పేరు (ఆంగ్లం) | Sardesai Tirumalarao |
పేరు (తెలుగు) | సర్దేశాయి తిరుమల రావు |
కలం పేరు | – |
తల్లిపేరు | కృష్ణవేణమ్మ |
తండ్రి పేరు | నరసింగరావు |
జీవిత భాగస్వామి పేరు | ఆజన్మ బ్రహ్మచారి |
పుట్టినతేదీ | 7/1/1928 |
మరణం | మే 1994 |
పుట్టిన ఊరు | జొహరాపుం, అలూరు తాలూక, కర్నూలు జిల్లా |
విద్యార్హతలు | బిర్లా ఇన్స్టిట్యూట్‌నుండి ఎం.ఎస్.సి. కెమిష్ట్రీ |
వృత్తి | డైరెక్టరు, తైలసాంకేతిక పరిశోధనాసంస్థ, అనంతపురం |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రతి రచననూ విమర్శనాత్మక దృష్టితో చూసే సర్దేశాయి తిరుమలరావుకు నచ్చిన గ్రంథాలు మూడున్నాయి. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకాన్ని, ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి నవలను, గడియారం వేంకట శేషశాస్త్రి రాసిన శివభారతం కావ్యాన్ని ఆయన ఎంతో ఇష్టపడేవాడు. కన్యాశుల్క నాటక కళ, సాహిత్య తత్త్వము-శివభారత దర్శనము అనే పుస్తకాలను రాశారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సర్దేశాయి తిరుమల రావు |
సంగ్రహ నమూనా రచన | రాయలసీమలో రచయితలున్నంతగా, సాహితీ విమర్శకులు లేరు. విమర్శకుల కొఱతవలన సాహిత్యపు విలువలు తరుగునను మాట అందరెరిగినదే, విలువలేని సాహిత్యముభూమిపై నిలువనేరదు. విమర్శకులుగా రాణించుట బహుకష్టమైన విషయము. విమర్శకుడు తరతమ భేదము లేని వాడుగా, బాహుభాషాకోవిదుడుగా, మంచిచెడ్డలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలుగు ధైర్యశాలిగా, నిలదొక్కుకొనగలుగు సమర్థవంతుడుగా నుండవలెను |
సర్దేశాయి తిరుమల రావు
రాయలసీమలో రచయితలున్నంతగా, సాహితీ విమర్శకులు లేరు. విమర్శకుల కొఱతవలన సాహిత్యపు విలువలు తరుగునను మాట అందరెరిగినదే, విలువలేని సాహిత్యముభూమిపై నిలువనేరదు. విమర్శకులుగా రాణించుట బహుకష్టమైన విషయము. విమర్శకుడు తరతమ భేదము లేని వాడుగా, బాహుభాషాకోవిదుడుగా, మంచిచెడ్డలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలుగు ధైర్యశాలిగా, నిలదొక్కుకొనగలుగు సమర్థవంతుడుగా నుండవలెను. అట్టి సమర్థులు రాయలసీమ సాహిత్య చరిరతలో కొద్దిమందేకలరు. వారిలో శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. కట్టమంచి రామలింగారెడ్డి, చిలుకూరు నారాయణరావుగారు అగ్రగణ్యులు. ఈ సాహతీ విమర్శకా గ్రేసరులందరికీ ‘భారతి’ పత్రిక స్వగృహముగా రాణించినది ఇట్టి విమర్శక శిఖామణులలో అనంతపురము వాస్తవ్యులు, మరియు అనంతపుర మండల తైలసాంకేతిక పరిశోధనాసంస్థ డైరెక్టరుగా పనిచేయుచున్న శ్రీ సర్దేశాయి తిరుమలరావు గారొకరు.
శ్రీ తిరుమలరావు గారిపేరు నేటి పత్రికాలోకమునకు సుపరిచితమైనదే. ఇటీవలనే ఆంధ్రపత్రిక దినపత్రికలో ‘బసవేశ్వరుడు కాయకమేకైలాస మనెనా?’ అను విషయముపై సోదాహరణ పూర్వకమగు సుదీర్ఘ చర్చను లేఖలద్వారా వీరు గావించిరి. ఇట్టి విమర్శనాత్మక వ్యాసములువీరివి. భారతి, ఆంధ్రప్రతిక, ఆంధ్రప్రభల వంటి ప్రసిద్ధ తెలుగు ప్రతికలలో వెలువడినవి. వారి ప్రిసిద్ధ వ్యాసములలో కొన్నింటి పేర్లైనను పేర్కొన్న వారి విషయ పరిజ్ఞానము, విమర్శనాదృష్టి, వారి అభిరుచులు మనకవగతము కాగలవు.
1) భారత, రామాయణ, భాగవతముల ఆద్యంతముల ఆంతర్యము (ఆంధ్రప్రభ)
2) తిక్కన స్త్రీ పర్వములోని ఛందోవైవిధ్యములోని ఆంతర్యము (ఆంధ్రప్రభ)
3) వేదవ్యాసుడు బ్రాహ్మణేతరుడా? (భారతి)
4) మేఘసందేశంలో మేఘుని మార్గము (భారతి)
భారతి సంచికలలో గురజాడ వారిపై వీరు వ్రాసిన విమర్శలు ఎల్లరూ చదువదగినవి.
1) కన్యాశుల్కములో అసభ్యత ఉన్నదా?
2) గురజాడకు అర్థమైన భారతీయ సంస్కృతి
3) కన్యాశుల్కం యాలిజం
4) గురజాడ విధూషకుడా?
శ్రీ విశ్వనాధవారి నవలలపై ఒక సమగ్ర పరిశోధన గావించి ‘విశ్వనాథనవలలు సమన లక్షణములు అను విషయముపై వ్యాసము వ్రాసిరి. భాషా శాస్త్రమునకు సంబంధించిన ‘తెలుగులిపి’, ‘అమ్మ, అప్ప, అయ్య శబ్దశ్వరూప చర్చలు’ మున్నగు వ్యాసములు, ఆదునిక కవులైన శ్రీదేవుల పల్లవారిపై ‘శ్రీకృష్ణశాస్త్రీ రొమాంటినిజం’ అను విమర్శనాత్మక వ్యాసము భారతిలో అచ్చుకాబడినవి. ‘భారతి’ దేశమునకాపేరు ఎట్లు వచ్చింది?’ అను చారిత్రాత్మక విషయమునపై కూడా వ్యాసమును వ్రాసిరి. ఇట్లు వీరనేక విషయములను తడివి క్షుణ్ణముగా పరిశోధించి విమర్శించి అందలి నుంచి చెడుగులను పాఠకుల ముందుంచిరి.
శ్రీ తిరుమలరావుగారు గావించిన మరొకఘనమైన విషయము విచట పేర్కొనవలసి ఉన్నది. ‘మహాకవి’ శ్రీ గడియారం వేంకటశేషశాస్త్రిగారు అందించిన ‘శివభారత’మను చారిత్రాత్మక ఉద్గ్రంధమునకు ‘సాహిత్య తత్వము, శివభారత దర్శనము’ అనుపేర మహావిమర్శనాత్మకమైన గ్రంథమునే వ్రాసిరి. తరువాత ‘కన్యాశుల్క నాటకకళ’ అను సమ్రగపరిశీలనా గ్రంథము నొకదానిని వెలువరించిరి. ఈ రెండు విమర్శలు, ప్రాచ్య, పాశ్చాత్య, అలంకారిక దృక్పధముల బట్టి రచింపబడినవి. ఇవి పండితుల చేత ప్రశంసలను పొందినవి.
శ్రీ తిరుమలరావు గారు ఆకారమున పొట్టివారు. మితబాషులు, సోమరితన మెరుగనివారు, నిత్యము స్వదేశ, విదేశపత్రికలకు విశతముగా చదువువారు సందేహాస్పదమగు విషయములను వెంటనే పత్రికలకు తెలుపుట, సందేహములు గలవారికి ఆ సందేహములను పత్రికాముఖమున తీర్చుట వీరి ముఖ్యమైన వినోదకృషి. ది హిందూ ఇండియన్ ఎక్సుప్రెస్ బ్లిడ్జి ఇలస్ట్రేటెడ్ వీక్లీ, మున్నగు ఆంగ్లపత్రికలలో అనేక భావగర్భిత ఆలోచనాత్మక లేఖలు, వీరు వ్రాయుచుందురు. ఇప్పటికి వీరిలేఖలు శతాధికములైనవేమో వీరేమి వ్రాసినను, ఏమి చెప్పినను అందులో విజ్ఞానము, వినోదము, ఆలోచనా మౌలికలతో కూడియుండుట ఒక విశేషము. గ్రాంథిక వ్యవహారిక భాషలందు చక్కనిశైలి వ్రాయగలుగుల వీరి పదము కలమునకు గల ఒరవడి.
ఆదోని, అనంతపురం పట్టణములయందు హైస్కూలు కాలేజీ చదువులను ముగించి, రాజస్థాన్ విశ్వవిద్యాలయమునందు రసాయన శాస్త్రములో ప్రథమశ్రేణి యందుత్తీర్ణులై ఎమ్.పి. పట్టము పుచ్చుకొనిరి. తరువాత అనంతపురము, మైసూరు కళాశాలల యందు రసాయనిక శాస్త్రోపన్యాసకలుగా పనిచేసి, ప్రస్తుతము అనంతపురం ‘‘తైలసాంకేతిక పరిశోధనా సంస్థ’’ యందు డైరెక్టరుగా ఉన్నారు. వీరు త్రైంసాంకేతిక రంగమునందు అంతర్జాతీయ ఖ్యాతిగల శాస్త్రజ్ఞులు. ఈ శాస్త్రమునందు వీరు మూడవందలకు పైగా పరిశోధనలు గావించి ఆపత్రములను బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్ భారతీయ శాస్త్రీయ పత్రికలలో ప్రచురించిరి. అనేక జాతీయ అవార్డులు, బంగారు పతకములను గెల్చుకొనిన మేధావులు వీరు. ఇంతటి మేధావి పుట్టిన ఈ సర్దేశాయి వంశము ఈనాటిది కాదు. 17వ శతాబ్దములో ఆదోని నవాబుకు దివానుగా ఉండి, మంత్రాలయములో శ్రీ రాఘవేంద్ర స్వాములవారికి ద్వైతమత పీరస్థాపనకు తోడ్పడిన శ్రీ సర్దేశాయి వెంకన్నగారు వీరి పదవతరము వారగుట గొప్ప విషయమే కదా.
సాహిత్య, శాస్త్రరంగముల యందు సవ్యసాచులుగా వెలుగుచున్న శ్రీ సర్దేశాయ తిరుమలరావుగారు PEN All India Center లో సభ్యులు హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతాభిమానులై హాస్య ప్రియత్వం, నిర్భయత్వం క్రియాసరతగల శ్రీ సర్దేశాయివారిని సాహిత్య మెట్లుండవలెనని ప్రశ్నించినపుడు వారు చెప్పిన మాటలివి.
‘‘తొలకరి చినుకులు చిటపట పడునపుడు, పిల్లలు తలమీద చేతులు పెట్టుకొని ‘బుడుగో బుడుగు’ అని అఱచుచు గుండ్రముగా తిరుగునప్పటి ఉత్సాహమీయనవలెను. ఆశక్తులకు, శక్తులుగా, మార్పగల్గి ఉండవలెను. కవిత్త్వమొక Spring Board దానిమీద నిలబడి మనుష్యుడు ప్రగతి పథమున కెగురగలిగి ఉండవలెను.’’
ఇంతకంటెను వేరు నిర్వచనములు ఈ విషయమున చెప్పలేము. వీరు వివాహ జంజాటములో, చిక్కుపడక నిశ్చింతగా, ఏకాంతవాసమున బ్రహ్మచర్యమును గడపుచున్నారు. వీరికి భగవంతుడు దీర్ఘాయువు నొసంగి వీరిచే ఇతోధికముగా సారస్వతసేవ జరిపించుగాత.
———–