పేరు (ఆంగ్లం) | Puttaparti Narayanacharyulu |
పేరు (తెలుగు) | పుట్టపర్తి నారాయాణాచార్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీదేవి |
తండ్రి పేరు | శ్రీనివాసాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 3/28/1914 |
మరణం | 9/1/1990 |
పుట్టిన ఊరు | అనంతపురం మండలంలోని చియ్యేడు |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | తుళు, ఫ్రెంచి, పర్షియన్, ఇంగ్లీష్ , హిందీ , మలయాళం , సంస్కృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పద్యకావ్యాలు: పెనుగొండ లక్ష్మి, షాజీ, సాక్షాత్కారము, గాంధీజీ మహాప్రస్థానము ,శ్రీనివాస ప్రబంధం, సిపాయి పితూరీ, బాష్పతర్పణము, పాద్యము, ప్రబోధము, అస్త సామ్రాజ్యము సుధాకళశము, తెనుగుతల్లి, వేదనాశతకము, చాటువులు, గేయకావ్యాలు: అగ్నివీణ, శివతాండవము, పురోగమనము, మేఘదూతము, జనప్రియ , రామాయణము ద్విపద కావ్యము: పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్), వచన కావ్యాలు: ప్రబంధ నాయికలు, వ్యాస సౌరభము, రాయలనాటి రసికతా జీవనము, రామకృష్ణుని రచనా వైఖరి, విజయాంధ్రులు, భాగవతోపన్యాసాలు, విజయతోరణము, సమర్థ రామదాసు, తెనుగు తీరులు, ఆంధ్రమహాకవులు, విప్లవ యోగీశ్వరుడు, శ్రీసాయిలీలామృతము సరోజినీదేవి, నవ్యాంధ్ర వైతాళికులు, ఆంధ్రుల చరిత్ర, కర్మయోగులు, రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి. నవలలు: అభయప్రదానం, ప్రతీకారము, హరిదాసి ఆంగ్లంలో స్వతంత్ర రచనలు: Leaves in the Wind, Vain Glorions, The Hero మలయాళంలో స్వతంత్ర రచనలు: మలయాళ నిఘంటువు సంస్కృతంలో స్వతంత్ర రచనలు: త్యాగరాజ స్వామి సుప్రభాతం, మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం, శివకర్ణామృతము, అగస్త్యేశ్వర సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం అనువాదాలు: హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా(నవల) మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్(నవల) మలయాళం నుండి:స్మశానదీపం, కొందియిల్క్కురు సిలైక్కు(నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ(నాటిక),సెట్రక్కాడు కథలు మలయాళం లోకి:ఏకవీర ఇంగ్లీషు నుండి: మెఱుపులు – తలపులు, అరవిందులు ఇంగ్లిషు లోకి:భాగవతం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | సరస్వతీపుత్ర |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పుట్టపర్తి నారాయాణాచార్యులు శివతాండవము |
సంగ్రహ నమూనా రచన | క. శ్రీరమణీ లలిత కటా క్షాఽఽరోపణ చంపక ప్రసవమాలా శృం గారిత వక్షుండు దయా వీరుఁడు బరదైవ మెడఁద వెలిఁగెడుఁ గాతన్. ఉ. కన్నులఁ గల్వచూపులు వికస్వరముల్గగనాంచలంబులన్ దన్నఁగ ధింధిమి ధ్వనులు దట్టములై ప్రతిశబ్దమీన, నా సన్న గుహాంతరాళముల సాంధ్యలఁదాండవమాడు దుఃఖితా పన్న శరణ్యుఁ డీశ్వరుఁడు భావమున న్జిగిరించుఁ గావుతన్. |
పుట్టపర్తి నారాయాణాచార్యులు
శివతాండవము
క. శ్రీరమణీ లలిత కటా
క్షాఽఽరోపణ చంపక ప్రసవమాలా శృం
గారిత వక్షుండు దయా
వీరుఁడు బరదైవ మెడఁద వెలిఁగెడుఁ గాతన్.
ఉ. కన్నులఁ గల్వచూపులు వికస్వరముల్గగనాంచలంబులన్
దన్నఁగ ధింధిమి ధ్వనులు దట్టములై ప్రతిశబ్దమీన, నా
సన్న గుహాంతరాళముల సాంధ్యలఁదాండవమాడు దుఃఖితా
పన్న శరణ్యుఁ డీశ్వరుఁడు భావమున న్జిగిరించుఁ గావుతన్.
తలపైనిఁ జదలేటి యలలు దాండవమాడ
నలలత్రోపుడులఁ గ్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముపైన ముంగుఱులు చెఱలాడఁ
గనుబొమ్మలో మధుర గమనములు నడయాడఁ
గనుపాపలో గౌరి కసినవ్వు బింబింపఁ
గనుచూపులను తరుణకౌతుకము జుంబింపఁ
గడఁగి మూడవకంటఁ గటికనిప్పులు రాలఁ
గడుఁబేర్చి పెదవిపైఁ గటికనవ్వులు వ్రేల
ధిమిధిమిధ్వని సరిద్గిరి గర్భములు తూఁగ
నమిత సంరంభ హాహాకారములు రేగ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
కిసలయజటాచ్ఛటలు ముసరుకొని వ్రేలాడ
బుసలుగొని తలచుట్టు భుజగములు బారాడ
మకరకుండలచకాచకలు చెక్కులఁ బూయ
నకలంక కంఠహారాళి నృత్యము సేయ
ముకుజెఱమలో శ్వాసము దందడింపంగఁ
బ్రకటభూతిప్రభావ్రజ మావరింపంగ
నిటలతటమునఁ జెమట నిండి వెల్లువగట్టఁ
గటయుగమ్మున నాట్యకలనంబు జూపట్ట
తకఝణుత ఝణుత యను తాళమానము తోడ
వికచనేత్రస్యంది విమలదృష్టుల తోడ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
భుగభుగ మటంచు నిప్పులు గ్రుమ్మ నూరుపులు
ధగధగిత కాంతి తంద్రములుగాఁ గకుభములు
దంతకాంతులు దిశాంతముల బాఱలు వాఱఁ
గాంత వాసుకి హస్త కటకంబు డిగజాఱ
భావోన్నతికిని దాపటి మేను వలపూఱ
భావావృతంబు వల్పలిమేను గరుపాఱ
గజకృత్తి కడలొత్తి భుజముపై వ్రేలాడ
నజుఁడు గేల్గవమోడ్చి “హరహరా” యని వేడ
ఝణుత తధిఝణుత తదిగిణతో యను మద్దెలల
రణనంబు మేఘ గర్భముల దూసుక పోక
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
ఎగుభుజమ్ములు దాచి నగుమొగమ్మునఁ జూచి
వగలురమ్మునఁ దూచి భావాభిరతి నేచి
తరళతంద్రమ్ము మధ్యమ్ము కిటకిటలాడ
వనసాంధ్యకిమ్మీర ప్రభలు దనువునఁ గూడ
కుణియునెడ వలయంపు మణులు చిందఱలాఁడ
కిణుకిణు మటంచుఁ బదకింకిణులు బిరుదాఁడ
శృంఖలారుండములు చెలగి తాండవమాఁడ
శంఖావదాత లోచనదీప్తి గుమిగూడ
వలగొన్న యెముక పేరులు మర్మరము సేయఁ
బులకింపఁగా నొడలు మురజంబులును మ్రోయ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
మొలక మీసపుఁగట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతిఁ జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనలఁ దగులు భృంగ గణంబుఁ
గనుల పండువు సేయ, మనసు నిండుగఁ బూయ
ధణధణధ్వని దిశాతతి బిచ్చలింపంగ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
సకల భువనంబు లాంగికముగా శంకరుఁడు
సకల వాఙ్మయము వాచికము గాఁగ మృడుండు
సకల నక్షత్రంబులు గలాపములు గాఁగ
సకలంబు దనయెడఁద సాత్త్వికంబును గాఁగ
గణనఁ జతుర్విధాభినయాభిరతిఁ దేల్చి
తన నాట్యగరిమంబుఁ దనలోనె తావలచి
నృత్యంబు వెలయించి నృత్తంబు ఝళిపించి
నృత్త నృత్యములు శబలితముగాఁ జూపించి
లాస్యతాండవ భేద రచనాగతులు మీఱి
వశ్యులై సర్వదిక్పాలకులు దరిఁజేర
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
అంగములు గదురఁ బ్రత్యంగంబులునుఁ జెదర
హంగునకు సరిగా నుపాంగంబులును గుదురఁ
తత సమత్త్వాదు లంతఃప్రాణదశకంబు
నతి శస్తములగు బాహ్యప్రాణ సప్తకము
ఘంటాసదృక్కంఠ కర్పరము గానంబు
కంఠగాన సమాన కరయుగాభినయమ్ము
కరయుగము కనువైన కనులలో భావమ్ము
చరణములఁ దాళమ్ము చక్షుస్సదృక్షమ్ము
ఒరవడిగ నిలువంగ నురవడిఁ దలిర్పంగఁ
బరవశత్వమున శ్రీపతియున్ జెమర్పంగ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
కర ముద్రికల తోనె గనులఁ జూపులు దిరుగఁ
దిరుగు చూపులతోనె బరుగెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంటఁ గదిసికొన భావమ్ము
కుదిసి భావము తోనె కుదురుకోగ రసమ్ము
శిరము గ్రీవమ్ము పేరురము హస్త యుగమ్ము
సరిగాగ మలచి గండరువు నిల్పిన యట్లు
తారకలు జలియింపఁ దారకలు నటియింపఁ
గోరకములై గుబురు గొన్న జూటము నందు
నురగాలినలి రేఁగి చొక్కి వీచిఁన యట్లు
పరపులైపడఁ గల్పపాదపంబులఁ బూవు
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
———–