పేరు (ఆంగ్లం) | Kondamudi Sriramachandramurthy |
పేరు (తెలుగు) | కొండముది శ్రీరామచంద్రమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | 2008, సెప్టెంబరు 22 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పద్మవ్యూహం (నాటకం) సింహకాకౌతం మంత్రిగారి కూతురు సిరిదివ్వెలు ధర్మదీపం తలుపులు తెరవకండి పాపం పడగనీడ నారీ నారీ నడుమ మురారి స్వయంకృతం కలియుగ స్త్రీ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ రచయిత. ఇతడు 40కి పైగా నవలలు, 600 కథలు వ్రాశాడు. ఇతని నవల “చిరుమువ్వల మరుసవ్వడి” ఆధారంగా ఆనంద భైరవి సినిమాను తీశారు. ఈ సినిమాకు ఇతనికి ద్వితీయ ఉత్తమ కథారచయితగా నంది పురస్కారంతో పాటు వంశీ, కళాసాగర్ పురస్కారాలు లభించింది. ఇంకా ఇతడు మండలాధీశుడు, శ్రీరామచంద్రుడు సినిమాలకు సంభాషణలు వ్రాశారు |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొండముది శ్రీరామచంద్రమూర్తి |
సంగ్రహ నమూనా రచన | అశోక్ నగర్లో మేమున్న అల్లసాని పెద్దన వీధిలో నాకు తెలియనివాళ్ళెవరూలేరు. ఊరికి దూరంగా విసిరివేసి నట్లుగా వుండే ఆ పెద్దమనుష్యుల పోష్కాలనీలో నడిమధ్యగావున్న వీధిలో ఎడమవేపు చివరగావున్న మర్రిచెట్టు పక్కన ఆడపిల్లల కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తున్న శివజ్యోతీ ఆమె భర్త సత్యవంతుడూ తమ ఇద్దరు పిల్లలతోనూ కొత్తగా కట్టుకన్న తమ స్వంతరంగుల ఇంట్లో సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. |
కొండముది శ్రీరామచంద్రమూర్తి
అందరివంటిది కాదు
అశోక్ నగర్లో మేమున్న అల్లసాని పెద్దన వీధిలో నాకు తెలియనివాళ్ళెవరూలేరు. ఊరికి దూరంగా విసిరివేసి నట్లుగా వుండే ఆ పెద్దమనుష్యుల పోష్కాలనీలో నడిమధ్యగావున్న వీధిలో ఎడమవేపు చివరగావున్న మర్రిచెట్టు పక్కన ఆడపిల్లల కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తున్న శివజ్యోతీ ఆమె భర్త సత్యవంతుడూ తమ ఇద్దరు పిల్లలతోనూ కొత్తగా కట్టుకన్న తమ స్వంతరంగుల ఇంట్లో సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. ఆ యింటికి ఎదురుగ్గా ఓ పెద్ద పాతబంగళా వుంది. లంకంత కొంప, దొడ్డినిండా రకరకాల చెట్లు. మేడమీద మూలగదిలో బిక్కు బిక్కుమంటూ వో ముసలి రిటైరయిన ఇంజనీరూ, ఖల్లు ఖల్లుమని ఇరవైనాలుగ్గంటలూ వీధికంతా వినిపించేట్లు దగ్గుతూ వుండే ఆయన బడుగు ఇల్లాలూ కాపురముంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కొడుకూ అమెరికాలో సెటిలైపోయి వో తెల్ల పిల్లని కట్టుకున్నాడు. అతగాడు వీళ్ళిద్దర్నీ కూడా అమెరికా వచ్చేయమని ఎన్నిసార్లు ఎంతగా రాసినా, వీళ్ళక్కడకు పోరు. ‘‘బ్రతికినంతకాలం ఇహ బ్రతకంగదా సుఖమో, దుఃఖమో ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఈ మట్టిలో కలిసిపోతేనే ఈ జీవితాలకింత సార్థకత. ఏవంటారు?’’ అంటుంటారు తమను చూడటానికి వచ్చని ప్రతివాళ్ళతోటీ. కానీ నా అనుమానం ఆ తెల్లపిల్ల మోచేతినీళ్ళు తాగకుండా వుండడం కోసమే, వాల్ళక్కడకు వెళ్ళటానికి ఈ అభ్యంతరం చెబుతున్నారని. వీధికి మధ్యగా వో సర్కిల్ ఇన్సెపక్టరుగారూ, ఆయన ఇంటికి ఎదురుగా ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ అధ్దెకొంపా, సర్కిల్ ఇన్సెపక్టరుగారికి కుడివైపున వో ఇఎన్టీ స్పెషలిస్టూ, ఆయనకు ఎడమవైపున పెద్దాసుపత్రిలో పనిచేస్తున్న ఆపిలుబుగ్గల పెద్దనర్సూ, ఇవతలగా హైస్కూలు హెడ్మాస్టరూ, వారికి పొరుగువారుగా వో ప్రోటస్టెంటు పాస్టరు కుటుంబం, వారికి మరికొంచెం దూరంలో లక్షలమీద వ్యాపారం చేసే పొగాకు చౌదరిగారూ, ఆయనకు చేతివాలుగా కాంపౌండు గోడ నానుకుని వున్న పూరిగుడిసెలో గిరీశం… వీల్ళూ మా వీధిలో నాకు తారసపడే వ్యక్తులు.
నిజానికి మా వీధిలో అన్నీ డాబాలూ, మేడలే, గిరీశం పూరిగుడిసె తప్ప. మా వీధిలో చాలా ఇళ్ళల్లో స్కూటర్లూ, ఒకటి రెండు ఇళ్ళల్లో కార్లూ వున్నాయి. ఒక్క గిరీశం గుడిసెలో తప్ప. పాపం అతను ఎక్కడకు వెళ్ళినా నడిచే వెళ్ళాలి. అతని రెండుకాళ్ళకూ, అతను పుట్టి నప్పటినుంచీ విశ్రాంతీలేదు. అవి నడుస్తూనే వున్నాయి. గిరీశం చదువుకోసం, గిరీశానికి ఓ ఉద్యోగాన్ని చూపించడం కోసం, గిరీశానికి తిండికోసం.
నేను గిరీశాన్ని రోజూ చూస్తూనే వాంను. గిరజాల నల్లని జుట్టు. కోలమొహం. కోటేరేసిన ముక్కు. ధనుస్సులా వంగిన పెదిమలు. వత్తయిన కనుబొమ్మలు. చెంపలమీద విష్కర్స. పెద్దమీసాలు. అతని కాళ్ళలో ఎంత బలముందో ఆ కళ్ళల్లో అంతటి నల్లని చిక్కదనముంది.
నాకింకా పెళ్ళి కాలేదు. అతని కప్పుడే పెళ్ళి కావడమా, ఆ పెళ్ళాం పోవడమూ, కొన్నాళ్ళు వూరుకున్నట్టే వూరుకుని మరో అమ్మాయిని కట్టుకోవడమూ అన్నీ జరిగిపోయినయ్.
నా పెళ్ళి ప్రస్తావన వచ్చినపుడెల్లా మా అమ్మ అతణ్నే ఉదాహరణగా తెస్తున్నది ఈమధ్య. ‘‘చూడ్రా నెత్తిమీద దమ్మిడీ పెడితే ఏగాణీ చెయ్యడు. వాడే పెళ్ళి చేసుకున్నాడు. ఒకసారికాదు, రెండుసార్లు, నువ్వూ వున్నావ్, వేలకు వేలు సంపాయిస్తునానవ్ నెల తిరిగే సరికీ ఏం లాభం? ఎంత చెప్పినా వినవ్ కదా, నీకు నచ్చినిపల్లనే చేసుకో. నేను కాదనను.’’
రోజూవుండే భాగోతమే కాబట్టి, నేను మెదలకుండా వూరుకున్నాను. నా మౌనాన్ని అంగీకారమనుకుని మళ్ళీ మొదలుపట్టింది మా అమ్మ. ‘‘నేను చెప్పినమాట వినరా, ఆ శివజ్యోతీ వాళ్ళ పిల్లను చేసుకో, పిల్ల బంగారబ్బొమ్మ. ఇరవై వేలు కట్నం. డిగ్రీ చదువుకుంది. పెళ్లానికి డిగ్రీ ఎందుకనుకుంటావా, వీధి చివరి మేడమీది ఇంజనీరుగారు కబురు చేశారు. ఆయన తమ్ముడి కూతురు వుందట. ముప్పైవేలకు పైగా ముట్టచెబుతాడట’’.
మా అమ్మ అట్లా మాట్లాడుతూనే వుంది. నేను వరండాలోకి వచ్చి స్కూటరు బయటకు తీశాను. ‘‘అంతేరా నా మాటను ఇట్లానే పెడచెవిని పెడుతూవుండు. ఎప్పుడో చెప్పా పెట్టాకుండా నేను కాస్తాహరీ అంటాను. అప్పుడఘోరిస్తావ్, అమ్మామాట వినలేదే, డదాని అవసరాన్ని అర్థంచేసుకోలేదే అని.’’ అంటున్నది అమ్మ వెనకనుండి.
ఎప్పుడూ ఇంతే. అమ్మ ఎప్పుడూ ఆడదాని అవసరం గురించే మాటాలడుతుంటుంది తప్ప, ఆడదానికి కావలసిన వ్యక్తిత్వం గురించి మాట్లాడదు.
సత్యవంతుడికి శివజ్యోతి సంపాదన కావాలి, గుర్రరప్పందాలలో పాల్గోడానికీ, పేకాటలో ఖర్చుపెట్టడానికీ.
ముసలి ఇంజనీరుకు కాల్ళు పట్టడానికి పరుగులా వున్న బడుగుపెళ్ళాం కావాలి. ఆ పెళ్ళాం ఖల్లుఖల్లుమని దగ్గే దగ్గుల పళ్ళెం అయినా ఇబ్దందిలేదు.
సర్కిల్ ఇన్సెపక్టరుకు ఆడదంటే గోల్డెన్ ఈగిల్ అందించే పక్కమీది చక్కనిచుక్క.
మెడికల్ రిప్రజెంటేటివ్కు, ఇంటికొచ్చినప్పుడు అన్నిరోజులూ తన ఒంట్లో దాచుకున్న వేడిని ఒక్కసారిగా చల్లార్చే ఫ్రిజిడేర్, భార్యంటే.
ఇఎన్టీ స్పెషలిస్టకు తన భార్య, తన పిల్లలకు వేడి వేడి అన్నం వండివడ్డించే వో వంటకత్తె.
ఆపిలుబుగ్గల పెద్దనర్సుకు, తన శరీరం డబ్బును పండించే పంటభూమి.
హైస్కూలు హెడ్మాస్టరుకు, అతని భార్యలోని స్త్రీత్వానికీ, అతని కోటులోని అధికారానికీ భేదం తెలీదు.
ప్రొటస్టెంటు పాస్టరుకు, ఆడదంటే మగవాడి పక్కటెముక. పాపానికి శ్రీకారం చుట్టిన ఈవ్కు వారసురాలు.
పుగాకు చౌదరిగారికి, అతని పెళ్ళాం అతను కాల్చకునే వో పోగాకు కాడ.
గిరీశానికి అతని పెళ్ళాం మెడమీద వో పెద్ద గుదిబండ.
వీళ్ళందర్నీ చూస్తూ కూడా నేనెట్లా పెళ్ళిచేసుకోను? తన వ్యక్తిత్వంతో మగవాణ్నీ పరాభూతం చేయగల స్త్రీ ఇంతవరకూ నాకు కనబడలేదు.
గిరీశం పూరిపాక మా మేడకు సరిగ్గా ఎదురుగ్గా వుంది. మా ఇల్లు నిరదలేచే సరికే, ఆ పూరిపాక ముందు కళ్లాపిచల్లబడి వుండేది. రాత్రిపూట మా ఇంట్లో దీపాలారిపోయినా, ఆమె మాత్రం మట్టి అరుగులమీద, పూరిగుడిసె చూరుక్రింద కొంగు పరుచుకొని, మిణుకుమిణుకు మంటున్న కిరసనాయలు బుడ్డీ పెట్టకుని సవతి పిల్లల్ని చెరోవైపునా పడుకోబెట్టుకొని దుఃఖ ఉద్విగ్నకంఠంతో ఏదో పాటలు పాడుకుంటూ, నాకు కిటికీలోనుండి కనిపించేది.
ఆ గొంతులో ఏ ఆకర్షణాలేదు. ఆమె రూపంలో ఏ ప్రత్యేకతా లేదు. ఆమె పొడువూకాదు, పొట్టీ కాదు, సన్నమూకాదు, లావూకాదు. తెలుపూ నలుపూ కలసిన బూడిదవర్ణంలో, ఎండిపోయిన నదిలాగా కన్పించేది అతుకుల చీరలు వొంటికిచుట్టుకునేది. కాళ్ళుపగిలినా చెప్పులు వేసుకునేది కాదు. కళ్ళు వాచినా కాటుక పెట్టుకునేది కాదు. ఆమెను ఒక సారి చూస్తే జ్ఞాపకం పెట్టుకొనే సంగతి ఏదీ ఆమెలో లేదు అని అర్థమౌతుంది. ఈ దేశంలో బ్రతుకుతున్న అనేక లక్షలమంది అనామకులైన ఆడవాళ్ళకు ఆమె జీవచ్ఛవంలాంటి ప్రతినిధి.
స్కూటర్ స్టార్టుచేసి నేను వీధి మలుపుకొచ్చేసరికి గిరీశం అక్కడ సిగరెట్టు తాగుతూ కనిపించాడు.
‘‘గుడ్ మానింగ్ సార్’’ అతని గొంతులో ఎంతో చనువు.
స్కూటర్ ఆపాను.
‘‘ఇవ్వాళ రాత్రి లైబ్రరీ హాల్లో ‘ఆడది’ నాటకం వేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి.’’ పేట్రన్ టిక్కట్టందించాడు.
నాటకాలు, కవిత్వం వీటిమీద డబ్బు వేస్టేచేయడం నాకు నచ్చదుకానీ అతను. నాకు పొరుగువాడు ఎంత చెడ్డా అతని కళ్ళల్లో మాటలకు రాని అభ్యర్థన.
జేబులోనిం వో పదిరూపాయలు తీసి ఈయబోయాను.
గిరీశం తటపటాయిస్తున్నాడు. ఏదోచెప్పాలనుకొని మొహమాటపడుతున్నాడు.
‘‘ఫర్వాలేదు తీసుకోండి’’ నేనే బలవంతం చేశాను.
‘‘అది కాదండీ మీరేమనుకోనంటే ఓ చిన్న రిక్వెస్ట్…’’
‘‘చెప్పండీ’’
‘‘ఏం లేదు. మన దేశంలో పుస్తకాలు వూరికే చదివేవాళ్లూ నాటకాలు ఫ్రీగా చూసేవాళ్ళూ ఎక్కువ. టిక్కెట్లు బాగా అమ్ముడుపోతాయన్న ధీమాతో భారీ ఏర్పాట్లుచేశాను. డిప్యూటీ మినిస్టర్గార్ని ఒకర్ని ప్రెసిడెంటుగా ఇన్వైట్ చేశాను. హాలుకు అద్దె, పూలదండలు, మైకు ఛార్జీలు వీళ్ళందరికీ కొంతైనా అడ్వాన్సుగా ఇవ్వకపోతే అక్కడంతా అభాసు అవుతుంది. అంచేత… ఓ హండ్రెడ్ మీరు సర్దుబాటుచేస్తే, తర్వాత మెల్లగా ఎడ్జస్ట్ చేస్తాను.’’
గిరీశాన్ని చూస్తే నిజానికి జాలి వేస్తున్నది. ఎన్నో అవతారాలెత్తి చివరకు నాటకాలు వేయడంలోకి దిగినట్టుంది. ఆ మాటే అన్నాను. ‘‘అంతఇబ్బందిగా వుంటే నాటకం వేయకపోతే ఏవండీ?’’
అతను తల అడ్డంగా వూపాడు. ‘‘అమ్మమ్మ అట్లా అనకండి. ఈ నాటకం కనుక సక్సెస్ అయితే ఇహ కనకవర్షమే కురుస్తుంది నా జీవితంలో దీన్ని కమ్మరిషయలైజ్ చేస్తాను. ఆ తరువాత పరిషత్తులోల బెస్ట అక్టర్ ప్రైజులు కొట్టేస్తాను. ఏదో ఒక పరిషత్తులో ఏ విశ్వనాథ్గారో, బాపూగారో నన్ను చూస్తారు. మద్రాసుకు రమ్మంటారు. అక్కణ్ణుంచి నా జీవితం వో పెద్ద మలుపు తిరుగుతుంది. ఇప్పుడు సినీరంగాన్నేలుతున్న వారినందర్నీ ఒక్కొక్కర్ని రిటైర్ చేయించేస్తాను. నౌకర్లు, చాకర్లు, బంగళాలు, టెలివిజన్లు, ఇంపాలా కార్లు, ఇంట్లో ఫ్రిజ్డేర్లు, నడిస్తే కాళ్ళక్రింద తివాచీలు, మాట్లాడితే ప్రెస్ కాన్ఫరెన్సులు…’’ అతను కళ్ళు మూసుకున్నాడు. పట్టపగలు, నడిరోడ్డు మీద నుంచుని పగటికలను స్వగతంలో ప్రకటించడం మొదలుపెట్టాడు.
నాకు అటువంటి మనుషులంటే చిరాకు. వాల్ళకలలు వాల్ళను జీవితంలో బాగుపడనీయవు. అతన్ని వదిలించుకుందామని, వో పాతిక రూపాయలు చేతిలో పెట్టి, పేట్రన్ టిక్కెట్ తిరిగి అతనికే ఇచ్చేసి, ‘‘నాటకానికి వచ్చే తీరిక లేదు నాకు. సారీ ఏమనుకోకండి. ఈ టిక్కెట్ మరొకరికి ఇచ్చేయండి, ఇప్పటికి ఇంతకన్నా ఇయ్యలేను. ఎక్స్ క్యూజ్ మీ ’’ అంటూ స్కూటరు మీద ముందుకు దూసుకుపోయాను.
గిరీశం ఆ రాత్రి నాటకం వేశాడో లేదో నేను పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత వారమంతా నాదగ్గర పుచ్చుకున్న పాతికరూపాయలూ ఇచ్చేస్తాడేమోనని ఎంతగానో ఎదురుచూశాను. కానీ అతను నాకు కనబడలేదు. నేను నిద్రలేచి ఆ పూరిపాకవంక చూసేసరికే అతను ఇంట్లోంచి నగర విహారానికి వెళ్ళిపోయినట్లుగా తెలిసిపోయేది. ఇహ రాత్రిపూట తారీకు మారితేగాని అతను ఇంటికి తిరిగివచ్చేవాడు కాదు. ముష్టి పాతిక రూపాయల కోసం అర్థరాత్రి వరకు ఎదురుతెన్నులు చూడడం నా మనస్సు అంగీకరించని విషయం.
ఆ రోజు ప్రొద్దుటినుండీ అమ్మ మళ్ళీ నామీద దాడి ప్రారంభించింది. ‘‘ఏరా, పెళ్ళి విషయం ఏం చేశావ్?’’ అంటూ.
‘‘చెప్తానులేవే, తగిన సమయం రానీ.’’
‘‘ఆ సమయం ఎప్పుడొస్తుందో ఆ బ్రహ్మదేముడికే తెలియాలి. నీ రెట్టమతం నీది. నువ్వేంచేసుకుంటావో ఇహ నీ ఇష్టమేగానీ, ముందివ్వాళ రాత్రి బండికి విశాఖపట్నానికి నాకో రైలు టిక్కట్టుపట్రా.’’
‘‘ఇప్పుడు అక్కడికెందుకే?’’
‘‘ఒరి పిచ్చిసన్నాసీ బ్రహ్మచారిగా వున్నవాడికి ఈ విషయాలేం జ్ఞాపకం వుంటాయిరా? నీ చెల్లెలు మళ్ళీ నీళ్ళోసుకుందని ఉత్తరం రాయలేదూ మొన్న రాసికూడా అప్పుడే పదిహేనురోజులు దాటిపలేదూ? ఏడోమాసం వచ్చేసే వుంటుంది కాన్పు, కాన్పుకూ దానికి గండమే కదురా. అసలే అబ్బనా కారపుదీ, ఏం కష్టపడుతుందో ఏమో?’’
అమ్మ, శకుంతలను గురించి మాట్లాడుతున్నది. శకుంతలనాఒక్కగానొక్క చెల్లెలు. మా ఇద్దరికీ పెద్దగా వయసులో తేడాలేదు. ఇద్దరం ఒక కంచంలోనే తిన్నాం. సరదా పుట్టినప్పుడు చిన్నప్పుడు అది మగదుస్తులు నేను ఆడదుస్తులు వేసుకుని ఆడుకున్నాం. వీధిబళ్ళో పిలక మాష్టరును కలిసి ఏడిపించాం, అందుకు గాను కలిసి దెబ్బలు తిన్నాం.
ఇప్పుడా శకుంతల అప్పుడే ముగ్గురు బిడ్డల తల్లి నాలుగో సారి మాతృత్వాన్ని పొందబోతున్నది.
కాసేపు వూరుకుని మళ్ళీ అమ్మ అన్నది. ‘‘ఒరేయ్ పోనీ శకుంతల ఆడబిడ్డ కూతురుంది చేసుకోరాదూ?’’
అమ్మ ఎవర్ని గురించి ప్రస్తావన చేసిందో ఆ పిల్లనా కళ్లముందు తళుక్కున మెరిసింది.
సుఖధ
పేరులోనే ఎంతో సుఖం వుంది. ఒక్కసారి చూశాను శకుంతల ఇంట్లో ఏదో ఫంక్షన్లో. ఆ అమ్మాయి గంభీరంగా వుంది. ప్రశాంతంగా వుంది. తెల్లగా వుంది. కాళిదాసు కావ్యకన్యలా వుంది. ఆదునిక నాగరికత ప్రసవించిన పుష్పంలా వుంది. మద్రాసులో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వుంది. వో ఆంగల్ల దినపత్రికలో సంపాదకురాలిగా పనిచేస్తోంది.
నేను అమ్మవేపు నవ్వుతూ చూశాను. ‘‘మద్రాస్ వెళ్ళొస్తాన్లేవే’’
అమ్మ కళ్ళింత చేసుకుని, నా వేపు నమ్మలేనట్లుగా చూసింది.
‘‘నిజం?’’
‘‘నిజమేనమ్మా నువ్వు విశాఖపట్నం నుంచి తిరిగివచ్చే లోపునే నేను మద్రాస్ వెళ్ళొస్తాను, ఈ విషయంలో ఒక నిర్ణయానికొస్తాను. సరేనా?’’
అమ్మ పట్టలేనంత సంతోషంతో నా దగ్గరకు తడబడుతున్న అడుగులతో వచ్చింది. ప్రేమగా నా చెంపలు సవరించింది. ‘‘పిచ్చికన్నా’’ అంటూ నా నుదురు ముద్దు పెట్టకుంది. ‘‘ఏ వయసులో ఆ ముచ్చట జరిగితేనే అది అందంరా’’
అమ్మ రాత్రికి వెళ్ళిపోయింది. నేను మర్నాడు సాయంకాలం మెయిల్లో మద్రాసుకు బయలుదేరబోతున్నాను. సూట్కేస్ సర్దుకుంటుండగా ‘‘అంకుల్’’ అంటూ ఆ అమ్మాయి అతి చొరవగా లోపలకు వచ్చింది. బీదరికం ఆ అమ్మాయి ప్రతి అణవులోనూ కనిపిస్తున్నది. మాసకలు పడ్డ దుస్తులు, తైలసంస్కారం అతి తక్కువసార్లు అనుభవించినజుట్టువాడిపోయిన మొహం, పల్చనై పొడుగుసాగిన చేతులు, బలహీనంగా వున్న గొంతు… అయినా ఆ అమ్మాయిలో ఏదో చొరవవుంది. ఏదో చెయ్యాలన్న తపన వుంది. కష్టాన్ని తెలుసుకున్న ఇంగితం వుంది.
———–