ఓలేటి పార్వతీశం (Oleti Paarvateesam)

Share
పేరు (ఆంగ్లం)Oleti Paarvateesam
పేరు (తెలుగు)ఓలేటి పార్వతీశం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1882
మరణం1/1/1970
పుట్టిన ఊరుపిఠాపురం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకావ్య కుసుమావళి , బృందావనం , ఏకాంత సేవ”
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలువేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు. తదనంతరం ఆయన తన బావమరిదితో కలసి వ్రాయడం ప్రారంభించారు. ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో వీరు తెలుగు జంటకవులుగా బాలాంత్రపు వేంకటరావు తో కలసి జంటకట్టి కవిత్వరచన చేశారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఓలేటి పార్వతీశం
వేంకట పార్వతీశ్వర కవులు
సంగ్రహ నమూనా రచన20వ శతాబ్ద దశకంలోని ఆంధ్రదేశ పరిస్థితుల్ని, వాతావరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని సంఘసంస్కరణని ప్రబోధించారు వేంకట పార్వతీశ్వర కవులు. 1919 సంవత్సరంలో వీరి ‘మాతృమందిరము’ నవల వెలువడింది. మత పరివర్తనావశ్యకతను సూచించకుండా పంచములకు దేవాలయ ప్రవేశాన్ని కలిగించింది. సంస్కారు లైన వేంకట పార్వతీశ్వర కవులు నూతనాచారాల్ని ప్రవేశపెట్టి పంచమాభ్యుదయానికి పూనుకున్నారు. అపూర్వమైన ఊహాశక్తితో అస్పృశ్యతా సమస్యను అత్యంత ప్రభావితంగా చిత్రించారు.

ఓలేటి పార్వతీశం
వేంకట పార్వతీశ్వర కవులు

20వ శతాబ్ద దశకంలోని ఆంధ్రదేశ పరిస్థితుల్ని, వాతావరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని సంఘసంస్కరణని ప్రబోధించారు వేంకట పార్వతీశ్వర కవులు. 1919 సంవత్సరంలో వీరి ‘మాతృమందిరము’ నవల వెలువడింది. మత పరివర్తనావశ్యకతను సూచించకుండా పంచములకు దేవాలయ ప్రవేశాన్ని కలిగించింది. సంస్కారు లైన వేంకట పార్వతీశ్వర కవులు నూతనాచారాల్ని ప్రవేశపెట్టి పంచమాభ్యుదయానికి పూనుకున్నారు. అపూర్వమైన ఊహాశక్తితో అస్పృశ్యతా సమస్యను అత్యంత ప్రభావితంగా చిత్రించారు.
చబుకం దెబ్బకు తట్టుకోలేక కిందపడ్డ పంచముడు లేవలేకపోతే రంగడు తన చేయి అందించి నిలబెడతాడు. పంచముడైన అప్పడు చండాలుడని రంగడికి తెల్సినా మానవతా దృష్టితో ఆదుకుంటాడు. చండాలుడ్ని చూడగానే ధనికుడికి అసహ్యం కలుగుతుంది. చండాల జాతిని తన్ని తగలేసినా అడిగే దిక్కులేదనే భావంతోనే ఆ ధనికుడు అప్పడ్ని కొడతాడు. అమానుషంగా ప్రవర్తించిన ధనికునిలో పై కులాల వాళ్ళ భావజాలం వ్యక్తమౌతుంది.
నవల్లోని ముత్యాల్లాగా ఇప్పటికీ పల్లెల్లోని దళితులు అర్ధనగంగానే కన్పిస్తారు. దానికి పంచముల దారిద్య్రమే కారణంగానీ అది వాళ్ళ ఆచారంకాదు. పేదరికంగాని అంటరానితనం గాని ప్రేమని అడ్డుకోవు. రంగడు ముత్యాల్ని ప్రేమించడంలో ఈ విషయం రుజువవుతుంది.
పిఠాపురంలోని మాలపల్లెలో అస్పృశ్యుల్ని విద్యావంతుల్ని చేయడంకోసం రెండు పాఠశాలలు వెలుస్తాయి. వీటివల్ల పంచముల చదువులు నిరాటంకంగా సాగేవి. ఆ పాఠశాల్లోనే ముత్యాలు చదువుతుంది.మాతృమందిరం నవల్లోని కళ్యాణానందస్వామి చేపట్టిన సంస్కరణలే ఆనాడు కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీన రసింహం, వేంకటరత్నం నాయుడు చేపట్టారు.
అంతేకాదు, రవీంద్ర నాథ టాగూరు రచనలను మొట్టమొదట అనువదించి జనానికి అందుబాటులోకి తెచ్చినవారు వేంకట పార్వతీశ్వర కవులు.
——–
వేంకట పార్వతీశ్వర కవులు 1910 లో “నాటకములు” మీద రాసిన పద్యం

సీ. జనదురాచార హింస్రాజంతుమారణ
క్రీడాసముత్సుకా ఖేటకములు
ధర్మాదిపూరుషార్థచతుష్టయాసూచి
కమనీయవిమల శృంగాటకములు
శృంగారహాస్య విశేషరసాపాది
చిత్రవిదూషక చేటకములు
దుర్వాదదుర్మత దుర్నీతిబోధక
విమతసంతానచపేటకములు
ఛాందసాచార దుర్గ్రహోచ్చాటకములు
పాటితాజ్ఞానదుర్విష కీటకములు
అభ్యుపేతసమున్నత హాటకములు
నవనవోద్ఘాటకమ్ములు నాటకములు
——-
”పుస్తకం మనస్సును శాంతపరుస్తుంది; చల్లని మాటలు చెబుతుంది; సందేహాలను తీరుస్తుంది; ధైర్యాన్ని కలిగిస్తుంది; తల్లిదంద్రులవలె, పెద్దలవలె సదుపదేశం చేస్తుంది”.
శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు పుస్తకాన్ని గురించి ఓ గీత పద్యంలో చెప్పిన భావమిది.
——-

ఉత్కంఠ

వేణు గానరవంబు వినవచ్చే నేమో
యమునలో నప్పుడే యమృత ముప్పొంగె ;
ప్రియ సఖీ , చెప్పవే వ్రేపల్లె నుండి
బయలు దేరే నటమ్మ , బాల కృష్ణుండు ?

శిఖి పింఛ కాంతులు చెలరేగెనే మొ
తరుపత్రములలోన తళతళల్ పుట్టె ;
ప్రేయసీ , యప్పుడే బృందావనమున
కొలువు దీర్చు నటమ్మ , గోపాల మూర్తి ?

గిరిమల్లికలతావి గిరికొన్న దేమో
యాభీరమండలం బవల మై పోయె ;
కళ్యాణి , చూడవే కన్నుల అ గప్పి
మోసగించునో యేమో మోహనమూర్తి !

శరత్కు మారి
వెన్నెల చీర గట్టి నెరవిచ్చిన రెల్లుతురాయి వెట్టి మే
లెన్నిన సన్న జాజిపువు టేత్తుల గ్రొమ్ముడి చుట్టి , యేటి వాల్
తిన్నెల నెచ్చెలుల్ వెదకి తీయగ వెన్నెల వత్తు లాడుచున్
పున్నమ రేయి దోచు విరిబోణి విహంగిని యెట్టు లయ్యెనో !

కొలకుల విచ్చు చెంగలు కోవల వెన్నెల నించి చు
క్కల విడి రంగరించి తనుశంబున నెత్తి చకోర శాఖకం
బుల నొడి జీర్చి యుగ్గు లిడి పువ్వల తొట్టెల నుంచి యంచతో
య్యలులను నూవ బంపుజవ రాలికి నేలొకో” పక్ష పాతముల్,

* . * * *

ఘనతకు లెల్ల రిచ్చవడి కన్లోన కంచెల నున్న కేతకీ
వనముల సౌమనన్యమును వర్థిల జేయుచునుండి బీటలె
త్తిన నడగట్ల బంగరువుతీగల గూర్చి, ఘనుల్ భ్రమింప, బ
ల్మి నిటు మెరుంగ తీగ లెదలించుట యొప్ప నె మోహనాంగికిన్ !

తేటవన్నియా మోయు తెరవంక న్నెల
గలనిస్వనములతో బలుకరించి,
పలుక వారిన పాలపండ్ల గుత్తులు గూర్చి
చిలుక బోదలకు విందుల నమర్చి,

ననదేనే గొల్లలాడిన గండు దేంట్లను
చెందమ్మిలోగిండ్ల చెరలు వెటి,
చెదరి తారాడుచు చెట్ల నీడల జేరు
చీకటికంటిలో జిచ్చు వెట్టి,

ప్రకృతి లాలించి పాలిందు బాల వయ్యు
జగతి రక్షించి శిక్షించి శక్తి గాంచి
విశ్వవిస్మయలీల నిజ్వెలది యెట్లు
పరమపురుష ప్రభావంబు బడసినది యొ?

ఆర్థప్రధాన మోహన సస్యలక్ష్మీకి
గొల దలంపని తలకోత వెట్టి,
కామానురూపవిభ్రమరాజ్యలక్ష్మీకి
నండ గూర్చని కలగుండు వెట్టి,
ఆఖలైహికార్థ భవ్యక్షమాలక్ష్మి కి !
భా పెరుంగని గుండె బీటు వెట్టి,
పరమార్టవిభవ శోభన విశ్వలక్ష్మికి
దగులు – సూపని వెల్లమొగము వెట్టి,
ఇట్టె వచ్చి వర్గాలక్ష్మి “కెసరు వెట్టి :
విజయలక్ష్మీప్రసంగంబు వీధి బెట్టి
రచ్చ కెక్కించినట్టి శరత్కు మారి
శారదేందిర యని యెట్లు పేరు గసెనొ !


కలువ కన్నె
కీలకీలను నవ్వి న న్నా లకింప జేసి
సొంపు పెంపున నను దమకింప జేసి
కేలి గిలిగింత నను బులకింప జేసి
చక్కబోయెద విది యేమి చందమామ!

మోము నెత్తిని నీముద్దు మొము జాడ :
కనుల చెరచితి నీచక్కదనము జూడ
మనసు విచ్చితి నీచల్లదనము నీడ
క్షణము నిల్చిన ద స్పీమి చందమాI

నా వలపు జూపు తనకంట నాటే నేమొ
చుక్క-నీకంటనే నన్ను జుచి నవ్వె ;
చెంతచెలి మెచ్చిన న్నిట్లు చిన్నబుచ్చి
దనుటయే నీకు న్యాయమా చందమామ !

కమ్మదేనె సోక గలదు మైక మటంచు
వలపు గాలి మరులు గొలుపు ననుచు
కలువ కన్నె బ్రతుకు గారడిగా జేసి
దనుట తగునె నీకు చందమామ !
మంతనంబు అయ్యో మాటలు లేకుండ
మొహముద్ర లయ్యే ముట్ట కుండ
కలల గాంచు ట య్యో కను మోడ్పు లేకుండ :
నిండ లేల నాకు చందమామ !

ఏకాంత సేవ

సర్వలోకేళ, యీ సాభంజికను
నీకేళి గృహమందు నిలువగా నిమ్ము ,
భువ వసంత్రాణ, యీపుష్ప వల్లికను
నీపూలతోటలో నిలువగా నిమ్ము .
భక్త మందార, యీ బాల శారికను
కళ్యాణ ధామ , యీ కవక పీఠికను
నీపాద ముల పొంత నిలువగా నిమ్ము .

అణువులు మొదలు బ్రహ్మాండంబు దాక
సర్వజీవుల కీవు సముడవు -కాన
నీదర్శనము చేయ నే గోరి కొంటి
నీ పూజ చేయంగ నే గోరి కొంటి
నీమాట లాలింప నే గోరి కొంటి
నీసేవ చేయంగ నే గోరి కొంటి
దయతోడ దిలకించి దాస్యం బొసంగి
న న్నేలు కొను మయ్య, నాజీని తేళ

(“మహోదయము” సంకలనం నుండి -)
———

వేంకటపార్వతీశ్వరకవుల కీర్తిపతాకనెత్తినది ‘ఆంధ్రప్రచారణీ గ్రంథమాల. ఆంధ్రప్రచారణీ కట్టు పేరు బ్రతిష్ఠలు వచ్చుటకు వేంకట పార్వ తీశ్వర కవులు కారణము. ఆంధ్రములో నభినవరీతులుగల నొకతీరు కవితకు అంకురార్పణము చేసినవా రీ జంట కవులే యని నేటి వారిలో మేటికవులు కొందఱభిప్రాయపడు చున్నారు. ఈయభిప్రాయమున కాయుగళము రచించిన ‘ఏకాంతసేవ’ యనుకృతి పట్టుగొమ్మ. అనుకృతి దారికి లోక, సాజముగా వచ్చిన తియ్యని బాసతో గొత్త వడుపున భావవిలక్షణత రాణించు కవితను రచించు నేటివారిలో ‘వేంకట పార్వతీశ్వరకవులు’ కడుగౌరవనీయు లనుట స్వభావోక్తి. ఇక వీరి చరిత్రాదికము గూర్చి ప్రకటించెదను.
బాలాంత్రపు వేంకటరావుగారు ‘ప్లీడరుగుమస్తా’ పని చేసుకొనుచు నేవో యల్లిబిల్లిపద్దెము లల్లుచుండెను. ఓలేటి పార్వతీశముగారు చెలికాని లచ్చారావుగారి దగ్గర నుండి యచ్చుపనులు చూచుచుండెను. 1908 సంవత్సరప్రాంతముదాక నీ కవకవు లొకరినొక రెఱుగరు. కాని, యిరువురు పిఠాపురమునకు బరిసరములోనే యున్నారు. విమర్శకాగ్రేసరులని ప్రసిద్ధి పడసిన శ్రీ నడకుదిటి వీర రాజకవిగారు విద్వజ్జన మనోరంజనీ ముద్రాలయద్వారమున సారస్వతసేవ గావించుచు నాడు పిఠాపురముననే కాపురముండి యున్నారు. ఈ మహాశయుడే మన ప్రస్తుత కవు లిరువురకు నేతుసంధానము చేసినవారు. ఆచంట సాంఖ్యాయనశర్మగారి సంపాదకత్వమున “కల్పలత” యను పత్త్రిక నడుచుచున్నతఱియది. ఆకల్పలతలో భాషాసంబంధములగు ప్రశ్నములు, సమస్యలు వెలువరింపబడెడివి. ఒకనెల గొన్ని ప్రశ్నములకు వీరరాజకవియును బిఠాపురము నుండి ప్రత్యుత్తరములు వ్రాసి పంపెను. వానికే పార్వతీశముగారు సమాధానము లంపిరి. వేంకటరావుకారు నెక్కడనుండియో వ్రాసి పంపించిరి. ఒకరివిషయ మొకరెఱుంగరు. పార్వతీశముగారికి ప్రథమ బహుమానము. వీరరాజకవికి రెండవభుమానము. వేంకటరావుగారికి మూడవ బహుమానము నిచ్చినటులు పత్త్రికలో బ్రకటితమైనది. ఈ మువ్వురు నొకశాఖపై నున్న కోకిలములే. ఒకరి గానమాధురు లొకరు విని యానందపడినారు. వీరరాజ కవిగారి సహృదయత మల్లాముకవిని – కొమరగిరి కవిని తీసికొని వచ్చి సంధానము చేసినది. నాటి నుండి వేంకట పార్వతీశ్వర కవులు. ఈ జంట యేర్పడని సమయమున వేంకటరావుగారు ‘ధనాభిరామము’ నాటకము – ‘సురస^ యను నవల వ్రాసికొనిరి. పార్వతీశముగారు పిఠాపురము మహారాజుగారి పట్టాభిషేకమునకు 1907 లో ‘సువర్ణమాల’ యను నాటకమును, ‘తారాశశాంకము’ అను వేఱొక నాటకమును రచించిరి. ఇవియే ప్రత్యేకరచనలు. తరువాతివన్నియు వేంకటపార్వతీశ్వర విరచితములే. కవ కలిసినతోడనే ‘అనురూప’ యను కావ్యము రచించిరి. అది యిపుడు ‘చిత్ర కథా సుధాలహరి’ గా బ్రచురింప బడినది. ఈ కవుల మేలి కలయికవలన 1911 లో నాంధ్ర ప్రచారణి వెలసినది. కార్యస్థానమునకు సూత్రపాతము తణుకులో జరిగినది. అక్కడ నొకయేడు మాత్రము ముండి నిడదవోలు – రాజమండ్రి – కాకినాడ – పిఠాపురము క్రమక్రమముగ సంచారము చేసినది. 1980 సం. దాక నీగ్రంథమాల మహోన్నతస్థితిలో నున్నది. శ్రీ కొవ్వూరి చంద్రారెడ్డిగారు తొట్టతొలుత ‘ప్రచారిణికి’ సహకృతి చేసిరి. ఆయన చేతిచలువ వలన నా గ్రంథమాల కట్టి ప్రఖ్యాత వచ్చినది. చంద్రారెడ్డి తెలుగు వారికి స్మరణీయుడైన వ్యక్తి. ఆంధ్రప్రచారిణికి దీటువచ్చు గ్రంథమాలలు మననేలలో రెండో మూడో. చక్కని వచన వాజ్మయమును సేవించిన గ్రంథమాలలే తక్కువ. 1980 నాటికి ప్రచారిణి వెలువరించిన గ్రంథముల సంఖ్య 170. ఆంధ్రప్రచారిణికి బ్రాణము వేంకట పార్వతీశ్వర కవులు. ఈ జంటకవులకు నడుమ నడుమ బొడముచుండు మానసికములగు కలతలను ప్రచారిణి మధ్యవర్తినియై తొలచుచుండెడిది. రెండు దశలు గ్రంథమాల జాతకము విఖ్యాతముగ వెలిగినది. వేంకట పార్వతీశ్వర నవలలు తెలుగులో నలుమూలల బేరు సంపాదించుకొన్నవి. ఈ కవు లిర్వురును గురుముఖమున సంస్కృతమునుగాని, ఆంగ్లముగాని యధ్యయనము చేయలేదు. వీరికి వంగభాష కొంచెము వచ్చును. మిత్రునివలన గన్నడములో ననువదింపబడిన బంకించద్రుని నవల నొకదానిని చదివించుకొని విని, వంగ వాజ్మయపు సొగసులకు, బంకించద్రుని కల్పనముల పొంకమునకు నివ్వెఱపడి మెల్లమెల్లగ నాభాషలో గృషి చేసిరి. ఆ కృషియైనను సాధారణమైనదే. ఏమైన నేమి! వంగము కాదు, ఆంగలము కాదు, అన్యభాష లెన్నో యెఱిగినవారికంటె గూడ వీ రెక్కువ సేవ చేసిరి. వీరి నవలలోని రచనసొంపు వేఱే నేను వక్కాణింప నక్కఱయుండదు.
అనువాదములు గావించిరి. కల్పనములును జేసిరి. ఏవి రచించినను సహజత్వము శైలిలో నుండుటచే వీరి రచనలు పాఠక హృదయములను హత్తుకొన గలిగినవి. వీరి నవలావాజ్మయము తెలుగుతల్లి విహారమునకు ‘బ్రమదావనము’. ఇక వీరి పద్యకావ్యముల సంగతి: ‘అనసూయ’ పత్త్రికలో మొట్టమొదట ‘ఏకాంతసేవ’ కావ్యము బయట బడినది. అదియాది వీరి నాధునికులు మెచ్చి కవులలో నొక మంచిస్థాన మిచ్చినారు. 1922 లో నా కృతి యచ్చుపడి తెలుగువారి కెల్లరకు నందుపాటులోనికి వచ్చినది. వంగ సారస్వత మెఱుగరు. ఆంగలము తెలిసినవారు కారు. రవీంద్రుని భావోన్నతి వీరి కెట్టు లబ్బినదో యని యంద ఱబ్బురపడినారు. ‘ఏకాంతసేవ’ నేటి కృతులలో రసభావపరిపూర్ణమై యున్నదని యెన్నుకొనినారు. ప్రకృతి పులకించునటులు భక్తుడు జీవితేశ్వరుడైన యా పరమేశ్వరుని గూర్చి పాడుకొన్న ప్రణయ గీతముల సంపుటమీ ‘యేకాంతసేవ’.
నా మెలంగుతోట నామాటలలో దేట
నావరాలకొంగు నావెలుంగు నావయాళి తేప నాచూపులో బాప
నిలుచుగాక! తన్ను గొలుచుదాక.
అని ప్రార్థించి కృతిగానమున కుపక్రమించిరి. కవుల భాకత యను పదమున బాఠకులకు దట్టుచుండును. నిశితమైన భావనాశక్తి గల కవులు వీరని ‘యేకాంతసేవ’ ఘోషించి చెప్పుచున్నది. ఈ పదములు చదువుడు:
తూరుపుగోనలో దుందుభిస్వనము
వీణాన్వనంబులో వినరాకయుండె
నానందవనములో నాగస్వరంబు
నూదకే కోకిలా యొక్కింతసేపు
*


శృంగారనదిలోన చిగురాకుదోనె
యే రాగజలధిలో నీదుచున్నదియొ
తలిరు జొంపంబులందలి గానలహరి
యే దివ్యసీమల కేగుచున్నదియొ!
పరువంపు బూపులోపలి కమ్మతావి
యేవాయుపథమునం దెగయు చున్నదియొ
తారాపథంబునందలి తటిల్ల తిక
యే మహాతేజమం దెనయుచున్నదియొ!
గాలిలో జాడలు కనిపెట్టగలుగు
దివ్యమూర్తికి నీకు దెలియదటమ్మ!
ప్రణయవనంబులోపలి పుష్పరథము
తుమ్మెదా! వేవేగ తోలితేవమ్మ! ఏకాంతసేవకు బీఠిక వ్రాసి వ్రాసి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చివర కిటులు తమ యభిప్రాయము తేల్చినారు. “ఇది విమర్శనాతీతము. వంగభాషకు రవీంద్రుని గీతాంజలి యెట్టిదో, మన యాంధ్రమున కీ మహాకవుల – భక్తుల యేకాంతసేవ యట్టిది”
వేంకట పార్వతీశ్వర కవుల భావరాశి స్వాభావికమైనది కాని, యాంగ్ల వంగములనుండి దొంగలిగొన్నది కాదని మన మనుకొనవలసిన విషయము. వీరి ‘కావ్యకుసుమావళి’ రెండు సంపుటములు చూడుడు! కవిత యెచ్చోటనేని సహజతలో గొఱతపడినటులున్న దేమో!
తిన్నని నున్నని తెల్లని యెనలేని
మొగ్గలలోనుండి నిగ్గుదీసి
చక్కని చిక్కని సరిలేని కమ్మని
పూవులలోనుండి ప్రోవుజేసి
విఱుగని తఱుగని వెలలేని తీయని
తేనియలోనుండి తేటదీసి
నలగని తలగని నలిలేని తొలిలేని
చివురాకుదొన్నెల సేకరించి-
ఆంధ్రకవితా సరస్వతి నమ్లానపుష్పోపహారములతో నర్పించిన కవివరులు వీరు. కవితలో దఱచుగ బదముల పున:పునరావృత్తి వీరి కిష్టము. నవ్యకవితావతారమునకు ముందే యనేక నూతన విషయములపై వీరిలేఖిని 1909 సం.కంటె దొల్లి పత్త్రికలలో వెల్లివిరిసినది. కొన్నిరకముల కవితామార్గములకు వేంకట పార్వతీశ్వర కవులు దర్శకులుగాని, వీరు వేఱొకరి కవితతీరు ననుకరించినటులు మన మనుకొనరాదు. అట్టి స్వాభావికత వారి రచనలో బదముపదమున బరికింపవచ్చును. ఈ జంట కవుల యభ్యుదయము గుఱుతించి శ్రీ పీఠికాపురాధీశ్వరుడు వీరి కొక ముద్రాయంత్రమునుగొనియిచ్చి తదుద్యమమునకు జేయూతనొసగెను. నరసారావుపేటలో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తున శ్రీ ఉయ్యారు రాజావారి సభాధిపత్యమున నీకవులకు ‘కవిరాజహంస’ బిరుద మొసగబడెను. 1943 లో రాజమహేంద్రవరమున వీరికి షష్ఠిపూర్తి సమ్మాన మహోత్సవము వైభసపూర్ణముగా సాగినది. అప్పుడు కూడిన యాధునిక కవివర్గము వీరికి “కవికులాలంకార” బిరుదము నిచ్చి గౌరవించిరి. ఈ బిరుదములు రెండును వీరియెడ దగినటులుండి యందగించుచున్నవి.

ఉ. పావనమూర్తి నీశ్వరుని బమ్మెర పోతన రామరాజుగా
భావనచేసి పాడుకొనె భాగవతంబును; నట్లె రామభూ
మీ వరు సద్గుణావళుల మేము జగత్ప్రభు లీలగాంచి బృం
దావన కావ్య మంకిత మొనర్చితి మాతని పెండ్లిపాటగన్.

అని చెప్పి శ్రీ పిఠికాపుర యువరాజు గంగాధర రామరాయ ప్రభునకు ‘బృందావనకావ్యము’ నంకితము గావించిరి. ఈ కబ్బము శ్రీ రఘునాథరాయల కాలమున వెలసిన శృంగారకావ్యములను దలదన్ను చెన్ను ననున్నది. ఈ కూర్పు నేర్పు పరికింపుడు.

సీ. మణి కిరీటంబుపై మన్నింపలేదటే
కొరగాని పురినెమ్మికోడిఱెక్క
అధరపల్లవముపై నానింపలేదటే
వెలివోని విరసంపు వెదురుపుల్ల
శ్రీవత్సకాంతిపై జెలగింపలేదటే
వెలలేని చిఱుమోక తులసిరేక
కల్యాణమూర్తిపై గదియింపలేదటే
కొరరాని నసరాకుపురుగునూలు అఖిలలోకవిభుని నతిభక్తి సేవింప
నాత్మవిభుని కరుణ నభిలషింప
దగనివారు బడయ దగనివా రెవరమ్మ?
తరతరంబు లేల తడవెదమ్మ!

ఉ. వేంకట పార్వతీశ్వర కవిద్వయ నిర్మల వాజ్మన:క్రియా
సంకలసంబునం బొడమి సమ్మతమై ఫలపుష్ప శాఖికా
సంకుల సత్కవిప్రకర సాధునుతంబయి రామరాణ్మహేం
ద్రాంకితమైన యీకృతినురాగమ మర్థుల దన్పు గావుతన్!

మన తెనుగువారిలో నీ కవులను దాటిన కవు లున్నారు. పండితులున్నారు. భావకు లున్నారు. తెలుగుపలుకుబడి యింతమధురముగా, మృదువుగా, తేట తెల్లముగా, దీరుతియ్యముగా దీర్చి దిద్దినవారు తక్కువగ నున్నారు. పసిపిల్లవానినుండి, పండితునివఱకు నచ్చునట్లు తేలికభాసలో నింత సంతనగా సంతరించు కవిరాజహంసలు మనవారిలో నెందఱో లేరు. ‘బాలగీతావళి’ పలువురు చూచియుందురు. ఎంతసేపు, సాధారణజనబోధకముగా నుండునట్టి నడక వారి సొమ్ము. అట్టులని, యర్థగంభీరత యుండకుండునా? ప్రతిపద్యమున జాల గాంభీర్యము. ఈ జంటకవులు తమ ‘లేఖిని’ గూర్చి యీరీతి యుపదేశములు చేయుచుందురు.

వ్రాయుము నిర్మలభావ వి
ధేయమ్ముగ బుధజనాతిధేయముగ జగ
ద్గేయమ్ముగ లలితసుధా
ప్రాయమ్ముగ బాఠకశ్రవణసేయముగన్.

ఇట్టి కరపులు గఱచిన లేఖినితో నీనడుమ వేంకటపార్వతీశ్వర కవి కోకిల యుగళము తెనుగులో నాదికావ్యగానము చేయదొడగినది. రచన నేటి కయోధ్యకాండములోనికి వచ్చినది. అది సాంతమై గీటు ఱాతికి వచ్చుగాక!

(“ఆంధ్ర రచయితలు” నుండి-)

———–

You may also like...