పప్పూరు రామాచార్యులు (Pappuru Ramacharyulu)

Share
పేరు (ఆంగ్లం)Pappuru Ramacharyulu
పేరు (తెలుగు)పప్పూరు రామాచార్యులు
కలం పేరు
తల్లిపేరుకొండమ్మ
తండ్రి పేరుపప్పూరు నరసింహాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ11/8/1896
మరణం3/21/1972
పుట్టిన ఊరుఅనంతపురం పట్టణం
విద్యార్హతలుబి.ఏ.
వృత్తిరాజకీయాలు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువదరుబోతు వ్యాసాలు, కల్లుపెంట నాటకం
విశ్వవినుత నామ వినుము రామ అనే మకుటంతో 40 పద్యాలు వ్రాశారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుబళ్ళారిలో ఈయన చేసిన పురాణ పఠనాన్ని విని బళ్ళారి రాఘవ బంగారుపతకంతో సత్కరించారు.
ఇతర వివరాలుఆయన సంస్కృతాంధ్ర పాండిత్యాలు భారతదేశ సంస్కృతి మూలసూత్రాలను చక్కగా అర్ధం చేసుకోవ డానికి దోహదం చేసింది. వ్యక్తిత్వ వికాసానికి గ్రంథపఠన ఆవశ్యకతను తొలుతనే గుర్తించినారాయన. గ్రంథాలయాలు లేని రోజుల్లో రామాచార్యులు స్వయంగా పుస్తకాలు సేకరించి చిన్న పుస్తక భాండాగారం నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు. గ్రంథాలయా లకు గ్రంథాలయ పన్నులు సక్రమంగా చెల్లించి నూతనంగా గ్రంథాలయాలను నెలకొల్పి కొత్త పుస్తకాలను సమకూర్చినారు. అనంతపురం మునిసిపాలిటీలో నిరంతర విద్యా విజ్ఞాన భాండా గారాన్ని నెలకొల్పడం అనేది ప్రశంసనీయమైన నిర్ణయము. నాటి జిల్లా కలెక్టర్ జేమ్స్ రామాచార్యులను ప్రత్యేకంగా అభినందించారు. పినాకిని, సాధన పత్రికలతో పాటుగా సహకార పత్రికకు కుడా సంపాదకత్వం నెరపారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపప్పూరు రామాచార్యులు
సంగ్రహ నమూనా రచనపట్టు చున్నవెపుడు పుస్తకంబులు కోట్లు
చదువదగిన వందు చాల కొలది
పట్టుజనులలోన పూజ్య లేకొందరో
విశ్వ విసుత నామ వినుము రామ, (రామయ్యపద్యాలు)

పప్పూరు రామాచార్యులు

పట్టు చున్నవెపుడు పుస్తకంబులు కోట్లు
చదువదగిన వందు చాల కొలది
పట్టుజనులలోన పూజ్య లేకొందరో
విశ్వ విసుత నామ వినుము రామ, (రామయ్యపద్యాలు)
పుట్టిన ప్రతిమనిషి పూజ్యుడు కాలేడు. వ్రాసిన ప్రతి పుస్తకము సాహిత్యములో తలమానికము కాజాలదు. “మలయ జంబు వలన వనము వెలిగిన రీతి” ఒక పుణ్య పురుషుని వలన ఆ మండలమునకు కీర్తి ప్రతిష్ట లు పెరుగును. పూజ్యులైన శ్రీ పప్పూరు రామాచార్యులవారిని అనంతపుర మండలమున ఎరుగని వారు లేరు. ఒక వైపు రచనా వ్యాసంగమును చేబట్టి సామర్ధ్యముతో ఒక పత్రికను నిర్వహించుచు ప్రజలలో రాజకీయ చైతన్యమును కల్గించిన ప్రజ్ఞాశాలురు శ్రీ ఆచార్యులవారు.
శ్రీ రామాచార్యుల తండ్రిగారెన శ్రీ నరసింహాచార్యులు కూడ పేరుమోసిన పౌరాణికులు. వీరి పురాణ ప్రసంగములందు హాస్యధోరణి అధికము. ఆ ఛాయలే కుమారునిలోను పొడసూపినవి. ఆచార్యుల వారు తండ్రికడనే సంస్కృతాంధములునేర్చి, అనంతపురము మునిసిపల్ హైస్కూలో చేరి, స్కూల పైనల్ పరీక్షను రాజమహేంద్రవరమున ముగించిరి. తరువాత 1914 లో మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువు సమయమునందే వీరు రాజకీయరంగములో ప్రవేశించిరి. అప్పటిలో రాయలసీమ ప్రజానీకమును జాగృతమొనర్చిన నాయకులలో పద్మశ్రీ కల్లూరు సుబ్బరావుగారు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ముఖ్యులు. కల్లూరు సుబ్బరావు గారివెంట పల్లెటూర్లకు వెళ్లి ప్రజలలో స్వాతంత్ర్య సముపార్థనా కాంక్షను రేకెత్తించిరి. ఆ సమ
ముయము నందే ఆచార్యులవారికి సుబ్బరావుగారితో కడు సన్నిహిత మేర్పడినది. గ్రామములలో మద్యనిషేధము, ఖద్దరు వస్త్రధారణ, హరిజనోద్ధరణ, గ్రామపారిశుభ్రత మున్నగు జాతీయ కార్యక్రమములను చేబట్టి, అనంతపురమండలమున బహుళ ప్రచారము గావించిరి. 1921లో గాంధీజిగారిని తాడిపత్రిలో కలుసుకొని, ఉప్ప సత్యాగ్రహములో పాల్గొనిరి. ఆ కారణమున వారొక ఏడాదిపాటు బళ్ళారిలో కారాగారవాన మనుభవించిరి.
తరువాత 1923 లో శ్రీ ఆత్మారామప్పగారి సహకారముతో ఆచార్యులవారు ‘పినాకినీ” పత్రికను ప్రారంభించిరి. మూడేడులా పత్రిక సాగిన తదనంతరము 1926 లో ఆచార్యులవారే “సాధన” యనుపేర మరొక పత్రికను నడిపిరి. ఆ పత్రికనంతపుర మండలమున ఎఱుగని వారులేరు. ఇప్పటికినీ ఆ పత్రికను ఆచార్యులవారి కుమారులు శ్రీ శేషాచార్యులవారే నడుపుచుండుట ముదావహము. శ్రీరామాచార్యులవారి కలమునకు పదును మెండు. పత్రికా సంపాదకత్వములో వీరనేక విషయములను కడు విచక్షణతో విమర్శించిరి. తెనుగుదేశమున వీరొక ప్రముఖ సంపాదకులుగా గుర్తింపబడిరి.
1942లో జరిగిన “క్విట్ ఇండియా” ఉద్యమమున ఆచార్యులవారు పాల్గొనిన కారణమున, మరొకసారి కారాగారమునకు వెళ్లి వేలూరు, తంజావూరు జైళ్లలో రెండేళ్ల గడిపిరి. అప్పడు వీరితోబాటు శ్రీయుతులు అర్. బి. రామకృష్ణరాజు, కల్లారు చంద్రమౌళి, కల్లారు సుబ్బరావు, టేకూరు సుబ్రహ్మణ్యము మున్నగువారుకూడా ఉండిరి. ఆచార్యులవారు తమకుగల సహజ పౌరాణిక ప్రవచనములతో తోటి డెటిన్యూలకు భారత. కాళిదాస కావ్యములలోని రమ్యభావములను వినిపించుచు, సత్కాలక్షేపము చేయుచుండిరి. వారి ప్రవచనా పాండిత్యమునకు రాజకీయ ఖైదీలు వెరగుపడి, జైలునందే వారికి పండిత సత్కారములు నెరవేర్చిరి.

జైలునుండి విడుదల జరిగిన పిదపకూడ ఆచార్యులవారు పురాణపఠన కార్యక్రమమును కొనసాగించుచు తమ జీవితమును గడుపుచుండిరి, బళ్లారి ప్రజానీకము వీరి పురాణపఠన కార్యక్రమ మునకు జోహారులొనర్చిరి. నాటక కళాప్రపూర్ణ బళ్లారి రాఘవా చార్యులవారు ఆచార్యుల వారినా సందర్భమున బంగారుపతకముతో సత్కరించిరి.
ఆచార్యులవారి రచనాపాటవమునకు ‘వదరుబోతు” వ్యాసములు మచ్చుతునకలు, ఆ వ్యాసములన్నియు హాస్యవ్యంగ్య ధోరణిలో, నిర్దుష్టమైన భాషలో, ధారాళమైన శైలిలో సంఘ సంప్రదాయములను విమర్శించుచు వ్రాయబడినవి. ఈ వ్యాసములు భాషాభివృద్ధి కేకాక సాంఘిక దురాచార నిర్మూలనకుకూడ తోడ్పడగలవు. ఈ వ్యాసములు కొన్ని విద్యార్థుల పాఠ్యగ్రంథములలో చేర్చబడినవి.
ఆచార్యులవారు తమ జాతీయోద్యమమున మద్యనిషేధము రూపుమాపదలచి, అటనట గ్రామీణ ప్రజలకు దృశ్యరూపముగా ప్రదర్శించి తెలియజేయుటకు వీలుగా, వ్యావహారిక భాషలోనే “కల్లుపెంట’ నాటకమును రచించిరి.
ఆచార్యులవారికి శ్రీరామునిపై భకి మెండు. రామనామము విశ్వవినుతమైనదగుటచే వారు తమ పద్యములను “విశ్వవినుత నామ వినుము రామ’ ఆను మకుటముతో 40 పద్యములు వ్రాసిరి. అవి ఇటీవల వెలుగులోనికి వచ్చినవి. ఆ పద్యములలో మచ్చునకివి.
గండ్ల శిలలనైన ఖండింప గలిగిన
ఉక్కు నీటి చెమ్మ తుక్కుపట్టు
ఎంత శూరుడైన కాంత చేతికి చిక్కు
విశ్వ విసుత నామ వినుము రామ,
చెట్టు మీద కోట్లు చిగురాకు పువ్వులు
ఒకటి తోడ నొకటి యొురసి కొనవు
నీతిపరుల బ్రతుకు రీతులిట్లుండురా
విశ్వ వినుత నామ వినుము రామ,
ఆచార్యులవారితో సన్నిహితులుగానున్న శ్రీ విద్వాన్ విశ్వంగారు వారినిగూర్చి ఇట్లు వ్రాసిరి.
ఆయన హాస్యంలో కాస్త ఘాటుపాలెక్కువ””­­­­ గనుక కొంత వ్యతిరేకత సంపాదించుకొన్నారు. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలలో యువకులుగా మేము (నేను, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి వగైరాలు) ప్రవేశించినప్పడు వ్యతిరేకంగా ఆయన చాలా వ్రాసేవారు. నేను సమాధానాలు అదే ‘సాధన” * వ్రాసేవాణ్ణి. ఇద్దరం ఆ ఆఫీసులోని పట్టమీద కూర్చునే వ్రాసేవారం. ఒకరి చిత్తశుద్ధి నొకరు శంకించి ఎరుగము . వాదం వాదమే. స్నేహం స్నేహమేగా ఉండగల సంస్కారం వారికున్నది.”
ప్రస్తుతం లోకసభ స్పీకర్ గారైన శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి వీరు ప్రైవేటు ఉపాధ్యాయులుగా మూడేళ్ల పని చేసిరి. ఇట్టి శిష్యు లాచార్యులవారి కెందరో కలరు. 1955 లో ఆచార్యులు వారు ఆంధ్రపదేశ్ శాసనసభ్యులుగా ఎన్నికైరి. అనంతపురం మునిసి పల్ చేర్మనుగా పనిచేసిరి. అనంతపురము జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్ష పదవినలంకరించిరి. సాధన పత్రికతో బాటు “సహకారపత్రిక’ కు సంపాదకత్వము వహించిరి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి “స్రవంతి పత్రిక సంపాదవర్గమున నుండిరి.
వీరికి ముగ్గురు కుమారులు. ఏడుమంది ఆడుబిడ్డలు. పెద్ద కుమారుడు శ్రీ శేషాచార్యులవారు ప్రస్తుతము ‘సాధన’ పత్రికను పట్టుదలతో నడుపుచున్నారు.
పండిన మనసు, వయసుగల ఆచార్యులవారు జీవితమును నిండుగా అనుభవించి వెళ్ళిరి వారు ధన్యజీవులు.

రాయలసీమ రచయితల నుండి….

———–

You may also like...