పేరు (ఆంగ్లం) | Tumu Narasimhadasu |
పేరు (తెలుగు) | తూము నరసింహదాసు |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకమ్మ |
తండ్రి పేరు | అచ్చయ మంత్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1790 |
మరణం | 1/1/1833 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | ఆంధ్ర సంస్కృత సాహిత్యాలలోను, సంగీతంలోను పాండిత్యం సంపాదించారు. |
వృత్తి | గుంటూరులో డివిజన్ కొలువులో లౌకికోద్యోగియై ఉన్నారు. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | దాసు భారతదేశం అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారు. కాలినడకన దాసు కాశీయాత్ర, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారు. మహాభక్తుడైన త్యాగరాజు దాసుని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడటం, బాధ కలిగించింది. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కన్పించి హైదరాబాదులో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహ దాసును భద్రాచలం, పాల్వంచ పరగణాలకు పాలకునిగా నియమించారు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తూము నరసింహదాసు |
సంగ్రహ నమూనా రచన | తూము నరసింహదాసు చాలా ప్రసిద్ధ పదకర్త. ఇతడు గుంటూరు నివాసి; త్యాగరాజు (1767-1847)కు సమకాలికుడు. భద్రాచల రామదాసు భక్తుడై – అపర రామదాసు లాగానే కీర్తన రచన చేసి భక్తిని ప్రకటించుకొన్నాడు. తూము నరసింహదాసు ముద్రతో కీర్తనలు అనేకం రచించాడు. భద్రాచలంలోనే రామచంద్రునిలో ఐక్యమైనట్లు తెలుస్తుంది. |
తూము నరసింహదాసు
తూము నరసింహదాసు చాలా ప్రసిద్ధ పదకర్త. ఇతడు గుంటూరు నివాసి; త్యాగరాజు (1767-1847)కు సమకాలికుడు. భద్రాచల రామదాసు భక్తుడై – అపర రామదాసు లాగానే కీర్తన రచన చేసి భక్తిని ప్రకటించుకొన్నాడు. తూము నరసింహదాసు ముద్రతో కీర్తనలు అనేకం రచించాడు. భద్రాచలంలోనే రామచంద్రునిలో ఐక్యమైనట్లు తెలుస్తుంది.
గుంటూరు నుంచి దేశయాత్ర చేసుకొంటూ భద్రాచలం వెళ్లి అక్కడ శ్రీరామచంద్రమూర్తికి కైంకర్యాలు చేయించిన రాజా తూము నరసింహదాసు అనే వాగ్గేయకారుని గురించి కొద్దిగా చెప్పుకొన్నాము. అచ్చయ మంత్రి, వెంకమ్మ అనేవారు ఈయన తల్లిదండ్రులు. గుంటూరు వాస్తవ్యులు. ఈయన త్యాగరాజస్వామికి సమకాలీనుడు. ఆంధ్ర సంస్కృత సాహిత్యాలలోను, సంగీతంలోను పాండిత్యం సంపాదించిన ఈయన గుంటూరులో డివిజన్ కొలువులో లౌకికోద్యోగియై ఉన్నా, పారమార్థిక చింతతో భద్రాచలం సీతారాములయెడ భక్తి కలిగి, భక్తి ప్రబోధకాలైన భజన కీర్తన లెన్నో రచించాడు. ఈ కీర్తనలలో రామభక్తి, పరమార్థ చింతా, వేదాంత తత్త్వమూ కలవి మాత్రమేగాక, సీతారాములకు భక్తితో, సంకీర్తన కైంకర్యానికి ఉపయోగించే ఉత్సవ సంప్రదాయ కృతులైన మేలు కొలుపులు, హెచ్చరికలు, లాలి పాటలు, మంగళహారతులు కూడా ఉన్నవి. ఈ కీర్తనలు ఆంధ్రదేశమంతటా భజనకూటముల వారి నోళ్లలోను, ఆ సంప్రదాయముగల యిళ్లలోను, చిరకాలం నుంచి వినబడుతూ ఉన్నవే.
1. | సౌరాష్ట్రం | భజనచేసే విధము తెలియండి జనులారా మీరు నిజము గనుగొని మోదమందండి |
2. | మధ్యమావతి | రామనామామృతమే నీకు రక్షకం బనుకోవే మనసా |
3. | యదుకులకాంభోజి | ఎందుకే యీ వట్టి బాధలు నీకెందుకే ఎందుకే బాధలజెందుచు నుండెద వందముగా ముకుంద వరదయనవు |
4. | యదుకులకాంభోజి | సెలవా మాకిక సెలవా రామయ్య సెలవా మాకిక శరణాగతవరభరణా భవతరణా రామయ్య |
5. | యమునాకల్యాణి | కావేటిరంగా నను గావవేరా కావేటిరంగ నను గావుమనుచు వేడ రా వేమి సేతురా రాకుమారా |
6. | తోడి | వందన మిదె శ్రీరంగా |
7. | యదుకులకాంభోజి | కరుణ యేదిరా రంగయ్య |
8. | రేగుప్తి | రంగని సేవింపగలిగె నమ్మా |
9. | శహన | వరదుని గంటినీ – కంచి వరదుని గంటినీ |
10. | రీతిగౌళ | రామసహాయ మెన్నటికో |
11. | కానడ | చెలియా శ్రీరామచంద్రుని సేవజేతమా |
నరసింహదాసు సకుటుంబంగా భక్తులైన మిత్ర బృందంతో సహా దక్షిణ దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ యాత్రచేస్తూ, శ్రీరంగమూ, కంచీ దర్శించి, అక్కడి దేవుళ్లపై కీర్తనలు పాడాడు. చెన్నపట్నం వచ్చి పార్థసారథిస్వామిని దర్శించి, అప్పుడు తిరువొత్తియూరులో వీణ కుప్పయ్యగా రింటిలో బసచేసిన త్యాగరాజస్వామిని దర్శించి ఆయన సంకీర్తనలను విని, అద్భుతానంద పరవశుడై తాను ఆయన ఘనతను ప్రశంసిస్తూ పద్యాలు చదివాడట. అక్కడ నుంచి నెల్లూరు వెళ్లి రంగనాథుని సేవించి ఆ తర్వాత వరద రామదాసనే మరొక భక్త వాగ్గేయకారుని తోడుచేసుకొని భద్రాచలం వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు స్థిరనివాసం ఏర్పరచుకొని సీతారాములపైన నిత్యోత్సవ సంకీర్తనలు రచించి పాడుతూండేవారు. అప్పటి నైజామును కలసికొని, అదివరకు గోపన్నగారు తానీషావారి సమ్మతిపైని భద్రాచల రాముల నిత్యకైంకర్యానికై యిచ్చిన దాన శాసనం దుష్టులెవరో చెక్కి వేసినదానిని తిరిగి వ్రాయించి, నైజాము చేత తిరిగి రాములవారికి కైంకర్యాలకూ, నిత్యోత్సవాలకూ గాను వార్షికాలు ఏర్పాటు చేయించారు. నరసింహదాసుగారూ, వరద రామదాసుగారూ చాలాకాలం భద్రాచలంలో ఉండి నిత్య సంకీర్తనలతో రాములవారిని సేవించుకొని, అక్కడే రాములవారిలో ఐక్యం పొందారని, తూము నరసింహదాసు చరిత్ర అనే హరికథ వల్ల మనకు తెలుస్తోంది. ఇందులో చాలా సంకీర్తనలు నరసింహదాసుల రచనలే. ‘తూము నరసింహదాస’ అనే ముద్ర, ఆ కీర్తనలలో కనిపిస్తూంది. నరసింహదాసుగారి సహచరులైన వరద రామదాసుగారు కంచి వాస్తవ్యులు. రామాంకితంగాను వరదరాజాంకితంగాను భక్తి కీర్తనలు వ్రాసినారు.
———–