పేరు (ఆంగ్లం) | Ganavarapu Venkatakavi |
పేరు (తెలుగు) | గణపవరపు వేంకటకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గణపవరపు వేంకటకవి |
సంగ్రహ నమూనా రచన | – |
గణపవరపు వేంకటకవి
పూర్వం ఆంధ్రభాషలో లోతైన పాండిత్యాన్ని సంపాదింపగోరి కావ్యనాటకసాహిత్యం లోతులను గ్రహించేందుకు వ్యాకరణ శాస్త్రం ఛందశ్శాస్త్రం అలంకార శాస్త్రం అధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు మూలఘటిక కేతన గారి ఆంధ్రభాషాభూషణం, అపర నన్నయభట్టు రచించిన ఆంధ్రశబ్దచింతామణి మొదలుగా శబ్దతత్త్వాన్ని నిశ్చయించే లక్షణగ్రంథాలు; మల్లియ రేచన కవిజనాశ్రయం, వెల్లటూరి లింగన సరసాంధ్రవృత్తరత్నాకరం వంటి ఛందస్తత్త్వాన్ని నిరూపించే ప్రకరణగ్రంథాలు; గుడిపాటి కోదండపతి రసమంజరి, వడ్డికవి శృంగార రసాలవాలం లాంటి సాహిత్యతత్త్వాన్ని నిర్దేశించే పాఠ్యగ్రంథాలు అనేకం ఉండేవి కాని, అవన్నీ ఆయా శాస్త్రాలలో ఏవో కొన్ని కొన్ని అంశాలకే పరిమితమైన వివృతికల్పాలు. లింగమగుంట తిమ్మకవి సులక్షణసారంలో ఛందస్సుకు ఆవశ్యకమైన వ్యాకరణాంశం చాలా కొద్ది, ఛందోవివరణమూ సంక్షిప్తమే. అనంతామాత్యుని ఛందోదర్పణంలో వ్యాకరణాంశం అతిస్వల్పం, ఛందోవిషయం కొంత విపులతరమే అయినా అందులో అలంకారాలు చర్చకు రావలసిన అవసరం లేకపోయింది. మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలో ఛందోవ్యాకరణాల ప్రసక్తి లేనే లేదు. ఉన్న సాహిత్యశాస్త్రవిశేషమైనా అటు రుయ్యకుని అలంకారసర్వస్వానికీ, విద్యాధరుని ఏకావళికీ, ఇటు విద్యానాథుని ప్రతాపరుద్రీయానికీ సమన్వయం కుదరక, అనువాదం సరిగా లేక ప్రామాణికతను సంతరించుకోలేకపోయింది. అప్పకవీయం వ్యాకరణప్రసంగమే కాని, ఆనుషంగికంగా వచ్చిచేరిన ఛందస్సుకే అందులో అగ్రియత్వం లభించింది. అనంతుని రసాభరణం, భైరవకవి కవిగజాంకుశం మొదలైనవి కొన్ని ఏదో ఒక లఘువిషయాన్ని గ్రహించి, దానినే ఎంతో కొంతగా విస్తరించిన వివృతిమాత్రాలు. ఉన్నంతలో వ్యాకృతికి చింతామణి, అహోబలపండితీయం; ఛందస్సుకు అప్పకవీయం లాగా అలంకారశాస్త్రంలో కావ్యకర్తలకు, కావ్యపాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం ఒక్కటీ లేదు.
విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి, పొత్తపి వెంకటరమణకవి లక్షణశిరోమణి మొదలైనవాటిలో లక్షణలక్ష్యాలు అసమగ్రంగా ఉండటమే గాక అవి పరోక్షసమన్వయసాపేక్షాలుగా ఉంటాయి. ప్రామాణికమైన ఒక లక్షణగ్రంథాన్ని తెచ్చుకొని రుయ్యకుని అలంకార సర్వస్వానికి జయరథుని విమర్శిని, మమ్మటుని కావ్యప్రకాశానికి మాణిక్యచంద్రుని సంకేతం వంటి మహావ్యాఖ్యానాలను ఎదుట ఉంచుకొని ఎక్కడికక్కడ సరిచూసుకొంటూ చదువుకొంటే కాని ఆ అధ్యయనం ముందుకు సాగదు. అటువంటి వ్యాఖ్యానగ్రంథాలైనా చింతామణికి బాలసరస్వతీయం, అధర్వణ కారికలకు అహోబల పండితీయం, అప్పకవీయంలో కొంత భాగానికి సుకవిమనోరంజనం వంటివి వ్యాకరణానికి వెలువడ్డాయి కాని, అన్ని ఛందోలంకారలక్షణగ్రంథాలకూ తెలుగు భాషలో సుపర్యాప్తంగా వ్యాఖ్యానాలు వెలువడలేదు. ఛందోలంకారాలకు సంస్కృతంలోని ఒక మూలాన్ని, దానిపై వెలసిన వ్యాఖ్యానాలను చదువుకొని, వాటికి సరిపడే తెలుగు ప్రయోగాలను సంపాదించి, ఆ రెండింటిని యథాయోగ్యంగా అన్వయించుకొనే అలవాటుండేది కాని, ఆ మాత్రపు కృషికైనా అలంకారశాస్త్రానికి తెలుగులో ఉన్న లక్షణగ్రంథాలు తక్కువ. వాటిపై పదవాక్యప్రమాణవిదుల విజ్ఞానవ్యాఖ్యలు వెలువడేంత ప్రామాణికత వాటికెన్నడూ కలుగలేదు. పైగా వాటి చర్చాపరిధి చాలా తక్కువ. కావ్యస్వరూపం, వృత్తిలక్షణం, గుణదోషనిరూపణం, శబ్దార్థాలంకారవివేచనం, రసభావవిశదిమ, నాయికానాయకుల గుణావస్థానిర్ణయం, దృశ్య శ్రవ్య కావ్యభేదాలు, రూపక పరిభాషాంగ ప్రశంస, కథాశరీరసంవిధానం, కవిసమయప్రదర్శనం, ప్రేక్షకులూ పాఠకులూ తప్పక తెలుసుకోవలసిన పారిభాషికపదాలు, నాట్యధర్ములు, ప్రకీర్ణకవిమర్శబోధ, ప్రకాశార్థాన్ని బట్టి కవి అంతరంగాన్ని ఆవిష్కరించటం మొదలైన ముఖ్యవిషయాలలో ఏ కొన్నింటికో అవి పరిమితాలు. విద్యార్థులు విద్యాధికులైన తర్వాత కూడా శృంగారప్రకాశ సరస్వతీకంఠాభరణాల వలె వారిని విద్యార్ణవం లోలోతులకు తీసికొనివెళ్ళి, విద్యాశిఖరి సమున్నతశిఖరాలపై విహరింపజేసే జీవితకాలప్రబోధగ్రంథం ఒక్కటీ లేదు.
అటువంటి లోపాన్ని పూరించటానికి బహుసంవత్సరాలు కృషిచేసి, వందలకొద్దీ గ్రంథాలనుంచి ప్రయోగాలను సేకరించి, అన్నింటి లక్షణాలను సూక్ష్మేక్షికతో పరీక్షించి, ఛందోవ్యాకరణాలంకార బృహద్విజ్ఞానకోశాన్ని సర్వలక్షణశిరోమణి అన్నపేరుతో కూర్చి; అందులో ఉపదేశింపబడినదానికే లక్ష్యానుబంధంగా ఒక ప్రబంధరాజాన్ని సంధానించిన ఒకే ఒక్క మహనీయుడు శ్రీ గణపవరపు వేంకటకవి. ఆ మహావిద్వాంసుడు కూర్చిన ఆ మహాప్రబంధం పేరు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం.
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, అటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటి కవి జినపాల గణి రచించిన సనత్కుమార చక్రి చరితమహాకావ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన శిష్యుడు సుమతి గణి తన గణధరసార్ధశతక బృహద్వృత్తిలో చెప్పిన ఒక శ్లోకం గణపవరపు వేంకటకవి రచనకు అన్వయించినట్లు తెలుగులో మరే కవి రచనకూ అన్వయింపదంటే అతిశయోక్తి కాదు. ఆ శ్లోకం ఇది:
నానాలంకారసారం రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారం
నానాచ్ఛందోఽభిరామం నగరముఖమహావర్ణకావ్యప్రకామమ్
దృబ్ధం కావ్యం సటీకం సకలకవిగుణం తుర్య చక్రేశ్వరస్య
క్షిప్రం యై స్తేఽభిషేకాః ప్రథమజినపదాశ్లిష్టపాలా ముదే నః.
వేంకటకవి కావ్యం కూడా బహువిధాలంకారసారమే. రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారమే. చిత్రకవిత్వంలో సాటిలేని కావ్యం ఇది. గర్భకవిత్వంలో దీనిని సరిపోలిన ప్రయోగసరళి నాటికీ, నేటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. బంధకవిత్వంలో త్రిదశతరంగిణీ చతుర్హారావళీ చతుర్వింశతిజినస్తుతి విజ్ఞప్తికా విద్యుల్లతాదుల లాగా ఇది కేవల బంధకావ్యం కాకపోయినా, అంతకు మీరిన బంధచిత్రప్రకారాలు దీనిలో ఉన్నాయి. హరిశ్చంద్రనళోపాఖ్యాన రామకృష్ణార్జునరూపనారాయణీయాదులను పోలిన అనేకార్థరచన కాకపోయినా ద్విసంధాన త్ర్యర్థిఘటనాదులున్నాయి. శేషశైలేశలీలా శ్రీశౌరిశైశవలీలాదుల వలె కేవలం స్థానచిత్రాలతో (య-ర-ఱ-ల-ళ-వ-శ-ష-స-హ అనే పది అక్షరాలతో) కూర్చిన రచన కాకున్నా, ఇందులో ఉన్నన్ని చమత్కారాలు వాటిలో లేవు. చిత్రకవితాప్రణయనంలో ‘యదిహాస్తి త దన్యత్ర, యన్నేహాస్తి న తత్క్వచిత్’ అని సగర్వంగా చెప్పదగిన కావ్యం ఇదొక్కటే. సంస్కృతంలో హరవిజయ చిత్రబంధ రామాయణాదులు, ప్రాకృతంలో అజియసంతిథయ సౌరిచరియాదులు దీనితో కొంత సాటికి, పోటీకి వస్తాయేమో. తెలుగులో మాత్రం వేరొకటి లేదు. సనత్కుమార చక్రి చరిత మహాకావ్యం వలె ఇదీ నానాచ్ఛందోఽభిరామమే. ఇందులో ప్రయోగింపబడినన్ని ఛందస్సులను ఇంత మనోహరంగా ఏ తెలుగు కవీ ప్రయోగించలేదు. సనత్కుమార చక్రి చరితకు తుల్యంగా ఇదీ అష్టాదశవర్ణనాపూర్ణమే. దాని వలె ఇదీ సటీకమే. దీనికీ బంధచిత్రాలున్న ప్రతి ఒకటీ, లఘుటీకతోడి ప్రతి ఒకటీ – ఇప్పుడైతే లేవు కాని, గతశతాబ్దం దాకా ప్రచారంలో ఉండేవి. ఆ విధంగా మహాపండితుడు జినపాల గణి రచనను గురించి గణధరసార్ధశతక బృహద్వృత్తిలో సుమతి గణి చెప్పిన శ్లోకం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసానికి అన్వయించినట్లు మరే కవి రచనకూ అన్వయింపదని స్పష్టం.
రచన: ఏల్చూరి మురళీధరరావు
———–