుందని నిరూపించారు. పెద్దచిన్న, కులం – మతం, దేవుడున్నాడు – లేడు ఇవన్నీ భావంపైనే ఆదారపడి వుంటాయన్నది రచయిత భావన.
వీరి ఆదర్శం నవలలో అస్పృశ్యతానివారణ ముఖ్యాంశంగా చెప్పబడింది. కులమత భేదాలవల్ల వివాహం ఆగిపోయి, అవివాహితగా నిలచిపోయిన లేడీ లెక్చరర్ సానుభూతిమయ గాథ ‘‘లేడీ లెక్చరర్ స్వగతం’’ నవలలో చెప్పబడింది. ‘‘సహజీవనం’’ అస్పృశ్యతా నాటిక. 1956 లో అనంతపురం జిల్లా కలెక్టరు గారు జరిపిన పోటీలలో దీనికి బహుమతి వచ్చింది. సమరసత్వం – మానవత్వం – పరిష్కారం వీరి మరికొన్ని సాంఘిక నాటకాలు. పరిష్కారం నాటకంలో మరో అంతర్నాటకం ఉండడం ఒక విశేషము. రామరాయలు – చారిత్రాత్మిక నవల. ఇందు అళియరామరాయలు కులాంతర వివాహం చేసుకొని ఆనాటికే ఆదర్శవంతుడయ్యాడని, సంఘసంస్కరణ ఆనాటినుండే అమలులోకి వచ్చిందని చెప్పబడిన నవల యిది. ‘‘భువనవిజయం’’ పఠనకు ప్రదర్శనకు యోగ్యమైన నాటిక.
ఇవియేకాక బాలసాహిత్యం వైపు కూడ తమ కలాన్ని నడిపించారు అంతటివారు. కోటవీరన్న సాహసం, ఉదయగిరి పోలన్న ధైర్యం. మంత్రాల రామన్న మొండితనం, కవిగారి బాల్యం వీరి బాలసాహిత్యపు నవలలు. చాలా కుతూహలం రేకెత్తించే విధంగా వ్రాయబడిన పిల్లల నవలలివి. ఇంకనూ వీరి వెన్నో అముద్రిత కృతులు ముద్రణ భాగ్యాన్ని పొందవలసి వున్నాయి.
పండితుల యందాదరాభిమానములు గలవారు. సమతావాదిగా మానవసేవ చేస్తున్నవారు.
———–