జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి (Jonnalagadda Satyanarayanamurthy)

Share
పేరు (ఆంగ్లం)Jonnalagadda Satyanarayanamurthy
పేరు (తెలుగు)జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి
కలం పేరువిహారి
తల్లిపేరువేంకమాంబ
తండ్రి పేరుమృత్యుంజయుడు
జీవిత భాగస్వామి పేరుశారదాంబ
పుట్టినతేదీ1/1/1906
మరణం1/1/1965
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా సెట్టిపేట
విద్యార్హతలుఎం.ఏ.
వృత్తిన్యాయవాది
తెలిసిన ఇతర భాషలుబెంగాలీ, హిందీ, పార్సీ, ఇంగ్లీషు, జర్మన్
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునాటకాలు : చంద్రగుప్త, మేవాడు పతనము
నవలలు : శ్యామల (1920), కాలసర్పి (1922), భిన్నహస్తము (1920), నూర్జహాన్ (1925), దుర్గాదాసు, ఆటీన్ మణెలా (1920), ఒథెల్లో (1960)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునా మహారాష్ట్ర యాత్ర
ప్రధాన వ్యాసం: నా మహారాష్ట్ర యాత్ర
రచయిత 1950ల్లో తాను చేసిన మహారాష్ట్ర యాత్రను ఈ గ్రంథంలో యాత్రా సాహిత్యరూపంలో రచించారు. ఈ యాత్రలో భాగంగా శివాజీ, బాజీరావు వంటి మహావీరులకు సంబంధించిన చారిత్రిక ప్రదేశాలు, కోటలు, మహానగరాలు, వివిధ పుణ్యక్షేత్రాలు వంటివి దర్శించి వాటి గురించి గ్రంథంలో పొందుపరిచారు. కాగా ఈ పుస్తకంలో అత్యంత విలువైన భాగం మాత్రం పీఠికలో ఉన్న యాత్రా సాహిత్య వివరాలు. క్రీస్తుకు పూర్వమున్న వివిధ నాగరికతల్లో యాత్రా సాహిత్యం నుంచి మొదలుకొని నిన్నమొన్నటి వరకూ యాత్రా సాహిత్యం రచించిన భ్రమణ కాంక్షాపరుల గురించి ఇందులో వివరించారు. ఈ సమాచారం విజ్ఞానసర్వస్వ దృక్కోణంలో యాత్రా సాహిత్యం తరహా వ్యాసాలకు చాలా విలువైనది. దీని రెండవకూర్పును వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు చెన్నపురిలోని వావిళ్ల ప్రెస్ లో 1951 సంవత్సరంలో ముద్రించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి – అక్షరం
సంగ్రహ నమూనా రచననిన్నటినుంచీ ముసురుగానే వుంది.
ఇవ్వాళపొద్దుటినుంచీ సన్నగా జల్లుపడుతోంది.
గుడిసెముందు చితచితగా వుంది రిక్షావాడి బతుకులా గుడిసె లోపల నేలంతా చిత్తడిచిత్తడిగా వుంది.
సాయంత్రానికి రిక్షావాడి చేతుల్లో వెక్కరించే నాలుగురాళ్ళలా గుడిసె కప్పులోంచి అక్కడా యిక్కడా వో చినుకు రాలుతోంది.

జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి
అక్షరం

నిన్నటినుంచీ ముసురుగానే వుంది.
ఇవ్వాళపొద్దుటినుంచీ సన్నగా జల్లుపడుతోంది.
గుడిసెముందు చితచితగా వుంది రిక్షావాడి బతుకులా గుడిసె లోపల నేలంతా చిత్తడిచిత్తడిగా వుంది.
సాయంత్రానికి రిక్షావాడి చేతుల్లో వెక్కరించే నాలుగురాళ్ళలా గుడిసె కప్పులోంచి అక్కడా యిక్కడా వో చినుకు రాలుతోంది.
పొయ్యిలో కాలని తుమ్మ కొమ్మల్నీ, కడుపులో కాల్తున్నఎండిపోయిన ఎముకల్నీ తిట్టుకుంటోంది గంగమ్మ.
లోకంలోని నిరక్షరాస్యతలా గుడిసె అంతా కమ్మేసింది పొగ.
గంగమ్మ కళ్ళకీ పొగకీ నేస్తం కుదిరి ఎన్నేళ్లయిందే తెలీదుగానీ, ఇవ్వాళ మాత్రం గంగమ్మ పాలిట శ్రతువుగా మారిపోయింది పొగ. పైగా, గెరిల్లాలా సతాయిస్తోంది.
అందుకే, గంగమ్మ కళ్ళూ సన్నగా జల్లు కురుస్తున్నై.
గంజి చట్టిని పొయ్యిమీదనుంచీ దించి బయటికి వచ్చింది గంగమ్మ. చెంగుతో కళ్ళొత్తుకుంది.
ఎదురుగా – హనుమంతు.
గుడిసెముందు రావిచెట్టుకింద కూచుని,రాతి ముక్కతో తిన్నెమీద ఏదో బరుకుతున్నాడు.
జల్లు పలచబడుతోంది. వానకి తడిసిన మట్టి వింత వాసనల్ని వెదజల్లుతోంది. క్వార్టర్స్ ముందు తోటల్లోని బంతిపూల పచ్చదనం వావాతరణంలో కనిపిస్తోంది క్వార్టర్స్ని చుట్టేసిన కొండల అంచులమీద వింత వింత ఆకాశ చిరతాలు కదలాడుతున్నై. హనుమంతు మనసులోని కోరికల్లా.
గంగమ్మ హనుమంతు దగ్గరగా వచ్చింది. ‘‘ఏందిరా ఈడనె కూకన్నావ్, మీ అయ్య సెంటర్ కాడీకీ రమ్మన్నాడుగా’’ అంది వాడితో.
రంగయ్య రిక్షా వేసుకువెళ్తూ, హనుమంతుని సెంటర్కి పంపితే నూకలకి డబ్బులిస్తానని చెప్పిపోయాడు అప్పటికి ఒకటి రెండు గిరాకీలు తగుల్తాయనే ఆశతో.
హనుమంతు తలెత్తి తల్లి మొహంకేసి చూశాడు.
గంగమ్మ చూపులు తిన్నెమీదికి మరలినై. అంతా ఏదోచెక్కినట్టుంది. అది రాతో, గీతో అర్థంకాదు ఆమెకి. ‘‘ఏందిరా యియ్యన్నీ?’’ అడిగింది. ‘‘ఒంట్లేస్తన్నా, నినరాజు సెప్పాడు పది దాంకా’’ అన్నాడు హనుమంతు. వాడి కళ్ళల్లో గోచరిస్తున్న ‘యురేకా’ పిలుపుల్ని చదువుకో గలిగిన శక్తి గంగమ్మకు లేదు.
‘‘నీ కియ్యాల తన్నులు తప్పవులే’’ అంటూ వెనక్కివెళ్ళి గుడిసె తలుపు లాగి, దానికున్న పురికోసని గుంజకు కట్టి, మళ్ళీ చెట్టుకిందికి వచ్చింది.
‘‘నే ఎల్తన్నా. మీ అయ్యొస్తే సెట్టిగారింటికెల్లానని సెప్పు. మినువులు బాగుసెయ్యాలంట, మీ ఇద్దరూ గంజితాగండి’’ అంటూ ముందుకు సాగింది.
గంగమ్మకి కొడుకుని తలుచుకుంటే సంతోషమూకలుగుతుంది; అప్పుడప్పుడూ విచారమూ కలుగుతుంది. హనుమంతుకి పన్నెండేళ్ళు. గత రెండేళ్ళనుంచీ వాడు గంగమ్మకి సమస్యగానే తయారైనాడు. రోజు పొద్దున లేస్తూనే ‘నేబల్లోకెల్తానే సదూకుంటా’ అంటాడు. అప్పుడప్పుడూ ‘పలక్కొని పెట్టమ్మా’ అంటూ మారాం చేస్తాడు. ఎదురుగా క్వార్టర్స్ లో పిల్లలు బూట్టూ, కొత్తబట్టలూ వేసుకుని, చేతుల్లో పెట్టెలతో రిక్షాల్లోకి ఎక్కుతూవుంటే వాళ్ళందర్నీ కన్నార్పకుండా చూస్తూ రావిచెట్టుకింద నిలబడతాడు. ఈ దినచర్యలో కొత్త ఏమీలేదు. చూడాల్సిందీలేదు. అయినా ఆ సమయానికి ఠక్కున అక్కడికొచ్చి వాలతాడు హనుమంతు. అనుకోకుండానే అలా వచ్చి నిలబడతాడు. రిక్షాలు కదిలిపోతాయ్. పిల్లు కేరింతలు కొడ్తూ, చేతులువూపుతూ వుంటారు. వాళ్ళ తల్లులూ, తండ్రులూ వాళ్ళకి ‘టా…టా…’ చెప్తూ నిలుచుండిపోతారు.
కొద్ది సేపటికి ఉత్సాహంగా గుడిసెలోకొస్తాడు హనుమంతు. ‘‘నేనూ అట్టా బడికెల్తానే’’ అంటాడు దివిటీలా వెలుగుతున్న మొహంతో.
వాడి అయ్య రంగయ్య దీనికి సుతరామూ వొప్పుకోడు. ఒకటి రెండుసార్లు భర్తని కదిపిచూసింది గంగమ్మ. ‘‘సదువెందుకే సంకనాకను. ఆ పెద్దమేడలో కారున్న అయ్యగారి కొడుకు సూడు. సదూకుని అమెరికా ఎల్లొచ్చిండు. కాపీ డబ్బులు సంపాయించలేదు. హనుమంతుగాడికీ ఎదవ బుద్దులు నేర్పమాక’’ అన్నాడు రంగయ్య
ఇంకో వెన్నెలరాత్రి గుడిసె బయట హనుమంతు నిద్రపోతున్నాడు. లోపలికొచ్చి పెళ్ళాంతో సరసం మొదలెట్టాడురంగయ్య. ఇదే అదననుకొని రోజు రోజుకు ఖర్చులు ఎక్కువవుతున్నాయనీ, సంపాదన సాలడంలేదనీ, ఎన్నాళ్ళిలా దిగనాసి సంసారం చేస్తామనీ చెప్పుకుంటూపోయింది. గంగమ్మ మాటలు రంగయ్యలోనూ ఆలోచన కలిగించసాగేయి. చెమ్మగిలిన కండ్లకు వర్షంలా కనిపించింది భవిష్యత్తు ఇద్దరిలోనూ బతుకు భయం తొంగిచూసి, గుండెల్ని వెచ్చగా హత్తుకునేట్టు చేసింది.
సరిగ్గా ఆ సమయంలో గోముగా అడిగింది గంగమ్మ, ’’అడ్ని బల్లో ఏద్దాం’’ అని. పాముమీద కాలువేయబోయినవాడిలా అదిరిపడ్డాడు రంగయ్య. ఒక్కసారిగా నీరసం ఆవహించింది. క్షణంలో మొహాన్న చెమట పట్టింది. నవనాడులూ కుంగిపోయి నట్టయింది. కోపమొచ్చింది. లేచి నుంచున్నాడు. ‘‘ఈ మాట మల్లీ అన్నావంటే నీ తోలు తీస్తా జాగ్రత్త. సదువుపిచ్చి నీకు బాగానే పట్టిందే’’ అంటూ మిడతల దండులా పెళ్ళాంమీద దాడిచేశాడు. అరుస్తూనే గుడిసె బయటికి వెళ్ళి హనుమంతు పక్కన పడుకున్నాడు.
ఆ తర్వాత అప్పుడప్పుడూ హనుమంతు తన పాట తాను వొప్పజెప్తున్నా గంగమ్మ మారతం తనకైన అనుభవాల దృష్ట్యా భర్త దగ్గర ఆ ప్రసక్తి తేవడం మానేసింది.
హనుమంతు నెమ్మదిగా ఎదురింటి రాజతో జతకలిపేడు. రాజు తండ్రి బ్యాంక్లో పనిచేస్తాడు. క్వార్టర్స్ లో కాపురం. హనుమంతుకి అప్పుడప్పుడూ సాయంకాలాల్లో అక్షరాలూ, ఒంట్లూ నేర్పటం మొదలెట్టాడు రాజు. హనుమంతు వాటిని సాధన చేయసాగేడు.
ఇవ్వాళా అట్టాగే ఒంట్లేస్తూ కూర్చున్నాడు హనుమంతు.
పన్నెండు గంటలవుతుండగా వచ్చేడు రంగయ్య. ‘‘ఏరా, సెంటర్కాడికి రాలేదేం’’ అడిగేడు హనుమంతుని. హనుమంతు అప్పటికి గంజి తాగేసి గుడిసెలో నులకకుక్కిలో పడుకుని వాడి కలల్లో వాడు తేలిపోతున్నాడు. తండ్రి మాట విని ‘‘కాలికి నొవ్వగా వుంది’’ అపి మరోవైపు తిరిగి పడుకున్నాడు. ‘‘మీ యమ్మేది’’ ఈ ప్రశ్న తండ్రి సౌమ్యంగా వున్నట్టు ధైర్యం కలిగించింది హనుమంతుకి.
హనుమంతు లేచి కూర్చున్నాడు. తల్లి సెట్టిగారింట్లో మినుములు బాగుచేయడానికి పోయినట్టు చెప్పాడు.
రంగయ్య గంజి తాగడం మొదలెట్టేడు. ‘‘నువ్వొచ్చుంటే డబ్బులిచ్చేవాణ్ణిగా. ఇయ్యాల నూకలు కొనాల’’.
దీనితో అయ్యకాడ డబ్బులున్నట్టు అర్థం చేసుకున్నాడు హనుమంతు. మంచం దిగి నెమ్మదిగా తండ్రి దగ్గరగా వచ్చి ఆయన పక్కగా కూర్చున్నాడు. తండ్రి గంజి తాగుతూ, ఆవకాయ ముక్కని చీకుతుంటే తను నీళ్ళు నమిలేడు; ఉమ్మిమింగేడు. ధైర్యం కూడగట్టుకని అడిగేడు; ‘‘అయ్యా… నే బడికెల్తానే’’ అని.
ఠక్కున తలెత్తి కొడుకుకేసి చూసేడు రంగయ్య. తలవంచుకుని బిక్కు బిక్కుమంటూ నేలమీద పిచ్చిగీతలు గీస్తున్నాడు హనుమతు.
‘‘సంపేత్తా మల్లీ బడీగిడీ అన్నావంటే జాగ్రత్త’’ అంటూ గ్రుడ్లురిమి, కంచంలోనే చెయ్యి కడుక్కాన్నాడు రంగయ్య.
తండ్రి సౌమ్యంగా వున్నాడనుకున్న తన అంచనా తలక్రిందయినందుకు, ఆయన సమాధానం లోని కాళిన్యానికీ చిన్నబుచ్చుకుని, మొహం మిల్లిలా చేసుకుని అక్కణ్ణుంచీ లేచిపోయాడు హనుమంతు.
నులక కుక్కిలో నడుం వాల్చేడు రంగయ్య. కొడుకు అభ్యర్థన రంగయ్యని గతంలోకి తోసింది.
రంగయ్య తండ్రి దొరదగ్గర పాలేరుగా పనిచేసేవాడు. ‘‘దొరది దొడ్డమనసు’’ అంటూ వుండేవాడు తండ్రి. రంగయ్యకి ఏళ్ళు వస్తున్నకొద్దీ అతనికో బెడద ఏర్పడింది. దొరకి పిల్లల లేకపోవడం కారణమో, నిజంగానే ఆయన మనసు దొడ్డది కావడం కారణమో రంగయ్యకు తెలీదు గాని అతన్ని బడిలో వెయ్యమని దొర రంగయ్య తండ్రికి సలహా యిచ్చేట్ట.
ఓ మంచిరోజున ‘నువ్ బడికెల్తన్నావ్ యియ్యాలనుంచీ’ అన్నాడు తండ్రి. రంగయ్యకి తల్లిలేదు. అతన్ని కని ఆమె పోయింది. నాయనమ్మ పెంపకం. ఆవిడా అన్నది, ‘పాలేడు కొడుకుని పనిలోకి దింపమనకుండా ఆ దొరగారు నిన్ను బడికెయ్యమనడం నీ అదురుట్టంరా రంగా. బాగా సదూకో’ అని.
మైలు దురంలోవున్న పక్కవూళ్ళో వుంది బడి. చద్దన్నాయల్యాక డొంకబట్టిపోవడం, చింతకాయలు కోసుకు తింటూనో, నేరేడు పళ్ళేరుకు తింటూనో బడికి చేరేవాడు తను. వారం రోజులు తనను బాగా చూసేడు అయ్యవారు. పలకమీద ‘అ ఆ’ రాసిచ్చి దిదమనేవాడు. వారం అయనా తనకు ఆ రెండక్షరాలూ చూడకుండా రాయడం రాలేదు. ఆవేళ, అయ్యవారికి కోపమొచ్చింది. అరచేతిని వెనక్కి తిప్పి పట్టమని మెటికలమీద రూళ్ళకర్రతో వొక్కటేశాడు. తన ప్రాణం జివ్వుమంది. వొళ్ళు ఝల్లుమంది. నరాలు పెటపెట లాడినట్లయినై. అదే తన వొంటిమీద పడిన మొట్టమొదటి దెబ్బ, తన మనస్సుకు గాయమైపోయింది. మరో నెలరోజులు గడిచేసరికీ తన మనస్సు విరిగేపోయింది. ఆ నెలలో జరిగిన రెండు సంఘటనలూ తనకు తలపుకొస్తే ఈనాటికీ వొళ్ళు జలదరిస్తుంది.
ఒకరోజు బళ్ళో అయ్యవారు నాలుగోతరగతి పిల్లలకి పాఠం చెప్తున్నాడు. చంద్రమౌళి అని వో కుర్రాడ్ని ఏదో ప్రశ్న అడిగేడు. ఆ కుర్రాడికి సమాధానం రాలేదు. అయ్యవారు చిర్రుబుర్రులాడుతూ వాడికి చింతబరికెతో నాలుగు అంటించి గోడకుర్చీ వెయ్యమని దండన విధించాడు.గదిలో వో మూలకి పోయి గోడికుర్చీవేసి పుస్తకం కేసి చూస్తున్నాడు చంద్రమౌళి. బడివున్న ఇల్లంతా చవిటిగోడల మయం; పైన రెల్లుకప్పు.
పాఠాల గొడవలో పడ్డారు అందరూ.
ఉన్నట్టుండి పొలికేక పెట్టాడు చంద్రమౌళి. ‘‘చచ్చాను బాబోయ్, పిర్రకేదో పొడిచింది’’ అని.
అందరూ వాడికేసి చూశారు. అయ్యవారు నెమ్మదిగా వాడి దగ్గరగా వెళ్ళి ‘‘ఏరా ఏఃవిటి? వేషాలేస్తున్నావ్ వెధవా, నీ తెలివి నా దగ్గర చూపకు. బడి వదిలేదాకా గోడకుర్చీ తప్పదు. నోరెత్తావంటే చంపేస్తా’’నంటూ మరో రెండు దెబ్బలు అంటిం, వాణ్ణి మళ్ళీ గోడకుర్చీ వేయించి ఇవతలికి వచ్చాడు.
చంద్రమౌళి కళ్ళవెంట నీళ్ళు ధారగా కారుతన్నై. అతను సరిగా నిలబడలేకపోతున్నాడు. పది నిముషాలు కూడా కాలేదు. అతను వున్న పళాన కూలి గోడవారగా పడిపోయాడు.
అయ్యవారు అప్పుడు తేరుకున్నారు. నిజంగానే ఏదో కుట్టివుంటుందనిపించింది. హడావిడిగా చంద్రమౌళిని వాళ్ళ యింటికి చేర్చేరు. జరిగిన దేఁవిటో చెప్పలేకపోయారు.
చంద్రమౌళి తండ్రికి నలుగురు ఆడపిల్లల తర్వాత ఒక్కడే మగబిడ్డ.
ఆయనకు నాలుగరకల వ్యవసాయం వుంది. చంద్రమౌళిని అరచేతిలో నిమ్మపండులా పెంచుకుంటున్నాడు.
ఉరుకులు పరుగులతో చంద్రమౌళిని డాక్టరు దగ్గరికి తీసుకుని వెళ్ళేరు. ఆసరికే చంద్రమౌళి చచ్చిపోయాడు.
అంతా కలలా జరిగిపోయింది. మండ్రగబ్బ కుట్టివుంటుందని కొందరూ, కాదు ఏ పామో కరిచివుంటుందని కొందరూ అనుకున్నారు. ఎంత వెదికించినా ఏదీ కనిపించలేదు.
తాను ఆ మర్నాటినుంచీ బడి మానేశాడు. తండ్రీ, నాయనమ్మ ఎంత చెప్పినా వినలేదు. దొరకూడా అన్నాడో రోజు ‘భయం లేదులే వెళ్ళరా వెధవా’ అని. తను మొరాయించేశాడు. ఎవరేం చెప్పినా వెళ్ళనని మొండికేశాడు.
పది రోజుల తర్వాత జరిగిన మరో సంఘటన రంగయ్యని పూర్తిగా చదువుపట్ల విముఖుణ్ణి చేసింది.
ఆవేళ –
తండ్రికి పొలానికి అన్నం తీసికెళ్తున్నాడురంగయ్య. బళ్ళోనుంచి పిల్లలంతా తిరిగొస్తున్నారు. వాళ్ళంతా చాలాసందడిగా హడావిడిగా వున్నారు. వస్తున్నవాళ్ళు లెక్కకు పదిమందికి మించి లేరు వాళ్ళంతా దగ్గర పడేదాకా డొంకవారగా నిలబడ్డాడు రంగయ్య.
వెంకటచెట్టిగారబ్బాయి కుడికాలికీ, వేరే వొకపెద్ద దుంగకూ కలిపి ఒక గొలుసు వేళాడుతోంది. దుంగని రెండు చేతులతోనూ ఎత్తుకుని, కుడిభుజాన పెట్టుకుని బరువుగా అడుగులు వేస్తున్నాడు అతను.
మిగిలిన పిల్లలంతా వాణ్ణి గేలిచేస్తూ ఏడిపిస్తూ కుడి ఎడమలా, వెనకా ముందూ అల్లరి చేస్తూ నడిపించుకొస్తునానరు.
వాళ్ళంతా తనని దాటి వెళ్తుండగా ఎవర్నో అడిగేడు, ‘‘ఏఁవిట్రా ఇది?’’ అని. వాడు పెద్దగా నవ్వి ‘బండకొయ్య’ అని చెప్తూ వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి నాయనమ్మ నడిగి ‘బండకొయ్య’ గురించిన వివరాలు తెలుసుకున్నాడు రంగయ్య. నిద్రపట్టలేదు బండకొయ్యని మోసుకొస్తున్న పిల్లవాడి కన్నీరే రంగయ్య కళ్ళముందు మెదలసాగింది.
అప్పట్నుంచీ రంగయ్యకి చదువంటే తేళ్ళూ, జెర్రులూ పాకినట్లవుతుంది ‘చదువు’ అనే మూడక్షరాల్నీ ఉచ్చరించినా మహాపాపం అన్నట్టు భావించసాగేడు.
ఎవరన్నా చదువుకునే పిల్లల్ని చూసినప్పుడల్లా వారు వధ్యశిలకు కొని పోబడుతున్న మేకపిల్లల్లా అనిపిస్తారు అతనికి.
ఊళ్ళోకి రెండు ఇంగ్లీష్ కాన్వెంట్లు వచ్చాయి. ఆ కాన్వెంట్లకి పల్లల్ని తీసుకువెళ్ళడానికి చాలామంది రిక్షావాళ్ళు వాడుకల్ని కుదుర్చుకున్నారు. వాటిద్వారా నెలకొక ‘‘ఇంత’’ మొత్తం ఒక్కసారిగా చేతికొస్తుందని వారి ఆలోచన.
రంగయ్య మాత్రం ఆ పనిజోలికి పోలేదు. చదువుపట్ల అతనికున్న బావాలే దీనికి కారణం.
రంగయ్యకు ఈ ఆలోచనల్లోనే నిద్రపట్టింది.
ఉదయం బారెడు పొద్దెక్కింది.
వేపచెట్టు క్రింద కూర్చుని, అప్పటికి గంట నుంచీ గమనిస్తున్నాడు రంగయ్య.
రోడ్డుకు అవతలవైపు మూడంతస్తుల భవనం వుంది.
దానిలో ఏదో పెద్ద ఆఫీసు వుంది. ఆ ఆఫీసు దగ్గరికి పొద్దుటినుంచీ చాలా ‘లాగుడుబండ్లు’ వస్తున్నై. వచ్చని కొద్ది సేపట్లోనే వచ్చినవి వచ్చినట్లే వెనక్కీ వెళ్ళిపోతున్నై. కార్లూ, స్కూటర్లూ వున్న ఉద్యోగులంతా అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. బళ్ళవాళ్ళతో ఏదో మాట్లాడటం, పెద్దగా అరవడం, కేకలేసుకోవడం జరిగిపోతోంది.
మరో అర్థగంటకి –
బండ్లు, బల్ళ యజమానులు వెళ్ళిపోయారు ఆఫీసులో నుంచీ వో బాబు వచ్చాడు.
‘రిక్షా వస్తావా?’ అన్నాడు రంగయ్య నుద్దేశించి.
తలకాయ ఊపి, రిక్షాతోసమా ఆఫీసు ముందుకు నడిచేడు రంగయ్య.
అతను లోపలికి నడుస్తూ, ‘‘మా పెద్దసార్ మాట్లాడతారు రా’’ అన్నాడు. అనుసరించాడు రంగయ్య.
పెద్దసార్ అడిగేరు, ‘‘ఈ ఆఫీసులో వున్న రికార్డంతా గాంధీ చౌక్లో బిల్డింగ్ కి చేర్చాలి కుర్చీలూ, టేబుల్సూ, రేక్లూ, బెంచీలూ అవేవీ తియ్యఖ్కర్లేదు కాగితాలూ, ఫైళ్ళూ మాత్రమే అంతా వీళ్ళు చూపిస్తారు చూసుకో కావాలంటే నువ్వింకో రిక్షా అతన్ని తెచ్చుకో. సాయంత్రంలోగా ‘షిఫ్ట్’ చేస్తేచాలు. ఒక్కడివే చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు.’’
ఆయన ముఖంలో చిరాకూ, విసుగుదల్లా, అస్థిమితత్వం వున్నాయి. పక్కన చేరిన ఇతర ఉద్యోగులతో అన్నాడు ‘‘ఐ డోంట్ వాంట్ టు బి ఎక్స్ప్లాయిటెడ్ బై దోజ్ ఫెలోస్’ అందిరివైపూ ఒకసారి చూసేడు.
ఒకరిద్దరు, ‘‘యస్… యస్‘‘ అన్నారు.
‘‘ఇతనికి ఆ రికార్డంతా చూపండి’ పెద్ద సార్ ఆజ్ఞాపించారు.
కొంతమందికదిలేరు వాళ్ళతోపాటు రంగయ్య కదిలేడు.
‘‘అవసరమైతే ఇతనికింకోనాలుగ రూపాయలు ఎక్కువ ఇవ్వండి. వీడూ ఒప్పుకోకపోతే నేనే మోస్తాను అంతే’’ చాలా దృఢంగా ఎవరితోనో చెప్తున్నాడు పెద్దసార్.
రంగయ్య విన్నాడు ఇదేదో పట్టుదల బేరమనే విషయం అర్థమైందతనికి.
రికార్డంతా చూసుకున్నాడురంగయ్య. చాలా వుంది. గాంధీచౌక్ మూడు మైళ్ళుంది. ఒక్కడూ తలపడితే సాయంత్రందాకా తేలిగ్గా పడుతుంది.
‘‘ఎంత యివ్వమంటావ్?’’ సార్ అడిగేడు.
రంగయ్య నీళ్ళు నమిలేడు. ఎంత అడగాలో నిజానికి అతనికీ తెలీదు.
‘‘మీ యిష్టం సార్ మీరే చెప్పండి’’ అన్నాడు
ఆయనే ‘‘సరే నేనే చెప్తాను’’ అవి ‘‘అరవై రూపాయలు తీసుకో’’ అన్నాడు.
రంగయ్య కళ్ళముందు ఆరు పదిరూపాయల కాగితాలు రెపపెపలాడినై
‘‘అట్టాగేసార్’’ అనేసాడు.
పని చకచకా సాగింది. ఉద్యోగులంతా కాగితాల్నీ, ఫైళ్ళనీ కట్టలుకట్టి అందివ్వడం వంటి చిన్న చిన్న పనులు సహాయం చేస్తున్నారు రంగయ్యకి.
మొదటి ‘ట్రిప్’ అయ్యేసరికే కాఫీలు వచ్చినై రంగయ్యకీ ఇప్పించారు.
మధ్యాహ్నం ఒంటిగంట దాటుతోంది అప్పటికి ఆరుసార్లు గాంధీచౌక్కి వెళ్ళివచ్చాడు రంగయ్య.
ఉద్యోగులంతా భోజనాలకి పోతూ, రంగయ్యనీ హోటల్కి పిలిచేరు.
‘ప్లేట్ మీల్స్’ చేశాడు రంగయ్య బిల్లుని ఉద్యోగుల్లో ఒకాయన తీసుకుని చెల్లించాడు పెద్దసార్కి ఆఫీస్కే ‘కేరియర్’ వచ్చంది.
ఏడుగంటలు కావస్తోంది.
పని పూర్తిగా అయిపోయింది.
రంగయ్య వూపిరి పీల్చుకున్నాడు.
పెద్దసార్ రంగయ్యని లోపలికి కేకేశాడు రంగయ్య ఆయన ముందు నిలబడ్డాడు.
‘‘అనుకున్నట్టు పని పూర్తి చేశావ్ నాకు చాలా సంతోషంగా వుంది’’ ఆపి చుట్టూ చూశాడు. ఉద్యోగ బృందమంతా ఆయన మాటల్ని సమర్థిస్తున్న మొహాలతో నిలబడ్డారు.
ఒకాయన అన్నాడు, ‘‘లారీ పెట్టివుంటే చాలా దండగ పడివుండేవాళ్లం.’’
‘‘బండ్లవాళ్లుకూడా మనల్ని తినేయాలని చూశారు’’ మరొకతను సన్నగా అన్నాడు.
‘‘అందుకే నేనీ ‘ఇష్యూ’ని ‘ప్రిస్టేజ్’ క్రింద భావించాను. నిజంగానే, ఈ రిక్షా అతను వొప్పుకుని వుండకపోతే నేను నా స్వంత కార్లో కొట్టించేసి వుండేవాణ్ణి. డ్రైవర్ లేడని ‘హెజిటేట్’ చేసేవాణ్ణికూడా కాదు.’’
ఆయన మాటల్లో ఇంగ్లీష్ పదాలకి అర్థాలు తెలీలేదు రంగయ్యకి.
క్షణాల తర్వాత ఉద్యోగుల్లో ఒకాయన తొలిసారి రంగయ్యని పిలిచిన వ్యక్తి పెద్దసార్ని ఉద్దేశించి చెప్పాడు, ‘‘మనకివ్వాళ కాఫీ టిఫెన్లకీ, భోజనాలకీ అదీ యన ఖర్చంతా కలిసి ‘వోచర్’ తీసుకుందాం సార్’’.
‘‘యస్. యస్. అలాగే చెయ్యండి. ఐ ఎగ్రీ‘‘ అంటూ రివాల్వింగ్ ఛైర్లో గిర్రున పక్కకి తిరిగి బల్లమీద మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని గటగటా త్రాగేడు పెద్దసార్.
‘‘అయితే నూటపాతిక రూపాయల నలభై పైసలకి రాస్తాను వోచర్’’ అంటూ ఏదోకాగితం మీద రాయడం మొదలు పెట్టాడు మొదటి వ్యక్తి.
ఆ తర్వాత దానిమీద స్టాంపుని అతికించాడు. అది ‘నోటుబిళ్ళ’ అని రంగయ్యకి తెలుసు. ఆ కాగితాన్ని రంగయ్య ముందు వుంచి ‘‘ఇక్కడ సంతకం చెయ్’’ అంటూ చూపేడు.
రంగయ్య మనస్సు కలుక్కుమంది; గుండెల్లో ఎక్కడో సన్నటి బెజ్జం పడింది. ఆత్మన్యూనతా భావం మొహాన్న దోబూచులాడింది. క్షణం సేపు ఏదో భావ సంఘర్షణకి లోనైనట్టు ఊగిపోయాడు.
పెద్ద దొర…
నాయనమ్మ….
నాయన…
అయ్యవారు…
చంద్రమౌళి…
వెంకటచెట్టిగారి అబ్బాయి…
అందరూ కళ్ళముందు మెదిలి అదృశ్యమైనారు.
వీళ్ళందర్నీ వెనక్కి నెట్టి గంగమ్మ కనిపించింది. గంగమ్మ కొంగుచాటుగా బిక్కమొహం వేసుకొని ’అయ్యా, నే బడికెల్తానే’ అంటున్న హనుమతు కోరిక కనిపించింది.
రంగయ్య కళ్ళల్లో నీరు తిరిగింది.
ఆ ఉద్యోగికి సమాధానమేఁవీ చెప్పకుండా, టేబుల్మీది ‘స్టాంప్ పేడ్’ని తెరిచి ఎడమచేతి బొటనవ్రేలుని దానిమీద అద్ది కాగితంమీద ‘నిశానీ’ వేశాడు. తలవంచుకునే డబ్బు తీసుకున్నాడు అరవై రూపాయలు.
అరవై రూపాయలు తీసుకుని నూటపాతిక రూపాయల నలభై పైసలకి ‘నిశానీ’ వేసిన రంగయ్యని చూసి అతని దోసిట్లోని మాడంత మబ్బూ ఫక్కున నవ్వింది. ఎదురుగా వేపచెట్టుకు వ్రేలాడుతున్న ‘‘కాలం మారింది’’ సినిమా పోష్టర్ ఆ నవ్వుతో శృతి కలిపింది.
ఏదో నిశ్చయానికి వచ్చినట్టు గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోయాడు రంగయ్య.
ఉన్నత శిఖరాలకు దారులు వేస్తున్న ఆ అడుగుల చూపు రేపటి వెలుగువైపు.
ఆ వెలుగు ఇప్పుడూ ఎప్పడూ ‘అక్షరం’.

———–

You may also like...