పేరు (ఆంగ్లం) | Palkurki Somanathudu |
పేరు (తెలుగు) | పాల్కురికి సోమనాథుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | శ్రియాదేవి |
తండ్రి పేరు | విష్ణురామదేవుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1160 |
మరణం | 1/1/1240 |
పుట్టిన ఊరు | వరంగల్లు సమీపంలోని పాల్కురికి |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | తెలుగు, కన్నడ, సంస్కృత భాష |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెలుగు : బసవ పురాణం, వృషాధిప శతకం, చతుర్వేద సారము, పండితారాధ్య చరిత్ర చెన్నమల్లు సీసాలు, గద్యలు, ఉదాహరణలు, పంచకాలు, అష్టకాలు, స్తవాలు సంస్కృతం : సోమనాధ భాష్యం, రుద్ర భాష్యం కన్నడం : సద్గురు రగడ, చెన్న బసవ రగడ, బసవలింగ నామావళి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | సాహిత్యంలో తెలుగు భాషా పదాల వాడకం శివకవి యుగంలో పెరిగింది. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించారు. “రగడ” అనే ఛందోరీతి ఈయనే ప్రారంభించారు. ఈయనే మొదలుపెట్టిన రగడను “బసవ రగడ” అంటారు. ద్విపద, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా సీసము, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదము, వన మయూరము, చతుర్విధ కందము, త్రిపాస కందము వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశారు |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాల్కురికి సోమనాథుడు |
సంగ్రహ నమూనా రచన | కవిగా పాల్కురికి సోమనాథుడు: కవి కూడా సమాజంలో ఒక వ్యక్తే కాబట్టి సమాజ ప్రభావం అతనిపై తప్పనిసరిగా ఉండి తీరాలి. ఒక దేశ సంస్కృతి, నాగరికతలను ప్రతిబింబించేది ఆ దేశపు సాహిత్యమే. ఈ సాహిత్యం ఎంత నిర్దుష్టంగా వుంటే ఆ దేశపు సంస్కృతి అంత నిర్దుష్టంగా ఉంటుంది. |
పాల్కురికి సోమనాథుడు
పాల్కురికి సోమన రచనలు – సామాజిక, మత పరిస్థితులు
కవిగా పాల్కురికి సోమనాథుడు: కవి కూడా సమాజంలో ఒక వ్యక్తే కాబట్టి సమాజ ప్రభావం అతనిపై తప్పనిసరిగా ఉండి తీరాలి. ఒక దేశ సంస్కృతి, నాగరికతలను ప్రతిబింబించేది ఆ దేశపు సాహిత్యమే. ఈ సాహిత్యం ఎంత నిర్దుష్టంగా వుంటే ఆ దేశపు సంస్కృతి అంత నిర్దుష్టంగా ఉంటుంది. వాల్మీకి, వ్యాసమహర్షి, కాళిదాసు, భవభూతి, జయదేవుడు, చండీదాసు, కబీరు తులసీదాసు సూరదాసు, ప్రేమ్చంద్ రవీంద్రనాథ్ టాగూర్ మొదలైనవారి మహత్తర మైన రచనల కారణంగా భారతీయ సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం చేకూరాయి. దీనిని బట్టి సమాజ జీవితాన్ని తెలుసుకోవడానికి సాహిత్యమే ప్రధాన సాధనమని తెలుస్తుంది. సమాజ పరిస్థితులకు చక్కగా ప్రతిస్పందించినవారు శివ కవులు. వారిలో పాల్కురికి సోమన నాటి సమాజాన్ని తన రచనల్లో వివరంగా వర్ణించాడు. ”ఉరుతర గద్యపద్యోక్తు కంటే సరసమై పరగిన జాను దెనుంగు చర్చింపగా సర్వ సామాన్యమగుట”. నన్నయ అవలంభించిన సంస్కృత సమాస భూయిష్ట రచన సర్వసామాన్యము కాదని భావించి శైవమత ప్రచారం కోసం జన సామాన్యానికి చేరువగా జన సామాన్యాన్ని ప్రతిబిం బించే విధంగా వెలువడిన స్వతంత్ర గ్రంథాలకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు. మార్గ కవిత్వమునకు నన్నయ ఆదికవియైతే- దేశ కవిత్వమునకు పాల్కురికి సోమన్న తోవ తీర్చి ఆదికవియైనాడు. అందుకే ఆరుద్ర ”తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్లకోసం తెలుగు ఛందస్సులో పాటలు పాడింది. అతడు పాడిన తెలుగు ఛందస్సు పేరు ద్విపద. తెలుగుజాతి అతనికిచ్చిన దివ్యాయుధం ద్విపద. తెలుగు జాతికి అతడిచ్చిన గొప్ప కానుక కూడా ద్విపదే. పాల్కురికి సోమనాథుడు పుట్టకపోతే పాడుకొనేందుకు తెలుగు వాళ్లకే ఛందస్సు ఇంతగా రాణించేది కాదేమో! ప్రజల కోసం అతడు పుట్టాడు. ప్రజలే అతన్ని అమరకవిని చేశారు అని పేర్కొన్నాడు. పాల్కురికి జన్మస్థలం ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని పాలకుర్తి ప్రాంతం. శ్రీశైల మల్లికార్జున స్వామికి పరమభక్తుడైన ఇతడు కాకతీయుల కాలానికి చెందినకవి. సంస్కృతాంధ్ర కన్నడాది భాషల్లో అనేక రచనలు చేసిన మహాపండితుడు.
సామాజిక పరిస్థితులు:
ఒక భాషలో ఉన్న సాహిత్యపు సమున్నతి, సజీవతని బట్టి ఆ భాషకు ఆ భాష మాట్లాడే జాతికి గౌరవం చేకూరుతుంది. ఆ జాతి నాగరికమైనదో, అనాగరికమైనదో నిర్ణయించేది కూడ సాహిత్యాన్ని బట్టే. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే జాతి సామాజిక స్థితిగతులపైనే సాహిత్యపు తీరు తెన్నులు ఆధారపడి ఉంటాయి. ఆదికాలంలో వెలసిన కావ్యాలు ప్రాయికంగా సంస్కృత భాష అనువాదాలే, మార్గ కవితలే. అవి సామాన్య జనానికి సుదూరంగానే ఉండేవి. దీనికి భిన్నంగా పాల్కురికి దేశీయపద్ధతిలో సృష్టించిన రచనలు ప్రజలకు సిన్నిహితమైనాయి. అందులో పాల్కురికి కావ్యాలలో నాటి సమాజాన్ని దర్శింపవచ్చు. అందుకోసం ద్విపద ఛందస్సులో దేశీయ భాషారీతులను అనుసరిం చాడు. ఆయన ద్విపద రచనలైన బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు సోమన కాలం నాటి జనుల జీవిత స్థితిగతుల్ని, సాంఘిక పరిస్థితుల్ని చక్కగా ప్రతిబింబిస్తున్నాయి.
కులాల ప్రస్తావన-కులద్వేషాలు: ఆనాటి సమాజంలోని అన్ని వర్గాల కులాల వారికి, హీనంగా చూసిన కులాల వారికి కూడా తన రచనల్లో స్థానం కల్పించాడు. అతడు ప్రతిపాదించిన మతం ఏకపక్షానికి చెందినదైనా, అతని పాత్ర సృష్టి సర్వజన సమాదరణీయమైనది. పాల్కురికి పాత్రలు సామాజిక జీవనానికి సన్నిహితమై, సాధారణ మానవ చిత్తప్రవృత్తులకు లోబడి సజీవాలై ఉంటాయి. బ్రాహ్మణుల్ని మొదలు గీతకులం, మేదరి వరకు అన్ని కులాల వారిని కథా పాత్రల్ని చేశాడు.
సోమన రచనల్లో కులాల మధ్య స్పర్థలున్న అంశాలు కనిపిస్తున్నాయి. ప్రతి బ్రాహ్మణుడు భక్తుడు కాలేడని, భక్తుడు అయితే బ్రాహ్మణుడు అన్న కుల చట్రంలో ఇరుక్కోవద్దని భక్తి ప్రధానంగా బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించాడు.
మాదిగ- మాదర గండయ్య
గొల్ల – కాట కోటడు
కుమ్మరి – కుమ్మర గుండయ్య
వైశ్యుడు – సిరియాళుడు
మేదరి – సేటల వేమయ్య
గీత- హెందెడ మారయ్య
చాకలి- మడివాలు మాచయ్య
బెస్తవారు – అడి భర్తుడు
తెలగ – తెలుగు బొమ్మయ్య
ఎరుకల – కన్నప్ప
సాలె – ఆగసాలి కేతయ్య, దాసమయ్య
పైన పేర్కొన్నవన్నీ కులపరమైన వృత్తులు. ఇవిగాక ఒక భృతి కోసం చేసే వృత్తులను కూడా తన కావ్యాలలో ప్రస్తావించాడు.
××. కాకతీయుల కాలంలో వేశ్య వాటికలు: కాకతీయుల కాలానికి వేశ్యలు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండడంతో పాటు వారు ప్రత్యేకంగా ఒక తెగగా జీవించినట్లు పాల్కురికి రచన ద్వారా తెలుస్తుంది. సురవరం ప్రతాప రెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో ఓరుగల్లు నగరమున వేశ్యా గృహములు 12,700 ఉండేవని పేర్కొన్నాడు. ఓరుగల్లు నగరంలోనే కాకుండా కోటలోపలి ఒక వీధిలో వేశ్య వాటిక ఉండేదని తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ కాలంలో వేశ్యలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించినట్లు తెలుస్తుంది. ధనికులైన వేశ్యల వద్ద ఎందరో విలాసినులుండేవారు. వారు సంగీత నాట్యాల్లో ప్రవీణులు. ఇది ముగ్ధ సంగయ్య కథలూ పురాతమ్మ కథ ద్వారా తెలుస్తుంది. వేశ్యా సంపర్కం ఇంత దోషమయమని ఇప్పటివరకు పేర్కొంటున్న శివభక్తులు వేశ్యా సంపర్కం చేస్తే తప్పు లేదని పరోక్షంగా పలుచోట్ల పాల్కురికి సోమన తెలపడం వీరశైవ మతాభినివేశమే అని ఊహించవచ్చు. ఇంకా సోమన రచనల్లో సామాజిక అంశాలు గమనిస్తే బ్రాహ్మణకులంపై వ్యతిరేకత శైవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ధాన్యం నిలువ ఉంచడానికి పాతరలు, గాదెలు, కొట్టరువుల గుమ్ములు ఉపయోగించేవారు. నాణేలుగా మాడకాసు, తారము, రూక ఉండేవి. నీరు తెచ్చుకొనే పాత్రలు, వడ్డన పాత్రలు, గొడుగులు, పెట్టెలో పూజ పాత్రలు మొదలైన గృహోపకరణాలుపయోగంగా ఉండేది. వేశ్యా వృత్తి నాటి శైవ సమాజంలో తప్పుకాదు. కాబట్టి వేశ్యావృత్తి బలపడి ఉన్నట్లు చెప్పవచ్చు.
మతపరిస్థితులు: సాహిత్యం సామాజిక జీవన ప్రతిబింబ మని విజ్ఞుల భావం సామాజిక పరిస్థితుల్ని బట్టి సాహిత్య దృక్పథం కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ప్రాచీన సాహిత్యం ఎక్కువ భాగం మత దృక్పథంతోనే వెలువడింది. సమాజంలో జైన బౌద్ధాల ప్రభావం మితిమీరిపోయినపుడు వైదిక మత పునరుద్ధరణ కోసం పంచమ వేదంగా నన్నయ మహాభారతాన్ని రచించాడు. కాకతీయులు మొదట జైనులుగానే ఉండి తర్వాత బసవడు స్థాపించిన వీర శైవ మతాన్ని అనుసరించారు. పాల్కురికి వేద ప్రమాణాల్ని నిరసిస్తూ, వీరశైవం వేద విహితమైనదని తన రచనల్లో చెప్పాడు.
వీర శైవ మతము: వీరశైవులు, తక్కిన శైవ సంప్రదాయాల కన్న వైదిక మతాన్ని ఎక్కువగా నిరసించారు. వీర శైవం సంఘ సంస్కరణకు నాంది పలికింది. కుల విధానాన్ని వ్యతిరేకించింది. శూద్రులకు పంచములకు కూడా కావ్య గౌరవం కలిగించింది. స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెప్పింది. వీర శైవ కవుల్లో అగ్రగణ్యుడు పాల్కురికి. శివుణ్ణి పరమదైవంగా భావించే మతం శైవం. శైవులు ‘ఏక ఏవరుద్రో’ అని శివుడొక్కడే దేవుడని చాటుతారు. శివుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ. కాశీ యందు విశ్వేశ్వరుడు శ్రీశైలమందు మల్లికార్జునుడు, హిమాచలమందు గౌరీశంకరుడు. ఈ శైవాలయాలు శైవ వ్యాప్తిని తెలియజేస్తున్నాయి. శివునికి ఇతరులు సరిరారని సోమన ”శంకర దాసయ్య” కథలో పేర్కొన్నాడు.
బసవేశ్వరుడు కర్ణాటక దేశంలో వీరశైవమును స్థాపిస్తే ఇతని చరిత్రను మొదట తెలుగులో బసవపురాణంగా పాల్కురికి సోమనాథుడు రచించగా తరువాత ఇది కన్నడములోనికి భాషాంతరీకరణ పొందింది. అదేవిధంగా పండితారాధ్య చరిత్ర కూడా కన్నడ భాషలోనికి తెలుగు నుండే ప్రయాణము చేసింది. శివకవుల మతావేశమునకు ఉదాహ రణగా బసవ పురాణములో ఒక సంఘటనను ఉదహరిం చవచ్చును. శివభక్తుడైన భృంగి ఒకమారు శివుని దర్శింప బోయెను. ఆ సమయంలో శివుడు పార్వతీ సమేతుడై ఉండగా శివునికి మాత్రమే నమస్కరించి భృంగి వెనుదిరిగి పోయెనట. శివునికే తప్ప ఇతరుల ముందు శిరస్సు వంచని మతావేశము వీరిది. పైవిధంగా సోమనాథుని రచనలు వీరశైవ మత స్వరూపం మత విద్వేషాలు, మత సంప్ర దాయాలు ప్రతిఫలిస్తూ ఆనాటి మత పరిస్థితుల్ని అవగాహన చేసుకొనుటకు దోహదమౌతున్నాయి. జాతి బేధాలకు ఏ మాత్రం తావివ్వని వీరశైవమతాన్ని పాల్కురికి సోమన అనుసరించాడు.
”గూర్చెద ద్విపదలు గోర్కిదైవారదెలుగు మాటలనంగ వలదు, వేదములు కొలదియు జూడడిల నెట్టులనిన బాటి తూమునకును బాటియౌనేని- బాటింప సొలయు బాటియ కాదె అల్పాక్షరముల ననల్వార్థ రచన- కల్పించుటయు కాదె వివేకంబు” అని పాల్కురికి చెప్పిన ఈ మాటలు ఆధునిక కవులకు మార్గదర్శికాలుగా యెంచి ప్రవేశపెట్టదగినవి.
శైవభక్తి దృక్పథం తెలుగు సాహిత్యంలో వస్తు రూప, తాత్వికతలలో విప్లవాన్ని సృష్టించినా కొంత విమర్శకు గురైంది. ఇది ఇతర మతాల్ని దూషించే తీరులో ఉండటం వల్ల సర్వజినామోదం పొందలేకపోయింది. భక్తి భావనను అదుపులో పెట్టుకోలేక విషయాల్ని అతి విస్తారంగా రచిం చటం పాల్కురికి సోమనాథుని దృక్పథంలో ఒక లోపంగా చెబుతారు.
నల్గొండ జిల్లా పాల్కురికి గ్రామంలో జన్మించిన సోమనాథుడు కన్నడ దేశంలో కల్వముననున్న చెన్నమ అను భక్తురాలి గొప్పతనాన్ని తెలుసుకుని ఆమెను దర్శించడానికి వెళ్లి అక్కడ లింగైక్యం పొందాడని సోమేశ్వరపురాణంలో చెప్పారు.
పాల్కురికి సోమనాథుడు రచించిన కావ్యాల ప్రధానోద్ధేశం శైవమతోద్ధరణ. అయినా భాషా ఛందోవస్తు బంధాలను తెగనరికి ఒక సాహిత్య విప్లవానికి సారథ్యం వహించాడనే చెప్పవలసి వుంది.
———–