పేరు (ఆంగ్లం) | Vanmamalai Varadacharyulu) |
పేరు (తెలుగు) | వానమామలై వరదాచార్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | సీతమ్మ |
తండ్రి పేరు | బక్కయ్య శాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | వైదేహి |
పుట్టినతేదీ | 8/16/1912 |
మరణం | 10/31/1984 |
పుట్టిన ఊరు | వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామం |
విద్యార్హతలు | సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించారు. |
వృత్తి | ఉపాధ్యాయుడు, శాసనమండలి సభ్యుడు |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, తెలుగు, ఉర్దూ,హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మణిమాల (పద్యగేయకృతి)-1945, ఆహ్వానము -1958, శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం, పోతన చరిత్రము (మహాకావ్యము)-1966, జయధ్వజం విప్రలబ్ధ (గేయ కథా కావ్యం), స్తోత్ర రత్నావళి (అనువాద కావ్యం), భోగినీ లాస్యం (వ్యాఖ్యానం), గీత రామాయణం (అనువాద గేయ కావ్యం), వైశాలిని (మహా నాటకం) -1975, శ్రీ హనుమాన్ చాలీసా (అనువాదం) రాజ్యశ్రీ, సత్యమేవజయతే, నాగార్జున సాగరము, జానపద భారతము గ్రామ సుధార్, స్వతంత్ర భారతము, ఆజాద్ గోవా, సంక్రాంతి పగటి దొంగలు, స్నేహశక్తి, వయోజన విద్య |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | అభినవ కాళిదాసు, మహాకవి శిరోమణి, ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి, అభినవ పోతన, ఆంధ్ర కవివతంస, మధురకవి, కవికోకిల, కవిశిరోవతంస |
ఇతర వివరాలు | వానమామలై వరదాచార్యులు తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. ఇతని గురించి ఆసిఫాబాద్ కి చెందిన డి.సురేష్ కుమార్ “మన వానమామలై” అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రం తీశారు. దీనిని దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌లో 31-10-2010 మరియు 31-08-2011తేదీలలో ప్రసారం చేసింది. 2010 సంవత్సర ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డ్ ఈ చిత్రానికి లభించింది. 1968లో పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వము. 1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి వారిచే గండపెండేరం ,స్వర్ణ కంకణం ,రాత్నాభిషేకం 1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి వారిచే డి.లిట్ వాచస్పతి గౌరవ పట్టా |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వానమామలై వరదాచార్యులు |
సంగ్రహ నమూనా రచన | మహాకవి చరిత్రను మరో మహాకవి వ్రాస్తే, అది ఎంత సుమధురంగా ఉంటుందో మాటల్లో చెప్పటం కష్టం. ఆ మహాకవి పోతన అయితే, ఆయన చరిత్ర వ్రాసిన మహాకవి శ్రీ వానమామలై వరదాచార్యులుగారు. విశేషమేమిటంటే, సహజకవి అయిన పోతనను గురించి అతి సహజంగా ఆయన చరిత్రను కవితాత్మకంగా వ్రాయటమే! రామాయణాన్నిగురించి అనేక మంది కావ్యాలు వ్రాసారు. కానీ, వాల్మీకిని గురించి వ్రాసినవారు లేరు. భాగవతాన్నిగురించి తెలుగు ప్రజలకు అందచేస్తూ, పోతన గారు, తన పూర్వ కవులైన నన్నయ్య తిక్కనాదులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. |
వానమామలై వరదాచార్యులు
మహాకవి చరిత్రను మరో మహాకవి వ్రాస్తే, అది ఎంత సుమధురంగా ఉంటుందో మాటల్లో చెప్పటం కష్టం. ఆ మహాకవి పోతన అయితే, ఆయన చరిత్ర వ్రాసిన మహాకవి శ్రీ వానమామలై వరదాచార్యులుగారు. విశేషమేమిటంటే, సహజకవి అయిన పోతనను గురించి అతి సహజంగా ఆయన చరిత్రను కవితాత్మకంగా వ్రాయటమే! రామాయణాన్నిగురించి అనేక మంది కావ్యాలు వ్రాసారు. కానీ, వాల్మీకిని గురించి వ్రాసినవారు లేరు. భాగవతాన్నిగురించి తెలుగు ప్రజలకు అందచేస్తూ, పోతన గారు, తన పూర్వ కవులైన నన్నయ్య తిక్కనాదులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకంటే, వారు భాగవతాన్ని తెనిగించకుండా తనకోసమే వదిలినందుకు! ‘పట్టునది కలమో హలమో! – సేయునది పద్యమో సేద్యమో’ అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్యవసాయమే వృత్తిగా చేసుకొని జీవించి, పంచదార గుళికల లాంటి పద్యాలతో తెలుగువారికి భాగవతాన్ని అందించిన పోతరాజు మహాకవికి నీరాజనం సమర్పించారు. అయితే శ్రీ వానమామలై వరదాచార్యులుగారు, తనకన్నా అయిదు శతాబ్దాల ముందు నివసించిన పోతనను గురించి ‘పోతన చరిత్రం’ అనే పద్య కావ్యాన్ని వ్రాసారు. ఈ కావ్యంలో, రమారమి మూడువేల రెండువందల పద్యాలున్నాయి. అన్నిటికన్నా మరో గొప్ప విశేషమేమిటంటే, తెలుగుదేశం ఆధునికపు కవితా పోకడలకు అలవాటు పడిన కాలమది. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, వచనకవిత్వం లాంటి ఎన్నో నూతన సాహిత్య ప్రయోగాలాతో వర్ధిల్లుతున్న కాలంలో, ప్రాచీన కవితారీతులతో ప్రజలను మెప్పించిన కవి శ్రీ వానమామలై. ఒక మహాకవి చరిత్రను మరోకవి గ్రంధస్థం చేయటానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. మొదటిది – ఆ మహాకవి కవితా రీతులు నచ్చటం. రెండవది ఆ కవియొక్క జీవన దృక్పథం వల్ల ప్రభావితుడు కావటం. శ్రీ వానమామలై వరదాచార్యులుగారు ‘పోతన చరిత్రం’ ను వ్రాయటానికి, పైన చెప్పిన రెండూ కారణం కావచ్చును. అందులో సందేహించ వలసినదేమీలేదు.
శ్రీ వానమామలై వరదాచార్యులుగారు,1912, ఆగస్టు 16న వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు. తండ్రి గారి పేరు బక్కయ్యశాస్త్రి గారు. వారు నేటి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు అనే గ్రామంనుండి వచ్చి మడికొండలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. శ్రీ వానమామలై చిన్నతనంలో ఏ బడికీ పోలేదు. ఇల్లే ఆయనకు బడి. స్వయంకృషి వల్లే కవిత్వం, కావ్యాలు వ్రాయటం మొదలు పెట్టారు. ఆయన వ్రాసిన కావ్యాల్లో ‘మణిమాల’ చాలా ప్రసిద్ధి చెందింది. చెళ్ళపిళ్ళ, విశ్వనాధ వంటి వార్ల చేత ప్రశంసించబడ్డ కావ్యమది. వరదాచార్యులు గారికి పోతన జీవితమే ఆదర్శం. పోతనలాగే, వీరు కూడా ‘పోతన చరిత్రం’ ను శ్రీ రామచంద్రమూర్తికే అంకితమిచ్చారు. ‘పోతన చరిత్రం’ లో కొన్ని కాల్పనిక గాధలు కూడా వున్నాయి. అయితే, అవి పోతన గారి ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేసేవే! పోతనగారి లాగే వీరూ అతి సాత్వికులు, నిరాడంబరులు. ‘పోతన చరిత్రం’ వ్రాయటానికి దాదాపు పది సంవత్సరాలకు పైగా పట్టింది. అటువంటి గొప్ప కావ్యమైన ‘పోతన చరిత్రం’ ను ముద్రించటానికి ఎవరూ ముందుకు రాలేదు. 1966 లో అనుకుంటాను, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యగారి కృషి, సహకారం వల్ల ఈ కావ్యం వెలుగుచూసింది.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు తమ బహుమతితో ఈ కావ్యాన్ని, కవిని సత్కరించారు. బెనారస్లోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. పోతన నివసించిన ‘బమ్మెర’ తెలంగాణలో ఒక కుగ్రామం. వరదాచార్యులు గారు నివసించిన మడికొండ కూడా కుగ్రామమే! వారిరువురూ భక్తాగ్రేసరులే! అయితే ఒక చిన్న తేడా – పోతన మహాశయుని భక్తే కవిత్వమయింది. వరదాచార్యులు గారి కవిత్వం భక్తి ప్రేరితమైనది. ప్రతిపద్యం హృద్యం. జీవిత ప్రస్థానపు చివరిఘడియలలో వరదాచార్యులుగారు, వారి పూర్వీకులు నివసించిన చెన్నూరు గ్రామానికే చివరకు చేరుకున్నారు. ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులుగారి ఆశీర్వాదఫలం గడిచిన మూడు ప్రపంచ తెలుగు మహాసభలకు తోడు తిరుపతిలో డిసెంబర్ (2012) 27 నుంచి 29 వరకు జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల వరకూ తెలుగు జాతిని కాపు కాస్తూనే వచ్చింది. ముచ్చటైన మూడు ప్రాంతాల రూపు రేఖల్ని వానమామలై గారి పద్యంలోనే విందాం –
‘‘ప్రాచ్యదేశాంధ్ర ‘శ్రీమహాభారతమ్ము’
భవ్య తెలంగాణ ‘శ్రీ మహాభాగవతమ్ము’
మహిత రాయలసీమ ‘రామాయణమ్ము’
ఘన త్రివేణీ సమాగమాకారమూనె’’!
మరో విశేషమేమంటే, మరో అభినవ పోతన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు శ్రీ వానమామలై వరదాచార్యులు గారు దాదాపుగా సమవయస్కులు. ఒకరు తెలంగాణాను తెలుగు మాగాణిగా చేస్తే, మరొకరు ఆంధ్రావనిని పునీతం చేసారు. ఈ ఇద్దరి మహనీయుల శతజయంతి ఉత్సవాలు కూడా దాదాపుగా ఒకే సమయంలో ఘనంగా జరగటం కూడా దైవికమే! శ్రీ వానమామలై వరదాచార్యులుగారు వృద్ధాప్యంలో క్షయవ్యాధి సోకి, తన 72 వఏట -1984, అక్టోబర్ 31న, వారు భౌతిక శరీరాన్ని వీడారు. ఒకప్పుడు, వీరి జీవిత చరిత్రను తెలుగు పాఠ్యవాచకంలోబాలబాలికలు చదువుకున్నట్లుగా నాకింకా గుర్తుంది.
ఈ మధ్యనే ఆయన శతజయంతి ఉత్సవాలను జరిపి ఆయన అభిమానులు ఆయనకు ఘనమైన నివాళిని సమర్పించారు!
కలుపు తీయ రావేమే
కాపోరి పడుచా!… నీ
కంకణాలు గాజుల్లూ
గల్లు గల్లూ మనగా ||కలుపు||
పైట నడుముకు జుట్టి
చేత కొడవలి బట్టి
దుష్టశిక్షణ చేసే
అష్టభుజ కాళికవై ||కలుపు||
మన భూమి యందేమి
పరజాతి యా స్వామి
నఱికి వేసెద నన్న
నారి ఝాన్సీ వగుచు ||కలుపు||
నరుల కన్నము బెట్టు
వరి కఱ్ఱలను జుట్టి
పెరుగనీయని తుంగ
పెఱికెయ్య వలె నింక ||కలుపు||
( ఆహ్వానము గేయసంపుటిలోని రైతురాజు గేయనాటికలోని కొంత భాగము)
కుసుమోపదేశము
పుష్పమా నీదు చరితమ్ము పూర్ణమగును
ఒక్కరెన్నాళ్ళలో నేమి దక్కెనీకు
మంచి వాసనల నెడంద ముంచుకొనియు
చిత్రవర్ణాల పోషోకు జేసికొనియు…
కడుపు నిండార దేనెపాల్గుడుచు చుండి
తీగెటుయ్యలన్ముదముతో నూగుచుంటి
వగ్రిమ స్థానమున క్షణమాగవైతి
కూర్చు తేనెను తుమ్మెదల్ గుడిచిపోయె
అందమెల్లను మట్టిలో నడిగిపోయె
కోమలతనెల్ల యెండలు కుముల జేసె
ఆ సువాసన న్వాయువు లపహరించె
నొక్కరెన్నాళ్ళలో నేమి దక్కె నీకు
రాలిపడి మాతృభూపూజ దేలు మనుటె
ఉన్న రెన్నాళ్ళు నవ్వుచునుండు మనుటె
యునికి కగ్రిమ స్థానమే యొప్పుననుటో
వని సువాసన వలె కీర్తి వైభవములు
వ్యాప్తి గావింపు మనుటొ యీవసుధపైని
విత్తమదియొ మధూకర వృత్తిసేయు
బీదలకె తేనెవలె పంచివేయు మనుటొ
యిట్టిలోక సేవారతిడెవని కేని
పెత్తనము దేవతల తలన్బీఠమిడదె
అందమున సుందరుల తలక్రిందుగాదె
మాయంతరంగాల మాధురిమ సొంపు
మా యెదల నుదయించు మంచి వాసన పెంపు
మీ మనమ్ముల గలదె యో మానవుల్లార
అనుచు మము పరిహాసమాడు గతి నిత్యమ్ము
నవ్వుదువె యో చిన్ని పువ్వు కోమలిరో!
(మణిమాల కావ్యము నుండి)
———–